నేటి బిజినెస్ వార్తలు-౦౧/౨౦

*ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రాణించింది. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో సంస్థ నికర లాభంలో 20.1శాతం వృద్ధి సాధించింది. ఇది రూ.4,642.6కోట్లకు సమానం. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో సంస్థ నికర లాభం రూ.3,865.33 కోట్లు మాత్రమే.
*ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించిన క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్‌ ట్రేడర్లకు ఆదాయపన్ను శాఖ షాకిచ్చింది. ట్రేడింగ్‌ చేసిన వేలాది మందికి పన్ను కట్టాల్సిందిగా నోటీసులు పంపించింది. దేశవ్యాప్తంగా చేపట్టిన సర్వేలో 17 నెలల కాలంలోనే 3.5 బిలియన్‌ డాలర్ల విలువైన లావాదేవీలు జరిగాయని తేలడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
*మూడో త్రైమాసికం ఫలితాల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ దుమ్మురేపింది. చమురు శుద్ధిలో, జియోలో అత్యధిక లాభాలు ఆర్జించడంతో రెండో త్రైమాసికంతో పోలిస్తే ఈ సారి రిలయన్స్‌ నికర లాభం 25 శాతం పెరిగింది. అక్టోబర్‌-డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం రూ.9,423 కోట్లుగా నమోదైంది. ఇక స్టాండ్‌ అలోన్‌ లాభాలు 5.4 శాతం పెరిగి రూ.8,454 కోట్లుగా ఉన్నట్టు స్టాక్‌ ఎక్స్ఛేంజీకి సంస్థ సమర్పించింది.
*అక్టోబరు- డిసెంబరు త్రైమాసికానికి ఐటీసీ రూ.3,090 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2016-17 ఇదేకాలంలో సంస్థ ఆర్జించిన రూ.2,646.73 కోట్లతో పోలిస్తే నికర లాభం ఈసారి 16.75% పెరిగింది.
*ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) ఎగ్జిక్యూటివ్‌ బోర్డు కొత్త ఛైర్మన్‌గా హరీశ్‌ మన్వానీ నియమితులయ్యారు.
*దేశంలో మూడో అతిపెద్ద సాఫ్ట్‌వేర్‌ సేవల సంస్థ విప్రో అంచనాలకు అనుగుణంగా రాణించలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.1.931.3 కోట్లుగా నమోదైంది.
*అక్టోబరు- డిసెంబరు త్రైమాసికానికి హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ రూ.2,194 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో కంపెనీ ఆర్జించిన రూ.2,070 కోట్లతో పోలిస్తే ఇది 6% ఎక్కువ. మొత్తం ఆదాయం రూ.11,814 కోట్ల నుంచి 8.4 శాతం వృద్ధితో రూ.12,808 కోట్లకు చేరింది.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.75.6 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.
*పైవేటురంగ కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి రూ.1,624 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని నమోదు చేసింది.
*ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.146.11 కోట్ల నికరలాభాన్ని ప్రైవేటు రంగ ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ నమోదు చేసింది.
*ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఎస్‌ఐ) అధ్యక్షుడిగా మకరంద్‌ లీలే, ఉపాధ్యక్షుడిగా హైదరాబాద్‌కు చెందిన వి.ఆహ్లాదరావు ఎన్నికైనట్లు ఐసీఎస్‌ఐ వెల్లడించింది.
*ప్రైస్‌ వాటర్‌హౌస్‌(పీడబ్ల్యూ)పై సెబీ విధించిన రెండేళ్ల నిషేధంపై స్టే ఇవ్వడానికి సెక్యూరిటీస్‌ అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌(శాట్‌) నిరాకరించింది.
*జౌళి సంచులు, పేపర్‌ ప్లేట్లు, ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ పరికరాల వంటి ఉత్పత్తులు తయారు చేయడానికి చిన్న, మధ్య స్థాయి పరిశ్రమ ఏర్పాటు చేయాలనుకునే వారికి యూనిట్‌ ఏర్పాటు, రుణ సమీకరణ, సంబంధిత పరిశ్రమల నుంచి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు సన్‌రియో అఖిల భారత ఎంఎస్‌ఎంఈ వరల్డ్‌ ఎక్స్‌పో 2018 పేరుతో ‘ఎంఎస్‌ఎంఈ వరల్డ్‌’ ప్రదర్శన నిర్వహించనుంది.
*మొబైల్‌ ప్రీపెయిడ్‌ చందాదార్లు నగదు చెల్లించీ, వినియోగించని మొత్తాలను, పోస్ట్‌పెయిడ్‌ చందాదార్లు సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించిన నగదును వాపసు చేయాలని రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌), దాని అనుబంధ సంస్థ రిలయన్స్‌ టెలికాంలను టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ ఆదేశించింది.
*హోండా దేశవ్యాప్తంగా వివిధ మోడళ్లకు చెందిన 22,834 కార్లను వెనక్కి పిలిపించింది. తకాటా కంపెనీ తయారు చేసిన ఎయిర్‌బ్యాగ్‌లను సరిచేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
*స్థిరాస్తి పెట్టుబడుల ట్రస్టులు(రీట్స్‌), మౌలిక పెట్టుబడుల ట్రస్టు(ఇన్విట్స్‌)లను మరింత ఆకర్షణీయంగా మార్చడం కోసం నమోదిత బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు), అంతర్జాతీయ ఆర్థిక సంస్థల వంటి వ్యూహాత్మక పెట్టుబడుదారులు వాటిలో 25 శాతం దాకా పెట్టుబడులు పెట్టడానికి సెబీ అనుమతించింది.
*ఎయిర్‌ కండీషనర్ల తయారీ సంస్థ అంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ)కు చివరి రోజున 165.31 రెట్ల స్పందన లభించింది. గురువారం వరకు 3.61 రెట్లు మాత్రమే స్పందన కనిపించగా.. ఆఖరి రోజు ఇది 165.31 రెట్లకు పెరగడం గమనార్హం. సంస్థాగత మదుపర్ల విభాగంలో 175.82 రెట్లు, సంస్థాగతేతర మదుపర్ల విభాగంలో 521.71 రెట్లు, చిన్న మదుపర్ల నుంచి 11.42 రెట్లు చొప్పున స్పందన లభించింది.
*ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ నుంచి రూ.360.58 కోట్ల విలువైన ఆర్డరు లభించిందని దిలీప్‌ బిల్డ్‌కాన్‌ తెలిపింది.
*మూడో త్రైమాసికంలో పెట్రో రసాయనాల విస్తరణ ప్రాజెక్టులు ప్రారంభించాం. పెట్రో రసాయనాల వ్యాపారంలో భారీ పెట్టుబడులు ఇపుడు ప్రయోజనాలు చూపిస్తున్నాయి. మా రిఫైనింగ్‌ వ్యాపారం వరుసగా 12వ త్రైమాసికంలోనూ రెండంకెల మార్జిన్‌ నమోదు చేసింది. తద్వారా పరిశ్రమ మూలాల్లో, నిర్వహణలో బలం ఉందని చాటింది. జియో తొలిసారిగా లాభాలు ఆర్జించింది.. అందుకే అత్యధిక త్రైమాసిక లాభాన్ని పొందగలిగాం.
*విమానాల్లో ప్రయాణిస్తూ కూడా మొబైల్‌ ద్వారా కాల్స్‌ చేసుకునేందుకు, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ ద్వారా సన్నిహితులతో చాటింగ్‌ కొనసాగించే అవకాశం త్వరలో అందుబాటులోకి రానుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com