నేటి నేర వార్తలు-౦౨/౦౩

*భారత తొలి మహిళా ప్రైవేట్‌ డిటెక్టివ్‌ రజనీ పండిట్‌(54)ను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ మార్గాల ద్వారా కాల్‌ రికార్డింగ్స్‌ను టెలికాం కంపెనీల నుంచి రజనీ తెప్పించుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కాల్‌ డిటెయిల్‌ రికార్డ్స్‌(సీడీఆర్‌)లను అక్రమ మార్గాల్లో సంపాదించి, అమ్ముతున్న నలుగురు డిటెక్టివ్‌ల గ్యాంగ్‌ను పోలీసులు గురువారం పట్టుకున్నారు.
*పలాస రైల్వే స్టేషన్‌ వద్ద రైలు ఎక్కుతుండగా గుండె పోటు రావడంతో గుర్తు తెలియని వృద్ధుడు (55) శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు.
*పశ్చిమ్‌బంగ రాజధాని కోల్‌కతాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రద్దీగా ఉండే చింగ్రిఘట క్రాసింగ్‌ వద్ద బస్సు సిగ్నల్‌ జంప్‌ చేసి ఇద్దరు యువకులపైకి దూసుకుపోవడంతో వారు మరణించారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు ఆందోళన చేపట్టారు.
*మందమర్రి పాత బస్టాండ్ సమీపంలో శనివారం మధ్యాహ్నం రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ – డీసీఎం ఢీకొన్నాయి. ఈ రెండు వాహనాల వెనుక వస్తున్న ఆటో – బైక్ కూడా ఒకదానికొకటి ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
*హయత్‌నగర్‌లో జరిగిన యువతి హత్య కేసులో నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. కాబోయే భార్య అనూషను గత నెల 30న మోతీలాల్‌ అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు.
*ఉప్పల్, చిలకానగర్‌లో ఓ ఇంటిపై చిన్నారి తల దొరికిన కేసులో.. ఆ ఇంటి యజమాని రాజశేఖర్ బంధువులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజశేఖర్ మామ హన్మంతు, బుచ్చమ్మ, లక్ష్మిలను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు గతంలో క్షుద్రపూజలు చేసినట్టుగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ దిశగా విచారణ జరుపుతున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఆరుగురిని అరెస్ట్ చేశారు.
*నగామ జిల్లాలో శుక్రవారం జరిగిన రెండు రహదారి ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు.
*మరమ్మతుల పేరుతో ఇంటికొచ్చిన ఓ మెకానిక్‌ గృహిణిపై మత్తుమందు చల్లి సెల్‌ఫోన్లో నగ్న చిత్రాలు సేకరించాడు. బెదిరింపులకు దిగి పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడి ఆగడాలు శ్రుతిమించడంతో విసిగిపోయిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
*బాధ్యతగా ప్రవర్తించాల్సిన ఓ మహిళా పోలీసు నీతి తప్పి ప్రవర్తించింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి సాయం చేసినట్టే చేసి వారి వద్ద ఉన్న నగదును దొంగిలించింది.
*చైనాలోని షాంఘై నగరంలో ఓ వాహనం పాదచారుల పైకి దూసుకెళ్లిన ఘటనలో 18 మందికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
* మానేసోర్‌ భూ కుంభకోణంతో సంబంధం ఉందంటూ హరియాణా మాజీ ముఖ్యమంత్రి భూపేందర్‌ సింగ్‌ హుడాతో పాటు మరో 34మంది అధికారులపై సీబీఐ శుక్రవారం ఛార్జీషీట్‌ దాఖలు చేసింది.
*తోటి విద్యార్థుల దాడిలో ఓ బాలుడు పాఠశాల మరుగుదొడ్డిలోనే ప్రాణాలొదిలాడు. దిల్లీలోని కర్వాల్‌నగర్‌ జీవన్‌జ్యోతి ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న తుషార్‌ (16) గురువారం తోటి విద్యార్థులతో జరిగిన ఘర్షణలో మృతిచెందాడు.
*మ్‌ ఆద్మీ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. దిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత విజేందర్‌ గుప్తా, మరో ఇద్దరు భాజపా మేయర్లపై దాడి చేశారనే ఆరోపణలతో వారిపై కేసు నమోదు చేశారు.
*కలుషిత ఆహారం తీసుకున్న సంఘటనలో ఒకరు మరణించగా, 20 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
*జమ్మూ-కశ్మీర్‌లో భారీ హిమపాతానికి శుక్రవారం సాయంత్రం ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోగా.. మరొకరు గాయపడ్డారు. కుప్వారా జిల్లా మచ్చిల్‌ సెక్టార్‌లోని ‘21 రాజ్‌పుత్‌’ దళానికి చెందిన శిబిరం వద్ద ప్రమాదవశాత్తూ ఈ దుర్ఘటన జరిగినట్లు సైనికాధికారి ఒకరు వెల్లడించారు.
* రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి కారణమైన నల్గొండ పురపాలిక ఛైర్‌పర్సన్‌ బొడ్డుపల్లి లక్ష్మి భర్త శ్రీనివాస్‌ హత్య కేసులో విచారణాధికారిగా ఉన్న నల్గొండ రెండో పట్టణ సీఐ వెంకటేశ్వర్లు శుక్రవారం ఉదయం నుంచి అదృశ్యమయ్యారు. ఉదయం తన సర్వీసు రివాల్వర్‌, చరవాణిని ఠాణాలో అప్పజెప్పి అజ్ఞాతంలోకి వెళ్లినట్టు సమాచారం.
*తమిళనాడులోని మదుర మీనాక్షి ఆలయం తూర్పుగోపురం వద్ద శుక్రవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం ఏర్పడింది. సమీపంలోని 30 దుకాణాలకు మంటలు వ్యాపించి భారీ ఆస్తి నష్టమైంది. విషయం తెలిసిన వెంటనే మదురై కలెక్టర్‌ వీరరాఘవరావు సంఘటన స్థలికి చేరుకున్నారు. 200 మందికిపైగా అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేస్తున్నారు. ఈ సమయంలో భక్తులు, ఆలయసిబ్బంది లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ప్రభుత్వ యంత్రాంగమంతా అప్రమత్తమై మంటలను అదుపు చేసిందని కలెక్టర్‌ తెలిపారు. విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ వల్ల ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు.
*గత నెలలో నిజామాబాద్‌ జిల్లా సిర్నాపల్లి అటవీప్రాంతంలో గాయపడిన చిరుత పులి మృతి చెందింది. రైలు ఢీకొన్న ఘటనలో తోక తెగడంతో పాటు..నడుం భాగంలో గాయాలై లేచి నిలబడిలేని స్థితిలో ఉన్న చిరుతను హైదరాబాద్‌లోని జూ పార్కుకు తరలించి వైద్యం అందించారు. పదిరోజుల క్రితం అది మరణించింది. ‘చిరుతను బతికించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని’ అటవీశాఖ వర్గాలు తెలిపాయి.
*నల్గొండజిల్లాకేంద్రంలో మర్రిగూడ బైపాస్‌ రోడ్డుపై నలుగురు పాదచారులను డీసీఎం వాహనం ఢీకొంది. ఈ సంఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లాకేంద్ర ఆసుపత్రికి తరలించారు. మృతులు కృష్ణా జిల్లాకు చెందిన హేమంత్‌(32), సునీల్‌(31), మురళీకృష్ణ(32)లుగా గుర్తించారు.
*పాకిస్థాన్‌లోని సింధ్‌ రాష్ట్రంలో సీనియర్‌ మంత్రి మీర్‌ హజార్‌ఖాన్‌ బిజ్‌రాని(71) తుపాకీతో భార్యను కాల్చిచంపి, ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఆ దేశంలో కలకలం రేపుతోంది. ఇద్దరి మృతదేహాలను వారి బెడ్‌రూమ్‌లోనే రక్తపుమడుగులో పోలీసులు గుర్తించారు. మీర్‌ భార్య ఫరీహ రజాక్‌ కూడా గతంలో పాక్‌ చట్టసభకు ప్రాతినిథ్యం వహించారు.
*ఎంతటి పెద్ద చేపనైనా వలతో బంధించగల నేర్పరి ఆ మత్స్యకారుడు. కానీఆ చేపలే అతడి ప్రాణం తీశాయి. దాదాపు మూడు కిలోల బరువున్న చేపలు ఒక్కసారిగా పైకి ఎగిరి ఛాతికి బలంగా తాకడంతో అస్వస్థతకు గురై మృతిచెందాడు
*మేడారం జాతరలో అపశృతి చోటుచేసుకుంది. మేడారంలో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ గుండె పోటుతో మృతి చెందారు. హైదరాబాద్ కు చెందిన అప్తర్ సుల్తానా మేడారంలో జాతర సందర్భంగా విధులు నిర్వహిస్తుండగా గుండెపోటు రావడంతో మృతిచెందారు.
* ప్రకాశం జిల్లా దర్శి మండలంలో శనివారం రోడ్డుప్రమాదం జరిగింది. మండలంలోని కొత్తరెడ్డి పాలెం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఎదురెదురుగా వచ్చిన రెండు బైకులు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com