నేటి బిజినెస్ వార్తలు-౦౧/౧౯

* భారతీ ఎయిర్‌టెల్‌ డీలా పడింది. డిసెంబరు 31, 2017తో ముగిసిన మూడు నెలల కాలంలో భారతీ ఎయిర్‌టెల్‌ ఏకీకృత నికర లాభం 39 శాతం క్షీణించి రూ.306 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో లాభం రూ.504 కోట్లుగా నమోదైంది. ఇక ఆదాయం సైతం 13% తగ్గి రూ.23,336 కోట్ల నుంచి రూ.20,319 కోట్లకు పరిమితమైంది.
*బ్యాంకింగ్‌ షేర్లు విజృంభించడంతో సూచీల్లో లాభాల ర్యాలీ కొనసాగింది. వరుసగా రెండో రోజూ జీవన కాల గరిష్ఠాలను తాకాయి. ప్రైవేట్‌ బ్యాంకుల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పరిమితిని 100 శాతానికి, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 49 శాతానికి పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు వార్తలు వెలువడటమే ఇందుకు నేపథ్యం.
*ఇకపై తాము వెళ్లబోయే హోటల్‌ ఏ స్టార్‌ వర్గీకరణ కలిగినదో తెలుసుకునే వీలు పర్యాటకులకు కలగనుంది. ఇప్పటివరకు 3 స్టార్‌, 5 స్టార్‌ అని చెప్పుకోవడమే కానీ రాతపూర్వకంగా ఎక్కడా ఈ వివరాలను హోటళ్లు ప్రదర్శించడం లేదు. ఇకపై తమ హోటల్‌ ఏ స్టార్‌ విభాగానికి చెందినదనే అంశాన్ని తప్పనిసరిగా, సంస్థ వెబ్‌సైట్‌తో పాటు రిసెప్షన్‌లలో కూడా ప్రదర్శించాలని పర్యాటక శాఖ ఆదేశించింది. ఇందుకు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇందువల్ల ఈ రంగంలో పారదర్శకత ఏర్పడుతుందని పేర్కొంది.
*భారత్‌లో క్యాష్‌ అండ్‌ క్యారీ వ్యాపారంలోకి అడుగుపెట్టినట్లు థాయ్‌లాండ్‌ కేంద్రంగా పనిచేసే రిటైలింగ్‌ సంస్థ సియామ్‌ మాక్రో పీసీఎల్‌ ప్రకటించింది.
*పరిశోధనల్లో ఆసక్తి ఉండి, సంస్థల్లో పనిచేస్తున్న సీనియర్‌ కార్యనిర్వహణాధికారులకు ప్రత్యేక కోర్సును ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) అందించనుంది.
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సైయెంట్‌ రెండో మధ్యంతర డివిడెండు ప్రకటించింది. రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.4 (80 శాతం) మధ్యంతర డివిడెండు చెల్లించాలని బోర్డు నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది.
*మొబైల్‌ సేవల నుంచి మరిన్ని సేవలకు విస్తరిస్తున్నందున, రిలయన్స్‌ జియోపై రాబోయే 3-4 ఏళ్లలో మరో 23 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.లక్షన్నర కోట్ల)ను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) పెట్టుబడి పెడుతుందని మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ అంచనా వేస్తోంది.
*ప్రస్తుతం డిజిటల్‌ ప్రకటనలపై దాదాపు రూ.13,000 కోట్లు వ్యయం చేస్తుండగా, 2020 నాటికి ఇది రూ.18,000 కోట్ల చేరగలదని హైదరాబాద్‌కు చెందిన డిజిటల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కంపెనీ సిల్లీ మాంక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎండీ సంజయ్‌ రెడ్డి తెలిపారు.
*ఆదిత్య బిర్లా గ్రూప్‌ సంస్థ అల్ట్రాటెక్‌ సిమెంట్‌ డిసెంబరు త్రైమాసికంలో రూ.456.66 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది.
*అక్టోబరు-డిసెంబరు నెలల్లో యెస్‌ బ్యాంక్‌ లాభం 22% పెరిగి రూ.1076.87 కోట్లకు చేరింది. 2016-17 ఇదే కాలంలో బ్యాంక్‌ లాభం రూ.882.63 కోట్లుగా ఉంది.
*జీవ శాస్త్ర, ఔషధ రంగంలో వస్తున్న మార్పులపై సమగ్రంగా చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్న బయోఆసియా 2018 సదస్సు హైదరాబాద్‌లో ఫిబ్రవరి 22 నుంచి 24 వరకూ జరగనుంది.
*సెలూన్‌ సేవలు, సౌందర్య ఉత్పత్తులను అందించే వైఎల్‌జీ సెలూన్‌ హైదరాబాద్‌లో మార్చిలోపు కొత్తగా మూడు కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. సగటున 1680 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటవుతున్న ఈ ఒక్కో కేంద్రానికి రూ.60 లక్షల వరకూ ఖర్చు చేయనున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ రాహుల్‌ బాలచంద్రన్‌ తెలిపారు.
*రూ.398 అంతకుమించిన రీఛార్జులపై రూ.3,300 వరకు నగదు వెనక్కి పొందే అవకాశం కల్పిస్తున్నట్లు ఐడియా సెల్యులార్‌ ప్రకటించింది.
*ఉషోదయ ఎంటర్‌ప్రైజస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన ‘ప్రియా ఫుడ్స్‌’ ను ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎక్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఐఈవో – ఫియో) వారి సదరన్‌ రీజియన్‌ ఎక్స్‌పోర్ట్‌ ఎక్స్‌లెన్సీ అవార్డు వరించింది.
*జర్మనీకి చెందిన విలాసవంత కార్ల తయారీదారు ఆడి భారత మార్కెట్లోకి 2020 కల్లా విద్యుత్‌ వాహనాల(ఈవీ)ను ప్రవేశపెట్టనుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com