నేటి తాజా వార్తలు-౦౨/౧౪

*కేంద్ర మాజీ మంత్రి, ఆంధ్రా షుగర్స్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరక్టర్‌ బోళ్ల బుల్లి రామయ్య(92) పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలోని స్వగృహంలో మృతి చెందారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బుల్లిరామయ్య 1926, జులై 9న తూర్పుగోదావరి జిల్లా తాటిపాక గ్రామంలో జన్మించారు. ఆయనకు కుమార్తె, కుమారుడు ఉన్నారు.
* చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ షియోమీ ఎంఐ టీవీ4ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. కంపెనీ చైనా వెలుపల తొలిసారిగా ఈ టీవీని భారత్‌లోనే ఆవిష్కరించింది.
*రాష్ట్ర ప్రభుత్వ విప్‌, పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు భీమడోలు న్యాయస్థానం రెండేళ్ల జైలు శిక్ష, 2,500 రూపాయల జరిమానా విధించింది. 2011లో అప్పటి మంత్రిగా పనిచేసిన వట్టి వసంతకుమార్‌పై దాడి చేసిన కేసులో విచారించిన న్యాయమూర్తి దీప దైవకృప శిక్షను ఖరారు చేశారు.
*పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు పూర్తయ్యే లోపు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించకపోతే ఏప్రిల్‌ 6న తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌ ప్రకటించారు.
*దక్షిణాది రాష్ట్రాల జలవనరులశాఖ మంత్రుల భేటీ ఫిబ్రవరి 20న హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. కేంద్ర జలవనరులశాఖ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనున్నది. కేంద్ర జలవనరులశాఖ సహాయ మంత్రి మేఘ్వాల్‌, కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి ఎస్‌.కె.సింగ్‌, కేంద్ర జలసంఘం ఛైర్మన్‌ ఈ సమావేశానికి హాజరవుతారు.
*దక్షిణ భారత స్థాయి అఫ్‌సెట్‌ ముద్రణ సంస్థల ప్రదర్శన (ఎగ్జిబిషన్‌) హైదరాబాదులో మార్చి 9 నుంచి 12 వరకు నిర్వహించనున్నామని తెలంగాణ అఫ్‌సెట్‌ ప్రింటర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు చామల రవీందర్‌రెడ్డి మంగళవారం తెలిపారు.
*ఆంధ్రప్రదేశ్‌ చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారా ఉత్తమ లఘు చిత్రాలకు ఉగాది పురస్కారాలు అందిస్తున్నట్లు రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్‌, రంగస్థల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ అంబికా కృష్ణ చెప్పారు. చలనచిత్ర వాణిజ్య మండలి సభ్యులతో కలిసి ప.గో.జిల్లా ఏలూరులో మంగళవారం ఆయన ఉగాది పురస్కారాల బ్రోచర్‌ను ఆవిష్కరించారు.
*బెంగళూరులో నిర్వహిస్తున్న ఇందిరా క్యాంటీన్లను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ బుధవారం పరిశీలించారు. ఈ సందర్బంగా క్యాంటీన్లలో తయారుచేసిన ఆహార పదార్ధాలను ఆయన స్వయంగా రుచి చూశారు. అలాగే క్యాంటీన్ డిజైన్, కిచెన్‌లను కూడా పరిశీలించారు. ఏపీలో త్వరలో 50 నగరాల్లో 200 అన్న క్యాంటీన్లను జూన్ 2వతేదీనుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా బెంగళూరులో ఏర్పాటుచేసిన ఇందిరా క్యాంటీన్లను మంత్రి పరిశీలించి వాటి తీరుతెన్నులను తెలుసుకున్నారు.
* మార్చి 5వ తేదీ తర్వాత ఊహించని నిర్ణయాలు జరుగుతాయని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూరాష్ట్రంలో అధికారప్రతిపక్ష పాత్రలను మేమే పోషిస్తున్నామన్నారు.
* భారత టెన్నిస్‌కు తనను మించిన ప్రతిభగల క్రీడాకారిణులు లభిస్తారని సానియా మీర్జా వ్యాఖ్యానించింది. మరో సానియా ఎవరన్న ప్రశ్నకు స్పందిస్తూ చాలాకాలంగా తానీ ప్రశ్నను ఎదుర్కొంటున్నాననిదేశంలో క్రీడాకారిణులకు సానియా గీటురాయి కాదనితనకంటే మెరుగైన వారు రావాలని కోరుకుంటున్నానన్నది. ఫెడరేషన్‌ కప్‌లో ఇటీవల యువ క్రీడాకారిణులు మెరుగైన ప్రతిభను ప్రదర్శించారనిముఖ్యంగా అంకిత రైనా ప్రదర్శన తనను ఆకట్టుకుందని సానియా తెలిపింది.
