నేటి తాజా వార్తలు-౦౨/౧౧

*ఈ నెల 12 నుంచి జూన్ వరకు రాష్ట్రంలో జల సంరక్షణ కార్యక్రమాలు చేపడుతున్నామని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.
*శాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ ఏర్పాటు చేసేందుకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది. గత నాలుగైదు రోజులుగా పార్లమెంట్‌లో ఏపీ ఎంపీలు చేసిన ఆందోళన, భాజపా అధిష్ఠానం, కేంద్ర ప్రభుత్వం చర్చోపచర్చల నేపథ్యంలో రైల్వే జోన్‌ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది.
*కృష్ణా జిల్లా నందివాడ మండలం పుట్టగుంట వద్ద రూ.8.9కోట్లతో నిర్మిస్తున్న అరిపిరాల తారకరామ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ఎమ్మెల్సీ అర్జునుడుతో కలిసి మంత్రి ఉమ శంకుస్థాపన చేశారు.
*మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం శ్రీ జ్ఞానప్రసూనాంబికా సమేత సోమస్కంధమూర్తి పట్టణ వీధుల్లో వూరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగాస్వామివారు సూర్యప్రభ వాహనాన్ని అధిరోహించారు. ముందుగా వినాయక స్వామి, శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, చండికేశ్వరుడి విగ్రహాలను ఉత్సవమూర్తులతో పాటు వూరేగించారు. మేళతాళాలు, భక్తుల శివనామ స్మరణల మధ్య వూరేగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది.
*దేశీయ ఎయిర్‌లైన్ సంస్థ గోఎయిర్ అతి తక్కువ ధరకే విమాన టిక్కెట్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌ కింద టిక్కెట్‌ను రూ.991కే విక్రయించనున్నట్టు పేర్కొంది. ఈ ఆఫర్‌ కింద కస్టమర్లకు గోఎయిర్‌ ఆఫర్‌ చేస్తున్న టిక్కెట్లను 2018 ఫిబ్రవరి 20 వరకు బుక్‌ చేసుకోవచ్చు.
*పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలోకి నవయుగ అడుగుపెట్టింది. ట్రాన్స్‌ట్రాయ్‌, నవయుగ కంపెనీల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు స్పిల్‌వే కాంక్రీట్‌ పనులను శుక్రవారం నుంచి ప్రారంభించారు. నవయుగ కంపెనీ డైరెక్టర్‌ వడ్డూరి రమేష్‌ ప్రాజెక్టు ఎస్‌ఈ వీఎస్‌ రమేష్‌బాబుతో కలిసి పూజలు చేశారు.
* రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే కోటప్పకొండ శివరాత్రి రాష్ట్ర స్థాయి జాతర, వివిధ శైవక్షేత్రాలకు వెళ్లే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ గుంటూరు ఆర్‌ఎం జ్ఞానంగారి శ్రీహరి తెలిపారు.
*చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరస్వామి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆదిదేవుని ధ్వజారోహణ ఘట్టాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ విశేషోత్సవాన్ని పురస్కరించుకుని ఉదయం వెండి అంబారీపై స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకెళ్లి ఆలయంలోని ధ్వజస్తంభం వద్దకు తీసుకువచ్చారు.
*క్రైస్తవుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తున్న గుణదల మేరీ మాత మహోత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలకు విజయవాడలోని గుణదల కొండ దిగువున బిషప్‌ గ్రాసీ హైస్కూల్‌ గ్రౌండ్స్‌లో నూతనంగా నిర్మించిన ఆధ్యాత్మిక కళావేదికపై బిషప్‌ తెలగతోటి జోసెఫ్‌ రాజారావు, వికార్‌ జనరల్‌ ఫాదర్‌ యం.గాబ్రియేలు, మోన్సిగ్నోర్‌ ఫాదర్‌ మువ్వల ప్రసాద్‌, పుణ్యక్షేత్ర రెక్టార్‌ ఏలేటి విలియం జయరాజు, ఫాదర్‌ డేవిడ్‌రాజు తదితరులు దీపారాధన చేసి లాంఛనంగా మూడురోజుల తిరునాళ్లను ప్రారంభించారు.
* జైషే ఎ మహ్మద్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన ముష్కరులు జమ్ములోని సంజ్‌వాన్‌ వద్ద ఆర్మీ స్థావరంపై దాడి చేశారు. సంజ్‌వాన్‌ ఆర్మీ క్యాంపు పక్కన ఉన్న సైనికుల క్వార్టర్స్‌ నుంచి ఉగ్రవాదులు ప్రవేశించారు.
