నేటి తాజా వార్తలు-౧౨/౧౬

*తిరుమల శ్రీవారి సర్వదర్శనం భక్తులు క్యూలైన్లలో నిరీక్షించాల్సిన అవసరం లేకుండా నిర్దేశిత వ్యవధిలో దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు తుది దశకు చేరాయి. ఈనెల 18న ఈ ప్రక్రియను తితిదే ప్రయోగాత్మకంగా ప్రారంభించనుంది. ఈ విధానానికి ‘సమయ నిర్దేశిత సర్వదర్శనం’గా నామకరణం చేసింది. ఏర్పాట్లపై తిరుమల జేఈవో శ్రీనివాసరాజు శుక్రవారం అధికారులతో సమీక్షించారు. దివ్యదర్శనం, ప్రత్యేక ప్రవేశదర్శనం తరహాలో సర్వదర్శనం భక్తులకూ నిర్దేశిత కాల వ్యవధిలో స్వామి దర్శనం కల్పించాలని భావిస్తున్నామని తెలిపారు. ఆరు రోజుల పాటు ఈ ప్రక్రియను ప్రయోగాత్మకంగా పరిశీలించడానికి తిరుమలలో 14 చోట్ల 117 కౌంటర్లు ఏర్పాటుచేశామని వివరించారు. సోమవారం ఉదయం ఆరింటి నుంచి టోకెన్ల జారీ ప్రారంభిస్తామన్నారు. భక్తులకు అవగాహన కోసం ప్రదర్శన బోర్డులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో తిరుపతిలోనూ సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తామని, తద్వారా యాత్రికులు స్థానిక ఆలయాల సందర్శనకు అవకాశం ఉంటుందని వివరించారు.
*అక్రమాస్తుల కేసుల విచారణలో భాగంగా వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసుల్లో ఇతర నిందితులూ హాజరయ్యారు. న్యాయమూర్తి సెలవు కారణంగా విచారణ ఈ నెల 22కు వాయిదా పడింది.
*అయోధ్యలో రామజన్మభూమి, బాబ్రీ మసీదు వివాదానికి కోర్టు బయట పరిష్కారమే ఉత్తమమైనదని ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌ వ్యాఖ్యానించారు. ఈ విషయంపై భాగస్వాములందరితో తాను మాట్లాడుతున్నానని వివరించారు. గత నెలలో అయోధ్యలో తన పర్యటన అనంతరం దీనిపై సానుకూల స్పందన వస్తోందని చెప్పారు. మరోవైపు ముమ్మారు తలాక్‌(ట్రిపుల్‌ తలాక్‌)ను నేరంగా పరిగణిస్తూ కేంద్రం తీసుకొచ్చిన బిల్లుకు ఆయన మద్దతుపలికారు.
*ఆంధ్రప్రదేశ్‌లో కాట్రగడ్డ బ్యారేజీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం సుప్రీంకోర్టులో ఒడిశా స్పెషల్‌లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. వంశధార ట్రైబ్యునల్‌ తీర్పుపై ఒడిశా ట్రైబ్యునల్‌లో సమీక్ష దరఖాస్తు దాఖలు చేసిన విషయం విదితమే.
*ఆపదలో ఉన్న వారికి నేనున్నానంటూ సహాయం చేసేందుకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి తన ఉదారతను చాటుకుంటారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌. శత్రుదేశం ఆమెను విమర్శించినప్పటికీ కూడా ఆ దేశ వాసులకు ఏదైనా వీసా సమస్య ఉంటే వెంటనే పరిష్కరిస్తారు. తాజాగా.. ఆమె పాకిస్థాన్‌లో ఉన్న ఓ భారతీయరాలు స్వదేశానికి వచ్చేందుకు సహాయం చేశారు. అంతేకాదు.. ఆమె భారత్‌ వచ్చేందుకు టికెట్‌ కొనుక్కునేందుకు డబ్బులు లేవని చెబితే.. స్వయంగా సుష్మా ఆమెకు టికెట్‌ ఏర్పాటు చేశారు.
* గత ఎన్నికల(2012)తో పోల్చితే గుజరాత్‌లో పోలింగ్‌ శాతం దాదాపు మూడు శాతం మేర తగ్గింది. రెండు దశల్లో కలిపి మొత్తం 68.41% పోలింగ్‌ నమోదయిందని శుక్రవారం ఎన్నికల సంఘం ప్రకటించింది. గత ఎన్నికల్లో 71.32 శాతం మంది ఓటింగ్‌లో పాల్గొనగా, ప్రస్తుతం అంతకన్నా 2.91 శాతం తక్కువ మంది ఓట్లేశారు. తొలిదశలో 89 స్థానాలకు ఎన్నికలు జరగగా 89 శాతం; రెండోదశలో 93 స్థానాలకు జరిగిన పోలింగ్‌లో 69.99% నమోదయింది. రాష్ట్రం మొత్తమ్మీద 4.35 కోట్ల మంది ఓటర్లు ఉండగా, 2.97 కోట్ల మందే పాల్గొన్నారు. గిరిజనులు అధికంగా ఉండే నర్మదా జిల్లాలో అత్యధికంగా 79.15%మంది ఓట్లు వేయడం విశేషం. అత్యల్పంగా దేవభూమి ద్వారకా జిల్లాలో 59.39 శాతమే నమోదయింది. మొత్తం 33 జిల్లాలు ఉండగా, 15 జిల్లాల్లో మాత్రమే 70%కన్నా అధికంగా పోలింగ్‌ జరిగింది.
