నేటి తాజా వార్తలు -06/07

* పశ్చిమ బెంగాల్ గవర్నర్ కేషరినాథ్ త్రిపాఠికి అదనపు బాధ్యతలు అప్పగించారు. త్రిపుర రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి భవన్ వర్గాలు ఓ ప్రకటనను విడుదల చేశాయి. త్రిపుర ప్రస్తుత గవర్నర్ తతగట రాయ్ సెలవుపై ఉన్నారు. ఎటువంటి కారణాలు తెలపకుండానే ఆయన సెలవుపై వెళ్లారు. దీంతో పశ్చిమ బెంగాల్ గవర్నర్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ త్రిపుర గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
* కృష్ణాజిల్లా వ్యాప్తంగా గత రాత్రి నుంచి భారీగా వర్షం కురుస్తోంది. వర్షపు నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపైకి వర్షంపు నీరు వచ్చి చేరడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు జిల్లాలో వర్షాలపై కలెక్టర్ లక్ష్మీకాంతం సమీక్ష జరిపారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అలాగే అన్ని డివిజన్‌ల పరిధిలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు.
* ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ, జ్యోతిర్మయి తెలుగు గజల్‌ అకాడమీ సంయుక్త ఆధ్వర్యాన ఈ నెల 10, 11 తేదీల్లో గజల్‌ సాహితీ సదస్సు నిర్వహిస్తున్నట్లు సాంస్కృతిక శాఖ సంచాలకుడు డాక్టరు డి.విజయభాస్కర్‌ తెలిపారు.
* ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే ఇతర విద్యాసంస్థల్లో సీట్ల భర్తీకి జేఈఈ కౌన్సెలింగ్‌(జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ) ప్రక్రియ ఈనెల 15 నుంచి మొదలుకానుంది. మొత్తం ఏడు విడతల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ నెల 10న జేఈఈ అడ్వాన్సుడ్‌ ర్యాంకులు వెల్లడికానున్నాయి.
* ఆంధ్రప్రదేశ్‌లో 800 ఎంబీబీఎస్‌ వైద్యవిద్య సీట్లకు కోత పడింది. 6 వైద్యకళాశాలల్లో 2018-19 వైద్యవిద్య సంవత్సరానికి సీట్లను పునరుద్ధరించడానికి కేంద్ర సర్కారు అనుమతి నిరాకరించింది. కొత్తగా నెలకొల్పాలని సంకల్పించిన ఒక వైద్యకళాశాలకు అనుమతి మంజూరు చేయలేదు. ఈ మేరకు తాజాగా కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీచేసింది.
*గోదావరిలో తిరుగుతున్న 16 బోట్లు, లాంచీల్లో ఆశించిన స్థాయిలో ప్రమాణాలు లేవని, వాటిలో ప్రయాణం చేస్తే ప్రమాదం కనుక వాటిని తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు రాష్ట్ర ఓడరేవుల సహాయకుడు కోయ ప్రవీణ్‌ పేర్కొన్నారు. పోలవరం మండలం సింగన్నపల్లి కంపెనీ వద్ద ఉన్న బోట్లను బుధవారం సాయంత్రం ఆయన తనిఖీ చేశారు.
*పదిహేను రాష్ట్ర చట్టాలను తెలుగులో అనువాదం చేసి గెజిట్‌ ప్రచురించే నిమిత్తం ఏపీ న్యాయశాఖ బుధవారం ‘తెలుగు’లో జీవో జారీచేసింది. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సవరణ) చట్టం-2017, ఏపీ జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్‌(సవరణ) చట్టం-2017 తదితర చట్టాల్ని తెలుగు అనువాదం చేసేందుకు న్యాయశాఖ కార్యదర్శి దుప్పల వెంకట రమణ ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు.
* కాంట్రిబ్యూటరీ పింఛను విధానాన్ని(సీపీఎస్‌) రద్దు కోరుతూ జూన్‌ 8న ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సమాఖ్య (ఫ్యాప్టో) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించనున్నట్లు సమాఖ్య ఛైర్మన్‌ బాబురెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ ఐకాస, ఫ్యాప్టో సభ్య సంఘాలు పాల్గొనాలని కోరారు.
*సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఉద్యోగులకు ఆరోగ్యకార్డులు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయమని ఆ సంస్థ ఐక్యకార్యాచరణ సమితి ఛైర్మన్‌, కార్యనిర్వాహక కార్యదర్శి బి.సాల్మన్‌, హర్షవర్ధన్‌ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కార్డుల కోసం ఈ నెల 30లోగా ఎన్టీఆర్‌ ఆరోగ్య ట్రస్టు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని అందులో తెలిపారు.
*భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌షా ముంబయిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ, వ్యాపార ప్రముఖులతో ఆయన భేటీ అయ్యారు. తొలుత బాలీవుడ్‌ నటి మాధురీ దీక్షిత్‌ దంపతులను కలిసి అమిత్‌ షా ఆ తర్వాత ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటాను కలిశారు.
* భారీ వర్షాలతో నదులు ఒక్కసారిగా ఉప్పొంగి ఆకస్మిక వరదలు ముంచెత్తవచ్చని ఐదు రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. పశ్చిమ కనుమల్లో పుట్టిన నదులు పొంగి పొర్లవచ్చని కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, గుజరాత్‌ రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 7 నుంచి 12 వరకు కొంకణ్‌, గోవా, మధ్య మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురవవచ్చని భారత వాతావరణ విభాగం చేసిన హెచ్చరికను ఉటంకిస్తూ కేంద్ర జలవనరుల శాఖ ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. తాపి, తాద్రి, గోదావరి, కృష్ణ, కావేరి, వాటి ఉపనదుల్లో నీటి మట్టాలు పెరగవచ్చని పేర్కొంది. తుంగభద్రలోనూ ప్రవాహం పెరగవచ్చని అంచనా వేసింది.
* రాజధాని స్టార్టప్ ప్రాంత అభివృద్ధికి సింగపూర్‌తో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడలోని రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) కార్యాలయం ఎదుట ప్రజాసంఘాలు ఆందోళన చేపట్టాయి. సింగపూర్ ప్రభుత్వంతో ముఖ్యమంత్రి చంద్రబాబువి చీకటి ఒప్పందాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు ఆరోపించారు.
* పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్న వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ పాదయాత్రపై గురువారం తేనెటీగలు దాడి చేశాయి. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా పెరవలి మండలం కానూరు శివారు కొండాలమ్మ గుడి వద్ద జగన్‌ పాదయాత్రచేస్తుండగా తేనెటీగలు ఒక్కసారిగా మూకుమ్మడి దాడి చేశాయి. తేనెటీగల దాడి నుంచి జగన్‌ను కాపాడేందుకు భద్రతా సిబ్బంది విశ్వప్రయత్నాలు చేశారు.
* ఫెర్రింగ్ ఇండియా సీఈవో సురేష్ పట్టాతిల్‌తో పాటు కంపెనీ మేనేజ్‌మెంట్ టీం సభ్యులు రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ను నేడు హైదరాబాద్‌లో కలిశారు. ఈ సమావేశంలో పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, టీఎస్‌ఐఐసీ వైస్ మేనేజింగ్ డైరెక్టర్ ఈవీ నరసింహారెడ్డి, లైఫ్ సైన్స్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ పాల్గొన్నారు.
* మంత్రి మహేందర్ రెడ్డి ఇవాళ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన బషీరాబాద్ మండలంలో జరిగిన పల్లెబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గిరిజన తండాలలో మంత్రి పర్యటించారు. కుప్పన్ కోట్ తండ, బాద్లాపూర్ తండ, గొటిగ కులాన్, బోజ్యానాయక్ తండాలలో ప్రజలతో మమేకమై మహేందర్ రెడ్డి వాళ్ల సమస్యలు తెలుసుకున్నారు.
* హెచ్‌ఎండీఏ ప్రణాళిక విభాగం అధికారి భీంరావ్ నివాసంలో అవినీతి నిరోధక విభాగం(ఏసీబీ) అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. ఉదయం నుంచి శేరిలింగంపల్లిలోని భీంరావ్ నివాసంలో తనిఖీలు చేస్తూనే ఉన్నారు. హెచ్‌ఎండీఏ పూర్వ ప్రణాళికా విభాగం అధికారి పురుషోత్తంరెడ్డితో కలిసి భీంరావ్ అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కీలక ఆధారాల కోసం తనిఖీలు చేస్తున్నారు.
* చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు ఒప్పో తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఫైండ్ ఎక్స్‌ను ఈ నెల 19వ తేదీన విడుదల చేయనుంది. ప్యారిస్‌లోని లొవ్రె మ్యూజియంలో ఓ ప్రత్యేక ఈవెంట్‌ను ఏర్పాటు చేసి అందులో ఈ ఫోన్‌ను విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకు వచ్చిన అన్ని ఒప్పో ఫోన్ల కన్నా భిన్నమైన ఫీచర్లను ఈ ఫోన్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది.
* జనతాదళ్ యునైటెడ్ మాజీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు శరద్ యాదవ్‌కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆయన రాజ్యసభ సభ్యత్వానికి అనర్హుడని ప్రకటించిన నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడిగా ఆయనకు లభించవలసిన జీతం, ఇతర భత్యాలు, సదుపాయాలను నిలిపేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఢిల్లీ హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరిస్తూ ఈ తీర్పు చెప్పింది. విమానం, రైలు టిక్కెట్ల వంటి సదుపాయాలను కూడా నిలిపేయాలని స్పష్టం చేసింది.
* రాష్ట్రాభివృద్ధిని చూసి కాంగ్రెస్‌ ఓర్వలేకపోతోందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి, ప్రజల అభ్యున్నతి కోసం చేసే ప్రతి పనినీ విమర్శించడం మానుకొని, నిర్మాణాత్మక సూచనలు ఇచ్చి ప్రధానప్రతిపక్షం పరిణితితో వ్యవహరించాలని సూచించారు. గురువారం ఆయన సచివాలయంలో ఉపాధ్యాయ బదిలీలపై రూపొందించిన వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.
* ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం అర్ధరాత్రి జీవో నెం.16 జారీ అయింది. బదిలీల ప్రక్రియను పూర్తిగా వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారానే చేపట్టనున్నట్లు జీవోలో ప్రభుత్వం పేర్కొంది. గరువారం నుంచి ఈ నెల 10వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపింది.
* డేరా సచ్చా సౌద అధినేత గుర్మీత్ రామ్ రహీం దత్త పుత్రిక హనీప్రీత్ ఇన్సాన్‌కు పంచకుల సెషన్స్ కోర్టు ఝలక్ ఇచ్చింది. బెయిలు కోసం ఆమె చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. గత ఏడాది పంజాబ్, హర్యానాల్లో జరిగిన హింసాత్మక సంఘటనల కేసులో ఆమె ప్రస్తుతం జైలులో ఉన్న సంగతి తెలిసిందే.
* ఉపాధ్యాయుల బదిలీలకు తెలంగాణ విద్యాశాఖ షెడ్యూల్‌ విడుదల చేసింది. దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌ను మంత్రి కడియం శ్రీహరి ప్రారంభించారు. నేటి నుంచి ఈనెల 10 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపారు.
* దేశీయ మార్కెట్లు గురువారం భారీ లాభాలను సొంతం చేసుకున్నాయి. బ్యాంకింగ్‌, ఆటోమొబైల్‌, లోహ రంగాల షేర్లు రాణించడం మార్కెట్‌కు కలిసొచ్చింది.
* ప్రతిపక్ష నేత జగన్‌తో తిరుమల పూర్వ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు సమావేశమయ్యారు. టీటీడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. లోటస్‌పాండ్‌లోని జగన్‌ నివాసానికి రమణ దీక్షితులు వెళ్లారు.
* నైరుతి రుతుపవనాల ప్రభావంతో ముంబయిలో భారీగా వర్షం కురుస్తోంది. గురువారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షం కారణంగా పలు ప్రాంతాలు నీటమునిగాయి. దాదర్‌, పరేల్‌, కఫ్‌ పరేడ్‌, బంద్రా, బొరివలి, అంథేరి ప్రాంతాల్లోని రోడ్లు నీటమునిగాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com