నేటి తాజా వార్తలు -06/06

*పదవీ విరమణ పొందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఎస్‌.నర్సింగరావును ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శిగా పునర్నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. నర్సింగరావు గత నెల 31న పదవీ విరమణ పొందారు. ఆయన సేవలు వినియోగించుకునేందుకు సీఎం నిర్ణయించడంతో ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నెల ఒకటి నుంచి ఆయన రెండేళ్లపాటు పదవిలో ఉంటారు.
*బాసర ఆర్జీయూకేటీలో పీయూసీ మొదటి సంవత్సరం ప్రవేశానికి 24,441 దరఖాస్తులు వచ్చినట్లు వర్సిటీ ఉపకులపతి అశోక్‌కుమార్‌ తెలిపారు. ఇందులో 13,066 మంది విద్యార్థినులున్నారని పేర్కొన్నారు. 2018-19 విద్యాసంవత్సరానికి పీయూసీ మొదటి సంవత్సరంలో 1,500 సీట్లకు రాష్ట్రం నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచీ విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. స్థానికులు 22,739 మంది, స్థానికేతరులు 1,672 మంది, ఇతర రాష్ట్రాల నుంచి 30 మంది, ఎన్‌ఆర్‌ఐలు ముగ్గురు దరఖాస్తు చేసుకున్నారు. ఎంపికైనవారి జాబితాను 11న విడుదల చేస్తామని పేర్కొన్నారు.
*డీసెట్‌ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ రెండుమూడు రోజుల్లో విడుదల చేయనుంది. ఉత్తీర్ణులైన వారికి ఈనెల 19 నుంచి 22 వరకు కౌన్సెలింగ్‌ జరగనుంది. విద్యార్థులు కళాశాలలు, కోర్సుల ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ధ్రువపత్రాల పరిశీలన మాత్రం ఆయా కళాశాలల్లోనే నిర్వహిస్తారు.
*శ్రీవేంకటేశ్వర స్వామివారి స్వర్ణాభరణాలను ప్రదర్శించాలని తిరుమల, తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి తీర్మానించింది. ఇందుకు దేవస్థానం ఆగమ సలహామండలి అనుమతి కోరింది. అనుమతిరాగానే భారీ భద్రత కల్పించి భక్తుల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసే దిశగా ప్రదర్శించాలని సంకల్పించింది. మిరాశీ వ్యవస్థ రద్దయిన అనంతరం ఆలయ అధికారులకు అప్పగించిన ఆభరణాలన్నింటినీ తిరువాభరణం దస్త్రాల్లో నమోదు చేసిన మేరకు ప్రదర్శనకు ఉంచాలని తీర్మానించింది.
* శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌(ఎస్వీబీసీ) ఇన్‌ఛార్జి సీఈవోగా తితిదే తిరుపతి జేఈవో పోలా భాస్కర్‌ను నియమిస్తూ ధర్మకర్తల మండలి తీర్మానించింది. ఇది వరకు ఇన్‌ఛార్జి సీఈవోగా పని చేసిన ఎన్‌.ముక్తేశ్వరరావుకు తితిదేలో ఒప్పంద కాలం ఈ నెల 3వ తేదీతో ముగిసింది.
*సీఏ ఫౌండేషన్‌ పరీక్ష నిర్వహణ తేదీలో స్వల్ప మార్పులు జరిగాయి. ఇకపై నవంబరులోనే ఈ పరీక్షను నిర్వహించనున్నారు. సీఏ కోర్సులోకి ప్రవేశించాలనుకునే విద్యార్థులకు గతంలో సీఏ సీపీటీ పరీక్ష డిసెంబరులో జరిగేది. మారిన విధానం ప్రకారం ఈ పరీక్ష నవంబరులోనే నిర్వహించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సీఏ ఫౌండేషన్‌ రిజిస్ట్రేషన్‌కు జూన్‌ 30ని చివరి తేదీగా నిర్ణయించారు.
*ఈ నెల 11వ తేదీ నుంచి టీఎంయూ ఆధ్వర్యంలో చేపెట్టే నిరవధిక సమ్మెకు ఆర్టీసీ ఐకాస సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల వేతన సవరణ, ఇతర సమస్యల పరిష్కారం తదితర డిమాండ్ల విషయంలో ప్రభుత్వం, యాజమాన్య వైఖరిని నిరసిస్తూ సమ్మెకు సహకరిస్తామని ఆర్టీసీ ఐకాస కన్వీనర్‌ రాజిరెడ్డి తెలిపారు.
*దేశంలోనే తొలిసారిగా రైతు బీమా పథకం అమలు చేస్తున్నామని రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఆగస్టు 15 నుంచి రైతులకు బీమా సర్టిఫికెట్లు అందజేస్తామని వెల్లడించారు. ప్రతిఏటా ఆగస్టు మొదటి వారంలో బీమా సంస్థకు చెల్లింపులు చేస్తామని చెప్పారు. భూ రికార్డుల ప్రక్షాళన, రైతుబంధు పథకం, రైతుబీమా పథకాలు దేశానికే ఆదర్శమని గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు.
*తెలంగాణ ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లో సోమవారం వ్యవసాయ అధికారులు, రైతు సమన్వయ సమితి కో-ఆర్డినేటర్లు, మండల కన్వీనర్లకు అవగాహన సదస్సు నిర్వహించి దిశానిర్దేశం చేశారు.