*కాకినాడ- పిఠాపురం రైల్వేలైన్‌ను రద్దు చేస్తూ రైల్వే బోర్డు నిర్ణయాన్ని నిరసిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, భాజపా ఏపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు రైల్వే మంత్రి పీయూష్‌గోయల్‌లకు వేర్వేరు లేఖలు రాశారు.
*కర్నూలుజిల్లాలోని వెలుగోడు మండలం జమ్మినగర్ తండా శివార్లలో పెద్ద పులులు సంచరిస్తున్నాయన్న వార్తలతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జమ్మినగర్ శివారులోగల దట్టమైన అడవుల్లో పెద్దపులులు సంచరించడాన్ని కొందరు చూసి గ్రామస్తులకు తెలపడంతో వారు శివారుకు వెళ్లేందుకు జంకుతున్నారు. కాగా… ఈ విషయాన్ని అటవీ, పోలీస్ అధికారులకు కూడా తెలపడంతో వారు కూడా పెద్దపులుల జాడ కోసం అన్వేషిస్తున్నారు.
*పరిశుభ్రమైన నగరంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌కు అంతర్జాతీయ స్థాయి అవార్డు లభించింది. ఈ అవార్డును శుక్రవారం నుంచి మూడు రోజులపాటు రాజేంద్రనగర్‌లో జరుగుతున్న 7వ ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌లో ఆ సంస్థ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ డాక్టర్‌ సదాన్‌ కె.గోష్‌, కో చైర్మన్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ మైకెల్‌ నెల్లెస్‌, ప్రొఫెసర్‌ డాక్టర్‌ పి.ఆగముత్తు, సీఆర్‌సీ మెహంతి, గ్రేటర్‌ కమిషనర్‌ డాక్టర్‌ బి.జనార్థన్‌రెడ్డి, రాజేంద్రనగర్‌ సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌ ఏ.విజయలక్ష్మి, ఏఎంహెచ్‌ఓ డాక్టర్‌ పుట్ట పద్మ, శానిటరీ సూపర్‌వైజర్‌ అంజనేయులుకు అందజేశారు. సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌లో మునిసిపల్‌ కార్పొరేషన్‌ చేపడుతున్న కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని ఈ అవార్డును అందజేస్తున్నట్లు తెలిపారు. గ్రేటర్‌లో రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో తడి, పొడి చెత్త వేరు చేసే ప్రక్రియను చురుకుగా చేస్తున్నందున ఈ అవార్డు వచ్చినందని గ్రేటర్‌ అధికారులు తెలిపారు.
* ఇండోనేషియాలోని వెస్ట్‌ జావా దీవుల్లో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.5గా నమోదైంది. శుక్రవారం అర్థరాత్రి భూ ప్రకంపనలతో ప్రజలు ఒక్కసారిగా భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు. మరోవైపు భూ ప్రకంపనలతో పలు భవనాలు, ఇళ్లు, ఆస్పత్రులు కూడా దెబ్బతిన్నాయి. దాదాపు 20 సెకండ్ల పాటు భూమి కంపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో తామంతా వీధుల్లోకి పరుగులు తీశామని, తమలాగే ఇళ్లలో నుంచి బయటకు వచ్చినవారు సుమారు వెయ్యిమంది వరకూ ఉన్నారని తెలిపారు.
*రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన కొన్ని హామీలను తుంగలో తొక్కిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ అన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం నెరవేర్చకపోతే మిగతా వామపక్ష పార్టీలతో కలిసి ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని ఆయన హెచ్చరించారు.
*గోవా కంటే సుందరమైన సాగర తీరం విశాఖపట్నం సొంతమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖలో హెలీ టూరిజాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. వనరులు ఉన్నా ఇంకా పర్యాటకంగా విశాఖ అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. పర్యాటక అభివృద్ధితో ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు.
*ప్రభుత్వం రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్త్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలతో పాటు జిల్లాలో ని చిన్న చిన్న దేవాలయాలకు పాలక మండళ్లను ఏర్పాటు చేసింది. బాసర సరస్వతీ అమ్మవారి ఆలయానికి ప్రభుత్వం జీవో నంబర్వి డుదల చేస్తూ పాలక మండలిని ఏర్పాటు చేసింది. ఈ ఉత్తర్వులను కమిషనర్ శివశంకర్ విడుదల చేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com