నేటి తాజా వార్తలు-జులై 7

1. తెలంగాణలో క్రీడా కోటా రిజర్వేషన్‌ల కింద వైద్య, ఇంజినీరింగ్‌ వంటి వృత్తి విద్యాకోర్సుల్లో ఈ విద్యా సంవత్సరం ప్రవేశాలు కల్పించరాదంటూ ఉమ్మడి హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో విస్తృతమైన అంశాలున్నందున పూర్తి వివరాలతో ఆరు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. వృత్తి విద్యాకోర్సుల్లో ప్రవేశాలకు క్రీడాకోటా కింద రిజర్వేషన్‌లను కేటాయిస్తూ ప్రభుత్వం గతనెల 21న జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ టి.శ్రియ మరో నలుగురు దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టి ఈ ఘాటు వ్యాఖలు చేసింది.

2. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలు, కేంద్రం ఇచ్చిన హామీల అమలు కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి దాఖలు చేసిన కేసులో సంబంధిత కేంద్ర ప్రభుత్వ శాఖలు సుప్రీంకోర్టుకు సమర్పిస్తున్న అఫిడవిట్లన్నింటికీ మొదట రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్‌ అఫిడవిట్లు వేయాలని, ఆ తర్వాత సుప్రీంకోర్టులో స్వయంగా కేసు వేయాలని శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు.

3. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న జేఈఈ కౌన్సెలింగ్‌కు బ్రేక్‌ పడింది. సీట్ల కేటాయింపు, ధ్రువపత్రాల పరిశీలన, సీట్ల అనుమతి తదితరాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ(జోసా) ప్రకటించింది. మద్రాస్‌ హైకోర్టు ఆదేశాల మేరకు కౌన్సెలింగ్‌ నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాలల్లో కన్వీనర్‌ కోటాలో 2018-19 సంవత్సరానికి ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ప్రవేశాల్లో చేరికకు శనివారం నుంచి వెబ్‌ఆప్షన్లకు అవకాశం కల్పిస్తున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ కరుణాకరరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

4. ఏపీలో చంద్రన్న బీమా పథకానికి నమోదు ప్రక్రియను శనివారం నుంచి ప్రభుత్వం చేపట్టనుంది. నమోదు బాధ్యతను గ్రామాల్లో సెర్ప్‌కు, పట్టణ ప్రాంతాల్లో మెప్మాకు అప్పగించింది. సర్వే కోసం ‘చంద్రన్న రైతు బీమా’ పేరిట ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. క్షేత్రంలో సర్వే చేపట్టేందుకు వీలుగా అధికారులు ఇప్పటికే డ్వాక్రా సభ్యులకు శిక్షణనిచ్చారు. గ్రామానికి/వార్డుకు ఇద్దరు చొప్పున డ్వాక్రా సభ్యులు ఈ నెల 15 వరకు సర్వేలో పాల్గొని అర్హులను గుర్తించి బీమా పథకంలో నమోదు చేయనున్నారు.

5. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన జాతీయ సమాచార నిధిని ఏర్పాటు చేయడానికి కేంద్రం సమాయత్తమవుతోంది. ‘ఆయుష్మాన్‌భారత్‌’ పేరిట దేశవ్యాప్తంగా ఉన్న పది లక్షల కుటుంబాలకు ఏటా రూ.ఐదులక్షల మేర ఉచిత వైద్యసేవలు అందించాలని నిర్ణయించిన నేపథ్యంలో దీని ఏర్పాటు ఉపయుక్తంగా ఉంటుందని కేంద్రం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన చర్చాపత్రాన్ని నీతి ఆయోగ్‌ ప్రజల ముందుంచింది. ప్రతి రోగి ఆరోగ్య సమాచారాన్ని డిజిటిల్‌ రూపంలో భద్రపరచడం వల్ల వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికీ ఎక్కడికెళ్లినా అతని సమాచారమంతా అందుబాటులో ఉంటుందని, అదే సమయంలో వైద్య పరిశోధనలకు ఉపయోగపడుతుందని తెలిపింది.

6. ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు చేర్చేందుకు భారత్‌, భూటాన్‌ ప్రధానమంత్రులు నరేంద్ర మోదీ, షెరింగ్‌ తోబ్‌గేలు తీర్మానించారు. వివిధ అంశాలపై నేతలిద్దరూ ఇక్కడ శుక్రవారం విస్తృతస్థాయిలో చర్చలు జరిపారు. రక్షణ, భద్రత సహకారాన్ని మరింత పటిష్ఠపరిచే మార్గాలు, డోక్లామ్‌లో పరిస్థితి సహా వివిధ వ్యూహాత్మక అంశాలపై ప్రధానులు చర్చించినట్లు విదేశీ వ్యవహారాల శాఖ వివరించింది. జల-విద్యుత్తు రంగంలో సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి నిబద్ధతతో ఉన్నట్లు పునరుద్ఘాటించారు. భూటన్‌ సాధిస్తున్న ప్రగతిని ప్రధాని మోదీ అభినందించగా.. తమకు అందిస్తున్న అమూల్య సహకారానికి తోబ్‌గే భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

7. జపాన్‌లో 1995లో రసాయనిక దాడులకు తెగబడిన ‘ఓమ్‌ షిన్రిక్యో’ వర్గం నాయకుడు షోకో అసహారాను ఆ దేశం ఉరి తీసింది. అతడి ఆరుగురు అనుచరులకు కూడా శుక్రవారం మరణశిక్షను అమలు చేసింది. ప్రపంచం అంతమైపోతుందని విశ్వసించే ఓమ్‌ షిన్రిక్యో వర్గం.. 1995 మార్చిలో టోక్యోలోని ‘సబ్‌వే’లో ఆరు రైళ్లలో ఒకేసారి రసాయనిక దాడులకు పాల్పడింది. ప్రమాదకర ‘సారిన్‌’ వాయువును వదిలి.. 13 మంది ప్రాణాలను బలితీసుకుంది. ఘటనల్లో 5,800 మంది అనారోగ్యం పాలయ్యారు.

