నేటి తాజా వార్తలు-౦౪/౧౭

*ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కందుకూరి వీరేశలింగం పంతులు 171వ జయంతిని పురస్కరించుకొని 2018 సంవత్సరానికి ఆయన పేరుతో రంగస్థల పురస్కారాలను ప్రకటించింది. రాష్ట్ర చలనచిత్ర, నాటకరంగ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ అంబికాకృష్ణ సోమవారం విజయవాడలో పురస్కార విజేతలను ప్రకటించారు.
* వృత్తి విద్యా కళాశాలలు, మేనేజ్‌మెంట్‌, సాధారణ డిగ్రీ కళాశాలల వివరాలను ఉన్నత విద్యామండలి ఆన్‌లైన్‌ చేస్తోంది. ఇంజినీరింగ్‌, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ కళాశాలల యాజమాన్యాలు ఈనెల 25వ తేదీలోపు పూర్తి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు గడువు విధించింది.
*సాధారణ నిధుల వినియోగంపై ఆర్థిక శాఖ ఆంక్షలు విధించడంతో రాష్ట్రంలోని 12,920 మంది సర్పంచులు గత మూడు నెలలుగా గౌరవ వేతనానికి, మరో 50 వేల మంది ఒప్పంద కార్మికులు వేతనాలకు నోచుకోవడం లేదు.
*ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 20న ద్విచక్రవాహనాల ర్యాలీ, మానవహారం నిర్వహించనున్నట్లు రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్‌ ప్రధాన కార్యదర్శి రవిచంద్రకుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ర్యాలీ అనంతరం ఆర్డీవోలకు వినతులు సమర్పించనున్నట్లు వెల్లడించారు.
*క్యాన్సర్‌తో మృతి చెందిన గుంటూరు జిల్లా చినకాకానికి చెందిన ఈపురి దివ్య కుమారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ.15లక్షలను ముఖ్యమంత్రి చంద్రబాబు అందజేశారు.
*వచ్చే నెలలో ప్రారంభం కానున్న రంజాన్‌ ఉపవాసదీక్షల సందర్భంగా అవసరమైన ఏర్పాట్లు చేపట్టడానికి ఆయా శాఖల ఉన్నతాధికారులతో ఏప్రిల్‌ 20న ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్టు ఉప ముఖ్యమంతి మహ్మద్‌ మహమూద్‌ అలీ తెలిపారు.
*కులీకుతుబ్‌షా వారసత్వానికి ప్రతీకలైన కుతుబ్‌షాహీ టూమ్స్‌ బుధవారం నుంచి పర్యాటకులను ఆకర్షించనున్నాయి. తెలంగాణ పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన కులీకుతుషాహీ హెరీటేజ్‌ పార్క్‌ను పురావస్తుశాఖ బుధవారం పునఃప్రారంభించనుంది.
*రాష్ట్ర డీజీపీ మాలకొండయ్య బుధవారం ఢిల్లీకి వెళుతున్నారు. కేంద్రం ప్రతి ఏటా నిర్వహించే పబ్లిక్‌ గవర్నెన్స్‌కు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలను ఆహ్వానిస్తుంది. ఢిల్లీలో రెండు రోజుల(20, 21) పాటు జరిగే ఈ కార్యక్రమం అనంతరం కేంద్రం చేపట్టబోయే కార్యక్రమాల్లో మన రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై వారు ప్రతిపాదనలు పంపుతారు.
*రాష్ట్ర అర్హత పరీక్ష(సెట్‌) ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకాని వారికి మరో అవకాశం కల్పిస్తున్నట్లు టీఎ్‌స-సెట్‌ సభ్యకార్యదర్శి యాదవరాజు తెలిపారు. 20న ఓయూ దూర విద్యాకేంద్రంలో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు తెలిపారు.
