నేటి తాజా వార్తలు-౦౨/౦౩

*విశ్వశాంతి కోసం శనివారం విజయవాడలో బౌద్ధ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. స్వరాజ్ మైదానం నుంచి లబ్బీపేట సర్కిల్ వరకు శాంతి యాత్ర నిర్వహించారు. ఈ యాత్రను కలెక్టర్ లక్ష్మీకాంతం ప్రారంభించారు. ఈ కార్యక్రమం కోసం రావాల్సిన దలైలామా అనారోగ్య కారణంగా పర్యటన రద్దు చేసుకున్నారు. ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. అమరావతి విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పాలనే నినాదంతో ఇవాళ ప్రపంచ శాంతి కార్యక్రమాన్ని చేపట్టినట్లు కలెక్టర్ వెల్లడించారు.
*నాలుగు రోజుల పాటు మేడారంలో జరుగుతున్న సమ్మక్క సారలమ్మల మహా జాతరకు శనివారం ఆఖరి రోజు. దీంతో అధిక సంఖ్యలో భక్తజనం మేడారానికి పోటెత్తారు. తెలంగాణ సీఎస్‌ ఎస్‌.కె.జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డిలు ఈరోజు మేడారానికి విచ్చేశారు. వీరికి అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం భక్తులకు అందుతున్న సౌకర్యాలపై వారు సమీక్షించారు.
*24గంటలుగా కనిపించకుండా పోయిన నల్గొండ జిల్లా సీఐ వెంకటేశ్వర్లు ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. గుంటూరు జిల్లా బాపట్ల మండలం సూర్యలంకలో సీఐ ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. సీఐ వెంకటేశ్వర్లు మారుపేరుతో రిసార్ట్స్ తీసుకుని ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
*జలవనరుల అంశంపై చర్చించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులను ఈ నెల 15న దిల్లీ రావాలని కేంద్రజలవనరుల మంత్రిత్వశాఖ పిలిచింది.
*జీఎస్టీ కమిషనర్ ఒకరు లంచం తీసుకుంటూ సీబీఐ వలలో చిక్కుకున్నారు. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన కాన్పూర్‌ జీఎస్టీ కమిషనర్ సన్సార్ సింగ్‌ను ఇవాళ ఉదయం అరెస్టు చేశారు.
*కర్నూలు జిల్లాలోని శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 6వ తేదీ నుంచి 16వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఆరవ తేదీ నుంచి 10వ తేది రాత్రి 7.30 గంటల వరకు జ్యోతిర్ముడి కలిగిన శివదీక్షా భక్తులకు శ్రీమల్లికార్జునస్వామి స్పర్శదర్శనం కల్పించనున్నారు.
*దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలకు వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం ఈ నెల 12వ తేదీ నుంచి భారతదర్శన్‌ ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు ఐఆర్‌సీటీసీ డీజీఎం ఆర్‌.కె.చాంద్‌ తెలిపారు. శుక్రవారం విజయవాడలోని సంస్థ కార్యాలయంలో ఆయన యాత్ర వివరాలను వెల్లడించారు.
*కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్‌ రెండు రోజులు పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 4న రాత్రి 7.25 గంటలకు ఆమె హైదరాబాద్‌కు చేరుకుంటారు. 5న ఉదయం 10 గంటలకు కొండాపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శిస్తారు.
*రాష్ట్రంలో పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఏప్రిల్‌ 21(శనివారం)న పాలిసెట్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌మిత్తల్‌ సమక్షంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ తేదీని ఖరారు చేశారు.
*ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు 2018-19 విద్యాసంవత్సర అడ్మిషన్ల షెడ్యూల్ విడుదలైంది.
*అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయనున్న దక్షిణ కొరియా కార్ల దిగ్గజం ‘కియ’ పరిశ్రమకు ఈ నెల 22న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు భూమిపూజ చేయనున్నారు. కలెక్టర్‌ వీరపాండ్యన్‌, ఎస్‌పీ అశోక్‌కుమార్‌ శుక్రవారం పెనుకొండ మండలం అమ్మవారిపల్లి వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. కియా కార్లపరిశ్రమ చైర్మన్‌ రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు అంతర్జాతీయ స్థాయిలో ఉండేలా చూస్తున్నారు.
*ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అస్వస్థతకు గురయ్యారు. వెలగపూడిలోని సచివాలయంలో సీఎం సమక్షంలో శుక్రవారం జరిగిన వరుస సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. మొదట పార్టీ సమన్వయ సమావేశం, అనంతరం కేబినెట్‌ సమావేశానికి హాజరయ్యారు. సమావేశం మధ్యలో తల తిరుతోందని అక్కడి సిబ్బందికి చెప్పారు. వెంటనే విజయవాడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. పరీక్షల అనంతరం ఆయనకు వెర్టిగో సమస్య ఉందని వైద్యులు నిర్ధారించారు. ఎక్కువ ప్రయాణాలు చేస్తే ఈ సమస్య వస్తుందని తెలిపారు.
*దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాచలం పుణ్యక్షేత్ర అభివృద్ధికి 3 నమూనాలను సిద్ధం చేశారు. భద్రాద్రి ఆలయాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే రీతిలో ఆధ్యాత్మిక గురువు చినజీయర్‌స్వామి సలహాలు, సూచనలతో ఆర్కిటెక్ట్‌ ఆనందసాయి ఆధ్వర్యంలో ఈ నమూనాలు సిద్ధమయ్యాయి. దేశంలోనే గుర్తింపు కలిగిన సీతారామ చంద్రస్వామి ఆలయ విశిష్ఠతను, భద్రాచలం పుణ్యక్షేత్ర ఖ్యాతిని పెంచే రీతిలో సిద్ధం చేసిన ఈ నమూనాలను రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్‌లోని తన నివాసంలో శుక్రవారం పరిశీలించారు. ఆర్కిటెక్ట్‌ ఆనందసాయి వివరించిన ఆలయ నమూనాల పట్ల తుమ్మల సంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ సమక్షంలో రెండు రోజుల్లో తుది నమూనాను ఖరారు చేస్తామన్నారు. అభివృద్ధి పనులను శ్రీరామనవమిలోపు మొదలు పెట్టి వచ్చే ఏడాది శ్రీరామనవమి నాటికి భద్రాద్రికి తుది రూపమిస్తామన్నారు.
*తెలంగాణలో పోలీసు ఉద్యోగార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. హోంశాఖ పరిధిలో భారీగా పోస్టుల భర్తీకి అనుమతిచ్చింది. మొత్తం 14,177 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 1,210 సబ్ ఇన్‌స్పెక్టర్‌, 12,941 కానిస్టేబుల్‌ పోస్టులతో పాటు 26 ఏఎస్ఐ పోస్టులున్నాయి. పోలీసు నియామక బోర్డు ద్వారా ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com