నేటి నేర వార్తలు-04/14

*కొవ్వూరు పట్టణంలో రోడ్డు కం రైలు వంతెన దిగువున గోదావరి నదిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం కనిపించింది. సుమారు 50 నుంచి యాభై ఐదేళ్ల వయసు కలిగిన మహిళ మృతదేహాన్ని శుక్రవారం స్థానికులు గుర్తించారు.
*వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం కుస్మసముద్రంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. గత రాత్రి గ్రామంలోకి ప్రవేశించిన చిరుత పశువులపై దాడికి తెగబడింది. దీన్ని గమనించిన రైతులు కేకలు వేయడంతో ఆ చిరుత సమీపంలోని అడవిలోకి పారిపోయింది. చిరుత సంచారంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు.
*మాచారెడ్డి మండలం పాల్వంచ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న కారు ఆటోను ఢీకొట్టింది. దీంతో తహశీల్(19) అనే యువతి అక్కడికక్కడే మృతి చెందింది. ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.
*సిరిసిల్ల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో తుపాకి మిస్‌ఫైర్ అయింది. ప్రమాదవశాత్తు తుపాకి పేలి ఏఆర్ కానిస్టేబుల్ సత్యనారాయణకు తీవ్రగాయాలయ్యాయి. విధుల బదిలీ సమయంలో ఏఆర్ కానిస్టేబుల్ ఆయుధాన్ని పరిశీలిస్తుండగా ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన ఏఆర్ కానిస్టేబుల్‌ను సిరిసిల్ల జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
*నర్సింగ్ హోమ్‌లో లింగ నిర్ధారణ పరీక్షల ఆరోపణలపై పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. సైదాబాద్ సింగరేణి కాలనీలో ఉన్న గాయత్రి నర్సింగ్ హోంకు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. నర్సింగ్ హోం ఎండీ రచనాసింగ్, డైరెక్టర్ కిరణ్, సూపర్ వైజర్ ఉన్నిసా బేగంను అదుపులోకి తీసుకున్న సైదాబాద్ పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు.
*ఇంటర్‌లో అనుత్తీర్ణులమయ్యామని, తక్కువ మార్కులు వచ్చాయని రాష్ట్రవ్యాప్తంగా ఐదుగురు ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
*ఓ చిన్నారిపై అమానుషంగా ప్రవర్తించిన నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ హైదరాబాద్‌ చిన్నారుల కోర్టు శుక్రవారం తొలి తీర్పును ప్రకటించింది.
*ఒడిశాలోని గుణుపురం అదనపు జిల్లా న్యాయస్థానం శుక్రవారం సంచలనాత్మక తీర్పు వెలువరించింది. చిల్లంగి చేస్తున్నారనే నెపంతో ముగ్గురిని హత్యచేశారంటూ రెండేళ్ల కిందట నమోదైన కేసు తుది విచారణలో గుణుపురం అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి సువేంధుకుమార్‌పొత్తి తొమ్మిది మందికి మరణశిక్ష విధించారు.
*అమెరికా అరిజోనాలోని ఫీనిక్స్‌ శివారులో జరిగిన విమాన ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆనంద్‌పటేల్‌(26) అనే భారతీయ మూలాలున్న యువ పారిశ్రామికవేత్త ఉన్నారు.
* అనంతపురంలోని ఓ ప్రైవేట్‌ శిక్షణ కేంద్రం మేనేజర్‌ కీచకుడిగా మారిపోయాడు. విద్యార్థినులు స్నానం చేస్తుండగా చరవాణి సాయంతో వీడియో తీస్తూ దొరికిపోయాడు.
*మహిళలపై దాడులు చేసి అత్యాచారాలకు పాల్పడుతున్న ఉన్మాదిని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరులో పోలీసులు అరెస్టు చేశారు.
*తమిళనాడులో ఎండీఎంకే నేత వైగో అల్లుడు ఆత్మాహుతికి యత్నించిన ఘటన రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. వైగో భార్య రేణుకాదేవి మేనల్లుడు శరవణ సురేశ్‌ శుక్రవారం ఉదయం విరుదునగర్‌లో శరీరంపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకున్నారు.
*తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం రైల్వేస్టేషన్‌లో పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని దంపతులు మృతి చెందారు.
*కారుణ్య మరణానికి అనుమతికోరిన మహిళ సరైన వైద్యం అందేలోపే తనువు చాలించారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని డ్రైవర్స్‌కాలనీకి చెందిన పత్తి రామలక్ష్మి(35) కడుపులో 25 కేజీల కణితి పెరడగంతో అనారోగ్యానికి గురయ్యారు.
* చెడు వ్యసనాలకు బానిసైన ఓ అన్న గొర్రెలను చాటుమాటుగా అమ్ముకుంటూ తరచూ గొడవలు చేస్తున్నా అన్న ఆగడాలు మితిమీరడంతో తమ్ముడు చేతిలో దారుణహత్యకు గురైన సంఘటన దేవరకద్ర గుడిబండ గ్రామంలో శుక్రవారం ఆలస్యంగా వెలుగుచూసింది.
*దిల్లీ నుంచి నాసిరకం టీవీలను తీసుకొచ్చి బ్రాండెడ్‌ ఉత్పత్తుల స్టిక్కర్లు అంటించి వినియోగదారులకు అంటగడుతున్న ముఠా గుట్టును రాచకొండ ఎస్‌వోటీ, చైతన్యపురి పోలీసులు రట్టు చేశారు.
*అమెజాన్‌ ఆన్‌లైన్‌ సంస్థను మోసం చేసిన ఐదుగురు యువకులను సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.10.75 లక్షల నగదుతో పాటు వివిధ మొబైల్‌ ఆపరేటర్లకు చెందిన 556 సిమ్‌కార్డులు, 42 సెల్‌ఫోన్‌లు, రెండు ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు.
*నెల్లూరు జిల్లాను వణికించిన సైకో ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జిల్లాలోని కోవూరులో ఒకే రోజు రాత్రి ఐదుగురు మహిళలపై దాడులకు పాల్పడి, ఒకరిపై అత్యాచారం చేయడంతో సైకో వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. సైకో కోసం ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేసిన పోలీసులు తమిళనాడు, నెల్లూరు జిల్లాల్లో గాలింపు చేపట్టారు.
*రాజస్థాన్‌లోని కోట ప్రాంతంలో ప్రమాదం చోటుచేసుకుంది. ధన్‌ మండిలో శనివారం తెల్లవారుజామున ఓ రెండంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. స్థానికుల సమాచారంతో ఎన్డీఆర్ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. ఈ ఘటనలో పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారిని వెలికి తీసేందుకు సహాయక సిబ్బంది యత్నిస్తున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com