* నవ్యాంధ్రలో మరో ప్రతిష్ఠాత్మకమైన వాహన తయారీ కంపెనీ తన కార్యకలాపాలను ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. విజయవాడ పరిధిలోని మల్లవల్లి మోడల్‌ ఇండస్ర్టియల్‌ పార్క్‌లో బాడీ బిల్డిండ్‌ యూనిట్‌ ఏర్పాటుకు ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం ‘అశోక్‌ లే ల్యాండ్‌’ ముందుకొచ్చింది. మార్చి నెలలో భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించటానికి కంపెనీ ప్రతినిధులు ఆసక్తి చూపుతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఆహ్వానించి, ఆయన చేతులమీదుగా భూమి పూజ జరిపించాలని నిర్ణయించారు.
* సీపీఐ ఆఫీస్‌లో 8 వామపక్ష పార్టీల నేతలు బుధవారం సమావేశమయ్యారు. సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు సాధన కోసం మహా ఉద్యమం చేయాలని నిర్ణయించారు. మార్చి 2,3,4 తేదీల్లో జిల్లా కేంద్రాల్లో రిలే దీక్షలు , మార్చి 5న ఢిల్లీలో ఆందోళన చేయనున్నారు. అలాగే 18న రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించాలని వామపక్ష నేతలు నిర్ణయించారు.
* రాష్ట్రంలో మరో రెండు పారిశ్రామిక పార్కులు ఏర్పాటు కానున్నాయి. ఉపాధి అవకాశాలు పెంచడంలో కీలక పాత్ర వహించే సూక్ష్మచిన్న మధ్య తరహా పరిశ్రమలకు కేంద్రం ప్రాధాన్యమిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో క్లస్టర్‌ డెవల్‌పమెంట్‌ ప్రోగ్రామ్‌ (సీడీపీ)కింద మూడు పారిశ్రామిక క్లస్టర్‌లకు అమోదం తెలిపింది. ఇటీవల అదనంగా తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురంచిత్తూరు జిల్లాలోని గండ్రాజుపల్లిలో పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేసేందుకు కేంద్ర పరిశ్రమల మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది.
* బీసీ విద్యార్థుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నెల 22న తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ ఆడిటోరియంలో బీసీ విద్యార్థి గర్జన నిర్వహిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య తెలిపారు.
* నాగాలాండ్ శాసనసభ ఎన్నికల సందర్భంగా క్రైస్తవులకు భారతీయ జనతా పార్టీ మంచి వాగ్దానం చేసింది. తమను గెలిపిస్తేప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత క్రైస్తవులకు ఉచితంగా జెరూసలెం సందర్శించేందుకు ఏర్పాట్లు చేస్తామని ప్రకటించినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
* నాగాలాండ్‌ అసెంబ్లీ ఎన్నికలపోలింగ్‌ జరగకముందే ఎన్‌డీపీపీ-బీజేపీ కూటమికి తొలి విజ యం దక్కింది. ఈ కూటమి సీఎం అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి నీఫూ రియో ఉత్తర అంగామీ-2 స్థానం నుంచి బరిలోకి దిగగా.. పాలక నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ (ఎన్‌పీఎఫ్‌) అభ్య ర్థి, ఆయన బావ చుప్‌ఫుయో అంగామీ తన నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు.
* విశ్వ‌న‌టుడు, భార‌త‌దేశ అగ్ర‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ త‌న అభిమానుల‌కు నిరాశ‌ను మిగులుస్తూ సంచ‌ల‌న విష‌యం వెల్ల‌డించారు. రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన క‌మ‌ల్‌.. ఇక‌పై సినిమాలు చేయ‌న‌ని తేల్చిచెప్పారు. ప్ర‌స్తుతం బోస్ట‌న్‌లో ఉన్న క‌మ‌ల్.. అక్క‌డ ఓ ప్రైవేట్ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఈ విష‌యం వెల్ల‌డించారు. అయితే ఇప్ప‌టికే నిర్మాణం పూర్తి చేసుకున్న రెండు సినిమాలు మాత్రం య‌థావిధిగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తాయ‌ని తెలిపారు.
* ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి నెతన్యాహు చిక్కుల్లో పడ్డట్లు కనిపిస్తోంది. ఆయనపై అవినీతికి సంబంధించి రెండు కేసులు నమోదు చేయాలని ఇజ్రాయెల్‌ పోలీసులు సిఫార్సు చేశారు.
* ప్రజావసరాలకు అనుగుణంగా చిన్నమొత్తాల పొదుపు పథకాల్లో మార్పులు తీసుకురానున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఐదేళ్లలోపే పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఖాతాను మూసివేసే అవకాశం కల్పించనుంది.
* విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ ప్రకటించాల్సిందేనని శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్‌నాయుడు పునరుద్ఘాటించారు.
* ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తమ ఎంపీలు రాజీనామా చేస్తారని ప్రతిపక్ష వైకాపా పార్టీ అధినేత జగన్ చేసిన వాఖ్యలపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు ఘాటుగా స్పందించారు. ఐదు సంవత్సరాలు పాలించమని ప్రజలు ఓట్లేస్తే ముందే ఎందుకు రాజీనామా చేస్తామంటున్నారో సమాధానం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com