నేటి తాజా వార్తలు-06/13

* తెలంగాణ ఐసెట్ 2018 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి విడుదల చేశారు. 15 రోజుల్లో ఐసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలలో సీట్ల భర్తీ కోసం గత నెల 23, 23 తేదీల్లో టీఎస్ ఐసెట్ 2018 పరీక్షలు నిర్వహించారు.
* ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో విద్యుత్‌షాక్‌ తగిలి తీవ్రంగా గాయపడి కోలుకున్న ముగ్గురు విద్యార్థులు బుధవారం ఉధయం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా విద్యార్ధులకు అండగా ఉంటామని సీఎం హామీ ఇచ్చారు.
* కాజీపేట జంక్షన్‌ మీదుగా ఈ నెల 15న తిరుపతికి స్పెషల్‌ రైలు నడిపిస్తున్నారు. (02164) నెంబరు గల స్పెషల్‌ రైలు హైదరాబాద్‌లో ఈనెల 15న రాత్రి 7.40కి బయలు దేరి 9.40కి కాజీపేటకు వస్తుంది. 16న ఉదయం 8.10 ని.లకు తిరుపతికి చేరుకుంటుంది. ఇదే రైలు (02763)తిరుపతిలో ఈ నెల 17న రాత్రి 7గం.లకు బయలు దేరి 18న ఉదయం 6.35కు కాజీపేటకు వస్తుంది. 8.35ని.లకు హైదరాబాద్‌కు చేరుకుంటుంది. ఈ రైలు సికింద్రాబాద్‌, కాజీపేట జంక్షన్‌, వరంగల్‌, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, రైల్వే స్టేషన్‌లలో హాల్టింగ్‌ సౌకర్యం కల్పించారు. ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా ఈ స్పెషల్‌ రైలు కేవలం ఒక్క రోజు అప్‌అండ్‌ డౌన్‌ నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
* ఈనెల 17న ఢిల్లీలో నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కసరత్తు చేపట్టారు. ఈ మేరకు బుధవారం ఉదయం సచివాలయంలో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. విభజన అంశాలు, కేంద్ర సాయంపై అధికారులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
* దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, కేంద్ర ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక విద్యాసంస్థ(జీఎఫ్‌ఐటీ)ల్లో సీట్ల సంఖ్య పెరగనుంది. వాటిల్లో 2016లో మొత్తం 34,895 సీట్లుంటే 2017లో వాటి సంఖ్య 36,268కి చేరింది. గత ఏడాది 97 విద్యా సంస్థల్లో ప్రవేశాలు జరిగాయి. ఈసారి అవి 100కి చేరాయి. దేశంలోని 23 ఐఐటీల్లో గత ఏడాది 10,988 సీట్లుండగా ఈసారి వాటి సంఖ్య 11,279కి పెరిగింది. గత ఏడాది 31 ఎన్‌ఐటీల్లో 17,868 సీట్లు, 23 ట్రిపుల్‌ఐటీల్లో 3,433 సీట్లు, 20 జీఎఫ్‌టీఐల్లో 3,979 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకు ఐఐటీల్లో మాత్రమే పెరిగిన సీట్లను వెల్లడించారు. ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో సీట్ల సంఖ్య మరో మూడునాలుగు రోజుల్లో వెల్లడికానుంది. మొత్తానికి గత ఏడాది కంటే మరో 1,500 వరకు సీట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
*స్వీడన్‌కు చెందిన ఫర్నిచర్‌ దిగ్గజం ఐకియా భారత్‌లో తన తొలి విక్రయ కేంద్రాన్ని జులై 10న ప్రారంభించేందుకు సమాయత్తమవుతోంది. ‘ఈ కేంద్రాన్ని ప్రారంభించేందుకు సంస్థ సీఈఓ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకూ ఐకియా దాదాపు రూ.800 కోట్ల పెట్టుబడి పెట్టింది. దీనిద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక ఉద్యోగాలు వస్తాయని’ తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ పేర్కొన్నారు.
* నీటి లభ్యత, కేటాయింపులపై తుంగభద్ర బోర్డు తీసుకున్న నిర్ణయం తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపనుంది. ఈ నీటి సంవత్సరంలో ఎక్కువ కేటాయించాల్సి ఉండగా.. బోర్డు తక్కువ అంచనాలు వేసినట్లు తెలిసింది. దీనివల్ల రెండు రాష్ట్రాలకు కేటాయింపు తగ్గింది. ఈ ప్రభావం ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌పై ఎక్కువగా ఉంది.
