నేటి తాజా వార్తలు

*పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ప్రహసనంగా మార్చేశారని వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి కె. పార్థసారధి మండిపడ్డారు. గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ… అసెంబ్లీలో చంద్రబాబు నటనకు నంది అవార్డు ఇవ్వాలన్నారు.
*అస్సాం మంత్రి హిమంత బిస్వా శర్మ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఆరోగ్యశాఖ మంత్రి అయిన బిస్వా బుధవారం నూతన ఉపాధ్యాయులకు నియామక పత్రాలను అందించే కార్యక్రమానికి హాజరై ప్రసంగిస్తూ … గత జన్మలో చేసిన పాపాల మూలంగానే మనుషులకు దీర్ఘకాలిక రోగాలు వస్తున్నాయంటూ.. కాన్సర్‌ వంటి రోగాల వెనుక, యాక్సిడెంట్‌లలో మనుషులు చనిపోవటానికి కూడా కర్మే కారణమంటూ చెప్పారు. దీనిపై హేతువాదులు, పాత్రికేయులు, ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యనేతలు బిస్వాపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
*తమిళనాడులో శశికళ వర్గానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అన్నాడీఏంకే రెండాకుల గుర్తుపై కేంద్ర ఎన్నికల సంఘం గురువారం స్పష్టతనిచ్చింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి వర్గానికే రెండు ఆకుల గుర్తును కేటాయిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది.
*పురస్కారం తీసుకోవడానికని ఇటీవల దిల్లీకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర మంత్రికి చేదు అనుభవం ఎదురైంది! రాత్రి 11 గంటలప్పుడు తెలంగాణభవన్‌కు చేరుకున్న ఆయనకు ప్రోటోకాల్‌ సిబ్బంది కనిపించలేదు. విమానాశ్రయం నుంచి తీసుకొచ్చిన వ్యక్తి… కారు దిగ్గానే ‘నమస్కారం’ పెట్టేశాడు. స్వర్ణముఖి బ్లాకులో తనకు కేటాయించిన గదికి మంత్రి వెళ్లారు. సహాయకుడిని పిలిచి, భోజనం తీసుకురావాలని చెప్పగా…‘‘ఇప్పుడిక్కడ భోజనం దొరకదు. ‘గులాటి’ (సమీపంలో పేరొందిన భోజనశాల)కి వెళ్లండి’’ అన్నాడు! ఇంతలో ఆంధ్రాభవన్‌ సిబ్బంది ఒకరు మంత్రిని గుర్తించి, హుటాహుటిన క్యాంటీన్‌ నుంచి భోజనం తెచ్చిచ్చాడు. సదరు మంత్రి హైదరాబాద్‌ చేరుకున్న తర్వాత… మంత్రినైన తనను పట్టించుకోలేదని జీఏడీలో ఫిర్యాదుచేశారు. సాధారణంగా తెలంగాణ మంత్రులకు ‘శబరి’లో గదులు కేటాయిస్తారు. ఆ రోజు స్వర్ణముఖిలో మంత్రికి గది కేటాయించడంపైనా విమర్శలొస్తున్నాయి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన గది సహాయకునిపై వేటుకు రంగం సిద్ధమైంది. గతంలోనూ టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్‌ గంటా చక్రపాణి మీడియాతో చిట్‌చాట్‌ సందర్భంగా ప్రోటోకాల్‌ వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తంచేశారు.
*తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి వారిని గ్రీన్‌ ట్రైబ్యునల్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ స్వతంత్రకుమార్‌ దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. స్వతంత్రకుమార్‌కి తితిదే అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. తిరుమల పరిశుభ్రతతో పాటు వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉందని పేర్కొన్నారు.
* తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తిరుచానూరుకు సారె వూరేగింపుగా బయలుదేరింది. పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు చక్రస్నానం నిర్వహించనున్నారు.పంచమి తీర్థం రోజు శ్రీవారి నుంచి అమ్మవారకి సారె, పసుపు, కుంకుమ, ఆభరణాలు తీసుకెళ్లడం ఆనవాయితీ. వేకువజామున స్వామివారికి సుప్రభాత సేవ అనంతరం మంగళవాయిద్యాల నడుమ సారెకు తిరువీధుల్లో వూరేగింపు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కొండపై నుంచి అలిపిరి నడక మార్గంలో సారెతో తిరుచానూరుకు బయలుదేరారు. అలిపిరి నుంచి తిరుపతి పురవీధుల్లో వూరేగింపుగా తిరుచానూరు పసుపు మండపానికి సారె చేరుకోనుంది.
