నేటి తాజా వార్తలు ౦౪/౧౨

* జనగామ జిల్లాలోని బచ్చన్నపేట మండలంలో వడగళ్ల వాన కురిసింది. మండలంలోని సాల్వాపూర్, మన్సాన్‌పల్లి, లింగంపల్లిలో కురిసిన వడగళ్ల వర్షానికి వరి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. అకాల వర్షం పంటలను నాశనం చేయడంతో రైతులు వాపోతున్నారు.
* యోగా గురువు, పతంజలి సంస్థ అధినేత బాబా రామ్‌దేవ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును ప్రగతి భవన్‌లో కలిశారు. ఈ సందర్భంగా రామ్‌దేవ్‌కు సీఎం పుష్పగుచ్చంతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాబా రామ్‌దేవ్ సీఎం కేసీఆర్‌తో కాసేపు ముచ్చటించారు. ఎంపీ కవిత, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు సీఎం వెంట ఉన్నారు.
* తెలంగాణ సీఎం కేసీఆర్‌ రేపు బెంగళూరు వెళ్లనున్నారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంతో వివిధ పార్టీల నేతలను కలుస్తున్న ఆయన.. రేపు మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ కానున్నారు. ప్రత్యామ్నాయ కూటమికి సంబంధించిన అంశాలపై దేవెగౌడతో కేసీఆర్‌ చర్చించనున్నారు.
* తెలంగాణలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు 1,384 పోస్టులు మంజూరయ్యాయి. ఈ పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో 1,214 డిగ్రీ లెక్చరర్లు, 15 ప్రిన్సిపల్‌, 67 పీడీ, 64 లైబ్రేరియన్‌, 24 పరిపాలన అధికారుల పోస్టులు ఉన్నాయి.
* ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియెట్‌ రెండో సంవత్సర పరీక్షల ఫలితాలు గురువారం విడుదల అయ్యాయి. రాజమహేంద్రవరం షల్టన్‌ హోటల్‌లో మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ రోజు మధ్యాహ్నం ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్మీడియెట్‌ రెండో సంవత్సారనికి సంబంధించి జనరల్‌, వొకేషనల్‌ కోర్సులకు సంబంధించిన అన్ని ఫలితాలను ప్రకటించారు.
* కోట్ల రూపాయలు విలువైన 81 ప్రాచీన కళాఖండాలను దక్షిణ దిల్లీలోని ఓ గోదాములో స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులు బుధవారం తెలిపారు. వీటిలో కొన్ని శిల్పాలు వందల ఏళ్లనాటివని వివరించారు. కైలాష్‌ ప్రాంతానికి చెందిన సుబోధ్‌ దలాల్‌అనే వ్యక్తి వీటిని దాచిపెట్టినట్లు సమాచారం అందిందని తెలిపారు. దీంతో భారత పురావస్తు అధ్యయన సంస్థ సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టామని వెల్లడించారు. ఆయనపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.
* తెలంగాణలో ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. శుక్రవారం ఉదయం 9గంటలకు ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్‌ పరీక్షలు జరిగాయి. మొదటి సంవత్సరం పరీక్షకు 4.93లక్షల మంది, రెండో సంవత్సరం పరీక్షకు 4.39లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
* ‘భారత విత్తన కాంగ్రెస్‌’ సదస్సును వచ్చే ఫిబ్రవరి 4, 5 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు జాతీయ విత్తన కంపెనీల సంఘం ప్రకటించింది. గత ఫిబ్రవరి 5, 6 తేదీల్లో 8వ విత్తన కాంగ్రెస్‌ను నిర్వహించారు. వచ్చే ఏడాది 9వ సదస్సు నిర్వహణకు హైదరాబాద్‌ను ఎంపిక చేశారు. గతంలో 2011లోనూ భారత విత్తన కాంగ్రెస్‌ హైదరాబాద్‌లో జరిగింది.
* భారత కమ్యూనిస్టు పార్టీ (మార్కిస్టు) 22వ జాతీయ మహాసభలు ఈ నెల 18 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కార్యదర్శి పి.మధు పేర్కొన్నారు.
* ఈనెల 16వతేదీన ఏపీ బంద్‌కు వామపక్ష పార్టీలు, ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపునిచ్చింది. ఈమేరకు ప్రత్యేక హోదా సాధన సమితి నాయకుడు చలసాని శ్రీనివాస్ గురువారం విలేకరులతో మాట్లాడుతూ… 16వతేదీన బంద్‌కు పిలుపునిస్తున్నామని, అయితే… అత్యవసర సేవలకు బంద్ నుంచి మినహాయింపునిస్తున్నామన్నారు. అలాగే ‘బంద్‌లు చేయాలని మా‌కు కోరిక కాదు… ప్రజల కోసం రోడ్డెక్కుతున్నాం..’ అని ఆయన అన్నారు. పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా బంద్ కు పిలుపునిస్తున్నామని, ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసేలా ప్రధానమంత్రి నరేంద్రమోదీ దీక్ష ఉందన్నారు. ప్రజలంతా‌ స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనాలని లెఫ్ట్, హోదా సాధన సమితి పిలుపునిచ్చింది.
