నేటి తాజా వార్తలు-06/05

* ఉరుములు, మెరుపులు, హోరు గాలితో కూడిన భారీ వర్షం సోమవారం రాత్రి ముంబయి నగరాన్ని ముంచెత్తింది. విమానాలు ఎగరలేదు. ఇక్కడకు చేరుకోవాల్సిన పలు విమానాలు దారిమళ్లాయి. రైళ్లూ కదల్లేదు. పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. నగరం, శివారుల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాయ్‌గఢ్‌, థానే, రత్నగిరి తదితర ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది.
*పొదుపు పేరుతో జోర్డాన్‌ ప్రభుత్వం చేపట్టిన చర్యలకు వ్యతిరేకంగా ప్రజలు చేపట్టిన ఆందోళనకు తలొగ్గి ప్రధాని హనీ ముల్కీ సోమవారం రాజీనామా చేశారు. జోర్డాన్‌ రాజు అబ్దుల్లా-2 ఆయనను పిలిపించి రాజీనామా చేయాలని కోరారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని విద్యాశాఖ మంత్రి ఒమర్‌ అల్‌ రజాజ్‌ను సూచించారు.
*కార్మికుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 11 నుంచి నిరవధిక సమ్మె చేస్తామని ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ ప్రకటించింది. సమ్మె నోటీసు ఇచ్చినా కార్మిక శాఖ కనీసం సమావేశమైనా నిర్వహించలేదని విమర్శించింది.
* రాష్ట్రంలోని అన్ని దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే అన్ని ప్రధాన ఆలయాల్లో ఆన్‌లైన్‌ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోనే ప్రథమంగా సికింద్రాబాద్‌ గణపతి దేవాలయంలో ప్రయోగాత్మకంగా ఆన్‌లైన్‌ బుకింగ్‌ సేవలను సోమవారం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు.
*ఐసెట్‌- 2018 ఫలితాలను ఈనెల 10న వెల్లడించనున్నట్లు కన్వీనర్‌, కాకతీయ విశ్వవిద్యాలయం వాణిజ్యశాస్త్రం సీనియర్‌ ఆచార్యులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
*తిరుమల శ్రీవారికి ఈ నెల 24 నుంచి జరగనున్న జ్యేష్ఠాభిషేకం ఉత్సవాల నేపథ్యంలో మూడు రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు తితిదే సోమవారం తెలిపింది. అభిషేకాది క్రతువులతో అత్యంత ప్రాచీనమైన శ్రీవారి ఉత్సవమూర్తుల విగ్రహాలు అరిగిపోకుండా పరిరక్షించేందుకు చేసే ఉత్సవమే జ్యేష్ఠాభిషేకం. ఈ వేడుకల్లో మొదటి రోజు శ్రీమలయప్ప స్వామివారికి బంగారు కవచాన్ని తీసివేసి హోమాలు, అభిషేకాలు, పంచామృత స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. వజ్రకవచం అలంకరించి తిరువీధుల్లో ఊరేగిస్తారు. రెండో రోజు ముత్యాల కవచ సమర్పణ, 26న బంగారు కవచ సమర్పణ చేసి చతుర్మాడవీధుల్లో విహరింపజేస్తారు. ఈ ఉత్సవం నేపథ్యంలో శ్రీవారికి 25న విశేషపూజ, 26న అష్టదళ పాదపద్మారాధన సేవ, కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, 3 రోజుల పాటు వసంతోత్సవాన్ని రద్దు చేస్తున్నట్లు తితిదే వెల్లడించింది. తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనుంది.
*ఉబ్బసం, దగ్గు, శ్వాస కోశ వ్యాధి గ్రస్తులకు ఈ నెల 8వ తేదీన కొండపల్లిలోని ఆరుపంపుల సెంటర్‌ వద్ద ఉచితంగా చేపమందు పంపిణీ చేస్తున్నామని హాజీ, హకీ, మహ్మద్‌ యాసఫ్‌ ఆలీ కుటుంబ సభ్యులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 1928 సంవత్సరం నుంచి ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు మృగశిర కార్తె ప్రవేశపు రోజున చేపమందును పంపిణీ చేస్తున్నామన్నారు. 8వ తేదీ ఉదయం 8గంటల నుంచి సాయంత్రం వరకూ పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. చేపమందు కోసం వచ్చే వారు ప్రాణం ఉండే బురదమట్ట చేప పిల్లలను తెచ్చుకోవాలన్నారు.
* కేంద్రంలోని మోదీ సర్కారుపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారం చేస్తోందని భాజాపా జాతీయ అధికార ప్రతినిధి జి.వి.ఎల్.నరసింహరావు అన్నారు.
* ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్‌ను నియమించడం పట్ల ఓబీసీలు ఆగ్రహంతో ఉన్నారని.. అందుకే ఉప ఎన్నికల్లో భాజపా ఓడిపోయిందని రాష్ట్ర మంత్రి ఓం ప్రకాశ్‌ రాజ్‌భార్‌ అన్నారు. భాజపా సీనియర్‌ నేత కేశవ్‌ ప్రసాద్‌ మౌర్యను ముఖ్యమంత్రిగా నియమించకపోవడం పట్ల వెనుకబడిన వర్గాలు అసంతృప్తితో ఉన్నాయని, ఆయనను కాకుండా యోగిని సీఎంగా చేయడంతో వారు భాజపాకు వ్యతిరేకంగా ఓట్లేశారని ఆయన పేర్కొన్నారు.
