నేటి తాజా వార్తలు-౦౨/౦౮

*కృష్ణా జిల్లాలోని సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో విజిలెన్స్ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. కంచికచర్ల, నందివాడ, నూజివీడు, మొవ్వ, గన్నవరం హాస్టళ్లలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు, రికార్డులను విజిలెన్స్ అధికారులు పరిశీలించారు.
* ప్రపంచంలోనే ఒంటరి పక్షిగా పేరుపొందిన ‘నిగెల్‌’ కన్నుమూసింది. న్యూజిలాండ్‌లోని మానా ద్వీపంలో నివసిస్తున్న ఈ గ్యానెట్‌ జాతి సముద్రపు పక్షి.. వృద్ధాప్యంతో చనిపోయినట్లు పరిశోధకులు భావిస్తున్నారు. గ్యానెట్‌ పక్షులను మానాకు ఆకర్షించేందుకు వన్యప్రాణ సంరక్షకులు ఇక్కడ పక్షుల బొమ్మలు, నకిలీ ఆవాసాలను ఏర్పాటు చేశారు. వీటి పట్ల ఆకర్షణకు గురై మూడు పక్షులు ద్వీపాన్ని క్రమంగా సందర్శిస్తున్నప్పటికీ.. ఓ బొమ్మ పక్షితో ప్రేమలో పడ్డ నిగెల్‌ మాత్రమే ఇక్కడ నివాసం ఏర్పరుచుకొంది. దీంతో ప్రపంచంలోనే ఒంటరి పక్షిగా దీనికి పేరు వచ్చింది.
*ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన రాకెట్‌ ‘ఫాల్కన్‌ హెవీ’.. తొలి ప్రయోగం విజయవంతమైంది. ఫ్లోరిడాలోని కేప్‌ కెనావెరాల్‌లోని కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి.. మంగళవారం ఈ రాకెట్‌ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది.
*మహా శివరాత్రి రోజున శ్రీశైల మల్లికార్జునుడికి అలంకరించడానికి 183 గజాల పొడవు, 18 అంగుళాల వెడల్పు గల తలపాగా వస్త్రాన్ని తయారుచేస్తున్నారు విశాఖపట్నం గాజువాకకు చెందిన శివభక్తుడు కొండా ప్రభాకర్‌(72). తూర్పుగోదావరి జిల్లా రాజోలు ప్రాంతానికి చెందిన ఆయన మూడు దశాబ్దాల పాటు తమిళనాడులో చేనేత వస్త్ర వ్యాపారం చేశారు. ప్రస్తుతం గాజువాక దగ్గర్లోని చినగంట్యాడలో కుమారుడు గణేష్‌ వద్ద ఉంటున్నారు. 41 రోజుల శివ దీక్షను చేపట్టి తన ఇంట్లో సొంతంగా చేతి మగ్గంపై కంచిపట్టు దారాలతో తలపాగా వస్త్రం రూపొందిస్తున్నారు.
*కర్నూలు జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల రెండో రోజైన బుధవారం శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామివార్లు భృంగివాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భ్రుమ్గీ వాహనం పై కొలువుదీటిన స్వామివారాలకు ఆలయ ప్రాంగణంలో అర్చకులు వేదపండితులు రుద్రమంత్రాలతో విశేష పూజలు జరిపారు. మంగళ వాయిద్యాల నడుమ స్వామీ అమ్మవార్లను పురవీధుల్లో తీసుకువచ్చి గ్రామోత్సవం జరిపారు.
*విట్‌ ఏపీ ‘విటోపియా- 2018’ పేరిట ఈ నెల 9 నుంచి విశ్వవిద్యాలయం ఆవరణలో జాతీయ క్రీడా సాంస్కృతిక ఉత్సవం నిర్వహించనున్నట్లు విట్‌ ఏపీ ఉపాధ్యక్షుడు శేఖర్‌ విశ్వనాథన్‌ పేర్కొన్నారు.
*సెంటర్‌ ఫర్‌ సైన్స్‌, ఎన్విరాన్‌మెంట్‌ నిర్వహించే ‘హరిత పాఠశాల’(గ్రీన్‌ స్కూల్‌)-2017 అవార్డుకు ఆంధ్రప్రదేశ్‌ ఎంపికైంది. ఈ కార్యక్రమం అమలులో దేశంలోనే మొదటి స్థానాన్ని సాధించింది.
*సీపీఎస్‌ విధానం రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 10న అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించనున్నట్లు ఏపీఎన్‌జీవో సంఘం ఛైర్మన్‌ అశోక్‌బాబు తెలిపారు.