* ప్రత్యేక హోదా కోసం ఇంద్రకీలాద్రిపై ఈనెల 22న దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేక యాగం చేయాలని తీర్మానించినట్లు దుర్గగుడి ఈవో పద్మ, పాలకమండలి ఛైర్మన్‌ గౌరంగబాబు వెల్లడించారు. విజయవాడలో బుధవారం నిర్వహించిన పాలకమండలి సమావేశంలో ఈ మేరకు సభ్యులంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు వారు వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా అమ్మవారి సన్నిధిలో ఈ యాగం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రూ.150 వెచ్చించి అన్నప్రాసన టిక్కెట్టు కొనుగోలు చేసిన వారికి ఇకపై రూ.15 విలువ చేసే చక్రపొంగలి ప్రసాదాన్ని ఉచితంగా అందించాలని తీర్మానించినట్లు వారు పేర్కొన్నారు.
* తితిదే శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి విశాఖపట్నం, నెల్లూరు, కడప, కర్నూలు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లోని 17 చోట్ల శ్రీనివాస కల్యాణాలు వైభవంగా జరగనున్నాయి. 13 తేదీన ప్రారంభమై 30న గుర్రంకొండ మండలంలోని చెర్లోపల్లి ఎస్సీ కాలనీలో ముగుస్తాయి.
* వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేసిన చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం మత్యం పంచాయతీ స్వచ్ఛదూత్‌ రమేష్‌కు రాష్ట్రస్థాయి అవార్డు లభించింది. కేంద్రం ఇచ్చిన స్వచ్ఛగ్రాహి అవార్డుకు రాష్ట్రం నుంచి ఈయన మాత్రమే ఎంపికయ్యారు. పాట్నాలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.
* ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు టీడీపీ అర్బన్‌ కమిటీ ఆధ్వర్యాన కళా వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ విప్‌, టీడీపీ అర్బన్‌ అధ్యక్షుడు బుద్దా వెంకన్న ఇతర నాయకులు తెలిపారు.
* గ్రేటర్‌ పరిధిలో మే 1 నుంచి 31వ తేదీ వరకు ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్‌ ప్రకటించారు.
* గతంలో ఎన్నడూ లేని విధంగా సత్యదేవుని కల్యాణ మహోత్సవాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించడానికి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఈనెల 26న స్వామివారి కల్యాణం, మే 1న శ్రీపుష్పయాగం భారీ ఎత్తున నిర్వహించాలని భావిస్తున్నారు. కల్యాణ వేదికను విశాలంగా, సుందరంగా తీర్చిదిద్ది భక్తులు మహోత్సవాన్ని కనులారా వీక్షించేలా చర్యలు తీసుకుంటున్నారు. శ్రీపుష్పయాగం నిత్యకల్యాణ మండపంలో నిర్వహించాలని భావిస్తూ మండపాన్ని కూడా అత్యంత సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక తయారు చేస్తున్నారు. ధర్మకర్తల మండలి సభ్యులతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.సత్యదేవుని ప్రసాదం తయారీ భవనం శిథిలావస్థకు చేరడంతో నూతన భవన నిర్మాణంలో భాగంగా తాత్కాలికంగా ఏర్పాట్లు చేస్తున్న భవనంలో అగ్నినిరోధక ఏర్పాట్లను పరిశీలించారు. తుని అగ్నిమాపక శాఖ అధికారి రమణ తాత్కాలిక భవనంలో ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయమై సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జల్లూరి సత్యనారాయణ పాల్గొన్నారు.దేవస్థానంలో శిక్షణ పొందుతున్న భజన గురువులకు ఈవో జితేంద్ర బుధవారం ధ్రువీకరణ పత్రాలు అందించారు. గత ఏడాది కాలంగా సుమారు 486 మంది భజన గురువులకు శిక్షణ ఇచ్చారు. గత నెల్లో శిక్షణ పొందిన గురువులకు ధ్రువీకరణ పత్రాలు అందించి హిందూ ధర్మపరిరక్షణకు కృషిచేయాలని ఈవో పేర్కొన్నారు.
*ఈనెల 18వతేదీన సింహాచలం అప్పన్న చందనోత్సవం జరగనుందని దేవస్థానం అధికారులు బుధవారం తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేయనున్న దృష్ట్యా ఆయా కార్యక్రమాలు, ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కాగా… సింహాచలంలో తొలి విడత చందనం అరగదీత కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావుతోపాటు పలువురు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా సింహాచలం అప్పన్న దేవాలయం దేశంలోని ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ఉంది. ఏడాదికి 12గంటలు మాత్రమే దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. మిగిలిన సమయంలో విగ్రహం చంతనంతో కప్పబడి ఉంటుంది. ఈ నిజరూప దర్శన సమయాన్ని చందనయాత్ర, చందనోత్సవం అని పిలుస్తారు. అయితే.. ఈ ఏడాదకోసారి ఈ చందనోత్సవాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలి వస్తుంటారు.
* దేశ ప్రజలను, భూ భాగాన్ని కాపాడడానికి ఎంత నిబద్ధతతో పనిచేస్తున్నామో.. దేశంలో శాంతి పరిరక్షణకు కూడా అంతే నిబద్ధతతో పనిచేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఆయన ఈరోజు తమిళనాడు రాజధాని చెన్నైలో జరుగుతున్న డిఫెన్స్‌ ఎక్స్ పో-2018లో పాల్గొని ప్రసంగించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com