నేటి తాజా వార్తలు-06/14

*మొబైల్స్ తయారీదారు ఒప్పో తన రియల్ మి స్మార్ట్‌ఫోన్‌కు గాను మూన్‌లైట్ సిల్వర్ స్పెషల్ వేరియెంట్‌ను ఈ నెల 18వ తేదీన విడుదల చేయనుంది.
*కాచిగూడ, కరీంనగర్‌ల మధ్య నడిచే కేసీజీ రైలు(57601)ను కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ ఈ నెల 15న హైదరాబాద్‌లో ప్రారంభించనున్నారు. ఈ రైలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు కాచిగూడలో బయల్దేరి నిజామాబాద్‌, మోర్తాడ్‌, మెట్‌పల్లి, కోరుట్ల, మేడిపల్లి, లింగంపేట జగిత్యాల, నూకపల్లి మల్యాల, పొద్దూరు, గంగాధర, కొత్తపల్లి మీదుగా కరీంనగర్‌కు మధ్యాహ్నం 3-25 గంటలకు చేరుకుంటుంది. తిరిగి అక్కణ్నుంచి మధ్యాహ్నం 3-45 గంటలకు బయల్దేరి.. కాచిగూడకు రాత్రి 11 గంటలకు చేరుకుంటుంది.
*రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 19న జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. దీనికి ముందు సీఎం నివాసంలో తెదేపా సమన్వయ కమిటీ సమావేశం ఉంటుంది.
*ఈ విద్యా సంవత్సరం నుంచి సర్కారు పాఠశాలల్లో మధ్యాహ్నభోజనంలోభాగంగా వారానికి ఐదు కోడిగుడ్లు ఇచ్చేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించినప్పటికీ.. ప్రభుత్వ అనుమతి లభించనందున పాతవిధానాన్నే అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ నెల 30 వరకు వారానికి మూడు కోడిగుడ్లు చొప్పున అందించాలని సరఫరా ఏజెన్సీలను ఆదేశించింది.
*అమరావతి: కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సెంట్రల్‌ సెక్టర్‌ స్కీమ్‌(సీఎస్‌ఎస్‌) ఉపకారవేతనానికి ఎంపికైన విద్యార్థులు www.scholarships.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్మీడియట్‌ విద్యామండలి కార్యదర్శి బి.ఉదయలక్ష్మి తెలిపారు. జూన్‌ 25 నుంచి నమోదు ప్రారంభమవుతుందని.. తుది జాబితా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్ణయిస్తుందని బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికైన విద్యార్థుల జాబితా సంబంధిత జూనియర్‌ కళాశాల లాగిన్‌లో ఉంచినట్లు వివరించారు.
*తిరుమల శ్రీవారి ఉత్సవమూర్తి అయిన శ్రీమలయప్ప స్వామివారికి స్వర్ణ కవచాన్ని ఈనెల 19న తొలగించనున్నట్లు తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. ఈనెల 24 నుంచి 26 వరకు జ్యేష్ఠాభిషేకం ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఈ క్రతువును నిర్వహించనుంది.
*కశ్మీర్‌లోని హిమసానువుల్లో ఈనెల 28 నుంచి మొదలయ్యే అమర్‌నాథ్‌ యాత్ర సందర్భంగా తెలుగు యాత్రికులకు ఉచితంగా తెలుగు వంటకాలను అందించేందుకు సిద్దిపేటలోని ‘అమర్‌నాథ్‌ అన్నదాన సేవా సమితి’ సన్నద్ధం అవుతోంది. ఏడేళ్లుగా ఈ సంస్థ అక్కడ అన్నదానం నిర్వహిస్తోంది.
* ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ప్రభావితం చేసిన కార్ల్‌ మార్క్స్‌పై ఐదు రోజుల అంతర్జాతీయ సదస్సును ఈనెల 16 నుంచి పట్నాలో నిర్వహిస్తున్నారు. 18 దేశాలకు చెందిన 200 మందికి పైగా ప్రతినిధులు హాజరవుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రముఖ ఆర్థికవేత్త మేఘానంద్‌ దేశాయ్‌ తొలిరోజున కీలకోపన్యాసం చేసి.. ఈనెల 20న ముగింపు కార్యక్రమంలో సదస్సు వివరాలను సమర్పిస్తారని సలహా కమిటీ కన్వీనర్‌ నీరజ్‌ కుమార్‌ తెలిపారు.
*సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈ నెల 29న ఏపీ, తెలంగాణ రాష్ట్రాల బార్‌ కౌన్సిళ్లకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఏపీ బార్‌ కౌన్సిల్‌ కార్యదర్శి రేణుక తెలిపారు. ఏపీ బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల రిటర్నింగ్‌ ఆఫీసర్‌గా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పి.కేశవరావు, తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల రిటర్నింగ్‌ ఆఫీసర్‌గా జస్టిస్‌ ఎ.శంకర్‌నారాయణలను నియమించినట్లు పేర్కొన్నారు.
*కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడం కుదరదని సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేయడంపై కడప జిల్లా కన్నెర్ర చేస్తోంది. విభజన చట్టంలో పేర్కొన్న హామీని సైతం కేంద్రం నెరవేర్చడం లేదంటూ పార్టీలకతీతంగా జిల్లావ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. తెదేపా, వైకాపా సహా పలు పార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు ఆందోళనలు, ర్యాలీలు చేపట్టాయి.
*జగిత్యాల మండలం గుట్రాజ్‌పల్లెలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని టీఆర్‌ఎస్ ఎంపీ కవిత ఆవిష్కరించారు. అనంతరం నూతన గ్రామపంచాయతీ భవనాన్ని, రూ. 32 కోట్ల వ్యయంతో నిర్మించనున్న గురుకుల జూనియర్, డిగ్రీ కళాశాల భవనాలకు ఎంపీ కవిత భూమిపూజ చేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com