నేటి తాజా వార్తలు -07/06

* తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. గత నెల 21న ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం.7పై కోర్టు స్టే విధించింది. ఏడాది పాటు ప్రొఫెషనల్ కోర్సుల్లో స్పోర్ట్స్ కోటాను పరిగణనలోకి తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.7 వల్ల స్పోర్ట్స్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని స్పోర్ట్స్ అభ్యర్థులు నిలేరాయ్, కాలేశ్రేయ పిటిషన్ దాఖలు వేశారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రొఫెషనల్ కోర్సులో స్పోర్ట్స్ కోటాను ఎత్తేయాలని పిటిషనర్ తరపు న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపించారు. అలాగే ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం.7లో కూడా అనేక అక్రమాలు జరిగాయని కోర్టుకు తెలిపారు. దీంతో ప్రొఫెషనల్ కోర్సులో స్పోర్ట్స్ కోటాను ఎత్తేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. జీవో నెం.7ను రద్దు చేస్తూ జస్టిస్ రామసుబ్రమణ్యం బెంచ్ తీర్పు ఇచ్చింది.
* 2018 అక్టోబర్‌ నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఆన్‌లైన్‌లో తితిదే విడుదల చేసింది. మొత్తం 53,642 సేవా టికెట్లను విడుదల చేసింది. ఎలక్ట్రానిక్‌ లాటరీ విధానం కింద 9,742 సేవా టికెట్లను కేటాయించింది. సుప్రభాతం కింద 7,597, తోమాల కింద 90, అర్చన కింద 90 టికెట్లను విడుదల చేశారు. అష్టాదళ పాదపద్మారాధనకు 240, నిజపాద దర్శనానికి 1725, కరెంటు బుకింగ్‌కు 43,900 ఆర్జిత సేవా టోకెన్లు కేటాయించారు. వసంతోత్సవానికి 11 వేల టికెట్లు, సహస్త్ర దీపాలంకరణకు 12 వేల టికెట్లు అందుబాటులో ఉన్నాయి.
*తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయ శుద్ధిలో భాగంగా ఈనెల 10న కోయిల్‌ ఆళ్వారు తిరుమంజనాన్ని నిర్వహించనున్నట్లు గురువారం తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. సాధారణంగా ఏడాదిలో నాలుగు సార్లు.. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాలకు ముందు వచ్చే మంగళవారం తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ నెల 17న ఆణివార ఆస్థానం పర్వదినం ఉన్నందున.. 10న ఈ క్రతువుకు ముహూర్తంగా నిర్ణయించింది. ఉదయం 6 గంటల నుంచి సుమారు 5 గంటల పాటు ఆనందనిలయం సహా బంగారు వాకిలి వరకు సుగంధ ద్రవ్యభరిత మిశ్రమంతో సంప్రోక్షణ చేయనున్నారు. ఆ రోజున శ్రీవారికి అష్టదళ పాదపద్మారాధన సేవను తితిదే రద్దు చేసింది. తిరుమంజనం అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు ఆలయ అర్చకులు ఆగమోక్తంగా పూజాదికాలు పూర్తి చేసిన తర్వాత మధ్యాహ్నం 12 గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభించనుంది.
* సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 20వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు తెలంగాణ లారీ యజమానుల సంఘం ప్రధాన కార్యదర్శి జి.దుర్గాప్రసాద్‌ పేర్కొన్నారు.
*భాజపా సీనియర్‌ నేత ప్రొఫెసర్‌ ఎస్‌వీ శేషగిరిరావు కేరళ సెంట్రల్‌ యూనివర్సిటీ కులపతిగా నియమితులయ్యారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
* చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఈ నెల 27న సాయంత్రం 5 గంటల నుంచి 28వ తేదీ వేకువజామున 4.15 గంటల వరకు మూసివేయనున్నట్లు తితిదే మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఆ రోజు రాత్రి 11.54 గంటల నుంచి 28న తెల్లవారు జామున 3.49 గంటల వరకు చంద్రగ్రహణం ఘడియలు ఉంటాయి. గ్రహణం పట్టే సమయానికి 6 గంటల ముందుగానే ఆలయ ద్వారాలు మూసివేయడం ఆనవాయితీ. గ్రహణం అనంతరం వేకువ జామున 4.15 గంటలకు మందిరం తలుపులు తెరిచి సుప్రభాత సేవ అనంతరం శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. తర్వాత తోమాల, కొలువు, పంచాంగశ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా పూర్తి చేస్తారు. 28న స్వామివారికి ఉదయపు సేవలు పూర్తయ్యాక ఉదయం 7 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది. 27న శ్రీవారికి కల్యాణోత్సవం, ఊంజలసేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవ, గరుడవాహన సేవలను తితిదే రద్దు చేసింది.