*చెత్త తరలింపు ప్రక్రియలో నూతన విధానాలు అవలంభించినందుకు గాను విజయవాడ నగరపాలక సంస్థకు స్కోచ్ అవార్డు దక్కింది. నగరంలో నిత్యం ఉత్పత్తి అయ్యే చెత్తను స్మార్టు బిన్నులు ద్వారా సేకరించి తరలించటంతో పాటు సర్వేలెన్స్ కెమెరాల ద్వారా పర్యవేక్షించినందుకు ఈ అవార్డు వచ్చినట్లు కమిషనర్ నివాస్ తెలిపారు. *
* రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకం, టెలిమెట్రీ, బోర్డు నిర్వహణ తదితర అంశాలపై చర్చించేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు బుధవారం సమావేశమైంది. హైదరాబాద్ జలసౌధలో బోర్డు ఛైర్మన్ హెచ్ కే సాహూ నేతృత్వంలో జరుగుతోన్న సమావేశంలో బోర్డు సభ్య కార్యదర్శి పరమేశంతో పాటు ఇరు రాష్ట్రాల సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఈఎన్ సీ నాగేందర్, ఆంధ్రప్రదేశ్ తరపున జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్ సీ వెంకటేశ్వరరావు, ఇంజనీర్లు పాల్గొన్నారు.
* తమ రాజీనామాలపై పునరాలోచన లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌కు స్పష్టం చేశారు. వైకాపా ఎంపీలు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, సుబ్బారెడ్డి, వరప్రసాదరావు, అవినాశ్‌ రెడ్డి, మిథున్‌ రెడ్డి ఈరోజు స్పీకర్‌ను కలిశారు. తమ రాజీనామాలను వెంటనే ఆమోదించాలని మరోసారి కోరారు.
*మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పది రోజుల్లో రైతు రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ‘మీ (రైతులు) మీద కాల్పులు జరిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుని తీరుతాం’ అని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోని మాండసౌర్‌లో రైతులపై కాల్పులు జరిగి ఏడాది అయిన సందర్భంలో మాండసౌర్‌లో బుధవారం జరిగిన రైతు ర్యాలీలో రాహుల్ పాల్గొన్నారు.
* గల్లా అరుణ పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తలను ఎంపీ గల్లా జయదేవ్ కొట్టిపారేశారు. తన తల్లి పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారం అవాస్తవం అన్నారు. గల్లా అరుణ అమెరికా వెళ్లే ముందు రాబోయే ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయనని చెప్పారన్నారు. దీనికి లేనిపోని ప్రచారాలు చేస్తున్నారని వాపోయారు.
* వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామాలపై డ్రామాలు బాగా ఆడుతున్నారని టీడీపీ ఎంపీ శివప్రసాద్ ఎద్దేవా చేశారు. అందరూ బాగా నటించి ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. 1951 యాక్ట్ ప్రకారం ఇప్పుడు రాజీనామాలు ఆమోదించుకుంటే ఎన్నికలు జరగవని తెలిసే డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని శివప్రసాద్ అన్నారు.
* ప్రముఖ రచయిత, సినీ నటుడు తనికెళ్ల భరణి తనకు వచ్చిన రైతుబంధు చెక్కును ప్రభుత్వానికి తిరిగి ఇచ్చారు. షాబాద్‌లో తనకున్న రెండున్నర ఎకరాల భూమికి రూ. 10 వేల చెక్కు వచ్చింది. ఈ చెక్కును తనికెళ్ల భరణి.. అధికారులకు తిరిగి వెనక్కి ఇచ్చారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు పలువురు ప్రముఖులు, మంత్రులు, ఎమ్మెల్యేలు తమ రైతుబంధు చెక్కులను ప్రభుత్వానికి తిరిగి ఇచ్చిన విషయం విదితమే.
* ప్రధానమంత్రి నరేంద్రమోది ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రడూన్ పరేడ్ ‌గ్రౌండ్‌లో యోగా చేయనున్నారు. ఈ నెల 21న ‘ప్రపంచ యోగా దినోత్సవం’ సందర్భంగా దేశ వ్యాప్తంగా యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే ఉత్తరాఖండ్‌లో నిర్వహించే యోగా కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు. యోగా అనంతరం దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి నేతలు, అధికారులు సహా దాదాపు 60 వేల మంది ప్రజలు హాజరుకానున్నారు.
ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి 21 వరకు యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మోదీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత యోగాను ప్రభుత్వ కార్యక్రమమంగా నిర్వమిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు జూన్ 21న ‘యోగా డే’ను జరుపుకొంటున్నాయి.
*నాసా-ఏఎంఈఎస్‌ స్పేస్‌ సెటిల్‌మెంట్‌ పోటీకి సంబంధించి మే 24 నుంచి 27 వరకూ అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో నిర్వహించిన.. ఐఎస్‌డీసీ కాన్ఫెరెన్స్ లో శ్రీచైతన్య ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిందని విద్యాసంస్థల అకడమిక్‌ డైరెక్టర్‌ సీమ తెలిపారు. భారత్‌ నుండి మొత్తం 125 మంది ఈ కాన్ఫెరెన్స్‌లో పాల్గొనగా ఒక్క శ్రీచైతన్య నుంచే 105 మంది ఉండటం గొప్ప విషయమని ఆమె మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 25 దేశాల నుండి 480 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలో శ్రీ చైతన్య.. 1, 2, 3 బహుమతులతో పాటు అత్యధిక గెలుపు ప్రాజెక్టులు కైవసం చేసుకుని, వరుసగా 5వ సంవత్సరమూ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిందని వివరించారు. విజేతలను శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత బీఎస్‌ రావు అభినందించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com