నేటి తాజా వార్తలు-౦౭/౧౧

1. శ్రీ పీఠాధిపతి స్వామి పరిపూర్ణానందపై హైదరాబాద్‌ పోలీసులు నగర బహిష్కరణ విధించారు. గతేడాది నవంబర్‌లో జరిగిన రాష్ట్రీయ హిందూ సేన సమావేశంలో పరిపూర్ణానంద చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగానే బహిష్కరణ విధించినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో స్వామిని హైదరాబాద్‌ నగరం నుంచి తరలించారు.

2. పాకిస్థాన్‌ మరోసారి రక్తమోడింది. పెషావర్‌లోని ఓ ప్రాంతంలో ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తుండగా ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో అవామీ నేషనల్‌ పార్టీ (ఏఎన్‌పీ) అభ్యర్థి హరూన్‌ బిలౌర్‌, 16 ఏళ్ల అతని కుమారుడు సహా 14 మంది మృతిచెందారు. సుమారు 50 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

3. సంచలన విజయాలతో ఫుట్ బాల్ సెమీస్ కు దూసుకొచ్చిన బెల్జియం ఆశలకు గండి పడింది. కీలక పోరులో బలమైన ఫ్రాన్స్ జట్టు. 1-0తో బెల్జియంను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. దీంతో మెగా టైటిల్ ను ముద్దాడాలన్న బెల్జియం దూకుడుకు అడ్డుకట్ట పడింది.

4. సులభ వాణిజ్య ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాలు మరోసారి సత్తాచాటాయి. 2017 సంవత్సరానికి కేంద్ర వాణిజ్యశాఖ పరిధిలోని పారిశ్రామిక విధాన ప్రోత్సాహక విభాగం మంగళవారం ప్రకటించిన ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్‌ నెంబర్‌ 1, తెలంగాణ నెంబర్‌ 2 స్థానాల్లో నిలిచాయి. గత ఏడాది తెలంగాణతో కలిసి మొదటి ర్యాంకు పంచుకున్న ఆంధ్రప్రదేశ్‌ ఈసారి 98.42% మార్కులతో ఒంటరిగానే ఆ స్థానంలో నిలిచింది. 98.33% మార్కులతో తెలంగాణ ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకొంది.

5. నిరుపేదల ఆకలిని తీర్చేందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రవేశపెడుతున్న అన్న క్యాంటీన్లు ఈరోజు ప్రారంభం కానున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలోని విద్యాధరపురంలో ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్‌ను ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. అనంతరం ఏ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించే సభలో ప్రసంగిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 25 పురపాలక, నగరపాలక సంస్థల్లో మొదటి విడతగా 60 క్యాంటీన్లు మొదలుకానున్నాయి.

6. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు చేసే వ్యాపారాల్లో సింగపూర్‌ సంస్థలు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ దేశ ఆర్థికమంత్రి హుంగ్‌ సీ క్వేట్‌ను కోరారు. కేవలం ఆర్థికసాయం అందించడమే కాకుండా ఆ సంస్థల నుంచి తక్కువ వడ్డీతో ఆర్థిక సహాయం అందేలా మార్గదర్శనం చేయాలని విజ్ఞప్తి చేశారు. సింగపూర్‌ మూడోరోజు పర్యటనలో భాగంగా చంద్రబాబు మంగళవారం ట్రెజరీ భవనంలో క్వేట్‌తో సమావేశమయ్యారు.

7. ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన థాయ్‌లాండ్‌ ‘గుహ నిర్బంధం’ కథ సుఖాంతమైంది. కబళించడానికి సిద్ధంగా ఉన్న వరదనీటి నడుమ 18 రోజుల పాటు చీకటి గుహలో బిక్కుబిక్కుమంటూ గడిపిన 12 మంది ఫుట్‌బాల్‌ జట్టు బాలలు, వారి కోచ్‌ సురక్షితంగా బయటపడ్డారు. ఇప్పటికే 8 మందిని రక్షించిన సహాయ బృందాలు.. మంగళవారం మిగతా నలుగురితోపాటు వారి కోచ్‌కు విముక్తి ప్రసాదించాయి. దీంతో అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో ఎంతో రిస్కుతో చేపట్టిన ఈ సంక్లిష్ట ఆపరేషన్‌ ముగిసింది.

8. ముంబయి నగరం, పరిసర ప్రాంతాలు కుండపోతగా కురుస్తున్న వర్షంతో అతలాకుతలమయ్యాయి. రెండో రోజయిన మంగళవారం కూడా ఎడతెరిపి లేని భారీ వర్షంతో సాధారణ జనజీవనం అస్తవ్యస్థమైంది. ఎటు చూసినా పోటెత్తిపోతున్న నీటితో రహదారులు చెరువులను తలపించాయి. సోమవారం రాత్రి నుంచి 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. గురువారం దాకా భారీవర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

9. ఈ నెల 18న ప్రారంభమయ్యే రాజ్యసభ వర్షాకాల సమావేశాల్లో 22 భాషల్లో ఏ భాషలోనైనా సభ్యులు మాట్లాడేందుకు అవకాశాన్ని కల్పించినట్లు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. మాతృభాషలోనే మన భావాలను, ఆలోచనలను ఎటువంటి ఆటంకం లేకుండా స్పష్టం చేయగలమని. మాతృభాషే సహజ మాధ్యమంగా తాను భావిస్తానన్నారు. బహు భాషల నిలయమైన పార్లమెంటులో భాషా పరిమితుల దృష్ట్యా ఏ ఒక సభ్యుడు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ సదుపాయాన్ని కల్పించామన్నారు.

10. ట్విట్టర్‌లో ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో అనుసరిస్తున్న వారున్న (ఫాలోవర్లు) నేతల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అగ్రస్థానంలో నిలిచారు. తర్వాతి రెండు స్థానాల్లో పోప్‌ ఫ్రాన్సిస్‌, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నట్లు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com