నేటి తాజా వార్తలు-౦౪/౦౨

*నడిచే దేవుడిగా కన్నడనాట విఖ్యాతినొందిన తుమకూరు సిద్ధగంగ మఠాధిపతి శివకుమారస్వామి తన 111వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. వేల మంది కదలివచ్చి మఠం మహామండప ప్రాంగణంలో ప్రత్యేక కీర్తనలు, భజనలతో ఆధ్యాత్మికానందాన్ని ప్రతిధ్వనింప చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తరించిన వేర్వేరు మఠాల అధిపతులు కదలివచ్చి ప్రత్యేక వేదికపై శివకుమారుడికి పుష్పాభిషేకం చేస్తున్న దృశ్యమిదీ! ఆధ్యాత్మిక జీవనమే మహా బలంగా నేటికీ తన పనులు తనే చేసుకుంటూ భక్తులకు మార్గదర్శకంగా నిలిచారు పీఠాధిపతి.
*కడప జిల్లా ఏకశిలానగరి కోదండ రామాలయం బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు ఆదివారం ఉదయం స్వామివారికి కాళీయమర్దన అలంకారం చేసి.. గ్రామోత్సవం నిర్వహించారు. రాత్రి శ్రీరామచంద్రమూర్తి అశ్వ వాహనంపై ఊరేగారు. గ్రామోత్సవాల్లో చిన్నారులు, యువతుల కోలాట ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది.
* భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో గత నెల 18న ప్రారంభమైన శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ఆదివారం పూర్ణాహుతి పలికారు. ఈ సందర్భంగా సుప్రభాతం నిర్వహించి నాదస్వర కచేరీ జరిపి స్వామివారిని ఊరేగింపుగా పునర్వసు మండపానికి తీసుకెళ్లారు.
*ఏపీ వ్యాప్తంగా పలుచోట్ల సోమ, మంగళవారాల్లో కూడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అలాగే ఈ వారం రోజులూ రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. రాయలసీమ మీదుగా ఉన్న ద్రోణి కాస్త బలహీనపడిందని వారు స్పష్టం చేశారు.
*గుంటూరు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రంథాలయ సంస్థల పరిధిలో ఈ నెల 25 నుంచి జూన్‌ 07 వ తేదీ వరకు విద్యార్థులకు వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి షేక్‌ పీర్‌ అహ్మద్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు గ్రంథాలయంలో పుస్తకపఠనం, కథలు చెప్పడం, కథలు రాయడం, పుస్తకాలు చదివించడం, చదివిన విషయాలపై సమీక్షలు రాయించడం, చిత్రలేఖనం, సంగీతం, నాటికలు, స్పోకెన్‌ ఇంగ్లీష్‌, కంప్యూటర్స్‌ శిక్షణ, అల్లికలు, కుట్లు అంశాలపై శిక్షణ ఇస్తామన్నారు.
*కావేరీ జలాల సాధన కోసం తమిళనాడులో అన్ని రాజకీయ పక్షాలు ఆందోళన బాట పట్టాయి. వెంటనే కావేరీ బోర్డును ఏర్పాటు చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్ష డీఎంకే ఆధ్వర్యంలోని విపక్షాలు ఆందోళన చేపట్టాయి.
*తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యవస్థకు గౌరవం లేకుండా పోయిందని తెలంగాణ జన సమితి(టీజేఎస్‌) వ్యవస్థాపకుడు కోదండరాం అన్నారు. ఆయన స్థాపించిన తెలంగాణ జన సమితి పార్టీకి ఇటీవల ఎన్నికల సంఘం గుర్తింపునివ్వడంతో సోమవారం ఆయన అధికారికంగా ప్రకటన చేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com