నేటి తాజా వార్తలు-౦౪/౧౫

*‘బిట్స్‌’ హైదరాబాద్‌ క్యాంపస్‌ విద్యార్థుల బృందం ప్రతిష్ఠాత్మక ‘రైస్‌ బిజినెస్‌ ప్లాన్‌’ పోటీలో విజేతగా నిలిచింది. అయిదువేల డాలర్ల(సుమారు రూ.3లక్షల 26 వేల పైచిలుకు) బహుమతి మొత్తాన్ని గెలుచుకుంది. అమెరికాలోని రైస్‌ విశ్వవిద్యాలయంలో ఈ పోటీ జరిగింది. ‘బిట్స్‌’హైదరాబాద్‌ ప్రాంగణానికి చెందిన ‘డబ్ల్యుసీబీ’ రోబోటిక్స్‌ బృందం చివరకు విజేతగా నిలిచింది.
* శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది తనిఖీలు నిర్వహించింది. ఓ వ్యక్తి వద్ద బుల్లెట్ ఉండటాన్ని గ్రహించిన సిబ్బంది.. సదరు వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. కాటమ్‌రెడ్డి అనే వ్యక్తి నుంచి బుల్లెట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాటమ్‌రెడ్డిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి కాటమ్‌రెడ్డి తిరుపతి వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు.
*ఉస్మానియా యూనివర్సిటీలో భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్‌.అంబేడ్కర్‌ పరిశోధన కేంద్రాన్ని శనివారం ఏర్పాటు చేశారు. ఓయూ ఉపకులపతి ప్రొఫెసర్‌ రామచంద్రం మాట్లాడుతూ.. పరిశోధనల కోసం నిధిని ఏర్పాటు చేస్తామని, మరిన్ని నిధుల కోసం కేం‌రద్రానికి లేఖరాసినట్లు తెలిపారు.
* క్షేత్ర స్థాయి ఉద్యోగులకు బయోమెట్రిక్‌ హాజరుపై సడలింపునిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 1 నుంచి అధికారుల నుంచి క్షేత్ర స్థాయి ఉద్యోగుల వరకు బయోమెట్రిక్‌ హాజరు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
*రాష్ట్రోపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రథమ కార్యవర్గ సమావేశాలు ఈనెల 29, 30న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని ఏస్టీయూ భవన్‌లో నిర్వహించనున్నట్లు ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు జోసెఫ్‌ సుధీర్‌బాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ విభజన సమయంలో ఇచ్చిన హామీలను ప్రధాని నరేంద్రమోదీ గుర్తుంచుకొని, వాటిని అమలు చేసే జ్ఞానాన్ని ఆయనకు ఇవ్వాలని కోరుతూ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా విగ్రహానికి వినతిపత్రం సమర్పించినట్లు వెల్లడించారు.
*భారీ దాడి చేయాలని ఉగ్రవాదులు పన్నిన కుట్రను భగ్నం చేసినట్లు ఈజిప్ట్‌ సైన్యం ప్రకటించింది. సైనిక శిబిరాల్లోకి చొరబడేందుకు యత్నించిన 14 మంది ఉగ్రవాదులను కాల్చి చంపినట్లు వెల్లడించింది. శనివారం జరిగిన ఈ ఘటనలో 8 మంది సైనికులూ మృత్యువాతపడ్డారని.. మరో 15 మంది గాయాలపాలయ్యారని పేర్కొంది. ‘ఆపరేషన్‌ సినాయ్‌-2018’ పేరుతో ఉగ్రవాదులు, నేర శక్తులను నిర్మూలించేందుకు సైన్యం ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది.
*కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఆదివారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. 65ఏళ్ల జైట్లీ ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే ఆయన కొద్దికాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో ఆయన ఇప్పటివరకు ప్రమాణస్వీకారం చేయలేకపోయారు. రాజ్యసభ ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు ఛాంబర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ పార్టీలకు చెందిన రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు.
* కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం చేసే ఆరోపణలు నిరాధారం, అసత్యమని ఏపీ భాజపా అధ్యక్షుడు హరిబాబు అన్నారు. విజయవాడలో భాజపా నాయకులు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బుక్‌లెట్‌ రూపంలో రాష్ట్ర ప్రజలకు హరిబాబు బహిరంగ లేఖ పంపారు. ‘రాష్ట్రానికి కేంద్ర సహకారం’ పేరుతో బుక్‌లెట్‌ను విడుదల చేశారు. అనంతరం హరిబాబు మాట్లాడుతూ.. ‘కేంద్రంపై కొందరు తెలిసీతెలియని విమర్శలు చేస్తున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనే బుక్‌లెట్‌ను విడుదల చేశాం. నాలుగేళ్లలో కేంద్రం ఏం చేసిందో బుక్‌లెట్‌లో తెలియపర్చాం. అసెంబ్లీలో కేంద్రంపై చేసిన ఆరోపణలు బుక్‌లెట్‌లో సమాధానం ఇచ్చా’మని అన్నారు.
* తితిదే ఛైర్మన్‌గా పుట్టా సుధాకర్‌ యాదవ్ నియామకం‌పై శివస్వామి చేసిన వ్యాఖ్యలపై యాదవ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. సుధాకర్‌ యాదవ్‌పై శివస్వామి వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని ఆరోపిస్తూ.. శివస్వామి తుళ్లూరు మండలం తాళ్లాయపాలెంలో ఏర్పాటుచేసిన శ్రీశైవక్షేత్రాన్ని ముట్టడించేందుకు యాదవులు ర్యాలీగా బయలుదేరారు. సమాచారం అందుకున్న పోలీసులు వీరిని మధ్యలోనే అదుపులోకి తీసుకుని తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
*ప్ర్రజా సంకల్పయాత్ర పేరిట ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేస్తోన్న పాదయాత్ర కృష్ణాజిల్లాలో రెండో రోజు కొనసాగుతోంది. ఈరోజు విజయవాడ శివారు వైఎస్ఆర్ కాలనీ నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభించారు. మైలవరం, గన్నవరం నియోజకవర్గాల్లోని వివిధ గ్రామాల మీదుగా పాదయాత్ర కొనసాగనుంది. అంబాపురం, జక్కంపూడి, కొత్తూరు తాడేపల్లి గ్రామాల్లో జగన్‌కు కార్యకర్తల నుంచి ఘనస్వాగతం లభించింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com