నేటి తాజా వార్తలు-౦౨/౦౭

*ఈ నెల 11న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో భేటీ అవుతా అన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. పవన్ జేఏసీతో వెళ్లడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. జేఏసీకి సహకరిస్తానని తెలిపారు.
* తెలంగాణ బీజేపీలో చేరికలు కొనసాగుతున్నాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మణ్‌ తెలిపారు. తెలంగాణ మాదిగ విద్యార్థి జేఏసీ చైర్మన్ గద్దల అంజిబాబు బీజేపీలో చేరినట్టు చెప్పారు.
బీజేపీ ద్వారానే దళితులకు సామాజిక న్యాయం లభిస్తుందన్న నమ్మకంతో విద్యార్థి నేత గద్దల అంజిబాబు పార్టీలో చేరారని తెలిపారు. మంగళవారం సత్తుపల్లిలో టీఆర్‌ఎస్‌కు చెందిన దళిత నేత రామలింగేశ్వరరావు బీజేపీలో చేరినట్టు వివరించారు.
*వాజ్‌పేయి హయాంలో మూడు రాష్ట్రాలు విభజిస్తే ఎలాంటి వివాదాలు రాలేదని.. కాంగ్రెస్‌ పార్టీ ఒక్క రాష్ట్రాన్ని విభజిస్తే నాలుగేళ్లుగా విభజన సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు.
*విజయవాడ దుర్గగుడి పాలకమండలి సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. మాడపాటి అతిథి గృహంలో జరుగుతున్న సమావేశానికి ఈవో ఎం.పద్మతో పాటు పాలకమండలి ఛైర్మన్‌ గౌరంగబాబు, సభ్యులు హాజరయ్యారు. ఈనెల 12, 13 తేదీల్లో ఇంద్రకీలాద్రిపై శివరాత్రి ఉత్సవాల నిర్వహణపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. అలాగే మల్లేశ్వరస్వామి ఆలయంలో భక్తులకు దర్శనం ప్రారంభించడంపైనా నిర్ణయం తీసుకోన్నారు. దుర్గగుడిలో జరుగుతున్న పూజల్లో మార్పులు చేర్పులపైనా పాలకమండలి చర్చించింది. అమ్మవారి దర్శనానికి వెళ్లే క్యూలైన్ల మార్పుపైనా సమావేశంలో చర్చించేందుకు సభ్యులు ప్రతిపాదించారు.
*తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ వేదికగా సీనియర్‌ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. కౌన్సిల్‌ సమావేశం ప్రారంభం కాగానే నగరంలోని సమస్యలు పరిష్కారం కావడం లేదని అధికారుల తీరుపై కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు.అనంతరం క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ద్వారా జీవో మంజూరు చేయించామని కొందరు డప్పు కొట్టుకుంటున్నారని బుచ్చయ్య చౌదరి అన్నారు.
*కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు రాజ్యసభ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ కేవీపీ సభలో ప్లకార్డులు చేతబూని ఆందోళన చేపట్టారు. దీంతో ఆయన్ని సభ నుంచి ఒకరోజు సస్పెండ్‌ చేస్తున్నట్లు రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ప్రకటించారు.
*తెలంగాణలో ఇంటింటికీ ఇంటర్‌నెట్‌ సౌకర్యం కోసం టీఫైబర్‌ ప్రాజెక్టు కింద చేపడుతున్న ప్రయోగాత్మక ప్రదర్శన రెండు వారాల్లో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని నాలుగు గ్రామాల్లో ప్రారంభమవుతుందని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ తెలిపారు.
*మండేసూర్యుడుని చూడాలంటేనే పలు జాగ్రత్తలు తీసుకుంటాం.అటువంటిది ఏకంగా భానుడిపై పరిశోధన అంటే సాధారణ విషయం కాదు. కానీ.. అసాధ్యాలను సుసాధ్యం చేయటం భారతీయ శాస్త్రవేత్తలకు కొత్తేమీ కాదంటున్నారు ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రో ఫిజిక్స్‌ (ఐఐఏపీ, బెంగళూరు) ఆచార్యులు దీపాంకర్‌ బెనర్జీ. భారతీయ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో తొలిసారి ప్రయోగించనున్న ఆదిత్య ఎల్‌1 కోసం నిరంతరం శ్రమిస్తున్నట్లు వివరించారు.
*ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 8792 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ ద్వారా ఉపాధ్యాయ పరీక్షలు జరుగుతాయని, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం జూన్‌ 2 నాటికి నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు.