*ఉపాధి హామీ పథకం కింద కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.317.61 కోట్లు విడుదల చేసింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి మెటిరీయల్‌ కాంపోనెంట్‌ కింద ఈ నిధులిచ్చింది. ఈ మొత్తానికి మూడు రోజుల్లోగా రాష్ట్ర ప్రభుత్వ వాటాను జతచేసి రాష్ట్ర ఉపాధి హామీ నిధికి ఈ సొమ్మును బదలాయించాల్సి ఉంటుంది.
*తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ను ట్విటర్‌లో అనుసరించే వారి సంఖ్య పది లక్షలకు (మిలియన్‌ ఫాలోయర్స్‌) చేరింది. ఈ ఘనత సాధించిన ప్రముఖుల జాబితాలో ఆయన శుక్రవారం చేరారు. తనను అనుసరించే వారి సంఖ్య పది లక్షలకు చేరగానే కేటీఆర్‌ స్పందించి ‘మిలియన్‌ థ్యాంక్స్‌’ అని ట్విటర్‌లో కృతజ్ఞతలు తెలిపారు.
*నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ వాటర్‌, ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ సొసైటీ (ఎన్‌సీడబ్ల్యూఈఎస్‌) 2018 కార్యక్రమాన్ని జూన్‌ 4 నుంచి 6 వరకు నిర్వహించనున్నట్లు కన్వీనర్‌ ఎంవీఎ్‌సఎస్‌ గిరిధర్‌ శుక్రవారం ఓప్రకటనలో తెలిపారు. కాన్ఫ్‌రెన్స్‌లో పాల్గొనే వారు తమ తమ పరిశోధన పత్రాలను ఏప్రిల్‌ 1లోపు జేఎన్‌టీయూ సెంటర్‌ ఫర్‌ వాటర్‌ రిసోర్సెస్‌ విభాగంలో అందజేయాలని అయన కోరారు.
*పీఆర్‌టీయూ టీఎస్‌ 48వ ఆవిర్భావ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా సంఘం కార్యాలయంలో సంఘం జెండాను అధ్యక్షుడు సరోత్తంరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీపీఎస్‌ పెన్షన్‌ విధానం రద్దు కోసం ఈ నెల 22న ధర్నాను నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు జనార్దన్‌రెడ్డి, పూల రవీందర్‌ పాల్గొన్నారు.
*ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో శనివారం హైకోర్టు న్యాయమూర్తుల బృందం పర్యటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగినప్పటికీ ఇంకా న్యాయశాఖ విభజన కాలేదు. ఇప్పటికీ ఆంధ్రపదేశ్ పేరుపైనే న్యాయశాఖ వ్యవహారాలు జరుగుతున్నాయి.
*ఉత్తరప్రదేశ్‌, బిహార్‌లలో ఉప ఎన్నికలను మార్చి 11న నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్‌ (ఈసీ) ప్రకటించింది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఖాళీ చేసిన గోరఖ్‌పూర్‌, ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య రాజీనామా చేసిన ఫూల్‌పూర్‌ లోక్‌సభ స్థానాలతోపాటు బిహార్‌లోని అరరియా లోక్‌సభ సీటుకు పోలింగ్‌ జరుగనుంది. అరారియాలో ఆర్‌జేడీ ఎంపీ మహ్మద్‌ తస్లిముద్దీన్‌ మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ మూడు స్థానాలకు ఈ నెల 13న నోటిఫికేషన్‌ జారీ కానుంది. 20వ తేదీ వరకు నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. మర్నాడు వాటి పరిశీలన.. 23లోపు నామినేషన్లు ఉపసంహరణకు అవకాశమిస్తారు. మార్చి 11న పోలింగ్‌ జరుగుతుంది. మార్చి 14న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటాయి.
*ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ సీట్ల భర్తీకి సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీ ససీ) శుక్రవారం నీట్‌ – 2018 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మే 6న నీట్‌ పరీక్షను నిర్వహించనుంది. జూన్‌ 5న పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి.
*వరంగల్ కలెక్టర్ ఆమ్రపాలి వారం రోజుల్లో పెళ్లి కుమార్తె కాబోతున్నారు. ఈ ఐఎఎస్ పెళ్లి గురించి ఇప్పుడు సోషల్ మీడియా వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే వాటన్నింటికీ పుల్‌స్టాప్ పడేలా పెళ్లి డేట్ ఫిక్స్ అయిపోయింది. ఈ నెల 18న ఐపీఎస్ సమీర్‌‌శర్మతో ఏడగులు వేయనుంది అమ్రపాలి. కాగా పెళ్లి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తైపోయాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com