*ఉక్కు పరిశ్రమలకు సంబంధించి తెలుగు రాష్ట్రాలు త్వరలో శుభవార్త వింటాయని కేంద్రమంత్రి బీరేంద్రసింగ్‌ అన్నారు. ఈరోజు దిల్లీలో కేంద్రమంత్రి బీరేంద్రసింగ్‌తో కేంద్రమంత్రి సుజనాచౌదరి, ఏపీ మంత్రి సుజయకృష్ణ రంగారావు, తెలంగాణ మంత్రి కేటీఆర్‌ భేటీ అయ్యారు. విభజన చట్టంలో హామీ మేరకు కడప, బయ్యారంలో ఉక్కు కర్మాగారాల ఏర్పాటుపై చర్చించారు. సుమారు 2 గంటల పాటు సాగిన సమావేశంలో విభజన చట్టం హామీలు నిలబెట్టుకోవాలని బీరేంద్రసింగ్‌ను కోరారు.ఈ సందర్భంగా బీరేంద్రసింగ్‌ మాట్లాడుతూ.. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కేంద్రం చిత్తశుద్ధితో ఉందన్నారు. టాస్క్‌ఫోర్స్‌ కమిటీ నెలరోజుల్లో నివేదిక ఇస్తుందన్నారు. స్వల్పకాలికంగా, దీర్ఘకాలికంగా ఏ తరహాఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై చర్చ జరిగినట్లు తెలిపారు. నెల రోజుల తర్వాత మరోసారి సమావేశం నిర్వహిస్తామన్నారు. ఉక్కు నాణ్యత అధ్యయనానికి టాస్క్‌ఫోర్స్‌ కమిటీకి సమయం పడుతుందని పేర్కొన్నారు.
* టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ అధినేత, భారతీ ఎంటర్‌ప్రైజస్‌ వ్యవస్థాపకుడు సునీల్‌ మిత్తల్‌ దాతృత్వం చాటుకున్నారు. తమ కుటుంబానికి చెందిన మొత్తం సంపదలో 10 శాతం వాటాను దాతృత్వానికి కేటాయించనున్నట్లు ప్రకటించారు. ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నందన్‌ నీలేకని దంపతులు తమ సంపదలో సగాన్ని దాతృత్వానికి కేటాయించనున్నట్లు ప్రకటించిన రెండు రోజుల తర్వాత మిత్తల్‌ ముందుకు రావడం గమనార్హం.
*పాకిస్థాన్‌కు భారత్ బిగ్ షాకిచ్చింది. ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను గృహ నిర్బంధం నుంచి స్వేచ్ఛ ప్రసాదించిన తర్వాతి రోజే పాకిస్థాన్‌కు భారత్ గట్టి షాకిచ్చింది. వచ్చే ఏడాది భారత్‌లో జరగనున్న ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో ఆడేందుకు పాక్ జట్టుకు అనుమతి నిరాకరించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. దేశం కంటే క్రికెట్ గొప్పది కాదని, దేశం తర్వాతే ఏదైనా అని తేల్చి చెప్పారు. క్రీడా మంత్రిత్వ శాఖ కూడా పాక్‌కు అనుమతి నిరాకరించే అవకాశం ఉంది. దీంతో ఆసియా కప్ ఎక్కడ నిర్వహిస్తారన్నదానిపై సందిగ్ధత నెలకొంది. పాక్‌కు అనుమతి ఇచ్చేది లేదని భారత్ తేల్చి చెప్పడంతో తటస్థ వేదికపై ఆసియాకప్‌ను నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.
