నేటి తాజా వార్తలు-౦౪/౦౧

* హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆదివారం సాయంత్రం పలుచోట్ల భారీ వర్షం కురిసింది. హయత్‌నగర్‌, వనస్థలిపురం, ఎల్బీనగర్‌, ఉప్పల్‌,నాగోల్‌, రామంతాపూర్‌, సికింద్రాబాద్‌, ఖైరతాబాద్‌, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో వర్షంతో పాటు వడగళ్లు పడ్డాయి. ఎండవేడిమితో అల్లాడుతున్న నగరవాసులకు అకాల వర్షం కాస్త ఉపశమనం కలిగించింది. పలుచోట్ల రహదారులు తడిసి ముద్దవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
* రాజధాని అమరావతి పరిపాలనా కేంద్రంగా ఉండాలే తప్ప మెగాసిటీగా ఉండరాదని రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు అభిప్రాయపడ్డారు. ‘ఎవరి రాజధాని అమరావతి’ పేరుతో తాను రాసిన పుస్తకాన్ని ఈనెల 5న ఆవిష్కరించనున్నట్లు ఆయన విజయవాడలో తెలిపారు.
* అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం మల్లాపురం గ్రామ సమీపంలో చిరుత అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. గ్రామానికి చెందిన గోపాల్ పొలంలో ఇవాళ ఉదయం చిరుత వెళ్తుండటాన్ని రైతులు గమనించారు. అందరూ దూరం నుంచి చూస్తుండగా అది స్పృహతప్పి పడిపోయింది. దీంతో రైతులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని చిరుతను పరిశీలించగా కాసేపు కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు వదిలింది. చిరుత ఎందుకు మరణించిందన్న దానిపై అటవీశాఖ సిబ్బంది ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అక్కడి నుంచి తరలించారు.
*జమ్ముకశ్మీర్‌లో వరుస ఎన్‌కౌంటర్లు చోటుచేసుకున్నాయి. వేర్వేరు ప్రాంతాల్లో భద్రతాబలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనల్లో 8 మంది ఉగ్రవాదులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి.
*అనంతపురం జిల్లాలోని లేపాక్షిలో ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా క్రీడావిభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ రకాల క్రీడలను ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. లేపాక్షి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన స్టాల్స్‌, ప్రదర్శనశాలలను ఆయన పరిశీలించారు. *ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా, విభజన హామీల అమలు, లోక్‌సభలో అవిశ్వాసంపై చర్చ జరగాలని డిమాండ్‌ చేస్తూ ఏప్రిల్‌ 2వ తేదీ(సోమవారం)న రిలే నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. విజయవాడలో నిర్వహించనున్న ఈ దీక్షలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతలు, కేంద్ర, రాష్ట్ర మాజీ మంత్రులు పాల్గొంటారని ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.
*భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవమూర్తులకు పవిత్ర గోదావరిలో చక్రతీర్థ స్నానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం పూర్ణాహుతితో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవనున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా భద్రాద్రి రామయ్యను దర్శించుకునేందుకు భక్తలు తరలివస్తున్నారు.
*తిరుమలలో యాత్రికుల రద్దీ శనివారం భారీగా పెరిగింది. తుంబురుతీర్థ ముక్కోటి, ఇంటర్‌, పదో తరగతి పరీక్షలు ముగియడంతో శ్రీవారి దర్శనార్థం వేలాదిగా యాత్రికులు తరలివచ్చారు. ధర్మదర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ను దాటి 2 కిలోమీటర్ల పొడవున యాత్రికులు బారులుతీరారు.
*కడప జిల్లా ఏకశిలానగరి ఒంటిమిట్ట కోదండరాముడి బ్రహ్మోత్సవాల్లో శనివారం రథోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం సీతారామలక్ష్మణ మూర్తులను పట్టువస్త్రాలు, పుష్పమాలికలు, ఆభరణాలతో అందంగా ముస్తాబు చేశారు. రథంపై ఉత్సవమూర్తులను కూర్చోబెట్టారు. తితిదే అధికారుల ప్రణాళిక ప్రకారం 9.06 గంటలకు రథం కదలాలి. రథమండపం వద్ద అన్నీ చక్క దిద్దాక 11.15 గంటలకు రథం కదిలింది.
