నేటి తాజా వార్తలు-౧౨/౩౧

*ఉషాలక్ష్మి బ్రెస్ట్‌ కేన్సర్‌ ఫౌండేషన్‌ సీఈవో, డైరెక్టర్‌ డాక్టర్‌ పి.రఘురాం 2017 సంవత్సరపు ప్రతిష్ఠాత్మక ‘సామాజిక సేవా పురస్కారాన్ని’ దక్కించుకున్నారు. ది అసోసియేషన్‌ ఆఫ్‌ సర్జన్స్‌ ఆఫ్‌ ఇండియా అందించే ఈ అవార్డును జైపూర్‌లోని బీఎమ్‌ బిర్లా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సెంటర్‌లో జరిగిన ఏఎ్‌సఐసీఓఎన్‌ 77వ వార్షిక సదస్సులో రాజస్థాన్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అశోక్‌ జైన్‌ రఘురాంకు ప్రదానం చేశారు. దేశసేవ, సామాజిక సేవ చేసినందుకు ఆయనకు ఈ పురస్కారం దక్కింది. కాగా, సామాజిక సేవా పురస్కారాన్ని అందుకున్న పిన్న వయస్కుడు రఘురాం కావడం విశేషం. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఈ అవార్డు అందుకున్న ఏకైక వ్యక్తి ఈయనే.
* రాష్ట్రంలో పోలీసు శాఖలో 14 వేల పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందని, హైదరాబాద్‌ సిటీ పోలీస్‌కు మంజూరు చేసిన 3,900 పోస్టులను కలిపి త్వరలోనే ప్రకటన జారీచేస్తామని రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కొత్త జిల్లాల్లో డీపీఓ కార్యాలయాలు, స్టేషన్ల నిర్మాణాలను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు.
*భారత ఆర్థిక సంఘం(ఐఈఏ) అధ్యక్షుడిగా ప్రముఖ ఆర్థికవేత్త, తెలుగువారైన మహేంద్రదేవ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐఈఏ సర్వసభ్య సమావేశంలో ఆయన ఎన్నికను ప్రస్తుత అధ్యక్షుడు సుఖదేవ్‌ థొరాట్‌ ప్రకటించారు.
*హిజ్రాల (ట్రాన్స్‌జెండర్స్‌) కోసం ప్రత్యేక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వారికి అన్నిరకాల హక్కులు, రక్షణ కోసం సంబంధిత చట్టాల్లో అవసరమైన సవరణలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం అవసరమైన చర్యలు చేపట్టాలని అన్ని శాఖల అధిపతులు, కార్యదర్శులను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర స్త్రీ, శిశు, వయోజన, విభిన్న ప్రతిభావంతులశాఖ కార్యదర్శి కె.సునీత శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
*జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్‌లోని పరిపాలన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తొలి సభ్యత్వాన్ని ఆయన స్వీకరించారు. అనంతరం పార్టీలోని ముఖ్యులకు సభ్యత్వ నమోదు పత్రాలను అందజేశారు. త్వరలోనే రెండు రాష్ట్రాల్లో సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com