8. భారత్ తో తొలి టీ20లో చిత్తుగా ఓడిన ఇంగ్లాండ్ రెండో టీ20లో సత్తా చాటింది. హేల్స్ (58 నాటౌట్ ) మెరిసిన వేళ టీమ్ ఇండియాను 5 వికెట్ల తేడాతో ఓడించి సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.హేల్స్ , బెయిర్ స్టో (28) మెరుపులతో ఇంగ్లాండ్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి భారత్ విధించిన 149 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఆఖరి ఓవర్లో 12 పరుగులు చేయాల్సి రాగా.. తొలి రెండు బంతులకు సిక్స్ , ఫోర్ బాదిన హేల్స్ జట్టును విజయపథంలో నడిపించాడు. దీంతో మూడు మ్యాచ్ ల సిరీస్ 1-1తో సమమైంది.

9. ఫిఫా ప్రపంచకప్‌లో ఫేవరేట్‌ జట్టుగా ఉన్న బ్రెజిల్‌ టోర్నమెంట్‌ నుంచి నిష్క్రమించింది. కాజన్‌ వేదికగా గతరాత్రి జరిగిన క్వార్టర్‌ఫైనల్స్‌లో బెల్జియం చేతిలో ఓడిపోయింది. అందరి అంచనాలకు తగ్గట్టుగా బెల్జియం ప్రదర్శన ఇచ్చి ఆకట్టుకుంది. బ్రెజిల్‌పై 2-1తేడాతో గెలుపొంది సెమీస్‌లోకి అడుగుపెట్టింది. మ్యాచ్‌ 13వ నిమిషంలో బ్రెజిల్‌ ఆటగాడు ఫెర్నాండినో ఓన్‌గోల్‌ చేయడంతో బెల్జియంకు ఒక గోల్‌పాయింట్‌ సమర్పించుకుంది. దీంతో బెల్జియం 1-0 ఆధిక్యం సాధించింది. ఆ తర్వాత 31వ నిమిషంలో బెల్జియం ఆటగాడు బ్రునె గోల్‌ చేసి జట్టును 2-0 ఆధిక్యంలో నిలిపాడు. ప్రథమార్ధంలో బ్రెజిల్‌ ఎంత ప్రయత్నించినా గోల్‌ చేయలేకపోయింది. ద్వితీయార్ధంలో ఇరు జట్లు హోరాహోరీగా పోటీపడ్డాయి. అయితే 76వ నిమిషంలో బ్రెజిల్‌ ఆటగాడు ఆగస్టొ గోల్‌ చేసి జట్టు ఖాతా తెరిచాడు. అయితే తాము గోల్‌ చేయడం కన్నా ప్రత్యర్థిని గోల్‌ చేయకుండా కట్టడి చేయాలని రెడ్‌ డెవిల్స్‌ చేసిన ప్రయత్నం ఫలించింది. దీంతో మ్యాచ్‌ బెల్జియం వశమైంది.

10. ఫా ప్రపంచకప్ లో ఫ్రాన్స్ సెమీస్ కు చేరింది. ఉరుగ్వేతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో 2-0తో ఘన విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్లు పోటాపోటీగా పోరాడినా.. చివరికి విజయం మాత్రం ఫ్రాన్స్ నే వరించింది. తొలి అర్ధభాగంలో గోల్ కోసం ఇరు జట్లు తీవ్రంగా ప్రయత్నించాయి. ఈ క్రమంలో మ్యాచ్ 40వ నిమిషంలో ఫ్రాన్స్ ఆటగాడు వరానే.. హెడర్ గోల్ తో తన జట్టుకు తొలి గోల్ అందించాడు. తర్వాత మరో గోల్ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో తొలి అర్ధభాగంలో 1-0తో ఫ్రాన్స్ ఆధిక్యంలో నిలిచింది. అనంతరం ప్రారంభమైన రెండో అర్ధభాగంలోనూ ఇరు జట్లూ సమానంగా బంతిని నియంత్రణలో పెట్టుకొని గోల్ కోసం ప్రయత్నించాయి. ఈ క్రమంలో 61వ నిమిషంలో గ్రీజ్ మన్ గోల్ చేసి ఫ్రాన్స్ ఆధిక్యాన్ని 2-0కి పెంచాడు. బలమైన డిఫెన్స్ ఉన్న ఉరుగ్వే.. ఫ్రాన్స్ ఎటాకింగ్ గేమ్ ను నిలువరించలేక నిరాశగా టోర్నీ నుంచి నిష్క్రమించింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com