* పయ్యావుల వారి పెళ్లి వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎమ్మెల్సీ, శాసనమండలి చీఫ్‌విప్‌ పయ్యావుల కేశవ్‌ సోదరుడు పయ్యావుల శీనప్ప కుమార్తె వివాహం గురు, శుక్రవారాల్లో జరగనున్న విషయం తెలిసిందే. గురువారం రాత్రి రిసెప్షన్‌, శుక్రవారం తెల్లవారుజామున పెళ్లి జరగనున్న నేపథ్యంలో సినిమా సెట్టింగ్‌లను మైమరిపించేలా కల్యాణవేదికను సుందరంగా తీర్చిదిద్దారు. పెద్ద ఎత్తున రాజకీయ, అధికార ప్రముఖులు, వేలాదిగా టీడీపీ శ్రేణులు, పయ్యావుల కుటుంబ అభిమానులు తరలిరానున్నారు. దీంతో అదే స్థాయిలో ఎంవైఆర్‌ కళ్యాణమండప ప్రాంతాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. వివాహ వేదిక ఏర్పాట్లు బుధవారం రాత్రి పూర్తయ్యాయి.పయ్యావుల కేశవ్‌, ఆయన కుమారులు విక్రమ్‌సింహ, విజయ్‌సింహ దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడా, ఎలాంటి సమస్యా తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా.. బుధవారం అనంతపురం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్‌రెడ్డి కల్యాణ వేదిక వద్దకు వచ్చి ఏర్పాట్లు పరిశీలించి వెళ్లారు. అలాగే జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన పార్టీ నేతలు, పయ్యావుల కుటుంబ అభిమానులు తరలివచ్చి వివాహ ఏర్పాట్లు చూసి హర్షం వ్యక్తం చేశారు. గురువారం రాత్రి జరిగే రిసెప్షన్‌కు పెద్ద ఎత్తున మంత్రులు, ఉన్నతాధికారులు తరలిరానున్నారు.
*తిరుచానూరు పద్మావతి అమ్మవారికి గురువారం పంచమి తీర్థ మహోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం నుండి సంప్రదాయబద్ధంగా సారెను తీసుకెళ్లారు. వేకువజామున 4.30గంటలకు ఆలయం నుండి పసుపు, కుంకుమ, పట్టు వస్త్రాలు, నైవేద్యాలను సంప్రదాయబద్ధంగా బాజాబజంత్రీలు, అర్చకుల వేదమంత్రాలతో తిరువీధుల్లో ఊరేగింపు జరిపారు. వజ్రాలు పొదిగిన బంగారు ఆభరణాలును అమ్మవారికి కానుకగా సమర్పించారు..మాడ వీధులలో ఊరేగించాక బేడీ ఆంజనేయస్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నడకమార్గంలో ఈ సారెను ఉదయం పంచమి తీర్థ ఘడియలకు ముందే తిరుచానూరు అమ్మవారికి చేర్చారు.. టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, అర్చకులు పాల్గొన్నారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఉదయం 11.48 గంటలకు అమ్మవారి పుష్కరిణిలో పంచమి తీర్థ (చక్ర స్నాన) మహోత్సవాన్ని టీటీడీ అధికారులు ఘనంగా నిర్వహించారు. భక్తులు సంయమనం పాటించి భద్రతా సిబ్బందికి సహకరించాలని టిటిడి విఙప్తి చేసింది.
*పద్మావతి విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. భారత్‌లో అనుకుంటే పొరపాటు పడ్డట్టే. పద్మావతి సినిమాకు బ్రిటన్‌లో ఊరట లభించింది. ఈ సినిమాపై పలు వివాదాలు నెలకొన్న నేపథ్యంలో విదేశాల్లో కూడా సినిమా విడుదలపై ఇన్నాళ్లూ నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే ఎట్టకేలకు బ్రిటన్ సెన్సార్ బోర్డ్ బన్సాలీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ముందుగా అనుకున్నట్టు గానే డిసెంబర్ 1న లండన్‌లో పద్మావతి విడుదల కానుంది. కానీ భారత్‌లో మాత్రం పద్మావతి సినిమా విడుదలను వాయిదా వేసుకుంటున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.సంజయ్‌ లీలా బన్సాలీ పద్మావతి సినిమాను రాజ్‌పుత్‌ల మనోభావాలను దెబ్బతినే విధంగా తెరకెక్కించాడని ఆ సామాజిక వర్గం ఇప్పటికీ ఆందోళన చేస్తూనే ఉంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా సినిమాపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో పద్మావతి సినిమా చిక్కుల్లో పడింది. పైగా కొందరు బీజేపీ నేతలు చిత్ర దర్శకుడికి, హీరోయిన్ దీపికా పదుకునేను చంపితే పారితోషికమిస్తామంటూ బహిరంగ ప్రకటనలు చేయడంతో వివాదం మరింత రాజుకుంది. పలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పద్మావతి సినిమాను నిషేధిస్తున్నట్లు ఏకంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులే ప్రకటించడంతో వివాదం సద్దుమణిగేదాకా నిర్మాతలకు చిత్ర విడుదలను వాయిదా వేయక తప్పలేదు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com