* కేంద్రహోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ జమ్ము-కశ్మీరులో ఈనెల 4 నుంచి రెండురోజుల పాటు పర్యటిస్తారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డొబాల్‌ కూడా రాజ్‌నాథ్‌ సింగ్‌ వెంట కశ్మీరుకు వెళతారు. ఆ రాష్ట్రంలో భద్రతా పరిస్థితిని శ్రీనగర్‌లో జరిగే అత్యున్నత స్థాయి సమావేశంలో హోంమంత్రి సమీక్షిస్తారు. అమర్‌నాథ్‌ యాత్రపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తారు.
*ఆంధ్రప్రదేశ్‌-కర్ణాటకల మధ్య సరిహద్దులను ఈ నెల 27 కల్లా తేల్చాలని సర్వేయర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాకు సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది.
* జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారానికి జులై 15వ తేదీలోపు కేంద్ర మానవ వనరుల శాఖకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ ఇన్‌ఛార్జి కమిషనర్‌ అధర్‌ సిన్హా ఒక ప్రకటనలో తెలిపారు. 2017 సంవత్సర పురస్కారాలకు www.mhrd.gov.in వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
* తెలంగాణ రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న వి.నిరంజన్‌రావు పదవీ కాలాన్ని ప్రభుత్వం మరో ఏడాదికి పొడిగించింది. ఆయన పదవీకాలం ఈ ఏడాది జూన్‌తోముగిసింది. దీంతో పదవీ కాలాన్ని ఏడాది పొడిగించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు అనుమతి కోరింది. అందుకు హైకోర్టు సానుకూలంగా స్పందించడంతో సర్కారు ఉత్తర్వులు జారీచేసింది.
* వంశపారంపర్య అర్చకుల పేర్ల నమోదు కార్యక్రమం ఈ నెల 6 నుంచి చేపట్టనున్నారని, దీనికోసం దేవదాయశాఖ ఏర్పాట్లు చేసిందని ఏపీ అర్చక సమాఖ్య కార్యదర్శి జంధ్యాల వెంకట రామలింగేశ్వర శాస్త్రి సోమవారం గుంటూరులో తెలిపారు.
*తెలంగాణలోని ఎస్పీడీసీఎల్‌, ఎన్పీడీసీఎల్‌లు తమకు బకాయిలు చెల్లించనందుకు ఆ 2 కంపెనీలు దివాలా తీసినట్లుగా ప్రకటించాలని కోరుతూ ఏపీ జెన్‌కో వేసిన పిటిషన్‌పై ఈనెల 23న నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌(ఎన్సీఎల్టీ) హైదరాబాద్‌ బెంచ్‌ తుది వాదనలు విననుంది.
*లోక్‌సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించే సాధ్యాసాధ్యాలపై చర్చించేందుకు లా కమిషన్‌ సిద్ధమవుతోంది. ఈ వారంలో అన్ని ప్రధాన పార్టీలతో రెండు రోజుల పాటు సంప్రదింపులు జరపనుంది. ఈ మేరకు ఈ నెల 7, 8 తేదీల్లో జరగనున్న సమావేశానికి రావాలని ఏడు జాతీయ పార్టీలకు, 59 ప్రాంతీయ పార్టీలకు లేఖ రాసింది. లా కమిషన్‌ నుంచి తమకు ఆహ్వానం అందిందని కాంగ్రెస్‌ వర్గాలు ధ్రువీకరించాయి.
