నేటి నేర వార్తలు-౧౨/౯

*వివాహేతర సంబంధాల్లో కేవలం పురుషులనే శిక్షించి, మహిళలను విడిచిపెడుతున్నారంటూ దాఖలైన వ్యాజ్యాన్ని శుక్రవారం సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఇందుకు సంబంధించి భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ)లోని సెక్షన్‌ 497ను సవాలు చేస్తూ భారత సంతతి వ్యక్తి జోసఫ్‌ షినే (40) ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
*క్రిస్మస్‌ వేడుకలకు వెళ్లి తిరిగి వస్తుండగా టాటా మ్యాజిక్‌ వాహనం ప్రమాదవశాత్తు లోయలోకి దూసుకెళ్లడంతో అయిదుగురు మృతిచెందారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లాలోని చింతూరు- మారేడుమిల్లి ఘాట్‌ రహదారిలో గురువారం అర్ధరాత్రి దాటాక చోటుచేసుకుంది. చింతూరు మండలం తులసిపాక గ్రామానికి పది కిలోమీటర్ల దూరంలోని కొండదారిలో ఓ వాహనం మొరాయించింది. దాన్ని పరిశీలించేందుకు మరో నాలుగు వాహనాలకు చెందిన డ్రైవర్లు వెళ్లారు. ఈ సమయంలో టాటా మ్యాజిక్‌ వాహనం రోడ్డు వాలుగా ఉండటంతో వెనక్కి వచ్చేసి నేరుగా 70 అడుగుల లోయలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో వాహనంలో ఉన్న 12 మంది కేకలు వేయడంతో మిగతా వాహనాల్లో ఉన్నవారు ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటనలో కాకినాడ, విశాఖ జిల్లాకు చెందిన అయిదుగురు మృతి చెందారు. విశాఖ జిల్లా పాయకరావుపేటకు చెందిన కీర్త వరలక్ష్మి (50), కాకినాడలోని ఇంద్రపాలెంకు చెందిన వాసంశెట్టి సుశీల (45), శాంతకుమారి (40), లెనిన్‌పేటకు చెందిన సుగిత (40) అక్కడికక్కడే మృతిచెందారు. రఘును వైద్యం కోసం కాకినాడకు తరలిస్తుండగా మృతి చెందాడు. గాయపడిన మరో ఏడుగురు రంపచోడవరం, కాకినాడ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
*తీవ్ర సంచలనం సృష్టించిన …అత్యంత పాశవికమైన నిఠారీ హత్యల కేసులో దోషులైన వ్యాపారవేత్త మొనీందర్‌ సింగ్‌ పంధేర్‌, అతని ఇంటి పనివాడు సురేంద్ర కోలీలకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం మరణశిక్ష విధించింది. వీరిద్దరి చేతిలో 16 మంది అమాయకులు దారుణ హత్యకు గురయ్యారు.
*ప్రేమించిన యువకుడు మాట తప్పడం..వేరే యువతితో నిశ్చితార్ధం చేసుకోవడంతో ప్రేమికురాలు పోలీసులను ఆశ్రయించింది.. అనంతరం అక్కడే విషగుళికలు మింగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అనంతపురం జిల్లా బత్తలపల్లిలో ఈ దారుణం చోటుచేసుకుంది. బత్తలపల్లికి చెందిన దాదాఖలంధర్‌, ముంతాజ్‌బేగం దంపతుల చిన్న కుమార్తె నసురున్నీసా (25). ఈమె స్థానిక ఆర్డీడీ ఆసుపత్రి ఆవరణలోని గృహాల్లో పనులు చేస్తోంది. ఆమెకు..స్థానిక ఎస్సీ కాలనీకీ చెందిన కుషాల్‌బాబు పరిచయం అయ్యాడు. ప్రేమిస్తున్నానని వెంట పడ్డాడు. మన మతాలు వేరని ప్రేమకు అడ్డు చెప్పింది. అయినా యువకుడు వదలకపోవడంతో..కొద్ది రోజుల తర్వాత ప్రేమను అంగీకరించింది. ఈవిషయం తెలుసుకొన్న తల్లిదండ్రులు ఆమెను మందలించి వేరే సంబంధాలు చూస్తున్నా.. తాను కుషాల్‌బాబునే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అయితే, ప్రేమించిన యువతిని కాదని కుషాల్‌బాబు మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈవిషయం తెలుసుకున్న నసురున్నీసా గురువారం తన తమ్ముడు ఇమ్రాన్‌తో వెళ్లి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మీరు తల్లిదండ్రులను తీసుకురావాలని పోలీసులు సూచించడంతో ఇమ్రాన్‌ ఇంటికి వెళ్లాడు. అంతలోనే ఏమనుకుందో ఠాణా ఆవరణలో విష గుళికలు మింగింది. అపస్మారక స్థితిలో పడి పోవటంతో పోలీసులు ఆమె తమ్ముడికి చరవాణిలో సమాచారమిచ్చారు. అతను వచ్చి ఆర్డీటీ ఆసుపత్రికి తరలించాడు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. శుక్రవారం ఉదయం పోలీసులు కేసు నమోదు చేశారు. విష గుళికలు మింగిన వెంటనే పోలీసులు స్పందించలేదని..ఆమె తమ్ముడికి ఫోన్‌ చేసి ఊరుకున్నారని..వారు సకాలంలో ఆసుపత్రికి తరలించి ఉంటే మృతి చెందేది కాదని పలువురు పేర్కొంటున్నారు.
