నేటి తాజా వార్తలు-06/11

* ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆయన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్‌ పనులు పూర్తి కావడంతో పైలాన్‌ను ఆవిష్కరించి దాన్ని జాతికి అంకితం చేశారు. అనంతరం అక్కడే నిర్వహించిన శాంతిహోమంలో సీఎం పాల్గొన్నారు.
* సీఎల్పీ నేత జానారెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు సభాపతి మధుసూదనాచారిని కలిశారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో కోమటిరెడ్డి, సంపత్‌కుమార్ శాసనసభ సభ్యత్వాలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు.
* దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, కేంద్ర ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక విద్యాసంస్థ(జీఎఫ్‌ఐటీ)ల్లో సీట్ల సంఖ్య పెరగనుంది. వాటిల్లో 2016లో మొత్తం 34,895 సీట్లుంటే 2017లో వాటి సంఖ్య 36,268కి చేరింది. గత ఏడాది 97 విద్యా సంస్థల్లో ప్రవేశాలు జరిగాయి. ఈసారి అవి 100కి చేరాయి. దేశంలోని 23 ఐఐటీల్లో గత ఏడాది 10,988 సీట్లుండగా ఈసారి వాటి సంఖ్య 11,279కి పెరిగింది. గత ఏడాది 31 ఎన్‌ఐటీల్లో 17,868 సీట్లు, 23 ట్రిపుల్‌ఐటీల్లో 3,433 సీట్లు, 20 జీఎఫ్‌టీఐల్లో 3,979 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకు ఐఐటీల్లో మాత్రమే పెరిగిన సీట్లను వెల్లడించారు. ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో సీట్ల సంఖ్య మరో మూడునాలుగు రోజుల్లో వెల్లడికానుంది. మొత్తానికి గత ఏడాది కంటే మరో 1,500 వరకు సీట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
*విద్యుత్తు సంస్థల్లో రూ.4,200 కోట్ల పెట్టుబడులకు ఏపీ సీఎం చంద్రబాబు పచ్చజెండా ఊపారని ఇంధనశాఖ ఆదివారం తెలిపింది. ఇందులో భాగంగా విశాఖపట్నంలో భూగర్భ కేబుల్‌ పనులకు రూ.720 కోట్లు వ్యయం చేయనున్నట్లు వెల్లడించింది.
*రాష్ట్రంలోని కొన్ని కేంద్ర కారాగారాల ఖైదీలు 49మంది విడుదలలో భాగంగా ఆదివారం నెల్లూరులో ముగ్గురికి విముక్తి లభించింది. విడుదలైన వారిలో వైఎస్‌ రాజారెడ్డి హత్య కేసులో ఎ13 ముద్దాయి రాగిపిండి సుధాకర్‌రెడ్డి ఉన్నారు. ఆయన 11 ఏళ్ల 10 నెలల జైలు జీవితం గడిపారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి 18 మంది ఖైదీలను విడుదల చేశారు. క్షమాభిక్షకు హోంశాఖ రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం ఖైదీలను ఎంపికచేశారు.
*ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు జూన్‌ 12వ తేదీ(మంగళవారం) మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానున్నాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ కళాశాలలోని వైవీఎస్‌ మూర్తి ఆడిటోరియంలో మానవ వనరుల శాఖ మంత్రి గంటాశ్రీనివాసరావు ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.
* దేశరాజధాని దిల్లీలో ఆదివారం రాత్రి అన్నవరం సత్యనారాయణస్వామి కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. స్థానిక గోల్‌మార్కెట్‌లోని తితిదే బాలాజీ మందిర్‌ ఆవరణలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది. దిల్లీలో ఉన్న తెలుగు ప్రజల కోసం శనివారం సత్యనారాయణస్వామి వ్రతం నిర్వహించిన అన్నవరం దేవస్థానం పురోహితులు ఆదివారం రాత్రి కల్యాణోత్సవం జరిపించారు.
*ప్రపంచంలో ప్రేమాభిమానాలే శాశ్వతంగా నిలుస్తాయని, ఎంతో చిన్నదైన జీవితంలో అందరితో కలిసి మెలిసి ఉండాలని గవర్నర్‌ నరసింహన్‌ సూచించారు. రంజాన్‌ పురస్కరించుకొని ఆదివారం రాజ్‌భవన్‌లో ఆయన ముస్లింలకు ఇఫ్తార్‌ విందునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఉపముఖ్యమంత్రి మహమూద్‌అలీ, సభాపతి మధుసూదనాచారి, మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, మంత్రి నాయిని, ఎంపీ మల్లారెడ్డి,, వక్ఫ్‌బోర్డు ఛైర్మన్‌ సలీం తదితరులు పాల్గొన్నారు.
*స్వీడన్‌కు చెందిన ఫర్నిచర్‌ దిగ్గజం ఐకియా భారత్‌లో తన తొలి విక్రయ కేంద్రాన్ని జులై 10న ప్రారంభించేందుకు సమాయత్తమవుతోంది. ‘ఈ కేంద్రాన్ని ప్రారంభించేందుకు సంస్థ సీఈఓ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకూ ఐకియా దాదాపు రూ.800 కోట్ల పెట్టుబడి పెట్టింది. దీనిద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక ఉద్యోగాలు వస్తాయని’ తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ పేర్కొన్నారు.
*తిరుమల కొండపై సోమవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వ, నడకదారి భక్తులకు ఉదయం 8 గంటల నుంచి టైంస్లాట్ కింద టీటీడీ భక్తులకు టోకెన్లు జారీ చేయనుంది. శ్రీవారి ఉచిత దర్శనానికి 24 గంటల సమయం పట్టనుంది. అలాగే శ్రీవారి టైం స్లాట్‌ సర్వదర్శనం, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనాలకు 3 గంటల సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారికి హుండీ ద్వారా రూ.3.11కోట్ల ఆదాయం లభించింది. నిన్న శ్రీవారిని రికార్డులో స్థాయిలో 1,01,139 మంది భక్తులు దర్శించుకున్నారు.
*రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం ఈ నెల 11, 12 తేదీల్లో తుదివిడుత వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు పాలిసెట్ అడ్మిషన్స్ కన్వీనర్ నవీన్ మిట్టల్ వెల్లడించారు. తొలి విడుత కౌన్సెలింగ్‌లో సీటు రాని విద్యార్థులతోపాటు మంచి కాలేజీల్లో సీట్లు రానివారు, ఇంతకుముందు సీటు పొందినప్పటికీ కాలేజీల్లో ప్రవేశం పొందనివారు పాల్గొనాలని ఆయన సూచించారు.
* ఏసీబీ వలలో మరో ప్రభుత్వాధికారి చిక్కాడు. మున్సిపల్ డీఈఈ శ్రీనివాసరాజు నివాసంలో ఏసీబీ సోమవారం సోదాలు చేపట్టింది. ఆదాయానికి మంచి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. విశాఖ, భీమవరం, పాలకొల్లు సహా ఏడు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఇప్పటివరకు సుమారు రూ.20కోట్ల అక్రమాస్తులు గుర్తించారు.
* అంతర్జాతీయ విలు విద్య క్రీడాకారిణి, కూఎల్‌ డీమ్డ్‌ యూనివర్సిటీ విద్యార్థిని వెన్నం జ్యోతి సురేఖను బొంబాయి స్టాక్‌ ఎక్సేంజ్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఎక్స్‌లెన్స్‌ అవార్డుతో సత్కరించినట్లు యూనివర్సిటి క్రీడా విభాగ అధిపతి కమలేష్‌ తెలిపారు.
* వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహనరెడ్డి ప్రజా సంకల్పయాత్ర మంగళవారం జిల్లాలో మొదలు కానుంది. ఆయన పశ్చిమగోదావరి జిల్లా పర్యటన ముగించుకుని 12వ తేదీ సాయంత్రం మూడు గంటలకు రోడ్‌ కం రైలు వంతెన మీదుగా రాజమహేంద్రవరంలోని కోటిపల్లి బస్టాండు సెంటరుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ధవళేశ్వరం వరకు పాదయాత్ర సాగుతుంది. జిల్లాలోకి ప్రవేశించే ముందు వంతెన మీద ఆయనకు ఘనస్వాగతం పలకాలని పార్టీ వర్గాలు నిర్ణయించాయి.
* నిర్మాణపరంగా పోలవరం ప్రాజెక్టు మరో రికార్డు సాధించిందని మంత్రి దేవినేని ఉమామహేశ్వర్‌రావు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ స్పిల్‌ ఛానల్‌, స్పిల్‌ వే పనుల్లో ఒక్కరోజులో 11,158 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులతో రికార్డు సాధించామన్నారు. దేశంలో ఏ సాగునీటి ప్రాజెక్టులో ఈస్థాయి కాంక్రీట్‌ పనులు చేయలేదని చెప్పారు. చైనా త్రీగోర్జెస్‌ డ్యామ్‌లో 24 గంటల్లో 13వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు జరిగాయని, జులైనాటికి చైనా రికార్డును కూడా అధిగమిస్తామని మంత్రి దేవినేని స్పష్టం చేశారు.
* ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌పై ఎమ్మెల్యే కపిల్ మిశ్రా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శాసనసభకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ 10 శాతం కూడా హాజరుకాలేదని, ముఖ్యమంత్రి జీతంలో కోత విధించాలని పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఎమ్మెల్యే పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్‌పై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది.
* భద్రాద్రి సీతా రామచంద్రస్వామివారిని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దర్శించుకున్నారు. మంత్రులకు ఆలయ అర్చకులు, వేదపండితులు, సిబ్బంది స్వాగతం పలికారు. ప్రధాన ఆలయంలోని మూలవరులకు మంత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
* రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం ఈ నెల 11, 12 తేదీల్లో తుదివిడుత వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు పాలిసెట్ అడ్మిషన్స్ కన్వీనర్ నవీన్ మిట్టల్ వెల్లడించారు.
* ప్రధాని నరేంద్రమోదీపై టీడీపీ నేతల అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ ఆందోళన బాట పట్టింది. ఇందులో భాగంగా సోమవారం ఉదయం విజయవాడ ధర్నాచౌక్‌లో బీజేపీ మహాధర్నా చేపట్టింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, గోకరాజు గంగరాజు, మాణిక్యాలరావు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ టీడీపీ పాలనలో నియంతృత్వ ధోరణి పెరిగిపోయిందని మండిపడ్డారు. బీజేపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు మోసాలను, మాయమాటలను ప్రజలకు వివరిస్తామన్నారు. రాజకీయ లబ్దికోసం బీజేపీపై బురదజల్లుతున్నారని కన్నా లక్ష్మీనారాయణ విరుచుకుపడ్డారు.
* అసోంలో సోమవారం సంభవించిన భూకంపం ప్రజలను భయకంపితులను చేసింది. రిక్టర్‌ స్కేల్‌పై 5.1 మ్యాగ్నిట్యూడ్‌గా నమోదైన భూప్రకంపనలకు నాగోన్‌ జిల్లా ధింగ్‌కు 22 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతం భూకంప ప్రధాన కేంద్రంగా ఉందని షిల్లాంగ్‌లోని ప్రాంతీయ సెసిమలాజికల్‌ సెంటర్‌ పేర్కొంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com