*ఆంధ్రప్రదేశ్‌ వైద్య మండలి కార్యాలయం ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకు పనిచేయదు. సంబంధిత తేదీల మధ్య వైద్యవిద్యార్థుల గుర్తింపు, పునరుద్ధరణ ప్రక్రియ ఉండదని ఏపీ వైద్య మండలి ఛైర్మన్‌ యలమంచిలి రాజారావు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
*మత్స్యకారులు, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 21న శ్రీకాకుళంలో రాష్ట్ర ఆదివాసీ గోడు మహాసభ, మన్యప్రాంతాల బంద్‌ను పాటిస్తామని గిరిజన ఐక్యవేదిక జాతీయ అధ్యక్షులు వివేక్‌ వినాయక్‌ తెలిపారు.
*జనవరి 31 నుంచి ఫిబ్రవరి 4 వరకు నిర్వహించిన మేడారం మహా జాతర తంతు తిరుగువారం పండుగతో ముగిసింది. బుధవారం సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు ఆలయాల్లో ఘనంగా తిరుగువారం పండుగను జరిపారు. ఉదయాన్నే ఆదివాసీల ఆడపడుచులు వనదేవతల ఆలయాలను అలికి ముగ్గులు వేసి దేవతల పూజాసామగ్రి(అడేరాలను) శుభ్రం చేశారు.
*రాష్ట్రంలో మత్స్యకారులను మరింత ప్రోత్సహించేందుకు వచ్చే నెల 15 నుంచి 18 వరకు హైటెక్స్‌లో అంతర్జాతీయ చేపల ప్రదర్శన (ఆక్వాక్స్‌ ఇండియా-2018)ను నిర్వహిస్తామని మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు.
*విద్యార్థులు పరీక్షల ఒత్తిడిని ఎలా అధిగమించాలి? అన్న అంశంపై ఈ నెల 16న పాఠశాల, కళాశాల స్థాయి విద్యార్థులతో ప్రధాని మోదీ ముఖాముఖీ మాట్లాడనున్నారు.
* శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మూడో రోజు వైభవంగా జరుగుతున్నాయి. భ్రమరాంబ మల్లికార్జునస్వామిని దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు పోటెత్తారు. అటవీమార్గంలో కాలినడకన శివస్వాములు, భక్తులు భారీగా తరలివస్తున్నారు.
* ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై పార్లమెంటులో ఎంపీలు చేస్తున్న పోరాటాన్ని సీఎం చంద్రబాబు అభినందించారు. గురువారం పార్టీ నేతలతో సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిన్న పార్లమెంట్ ఉభయసభల్లో మన ఎంపీలు బాగా పనిచేశారన్నారు. ఎంపీ గల్లా జయదేవ్‌ ప్రసంగాన్ని సీఎం అభినందించారు.
* కడప నుంచి రాజధాని అమరావతికి విమాన సర్వీసు అందుబాటులోకి రానుంది. మార్చి 1 నుంచి ట్రూజెట్‌ కడప – విజయవాడల మధ్య విమాన సర్వీసును ప్రారంభించనుంది. ఈ మేరకు కేంద్రం అనుమతినిచ్చింది.
* కియా మోటార్స్‌ అధ్యక్షుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి హన్‌వూపార్క్‌ను సియోల్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రతినిధిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన మూడేళ్లపాటు ఈ బాధ్యతలు నిర్వహిస్తారు.
*దేశంలో తొలిసారిగా హోవర్ క్రాప్ట్ నీటిలోనూ, నెల పైనా నడిచే వాహనం పర్యాటకం విశాఖ తీరంలో నెల రోజుల్లో అందుబాటులోకి రానుంది. రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు హోవర్ లాండ్ సంస్థ ఈ సేవలను అందించబోతుంది.
*కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ కృష్ణాజిల్లా పెనుమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వినూత్నంగానిరసన చేపట్టారు. ఉయ్యూరులో చేపట్టిన నిరసన ప్రదర్శనలో భాగంగా గుండు కొట్టించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని నాలుగు రోజులుగా తెదేపా ఎంపీలు పార్లమెంటులో ఆందోళన చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్ర ప్రజల మనోభావాలు కేంద్రానికి తాకాలన్న ఉద్దేశంతోనే నిరసన చేపట్టినట్లు తెలిపారు.
* రామ జన్మభూమి-బాబ్రీ మసీదు కేసును అత్యున్నత న్యాయస్థానం మళ్లీ వాయిదా వేసింది. మార్చి 14వ తేదీన ఆ కేసుకు సంబంధించిన తుది విచారణ చేపట్టనున్నట్లు సుప్రీం తెలిపింది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సుప్రీం ఈ కేసును టేకప్ చేసింది.
* లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్‌ నారాయణతో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ భేటీ అయ్యారు. బేగంపేటలోని లోక్‌సత్తా పార్టీ కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com