*రాష్ట్రంలో గురువారం దాకా ఒక మాదిరి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు.గ్యాంగ్‌టక్‌ నుంచి పశ్చిమ బంగ, ఒడిశాల మీదుగా కోస్తాంధ్ర వరకూ భూమిపై 7.6 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి ఏర్పడింది.
*కర్నూలు జిల్లా మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి ఆలయాన్ని స్వచ్ఛ ఐకానిక్‌ కేంద్రంగా కేంద్రం గుర్తిచింది. స్వచ్ఛభారత్‌ మిషన్‌లో భాగంగా పది నూతన స్వచ్ఛ ఐకానిక్‌ కేంద్రాలను కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. దీంట్లో ఆంధ్రప్రదేశ్‌లోని రాఘవేంద్రస్వామి ఆలయం ఒకటి. గత రెండు దశల్లో 20 స్వచ్ఛ ఐకానిక్‌ కేంద్రాలను ప్రకటించిన కేంద్రం తొలి దశలో తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఇలా గుర్తించిన విషయం విదితమే.
*సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు పదో వేతన సంఘానికి సంబంధించిన బకాయిల్లో 70 శాతాన్ని ఈ నెల 14న చెల్లిస్తామని సంస్థ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. పదో వేతన సంఘం సిఫార్సులు 2016 జులై ఒకటి నుంచి అమల్లోకి రాగా 2017 నవంబరు నుంచి సంస్థ కొత్త వేతనాలను చెల్లిస్తోంది. 2016 జులై నుంచి 2017 అక్టోబరు వరకూ 16 నెలల వేతన బకాయిలున్నాయి.
* మంత్రి జోగు రామన్న ఇవాళ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జైనథ్ మండలంలో ఆయన పర్యటించారు. మండలంలోని తరోడ గ్రామంలో 15 లక్షలతో నిర్మించే కళ్యాణ మండపానికి మంత్రి భూమి పూజ చేశారు. అనంతరం సావాపూర్ గ్రామంలో 13 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని, 6,50,000 రూపాయలతో నిర్మించిన పాఠశాల భవనాలను మంత్రి ప్రారంభించారు.
* ఎస్సీ ఎస్టీ అట్రాసిటి చట్ట పరిరక్షణ కోసం జూలై 17న దళిత, గిరిజన సింహగర్జన కార్యక్రమాన్ని చేపడుతున్న ఎస్సీ ఎస్టీ యాక్ట్‌ పరిరక్షణ సమితి జాతీయ కో-ఆర్డినేటర్‌ మాదిగాని గురునాథం తెలిపారు.
* అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి, ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌లను పార్టీ నుంచి బహిష్కరించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ విచారణను కోర్టు వచ్చే నెల 19వ తేదీకి వాయిదా వేసింది. గత ఏడాది సెప్టెంబరు 12వ తేదీన నగర శివారు ప్రాంతమైన వానగరంలో అన్నాడీఎంకే అమ్మా, పురట్చితలైవి అమ్మా పార్టీల కార్యవర్గ సంయుక్త సమావేశం జరిగింది, ఈ సమావేశంలో ఈ రెండు పార్టీలు ఒక్కటిగా విలీనమయ్యాయి.
* మడకశిర పర్యటనలో భాగంగా అనంతపురం జిల్లాకు చేరుకున్న మంత్రి నారా లోకేష్‌ను ఘన స్వాగతం లభించింది. బుధవారం ఉదయం బెంగళూరు విమానాశ్రయం నుంచి కోడికొండ చెక్‌పోస్టు చేసుకున్న ఆయనకు జిల్లా, నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున ఘన స్వాగతం పలికారు. బెంగళూరు విమానాశ్రయం వద్ద మంత్రి లోకేష్‌ను మంత్రి కాల్వ శ్రీనివాసులు, ఎమ్మెల్యే బీకె పార్థసారథి, జెడ్పీ చైర్మన్ పూల నాగరాజు, చంద్రదండు అధ్యక్షుడు ప్రకాష్ నాయుడులు కలిసి స్వాగతం పలికారు.