* ఉప ఎన్నికలు రావని తెలిసిన తర్వాతే వైకాపా ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి నాటకాలు ఆడుతున్నారని తెదేపా ఎంపీ కొనకళ్ల నారాయణ అన్నారు. విజయవాడలో ఆయన విజయవాడ ఎంపీ కేశినేని నానితో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ప్రతిపక్ష నేత జగన్‌ ఆరాటం కేవలం కేసుల నుంచి బయటపడటం కోసమేనని ఆరోపించారు.
* రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘రైతు బంధు’ పథకాన్ని ఇటీవల ప్రారంభించింది. తొలి విడతలో భాగంగా ఎకరాకు రూ.4వేలు చొప్పున రైతులకు చెక్కులు కూడా అందించింది. అయితే ఈ పథకం ద్వారా వచ్చిన డబ్బులను బ్యాంకుల నుంచి తెచ్చుకునేందుకు రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూశామని రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. ఇందుకోసం తెలంగాణలోని బ్యాంకులకు రూ.5,400కోట్లు సరఫరా చేసినట్లు పేర్కొంది.
* విజయవాడ మున్సిపల్‌ కార్యాలయం వద్ద మంగళవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమస్య పరిష్కారం కోసం కార్పొరేషన్‌ను ముట్టడించేందుకు కార్మికులు భారీగా తరలివచ్చారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ కార్మికులు కార్పొరేషన్‌లోనికి చొచ్చుకు పోయేందుకు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు.
* నర్సుల బదిలీలను 20 శాతానికి కుదించడాన్ని నిరసిస్తూ రిమ్స్‌ ఆస్పత్రి నర్సులు సోమవారం ఆందోళన చేపట్టారు. ఆస్పత్రిలోని వాటర్‌ ట్యాంక్‌ ఎక్కేందుకు యత్నించగా పోలీసులు వారిని మధ్యలోనే అడ్డుకున్నారు.
* ముస్లింల కోసం రాష్ట్ర ప్రభుత్వం అందజేయనున్న ‘రంజాన్‌ తోఫా’ ను ఈ నెల 10వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా అందజేయనున్నారు. గోధుమపిండి ఐదు కేజీలు, చక్కెర రెండు కేజీలు, సేమ్యా కేజీ, నెయ్యి – 100 గ్రాముల ప్యాకెట్‌ చొప్పున మొత్తం ఐదు సరుకులను ఒక బ్యాగ్‌లో వేసి ఉచితంగా రంజాన్‌ తోఫాగా ఇవ్వనున్నారు. బ్యాగ్‌కు డీలర్లకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
* తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత ముస్లింల ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తుందని సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఇవాళ మెదక్ లో 1250 పేద ముస్లిం కుటుంబాలకు ప్రభుత్వం తరపున వస్ర్తాలు పంపిణీ చేశారు మంత్రి హరీశ్ రావు.
* రాష్ట్ర పర్యటనలో భాగంగా విశ్రాంత ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ మంగళవారం విజయనగరానికి చేరుకున్నారు. ఈరోజు నుంచి మూడు రోజుల పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఆయన పర్యటించనున్నారు. ముందుగా ఆయన విజయనగరంలోని పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, పురోహితులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం లక్ష్మీనారాయణకు అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు.
* సునంద పుష్కర్‌ హత్య కేసులో మాజీ కేంద్ర మంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత శశి థరూర్‌కు ఢిల్లీ కోర్టు మంగళవారం సమన్లు జారీ చేసింది. కేసులో నిందితుడైన శశి థరూర్‌ను జులై 7న విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.
*అగ్రీ గోల్డ్ కేసు విశారణలో హైకోర్టు ఈనెల ఎనిమిదికి వాయిదా వేసింది. అగ్రీగోల్ద్ ఆస్తుల కొనుగోలుకు జీ ఎస్సెల్ గ్రూపు ముందుకు వచ్చింది.
* ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ల భేటీకి ముహూర్తం ఖరారైంది. సింగపూర్‌ కాలమానం ప్రకారం ఈ నెల 12న ఉదయం 9 గంటలకు ఇరువురు నేతలు సమావేశం కానున్నట్లు అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం ప్రకటించింది. ట్రంప్‌, కిమ్‌ భేటీ కోసం ఏర్పాట్లను ముమ్మరం చేసినట్లు శ్వేతసౌధం మీడియా కార్యదర్శి శారా సాండర్స్‌ తెలిపారు.
* ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్లాస్టిక్‌ వస్తువులపై నిషేధం విధిస్తున్నట్లు సీఎం పళనిస్వామి ప్రకటించారు. ప్లాస్టిక్‌పై నిషేధం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమలు కానుందని ఆయన పేర్కొన్నారు.
* దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 108 పాయింట్లు నష్టపోయి 34,903 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 35 పాయింట్ల నష్టంతో 10,593 దగ్గర స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 67.15గా ఉంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com