*కోయంబత్తూరు, నీలగిరి జిల్లాలలో ఎంఎన్‌ఎం అధ్యక్షుడు కమల్‌హాసన్‌ వచ్చే నెలలో మూడు రోజులపాటు పర్యటించనున్నారు. ఆయన ఇటీవల మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) పేరిట పార్టీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వరుసగా జిల్లాలవారీగా బహిరంగ సభల ద్వారా ప్రజలు, కార్యకర్తలను కలుసుకుంటున్నారు. ఇటీవలే తిరుచ్చిలో ఓ సభ జరిగింది. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని కమల్‌ నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో కోవై, నీలగిరి జిల్లాలలో మూడు రోజుల ఆయన పర్యటనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే నెల 11, 12, 13వ తేదీల్లో పర్యటించనున్నారు. చేనేత కార్మికుల సమస్యల గురించి ఆయన అడిగి తెలుసుకోనున్నారు. తేయాకు తోటలలో పనిచేసే వారిని కూడా కలిసి వారి ఇబ్బందులను ఆరా తీయనున్నారు. మదురై, తిరుచ్చి బహిరంగ సభల్లాగానే కోయంబత్తూరులోనూ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సభ మే 13న జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
*భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో వైసీపీ ఎంపీలు మంగళవారం సమావేశమయ్యారు. విభజన హామీల అమలు, ఏపీకి ప్రత్యేక హోదాపై రాష్ట్రపతితో ఎంపీలు చర్చించినట్లు తెలుస్తోంది. కాగా రాష్ట్రపతితో సమావేశానికి విజయసాయి రెడ్డి గైర్హాజరయ్యారు.
*రాష్ట్రంలో రానున్న ఐదు రోజుల్లో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే అవకాశముందని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. ఈమేరకు ఈ ఐదు రోజులు ఎండిలు మండిపోతాయని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈనెల18వతేదీ నుంచి 20వరకు పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని తెలిపింది. అలాగే మిగిలిన జిల్లాల్లో 41డిగ్రీలకంటే ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. అలాగే21వతేదీ నుంచి 22వరకు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 44 డిగ్రీలు, అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. మిగిలిన జిల్లాల్లో 42డిగ్రీలు, అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, కావున ప్రజలు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
*అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న నాపేరు సూర్య చిత్రం ఆడియో వేడుక ఈ నెల 22న తాడేపల్లిగూడెం మండలం మిలటరీ మాధవరంలో నిర్వహించనున్నట్లు మాజీ సైనికోద్యోగుల సంఘం సోమవారం తెలిపింది.
* ఏపీకి ప్రత్యేక హోదాపై వైసీపీ కేంద్రాన్ని గట్టిగా నిలదీయడం లేదని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షం కంటే బీజేపీయే మమ్మల్ని ఎక్కువగా విమర్శిస్తోందని అన్నారు. బీజేపీ నేతలు మమ్మల్ని తిట్టడం మానేసి… విభజన హామీలను నెరవేర్చాలని మంత్రి డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలపై వెనక్కి తగ్గితే ఆ ప్రభావం దేశవ్యాప్తంగా పడుతుందని ఆయన అన్నారు. బీజేపీ-వైసీపీ నాయకుల మధ్య లాలూచీ రాజకీయం నడుస్తోందని, ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేరతారన్న వార్తలు అవాస్తవమని అన్నారు. ఆనం టీడీపీలోనే కొనసాగుతారని సోమిరెడ్డి స్పష్టం చేశారు.
* కేంద్ర ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి నాంది పలుకుతోంది. స్టడీ ఇన్ ఇండియా పోర్టల్(www.studyinindia.gov.in)ను కేంద్ర ప్రభుత్వం రేపు ఆవిష్కరించనుంది. విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ చేతుల మీదుగా స్టడీ ఇన్ ఇండియా పోర్టల్ ఆవిష్కరణ జరగనుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్, హెచ్‌ఆర్‌డీ సహాయ మంత్రి డా. సత్యపాల్ సింగ్, ఇతర కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ పోర్టల్ ద్వారా సౌత్ ఏషియా, ఆఫ్రికా, సీఐఎస్, మిడిల్ ఈస్ట్‌కు చెందిన 30 దేశాల విద్యార్థులు భారత్‌లో విద్యనభ్యసించవచ్చు. న్యాక్, ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్ పొందిన ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంపిక చేసిన 150 కోర్సుల్లో వీరు చేరవచ్చు. 80 దేశాలకు చెందిన రాయబారులను పోర్టల్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com