*ఈనెల 5వ తేదీన విజయవాడలో ఎన్టీఆర్‌ నూతన గృహప్రవేశ మహోత్సవం నిర్వహిస్తామని కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం తెలిపారు. నగరంలోని క్యాంపు కార్యాలయం నుంచి ఆయన సోమవారం ఆర్డీవోలు, స్పెషల్‌ ఆఫీసర్లు, ఎంపీడీవోలు, మండల తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 5వ తేదీ గురువారం ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఎన్టీఆర్‌ నూతన గృహప్రవేశ మహోత్సవం ఫేస్‌-2 కార్యక్రమం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి హాజరవుతారని, జిల్లాలో 20,109 ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తారని కలెక్టర్‌ తెలిపారు.
*ఈనెల 6న డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నట్లు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.
* ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ వ్యవహారాల బాధ్యుడు, కేరళ మాజీ సీఎం ఊమెన్‌ చాందీ ఈ నెల 9 నుంచి రాష్ట్రంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా జిల్లాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు, నియోజకవర్గ స్థాయి సమీక్షలు నిర్వహించనున్నారు. ఆయనతోపాటు ఏఐసీసీ కార్యదర్శులు క్రిస్టఫర్‌, మరియప్పన్‌, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పర్యటిస్తారని ఏపీసీసీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి, నాయకుల పనితీరు తదితర అంశాలపై ఊమెన్‌చాందీ సమీక్షించనున్నారు.
*ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ వ్యవహారాల బాధ్యుడు, కేరళ మాజీ సీఎం ఊమెన్‌ చాందీ ఈ నెల 9 నుంచి రాష్ట్రంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా జిల్లాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు, నియోజకవర్గ స్థాయి సమీక్షలు నిర్వహించనున్నారు.
*మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా బీచ్‌రోడ్డులో ఆయన విగ్రహానికి టీడీపీ నేతలు బుధవారం నివాళులర్పించారు. మంత్రులు చినరాజప్ప, అయ్యన్నపాత్రుడు, ఎంపీ అవంతి శ్రీనివాస్‌, ఎంవీఎస్‌ మూర్తి, సుబ్బారాయుడు అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
* రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థి సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ మంగళవారం ధర్నా నిర్వహించింది. గురువారం(5న) విద్యాసంస్థల బంద్‌ను పురస్కరించుకుని బషీర్‌బాగ్‌లోని డీఈవో కార్యాలయం ఎదుట ఈ ధర్నా చేపట్టారు. విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని విద్యార్థి సంఘాల నేతలు కోరారు. ఈ కార్యక్రమంలో జావేద్‌, అంజి(ఎస్‌ఎఫ్‌ఐ), చాణిక్య(ఏఐఎస్‌ఎఫ్‌), ఎం.సత్యనారాయణ(ఏఐడీఎస్‌వో), నాగరాజు, రియాజ్‌, స్వాతి(పీడీఎస్‌యూ) పాల్గొన్నారు.
*టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలపై ఈ నెల 23, 24 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట నిరాహార దీక్షలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు.
*ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ రాధాకృష్ణన్‌ ఈ నెల 7న రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారానికి సంబంధించి తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్‌ ఎస్‌కే జోషి మంగళవారం ఆదేశించారు. రాష్ట్ర హైకోర్టు సీజేగా జస్టిస్‌ రాధాకృష్ణన్‌ను నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం ఈ ఏడాది జనవరిలో కేంద్రానికి సిఫారసు చేసింది. ఈ సిఫారసులకు ఇటీవల ఆమోదం తెలిపిన కేంద్రం ఫైల్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వద్దకు పంపింది. ఆ ఫైల్‌పై ఆదివారం రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రాధాకృష్ణన్‌ నియమితులయ్యారు.
*రాష్ట్రంలో అత్యంత వైభవంగా నిర్వహించే బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి శివశంకర్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
*వారం రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ మానవవనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. జులై 6న నోటిఫికేషన్‌ జారీ చేస్తామని గతంలోనే చెప్పాన్నారు. రెండు అంశాల కారణంగా నోటిఫికేషన్‌ను విడుదల చేయలేకపోతున్నామన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com