*నడుస్తున్న రైల్లో ఇరువురి మధ్య చేలరేగిన ఘర్షణ ఒకరి ప్రాణం తీసింది. తెనాలి రైల్వే స్టేషన్లో స్వీపర్‌గా పని చేస్తున్న కె.రత్నరాజు(50) శుక్రవారం మధ్యాహ్నం విజయవాడ వెళ్లటానికి తెనాలిలో ప్యాసింజరు రైలు ఎక్కాడు. రైల్లో అతనికి ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం పాపాయపాలెంనకు చెందిన గడ్డం వెంకట్తో ఘర్షణ జరిగింది. ఇరువురు ఒకరినొకరు నెట్టుకున్నారు. రైలు తెనాలి సమీపం కఠెవరం వద్దకు వస్తున్న క్రమంలో తోపులాటలో రత్నరాజు రైలు నుంచి విసురుగా బయటపడ్డాడు. నేరుగా గడ్డర్లపై పడటంతో తలకు తీవ్ర గాయాలై ఘటనా స్థలిలోనే మృతి చెందాడు.
*బెంగళూరుకు చెందిన ఎర్రచందనం దుంగల స్మగ్లర్‌ ఖలీల్‌ఖాన్‌ శుక్రవారం పోలీసులకు పట్టుబడ్డాడు. చాగలమర్రి నోబెల్‌ థిÅయేటరు వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టగా ఓ కారు నుంచి కొందరు దిగి పారిపోయేందుకు యత్నించారు. పోలీసులు వారిని వెంబడించి పట్టుకొన్నారు.
*కోర్టు ధిక్కరణ కేసుల్లో తెలంగాణ అటవీశాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్‌, మరో నలుగురు అటవీశాఖాధికారులకు ఉమ్మడి హైకోర్టు నోటీసులు జారీచేసింది.
*అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జనగామ జిల్లా ఎర్రగొల్లపహాè్లో చోటుచేసుకుంది. మృతుని కుటుంబసభ్యులు తెలిపిన ప్రకారం.. కొండ పరశురాములు(35) తనకున్న మూడెకరాల్లో సాగు చేస్తున్నాడు. కొంతకాలంగా ఆశించిన దిగుబడులు రాకపోవడంతో రూ.4.50 లక్షల మేర అప్పులయ్యాయి. ఎకరం భూమిని అమ్మినా అప్పులు తీరకపోవడంతో మనస్తాపం చెంది శుక్రవారం ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
*ఉద్దేశపూర్వకంగా పోలీసు విధులకు ఆటంకం కలిగించి, రోడ్డుపై రాకపోకలకు ఇబ్బందులు కలిగించారని పలువురు ఏఎన్‌ఎంలపై పంజాగుట్ట పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదుచేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని ఒప్పంద, పొరుగుసేవల ఏఎన్‌ఎంలు శుక్రవారం ప్రగతిభవన్‌ వద్ద రోడ్డుపై బైఠాయించారు.
*గుజరాత్‌లో ఓ ట్రాలీ ఆటో రోడ్డుపై హల్‌ చల్‌ చేసిన వీడియో వైరల్‌ అవుతోంది. డ్రైవర్‌ లేకుండానే దానికదే ప్రయాణింటంతో అంతా అవాక్కవుతున్నారు. భరూచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
*విశాఖపట్నం జిల్లాలోని జి.మాడుగుల మండలంలో దారుణం చోటుచేసుకుంది. మద్దిగరువు సమీపంలో మావోయిస్టులు ఇద్దరు గిరిజనులను హతమార్చారు. ఇన్‌ఫార్మర్ల నెపంతో వీరిని కాల్చి చంపారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
*వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని వెల్టూరు సబ్‌ స్టేషన్ సమీపంలో 44వ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న కంటైనర్‌ను డీసీఎం ఢీకొనడంతో అందులో ఉన్న 14 ఆవులు మృతిచెందాయి. డీసీఎం డ్రైవర్ అంజి, పశువుల వ్యాపారి బాబుకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు.
*ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పితృవియోగం కలిగింది. శ్రీనివాసరెడ్డి తండ్రి రాఘవరెడ్డి అనారోగ్యంతో శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్‌లోని వారి స్వగృహంలో కన్నుమూశారు. ప్రజల సందర్శనార్థం రాఘవరెడ్డి భౌతిక కాయాన్ని వీరి స్వగ్రామం కల్లూరు మండలం నారాయణపురానికి తరలిస్తున్నారు. గ్రామంలో శనివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
*కుమార్తె గొంతు కోసి హత్య చేసి అనంతరం తండ్రి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంచలనం రేపింది. ఈ ఘటన వేలూరు సమీపంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెలితే వేలూరు సమీపం అరపాక్కం మసీదు వీధికి చెందిన నజీర్‌(50) బీడి కార్మికుడు. ఇతని భార్య కొద్ది రోజుల కిందట మృతి చెందింది. వీరికి యాస్మిన్‌(25)తో పాటు ముగ్గురు కుమార్తెలున్నారు. ఒక కుమార్తె కొద్ది సంవత్సరాల కిందట ప్రేమ వివాహం చేసుకుంది. మరో కుమార్తె అనారోగ్యంతో రెండేళ్ల కిందట మృతి చెందింది. దీంతో ఇంట్లో నజీర్, యాస్మిన్‌ మాత్రమే నివశిస్తున్నారు. యాస్మిన్‌కు వివాహం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లలో నజీర్‌ ఉండేవాడు.ఈ స్థితిలో శుక్రవారం ఉదయం ఆయన ఇళ్లు తెరిచి ఉండడాన్ని గమనించిన స్థానికులు లోనికి వెళ్లి పరిశీలించారు. ఆ సమయంలో యాస్మిన్‌ గొంతు కోసిన స్థితిలో రక్తపు మడుగులో శవంగా పడిఉంది. అనుమానం కలిగిన స్థానికులు నజీర్‌ కోసం గాలించారు. సమీపంలోని బావిలో నజీర్‌ మృతదేహం తేలుతూ కనిపించింది. దీనిపై వెంటనే రత్నగిరి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించి విచారణ చేపట్టారు. కుమార్తెను హత్య చేసిన అనంతరం నజీర్‌ బావిలో దూకి ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. బావిలో ఉన్న నజీర్‌ మృతదేహాన్ని బయటకు తీయగా ఆయన లుంగీపై రక్తపు మరకలు ఉన్నట్లు గుర్తించామని ప్పారు.
*ఇటీవల ఎస్‌ఆర్‌నగర్ పీఎస్ పరిధిలోని వెస్ట్ శ్రీనివాస్‌కాలనీలోని పద్మావతి హాస్టల్‌లో చిన్నారిని హింసించిన ఘటనలో నిందితులను రిమాండ్‌కు తరలించారు. నాలుగు సంవత్సరాల బాలికను కాలుతున్న పెంక మీద కూర్చోబెట్టి తీవ్ర హింసలకు గురిచేసిన నేపథ్యంలో ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు నిందితులపై కేసు నమోదు చేయగా, నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలంటూ బాలల హక్కుల సంఘం మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. ఈ మేరకు మానవ హక్కుల సంఘం స్పందించి ఎస్‌ఆర్‌నగర్ పోలీసులకు తగిన ఆదేశాలు జారీ చేయడంతో నిందితులు లలిత, ప్రకాష్‌లపై హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. బాలికను ప్రభుత్వ వసతి గృహానికి తరలించారు.
*పట్టాదారుపాస్‌బుక్‌లో పేరు నమోదుకు లంచం తీసుకున్న వీఆర్వోకు ఏసీబీ కోర్టు ఏడాది జైలుశిక్ష, రూ.2,500 జరిమానా విధించింది. 2010లో కరీంనగర్ జిల్లాలోని వడ్కాపూర్ వీఆర్వో మద్దెల నారాయణ, పాస్‌బుక్‌లో పేరు నమోదుకు రైతు రాజయ్య నుంచి రూ.2వేలు తీసుకున్నాడు. ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచంగా తీసుకున్న నగదు స్వాధీనం చేసుకుని, నారాయణపై కేసు నమోదు చేశారు. ఏసీబీ కోర్టులో విచారణ అనంతరం నేరం రుజువుకావడంతో ఏడాది జైలుశిక్ష, రూ.2,500 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో మూడు నెలలు జైలుశిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.
*ఏలూరు జిల్లా కేంద్రమైన ఏలూరులో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెంది ఉండటాన్ని శనివారం ఉదయం గుర్తించారు. ఏలూరు రైల్వేస్టేషన్ సమీపంలోగల పట్టాల పక్కన అప్పన్న అనే వ్యక్తి మృతిచెంది ఉన్నాడు. రైలు పట్టాల పక్కనగల కరెంటు స్తంభానికి శవమై వేలాడుతూ కనిపించడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా… ఎవరో హత్య చేసి కరెంటు స్తంభానికి వేలాడదీసినట్లు స్థానికులు భావిస్తున్నారు. పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతి కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com