నేటి తాజా వార్తలు 05/05

*తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని ఆలయాలను పరిశీలించడానికి అనుమతివ్వాలని కోరుతూ పురావస్తుశాఖ తితిదే ఈవోకు రాసిన లేఖపై దుమారం రేగింది. ఈ మేరకు తామురాసిన లేఖను వెనక్కి తీసుకుంటున్నట్టు తితిదే ఈవోకు ఆ శాఖ డీజీ ఫోన్‌ చేసి తెలిపారు. ‘‘తితిదే ఆధ్వర్యంలోని ఆలయాలను సురక్షిత ఆలయాల జాబితాలో చేర్చేందుకు అవకాశం ఉందా? లేదా? అనే అంశంపై అధ్యయనం కోసం సమాచారం, ఫొటోలు సేకరించాల్సి ఉందని ఓ లేఖ వచ్చింది. ఈ విషయం మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో దిల్లీ నుంచి కేంద్ర పురావస్తుశాఖ డీజీ ఫోన్‌ చేసి నాతో మాట్లాడారు. తితిదే ఆలయాలను తమ పరిధిలోకి తీసుకొనే ఆలోచన లేదని స్పష్టం చేశారు’’ అని ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు.
* వచ్చే నెల నుంచి నూతన టెలికాం విధానం అమల్లోకి తీసుకురానున్నట్లు టెలికాం సెక్రటరీ అరుణ సుందర్‌రాజన్‌ తెలిపారు. ఇప్పటికే ‘జాతీయ డిజిటల్‌ కమ్యూనికేషన్స్‌ విధానం 2018’ పేరిట ఈ ముసాయిదాను ప్రభుత్వం ఆవిష్కరించింది. ప్రజల సూచనలు, సలహాల కోసం దీన్ని అందుబాటులో ఉంచారు. ‘ఈ ముసాయిదాను నాలుగు వారాల్లో కేంద్ర కేబినెట్‌ ముందు ప్రవేశపెడతాం. ప్రస్తుతం ప్రజల సలహాలు, సూచనల కోసం రెండు వారాల పాటు అందరికీ అందుబాటులో ఉంచాం. వారం రోజుల్లో తుది రూపునిచ్చి ఆ తర్వాత కేబినెట్‌ ముందుంచుతాం. జూన్‌ నుంచి ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది’ అని అన్నారు.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలపై దిల్లీలో ఇండియా నెక్ట్స్‌ జాతీయ సదస్సు జరిగింది. రాజ్యాంగ నిపుణులు సుభాష్‌ కశ్యప్‌, సీపీఐ నేత సురవరం సుధాకర్‌రెడ్డి , లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్‌ నారాయణ తదితరులు సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జేపీ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం దేశంలో గవర్నర్ల వ్యవస్థ నిర్వీర్యం అవుతోంది. నామినేటెడ్‌ గవర్నర్లు కేంద్రంలో ఉన్న అధికార పార్టీ రాజకీయ ప్రతినిధులుగా పని చేస్తున్నారు. ఇది గవర్నర్‌ వ్యవస్థకు విరుద్ధం. నామినేటెడ్‌ గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలి’’ అని జేపీ వివరించారు.
* ప్రధానమంత్రి పదవి కోసం తాను పోటీ పడుతున్నారంటూ వస్తోన్న వార్తల్ని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ మరోసారి తోసిపుచ్చారు. కేంద్రమంత్రిగా సాధించిన దాంతో సంతృప్తి చెందడం తప్ప ప్రధాని పదవిపై ఎప్పుడూ దృష్టిసారించలేదని స్పష్టంచేశారు. శుక్రవారం ఆయన ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో తాను ఏదో ఒకరోజు ప్రధాని పదవిని అలంకరిస్తారని శివసేన నేత, మాజీ సీఎం మనోహర్‌జోషి చేసిన వ్యాఖ్యలపై గడ్కరీ వివరణ ఇచ్చారు. 2019లో ప్రధాని మోదీ నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్లి విజయం సాధించగలమని ధీమా వ్యక్తం చేశారు.
