నేటి తాజా వార్తలు-౦౨/౦౯

నేటి తాజా వార్తలు
* సినీ నటి తాప్సి ,ప్ర‌ముఖ ర‌చ‌యిత కోన వెంకట్ విజయవాడలో కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. తన తదుపరి చిత్రం పతాక సన్నివేశాల చిత్రీకరణ నిమిత్తం విజయవాడ వచ్చామని తాప్సి తెలిపారు. విజయవాడలో అమ్మవారిని దర్శించుకోవడం ఇదే మొదటిసారని పైగా శుక్రవారం రోజున అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
*తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీ వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఈ సాయంత్రం హస్తిన వెళ్లారు. కేసీఆర్‌తో పాటు ఆయన సతీమణి శోభ, ఇతరులు కూడా దిల్లీ వెళ్లిన వారిలో ఉన్నారు.
*ఎముకలు కొరికే చలిలో దక్షిణకొరియాలోని ప్యాంగ్‌ చాంగ్‌లో శీతాకాల ఒలింపిక్స్‌ ప్రారంభమయ్యాయి. ప్యాంగ్‌చాంగ్‌ ఒలింపిక్‌ స్టేడియంలో కళాకారులు ప్రత్యేక ప్రదర్శనలు, బాణసంచా వెలుగుల మధ్య వింటర్‌ ఒలింపిక్స్‌ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్‌ జే యిన్‌ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
*ఉత్తర ప్రదేశ్‌లోని మొరదాబాద్ జిల్లాలో ఇవాళ ఒకే వేడుకలో 131 జంటలు ఒక్కటయ్యాయి. కుల, మతాలకు అతీతంగా జరిగిన ఈ భారీ వేడుకలో 46 ముస్లిం జంటలు కూడా ఉండడం విశేషం. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కేంద్రమైన తాకుర్‌ద్వారా గ్రామంలో హిందూ, ముస్లిం దంపతుల కోసం సామూహిక మండపాలను ఏర్పాటు చేశారు. పేదకుటుంబాలకు లబ్ది చేకూర్చేవిధంగా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ముఖ్యమంత్రి సామూహిక్ వివాహ్ యోజన’ పథకం కింద పెళ్లిళ్లు జరిగాయి. ఈ వేదికపై వివాహం చేసుకున్న నూతన దంపతులకు ప్రభుత్వం తరపున రూ.20 వేల నగదు బహుమతిని కూడా ఇస్తున్నారు.
*పెప్సీకో చైర్మన్సీ ఈవో ఇంద్రా నూయీ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) స్వంతంత్ర డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. ఈ పదవికి ఎన్నికైన తొలిమహిళగా ఆమె రికార్డు సృష్టించారు. క్రికెట్‌లో అంతర్జాతీయ పాలనా భాగస్వామ్యాన్ని పెంచాలన్న ఉద్దేశంతోనే ఇంద్రా నూయీని ఎంపిక చేసినట్టు ఐసీసీ ఇవాళ వెల్లడించింది.
*కనకదుర్గమ్మను ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప గురువారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, వేద పండితులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆశీర్వచన మండపంలో వేద పండితులు ఉప ముఖ్యమంత్రికి అమ్మవారి ఆశీస్సులు అందజేశారు. అనంతరం ఆలయ ఈవో ఎం.పద్మ మంత్రికి అమ్మవారి చిత్రపటం, లడ్డూ ప్రసాదం, అమ్మవారి శేషవస్త్రం అందచేశారు. కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు, ఆలయ ఏఈవో, పీఆర్‌వో, తదితరులు పాల్గొన్నారు.
*బెజవాడ బార్‌ అసోసియేషన్‌ (బీబీఏ) 111వ వార్షికోత్సవంలోకి అడుగుపెట్టింది. వేడుకలను అంగరంగవైభవంగా నిర్వహించడానికి న్యాయవాదులు సమాయత్తమవుతున్నారు. 11వ తేదీన ముహూర్తం నిర్ణయించారు. విజయవాడలోని ‘ఏ’ కన్వెన్షన్‌ సెంటర్‌లో బీబీఏ 111వ వార్షికోత్సవంతోపాటు ప్రత్యేకంగా జ్యుడిషియల్‌ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేయబోతున్నారు.
*తెలంగాణ బీసీ ఉపాధ్యాయుల రాష్ట్ర మహాసభ ఈ నెల 11న నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని, సీపీఎ్‌సను రద్దు చేయాలని, కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం ఫ్యాప్సీలో రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నట్లు చెప్పారు.
*తిరుమల, తిరుపతి దేవస్థానం రూపొందించిన శ్రీవిళంబినామ సంవత్సర పంచాంగ ఆవిష్కరణ గురువారం రాత్రి జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల జేఈవో శ్రీనివాసరాజు తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ ధర్మప్రచారంలో భాగంగా ప్రతి ఏటా తెలుగు సంవత్సరాది ఉగాది నాటికి పంచాంగాలను ముద్రించి భక్తులకు అందిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఉగాది కోసం 40 రోజులు ముందుగానే పంచాంగాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వివరించారు.
*తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారికి ఓ ట్రస్టు రూ.కోటి విరాళాన్ని గురువారం సమర్పించింది. చెన్నైకు చెందిన శ్రీగురుచంద్రిక సమితి ట్రస్టు ఛైర్మన్‌ ఎ.వెంకటేశన్‌ తరఫున ప్రతినిధి ప్రసన్నకుమార్‌ విరాళానికి సంబంధించిన డీడీని తిరుమల జేఈవో శ్రీనివాసరాజుకు అందజేశారు. విరాళాన్ని శ్రీవేంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టు కింద డిపాజిట్‌ చేయాలని దాత సూచించారు. కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన వ్యాపారవేత్త కాజ పెద వెంకటేశ్వరరావు రూ.10 లక్షల విరాళాన్ని శ్రీవేంకటేశ్వర నిత్య అన్నప్రసాదం ట్రస్టు కింద అందజేశారు.
* శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల మూడో రోజు గురువారం శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామివార్లు భక్తులకు హంసవాహనంపై దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకారమండపంలో శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు ఆలయ అర్చకులు, వేదపండితులు శాస్త్రోకంగా పూజలు నిర్వహించారు.
*చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ధ్వజారోహణ ఘట్టం గురువారం సాయంత్రం శాస్త్రోక్తంగా జరిగింది.
*ఆప్కాబ్‌తో పాటు 11 జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)ల పాలకవర్గాల పదవీకాలాన్ని ఆరు నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 10 జిల్లాల పాలకవర్గాల పదవీకాలం ఫిబ్రవరి 17తో ముగుస్తుంది. గుంటూరు కమిటీకి ఫిబ్రవరి 28, ఆప్కాబ్‌కు ఫిబ్రవరి 26 వరకు గడువు ఉంది. ప్రకాశం, అనంతపురం జిల్లాలకు ఆలస్యంగా ఎన్నికలు నిర్వహించారు. వీటికి మే వరకు సమయం ఉంది.
*ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం గత పధ్నాలుగు రోజుల హుండీని లెక్కించారు. నగదు రూ.1.07 కోట్లు, బంగారం 200 గ్రాములు, వెండి 11కిలోల 400 గ్రాములు వచ్చింది. ఓ అజ్ఞాత భక్తులు ఐదు కిలోల వెండి విగ్రహాలను హుండీలో వేశారు. ఆలయ ఓపెన్‌శ్లాబ్‌లో జరిగిన హుండీ లెక్కింపులో ఉద్యోగులు పాల్గొనమని భీష్మించుకున్నారు. తమకు రావాల్సిన వేతనాలను చెల్లించకుండా జాప్యం చేస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు. ఆలయ ఈవో రాజేశ్వర్‌ వారితో మాట్లాడగా లెక్కింపులో పాల్గొన్నారు. కార్యక్రమంలో పలు సేవా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
*గుణదల మేరీమాత ఉత్సవాలు శుక్రవారం ఉదయం వైభవంగా ప్రారంభమయ్యాయి. మహా దివ్యపూజ కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామునుంచే వేలాదిగా భక్తులు తరలివచ్చారు.
*ఏపీకి కేంద్ర ప్రభుత్వ సాయంపై ఆర్థిక మంత్రి జైట్లీ ప్రకటనతో కేంద్ర మంత్రి సుజనా చౌదరి తీవ్ర నిరాశకు గురయ్యారు. దీంతో ఆయన రాజ్యసభ లాబీలో అరుణ్‌ జైట్లీతో వాగ్వాదానికి దిగారు. రెండుసార్లు ప్రకటనలు చేసినా ఎందుకు సంతృప్తి లేదని జైట్లీ ప్రశ్నించారు.
*ప్రత్యేక హోదా కోసం ఏపీ కాంగ్రెస్ ఆందోళన ఉధృతం చేసింది. శుక్రవారం ఢిల్లీలోని ఏపీ భవన్ ఎదుట ధర్నా చేపట్టింది. విభజన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఏపీపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డితోపాటు రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, జేడీ శీలంతోపాటు పలువురు నేతలు ఆందోళనలో పాల్గొన్నారు.
*శ్రీకృష్ణదేవరాయ మహోత్సవం – 2018 పేరిట శని, ఆదివారాల్లో తెలుగు భాషా బ్రహ్మోత్సవాలను నిర్వహించ నున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్‌ దీర్ఘాసి విజయకుమార్‌ తెలిపారు. సత్యనారాయణపురంలోని సాంస్కృతిక శాఖ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
*విదేశీ పర్యటన విజయవంతంగా పూర్తి చేసుకుని రాష్ట్రానికి తిరిగి వచ్చిన మంత్రి నారా లోకేష్‌కు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో పలువురు పార్టీ కార్యకర్తలు గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com