* ఏపీ ఎంసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ బుధవారం విడుదలైంది. జూలై 1 నుంచి 4 వరకు సర్టిఫికేట్ల పరిశీలన ఉంటుందని, అలాగే 4, 5 తేదీల్లో ఆపన్షల నమోదు ప్రక్రియ జరుగుతుందని ఎంసెట్‌ కన్వీనర్‌ పాండాదాస్‌ తెలిపారు. జూలై 7న విద్యార్థులకు సీట్లను కేటాయిస్తామన్నారు. కౌన్సెలింగ్ కోసం ఏయూ లయోల కాలేజ్‌, విశాఖ పాలిటెక్నిక్‌ కాలేజీ, తిరుపతిలో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
* సీఆర్‌డీఏపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మహీంద్రా, షాపూర్‌జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ, డీఎల్ఎఫ్, జీవీకే తదితర సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరావతి నిర్మాణంపై సంక్షిప్త వీడియో చిత్రాన్ని సీఆర్డీఏ సమావేశంలో ప్రదర్శించింది. అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ సంతోష నగరంగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ సంకల్పమని ఈ సందర్భంగా సీఎం అన్నారు.
* నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్‌కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. రంజాన్‌ దృష్ట్యా నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాన్ని ఈనెల 18కి వాయిదా వేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు. లేదా 17వ తేదీ మధ్యాహ్నానికైనా వాయిదా వేయాలని కోరారు. నీతి ఆయోగ్ 4వ సమావేశాలు నిర్వహించాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని చంద్రబాబు అన్నారు. అయితే 16న రంజాన్ పండుగ, 17 ఉదయం ఈద్ మిలాప్ కార్యక్రమాలున్నాయని, అందువల్ల తాను అమరావతిలో ఉండటం అవసరమని ముఖ్యమంత్రి ఆ లేఖలో పేర్కొన్నారు.
* సరోజిని కంటి ఆస్పత్రిలో ఐ బ్యాంక్‌ను మంత్రి ల‌క్ష్మారెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఐ బ్యాంక్ ద్వారా కార్నియాను స్టోర్ చేసుకోవచ్చని తెలిపారు.
* రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సర్దాపూర్‌లో అగ్రికల్చర్ కళశాలకు మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కేటీఆర్ కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే డాక్టర్ చెన్నమనేని రమేశ్‌తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. వ్యవసాయ కళాశాలకు శంకుస్థాపన చేసిన అనంతరం కేటీఆర్ మాట్లాడారు.
* మాజీ ప్రధానమంత్రి అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్యం విషమంగా ఉంది. శ్వాసకోశ, మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్న ఆయనను సోమవారం ఎయిమ్స్‌లో చేర్చారు. వాజ్‌పేయి చికిత్సకు స్పందిస్తున్నారని.. యాంటీబయాటిక్స్‌ ఇస్తున్నామని.. ఆయన పరిస్థితి నిలకడగా ఉందని మంగళవారం ఉదయం ఎయిమ్స్‌ మీడియా అధికారి ఆరతీ విజ్‌ బులెటిన్‌ విడుదల చేశారు. వాజపేయి ఆరోగ్యపరిస్థితిని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరా పర్యవేక్షణలో ప్రత్యేక వైద్య బృందం ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందని పేర్కొన్నారు. అయితే, సాయంత్రం ఆస్పత్రి వర్గాలు ఎలాంటి బులెటిన్‌ విడుదల చేయకపోవడం గమనార్హం. వాజపేయికి ఉన్న ఏకైక కిడ్నీ, ఊపిరితిత్తులు అంతంత మాత్రంగా పనిచేస్తున్నాయని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. మాజీ ప్రధానులు మన్మోహన్‌ సింగ్‌, దేవెగౌడ, ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భగవత్‌, కేంద్రమంత్రులు జేపీ నడ్డా, అశ్విన్‌ కుమార్‌ చౌబే, సాధ్వీ నిరంజన్‌ జోషి, అనంత్‌ గీతే, మాజీ మంత్రి మురళీ మనోహర్‌ జోషి మంగళవారం ఎయిమ్స్‌కు వచ్చి వాజపేయి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వాజపేయి ఆరోగ్యం మెరుగుపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు గాయని లతా మంగేష్కర్‌ ట్వీట్‌ చేశారు.
*దక్షిణ ముంబయిలోని వర్లి ప్రాంతంలోని బహుళ అంతస్తుల భవన సముదాయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అబ్బాసాహేబ్‌ మరాఠే మార్గ్‌లో ఉన్న బ్లూమౌంట్‌ టవర్స్‌లోని 33వ అంతస్తులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com