*ఝార్ఖండ్‌లో పదహారేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం, సజీవ దహనం కేసులో పోలీసులు 16మంది నిందితులను అరెస్ట్‌ చేశారు. రాష్ట్రంలోని ఛత్రా జిల్లాలో శుక్రవారం దుండగులు బాలిక ఇంట్లో ఉండగా దాడి చేసి సజీవ దహనం చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు రోజు రాత్రి నలుగురు మృగాళ్లు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయంపై బాలిక తండ్రి గ్రామ పెద్దకు ఫిర్యాదు చేయడంతో దుండగులు కోపంతో బాధితిరాలి ఇంటిపై దాడి చేసి ఆమెను అతి దారుణంగా చంపేశారు. ఇటీవల అమ్మాయిలపై పలు అత్యాచార ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న నేపథ్యంలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది.
* క్రిప్టో కరెన్సీకి సంబంధించి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎలాంటి లావాదేవీలను, సేవలను నిర్వహించరాదంటూ రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఓ కంపెనీ దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. గతంలో ఇలాంటి కేసులను విచారించిన జస్టిస్‌ రాజీవ్‌ షక్దర్‌ నేతృత్వంలోని బెంచ్‌ ముందుకు దీనిని తీసుకొచ్చారు. ఏప్రిల్‌ 6న ఆర్‌బీఐ జారీ చేసిన ఉత్తర్వులు నిరంకుశంగా, అనుచితంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని, వెంటనే వెనక్కి తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలంటూ మహారాష్ట్రకు చెందిన ఫ్లిన్‌స్టోన్‌ ప్రైవేటు లిమిటెడ్‌ న్యాయస్థానాన్ని కోరింది.
*ఉత్తర్‌ప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి అనుపమ జైశ్వాల్‌ పర్యటనలో భాగంగా లఖ్‌నవూకు సమీపంలోని బారాయిచ్‌ పాఠశాలలోని విద్యార్థులతో కలిసి భోజనం చేయాలి. అయితే ఆమె పర్యటనకు దాదాపు 8గంటల ముందు నుంచే విద్యార్థులకు ఎలాంటి ఆహారం పెట్టకుండా ఖాళీ కడుపుతో ఉంచడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ విషయాన్ని అనుపమ దృష్టి తీసుకెళ్లగా, భోజనాల విషయంలో సదరు ఉపాధ్యాయులు బాధ్యతలో వ్యవహరించాలని అన్నారు. ‘పిల్లలకు భోజనం పెట్టకుండా 8గంటల ముందు నుంచే వారిని నా రాకకోసం వేచి ఉండేలా చేయడం మంచిది కాదు. సదరు ఉపాధ్యాయులు దీనికి బాధ్యత వహించాలి. వారు తప్పక సమాధానం చెప్పాలి’ అని అన్నారు.
* రాష్ట్రంలో 224 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 12న జరుగనున్న ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కర్ణాటక చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారి సంజీవ్‌ కుమార్‌ శనివారం తెలిపారు. దీనిలో భాగంగా ఈ ఎన్నికలకు మొత్తం 58,008 పోలింగ్‌ కేంద్రాలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వీటితో పాటు మొత్తం మహిళా సిబ్బందితో 600 పింక్‌ పోలింగ్‌ కేంద్రాలను కూడా అందుబాటులో తీసుకొస్తున్నట్లు తెలిపారు.
* ప్లేఆఫ్‌ బరిలో నిలవాలంటే గెలవాల్సిన తప్పనిసరి మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు బోల్తా పడింది. దాదాపు అభిమానులను ఆశలను ఆవిరి చేసింది! చెన్నై సూపర్‌ కింగ్స్‌ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. 128 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఇంకా 12 బంతులు ఉండాగానే ధోనీసేన ఛేదించింది. అంబటి రాయుడు (32; 25 బంతుల్లో 3×4, 2×6) ఎప్పటిలాగే శుభారంభం అందించాడు. సురేశ్‌ రైనా (25; 21 బంతుల్లో 2×4, 1×6) రాణించగా ఎంఎస్‌ ధోనీ (31 నాటౌట్‌; 23 బంతుల్లో 1×4, 3×6) వరుస సిక్సర్లతో విన్నింగ్‌ షాట్లు కొట్టేశాడు.
* లింగాయత్‌లకు మైనార్టీ హోదాను తీసుకువచ్చేందుకు సీఎం సిద్ధ రామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని, అందుకోసం వీరశైవులను, లింగయత్‌లను విడగొట్టేందుకు చూస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సెదామ్‌లో ఆయన ప్రసంగించారు. యడ్యూరప్ప ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ కుటిలయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ఇలాంటి చర్యలకు సఫలం కావని, అందుకు కాంగ్రెస్‌ మూల్యం చెల్లించక తప్పదని స్పష్టం చేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com