*తిరుపతి స్విమ్స్‌ ఆసుపత్రిలో తితిదే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి ముంబయి నగరానికి చెందిన ప్రముఖ వ్యాపార సంస్థ వైఠల్‌ ల్యాబోరేటరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అధినేత రాజీవ్‌ శ్రీగోపాల్‌ బజాజ్‌ రూ.10 కోట్లు విరాళంగా అందించారు. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ ద్వారా దాత విరాళాన్ని అందించినట్లు స్విమ్స్‌ సంచాలకులు రవికుమార్‌ తెలిపారు. దాతకు, కుటుంబసభ్యులకు, విఠల్‌ ల్యాబోరేటరీస్‌ సంస్థ ఉద్యోగులకు సంచాలకులు ధన్యవాదాలు తెలిపారు.
*కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో మే నెలలో శిల్పకళా ప్రదర్శన ఏర్పాటుచేస్తున్నట్లు మంత్రి భూమా అఖిలప్రియ తెలిపారు. శనివారం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని తన నివాసంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సాధారణంగా శిల్పకళా ప్రదర్శనలు దిల్లీ, ముంబై నగరాల్లో జరుగుతుంటాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ఆళ్లగడ్డలో రూ.3 కోట్ల వ్యయంతో ఈ శిల్పకళా ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇందులో స్థానిక శిల్పులే కాక జాతీయ, అంతర్జాతీయ కళాకారులు పాల్గొంటారని చెప్పారు. స్థానిక శిల్పులు కార్యక్రమం ద్వారా మంచి నైపుణ్యం పొందే అవకాశం లభిస్తుందన్నారు
*తిరుమల, తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలిని వారం రోజుల్లో నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇటీవల తనను కలిసిన కొందరు ప్రముఖుల వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ మేరకు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఏడాదికాలంగా కొన్ని కారణాలతో ధర్మకర్తల మండలి నియామకాన్ని ప్రభుత్వం చేపట్టలేకపోయింది. ఈ తరుణంలో ముఖ్యమంత్రి ధర్మకర్తల మండలిపై కసరత్తు పూర్తి చేశారని, త్వరలోనే ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు సమాచారం. శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌(ఎస్వీబీసీ) ఛైర్మన్‌గా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావును నియమిస్తున్నట్లు తన మససులో మాటను ముఖ్యమంత్రి బయటపెట్టినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
* రాష్ట్రంలోని 14 పురపాలక సంఘాలు, 57 నగర పాలక సంస్థల్లో నూతనంగా అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆయా చోట్ల క్యాంటీన్ల ఏర్పాటు, వసతుల కల్పన నిమిత్తం రూ.388.15 కోట్లను విడుదల చేసిన సర్కారు.. ఇందుకు సంబంధించి టెండర్లను ఆహ్వానిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
*పశ్చిమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికలు మే 1, 3, 5 తేదీల్లో మూడు దశల్లో జరగనున్నాయని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఓట్ల లెక్కింపు మే 8న జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఎ.కె.సింగ్‌ తెలిపారు. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగే ప్రధానమైన ఎన్నికలు ఇవే కావడంతో రాజకీయంగా వీటికి ప్రాధాన్యత లభిస్తోంది.
*ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారైంది. ఇప్పుడే వద్దని కొందరు నాయకులు చేసిన సూచనలతో కొంత సందిగ్ధత నెలకొన్నప్పటికీ… శనివారం ఆయన దీనిపై స్పష్టత ఇచ్చారు. సోమవారం మధ్యాహ్నం ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు.
*రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు నెరవేర్చాలని కోరుతూ సోమవారం విజయవాడ ధర్నాచౌక్‌లో ధర్నా చేపడుతున్నామని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పేర్కొన్నారు. ఏప్రిల్‌ 3 నుంచి 6వరకూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే రిలే నిరాహార దీక్షలను విజయవంతం చేయాలని ఓ ప్రకటనలో ఆయన కోరారు.
*సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్ మండలం బూరుగుగడ్డ గ్రామంలో ఉన్న శ్రీ ఆదివరాహ లక్ష్మినరసింహస్వామి దేవస్థానాన్ని మంత్రి జగదీశ్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా లక్ష్మినరసింహస్వామి తిరుకళ్యాణంలో ఆయన పాల్గొన్నారు. దేవాలయంలో జరుగుతున్న తిరుకళ్యాణానికి హాజరైన మంత్రికి పూజారులుఆలయ ధర్మకర్తలు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. మంత్రి రాకను పురస్కరించుకొని టీఆర్‌ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో బూరుగుగడ్డకు చేరుకున్నారు. ఈ సందర్భంగా.. దేవస్థానం ప్రాశస్త్యాన్ని పూజారులను అడిగి మంత్రి తెలుసుకున్నారు.
*ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 3, 4 తేదీల్లో ఢిల్లీకి వెళ్లనున్నారు. ముందుగా ఈనెల 2, 3 తేదీల్లో ఢిల్లీ వెళ్లాలని భావించినప్పటికీ తాజాగా ఈనెల 3,4 తేదీల్లో ఢిల్లీ వెళ్లాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో పర్యటలో సీఎం చంద్రబాబు పలు జాతీయ పార్టీల నేతలతో భేటీ అయి విభజన హామీల సాధనకు కేంద్రంపై పోరాడేందుకు మద్దతు కూడగట్టనున్నారు.
*జమ్ముకశ్మీర్‌లో వరుస ఎన్‌కౌంటర్లు చోటుచేసుకున్నాయి. వేర్వేరు ప్రాంతాల్లో భద్రతాబలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనల్లో 8 మంది ఉగ్రవాదులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి.
* పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కొలువై ఉన్న ఇలవేల్పు మావూళ్లమ్మ అమ్మవారికి పట్టణానికి చెందిన మల్లినీడి తిరుమలరావు 100 గ్రాముల బంగారాన్ని ఆలయ ఈఓ ఎన్‌.ఎస్‌. చక్రధరరావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల రావు తల్లి లక్ష్మి ఇందిరమణి, సోదరుడు సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.
*హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జయరాంఠాకూర్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామిసేవలో పాల్గొన్న జయరాంకు తితిదే అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
* వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేకహోదా కోసం శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రత్యేకహోదా కోసం ఈనెల 6న స్పీకర్‌ ఫార్మాట్‌లో వైసీపీ ఎంపీలందరం రాజీనామాలు చేయనున్నట్లు ఎంపీ మిథున్‌రెడ్డి మరోసారి తెలిపారు.
*సీబీఎస్‌ఈ పేపర్‌ లీక్‌ కేసులో మరో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 12వతరగతి ఆర్థిక శాస్త్రం పేపర్‌లీక్‌కు సంబంధించి ఓ శిక్షణాసంస్థ యజమాని, మరో ఇద్దరు ఉపాధ్యాయులను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.
*తమ ఎంపీలను రాజీనామా చేయమనే అర్హత వైకాపాకు లేదని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. అఖిలపక్ష సమావేశానికి రాకుండా వైకాపా పారిపోయిందని..జగన్‌ పార్టీతో వెళితే ఆ అవినీతి తమ పార్టీకి అంటుకుంటుందని విమర్శించారు. గుంటూరులోకి చిలకలూరిపేటలో ‘ప్రత్యేక హోదా’ కోసం చేపట్టిన పోస్టుకార్డు ఉద్యమాన్ని ప్రత్తిపాటి ప్రారంభించారు.
*మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో శనివారం రాత్రి హోటల్‌ భవనం కూలి 10మంది మృతి చెందారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ రూ.2లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు.
*కామారెడ్డి జిల్లా బాన్సువాడలో వివిధ పార్టీల కార్యకర్తలు తెరాసలో చేరారు. వర్నం మండలం గోవూరు గ్రామస్థులు కూడా తెరాసలో చేరారు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వీరిని గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com