*వరంగల్‌ గ్రామీణ జిల్లా కలెక్టరేట్‌ను కాకతీయ మెగా జౌళి పార్కు భూముల్లో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం 20 ఎకరాలు ఇవ్వడానికి పరిశ్రమల శాఖ అంగీకరించింది. త్వరలోనే ఈ భూమిని రెవెన్యూ శాఖకు అప్పగించాలని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు.
*రైతుల యోగక్షేమాలను ఆకాంక్షిస్తూ అమ్మ కొండవీటి జ్యోతిర్మయి సెంట్రల్‌ ట్రస్టు, శ్రీవారి సేన ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన విజయవాడలో ‘ఇంటికో యువ రైతు’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్‌ ఛైర్మన్‌ కేవీవీ రావు ఓ ప్రకటనలో తెలిపారు.
*శ్రీశైలం మహాక్షేత్రంలో మంగళవారం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవస్థానం ఈవో భరత్‌గుప్తా, ఆలయ అర్చకులు, వేద పండితులు యాగశాల ప్రవేశం చేసి ఉత్సవాలకు అంకురార్పణ పూజలు చేశారు. గణపతి పూజ, శివ సంకల్పం, చండీశ్వర పూజలు జరిపారు. రాత్రి 8 గంటలకు భేరీ పూజ, అగ్ని ప్రతిష్ఠాపన చేసి సకల దేవతలను ఆహ్వానిస్తూ ఆలయ ప్రధాన ధ్వజస్తంభంపై ధ్వజ పతాకాన్ని ఆవిష్కరించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్ని ఆర్జిత సేవలు నిలుపుదల చేశారు.
*ఆదర్శ పాఠశాలల్లోని బోధన, బోధనేతర సిబ్బందిని ప్రత్యేక యూనిట్‌గా పరిగణిస్తూ పాఠశాల విద్యలో విలీనం చేసి 010 పద్దు ద్వారా జీతాలు చెల్లించాలని విద్యారంగ సమస్యల పరిష్కారానికి నియమించిన ఎమ్మెల్సీలు, అధికారుల కమిటీ సిఫార్సు చేసింది.
*పూర్వం బౌద్ధ మతానికి ముఖ్య కేంద్రంగా నిలిచిన అమరావతిలో బౌద్ధ ఆలయం నిర్మించేందుకు థాయ్‌లాండ్‌ బృందం ముందుకొచ్చింది. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన బృంద సభ్యులు.. విశాఖపట్నం లేదా విజయవాడ నుంచి త్వరలో థాయ్‌ ఎయిర్‌వేస్‌ విమాన సేవలు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. బౌద్ధ ఆలయ నిర్మాణానికి పదెకరాలు కేటాయిస్తామని, అందుకు అవసరమైన ఆకృతులు రూపొందించాలని ముఖ్యమంత్రి వారికి చెప్పారు. విజయవాడ నుంచి విమానాశ్రయ సర్వీసులు నడపాలని కోరారు.
*తిరుమల శ్రీవారికి ప్రతిరూపంగా శ్రీనివాసమంగాపురంలో కొలువైన శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు మంగళవారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. దేవాలయ అర్చకులు కంకణ భట్టర్‌ బాలాజీ రంగకుమార్‌, అర్చకులు ధ్వజారోహణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అంతకుముందు విశేష అలంకరణలో శ్రీదేవి-భూదేవి సమేత శ్రీహరి ఉత్సవర్లు బంగారు తిరుచ్చి వాహనంపై ధ్వజ మండపానికి చేరుకున్నారు. గరుడధ్వజ చిత్రపటాన్ని మండపంపై ఆవిష్కరించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం రాత్రి స్వామి పెద్దశేష వాహనంపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. కార్యక్రమంలో తితిదే కార్యనిర్వహణ అధికారి (ఈవో) అనిల్‌కుమార్‌ సింఘాల్‌, జేఈవో శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.
*శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణానికి చెందిన చేనేత కళాకారుడు పట్నం మునిబాబుకు కేంద్ర ప్రభుత్వం చేనేత కళ విభాగంలో 2016 సంవత్సరానికి జాతీయ అవార్డును ప్రకటించింది.
*దేశ జనాభాలో 50 శాతానికిపైగా ఉన్న బీసీలకు చట్ట సభల్లో 50 శాతం సీట్లు కేటాయించాలనే డిమాండ్‌తో ఈ నెల 12వ తేదీన రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్‌ల ముందు ధర్నాలు, దీక్షలు చేస్తున్నట్లు ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com