నేటి బిజినెస్ వార్తలు-౧౨/౧౪

*దేశంలో డిజిటల్‌ లావాదేవీలు, ఫైనాన్షియల్‌ సేవలను ప్రోత్సహించడానికి ప్రోత్సాహకాలు ముఖ్యమని.. గత బడ్జెట్‌లో కొన్ని ప్రోత్సాహకాలను ప్రకటించిన ప్రభుత్వం.. ఈ సారి బడ్జెట్‌లో కూడా మరి కొన్ని ప్రోత్సాహకాలను ప్రకటించే అవకాశం ఉందని రిజర్వు బ్యాంకు మాజీ డిప్యూటీ గవర్నర్‌ హెచ్‌.ఆర్‌.ఖాన్‌ తెలిపారు. అంతక్రితంతో పోలిస్తే హెచ్చుతగ్గులకు లోనైనప్పటికీ పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్‌ లావాదేవీలు పుంజుకున్నాయన్నారు.
*రిలయన్స్‌ జియోను స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదు చేయనున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని మాతృసంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) ప్రకటించింది. 2018 ఆఖరులో లేదా 2019 ప్రారంభంలో జియో పబ్లిక్‌ ఇష్యూకు వెళ్లడానికి ఆర్‌ఐఎల్‌ సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. వాటా విక్రయం కంటే ముందుగా రిలయన్స్‌ జియో పనితీరు మెరుగుదల కోసం వేచిచూడనున్నట్లు ఆర్‌ఐఎల్‌ వివరించింది. ‘జియో ఐపీఓ వార్తలు పూర్తిగా నిరాధారమైనవని, మీడియా ఊహాగానాలపై స్పందించకూడదన్నది మా విధానమని’ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధికార ప్రతినిధి వెల్లడించారు.
*నేడు సూచీలు బలహీనంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అమెరికా ఫెడ్‌ రిజర్వు సమావేశ నిర్ణయాలు ప్రభావం చూపొచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భవిష్యత్‌ రేట్ల పెంపు, బ్యాలెన్స్‌ షీట్‌ కుదింపు, ద్రవ్యోల్బణ అంచనాల వంటి వాటిపై ఫెడ్‌ వ్యాఖ్యల కీలకం కానున్నాయి.
*హైదరాబాద్‌లోని అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు (హెచ్‌ఎన్‌ఐ) అధిక ప్రతిఫలాలను ఆశిస్తున్నారని.. అందుకు తగ్గట్లుగా రిస్క్‌ తీసుకోవడానికి కూడా ఇష్టపడుతున్నారని కార్వీ ప్రైవేట్‌ వెల్త్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) అభిజిత్‌ భావే తెలిపారు. గతంలో హైదరాబాద్‌లోని హెచ్‌ఎన్‌ఐలు స్థిరాస్తుల్లో మదుపు చేసే వారని, గత కొద్ది సంవత్సరాలుగా మ్యూచువల్‌ ఫండ్‌లు, పోర్టుఫోలియో మేనేజిమెంట్‌ సర్వీసెస్‌ (పీఎంఎస్‌) ద్వారా ఈక్విటీ వంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టేందుకు బాగా ఇష్టపడుతున్నారని చెప్పారు.
*దేశీయ కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ తమ మోడళ్లపై 2 శాతం వరకు ధరలు పెంచనున్నట్లు ప్రకటించింది. కొత్త ధరలు జనవరి నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. తయారీ ఖర్చులు పెరగడమే ఇందుకు కారణమని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం చిన్నకారు ఆల్టో 800 నుంచి క్రాస్‌ఓవర్‌ ఎస్‌-క్రాస్‌ శ్రేణిలో కార్లను కంపెనీ విక్రయిస్తోంది. వీటి ధరలు రూ.2.45- 11.29 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌ దిల్లీ) మధ్య ఉన్నాయి. గత కొన్ని నెలలుగా పెరుగుతూ వచ్చిన కమొడిటీ ధరల కారణంగానే ధరలు పెంచాలని నిర్ణయించినట్లు కంపెనీ అధికార ప్రతినిధి వెల్లడించారు. ‘ఇప్పటివరకు చిన్న హెచ్చుతగ్గులను చవిచూశాం. అయితే క్రమంగా కమొడిటీ ధరలు పెరుగుతుండటంతో జనవరి నుంచి ధరలు పెంచనున్నాం’ అని అన్నారు.
*నిరర్థక ఆస్తులుగా మారిన మరో 22-23 పెద్ద బకాయిలపై దివాలా స్మృతి కింద చర్యలు చేపట్టేందుకు జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)కు బ్యాంకర్లు సిఫారసు చేయనున్నారు. తొలిదశలో 12 ఖాతాలను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) సూచన మేరకు ఎన్‌సీఎల్‌టీకి సిఫారసు చేసిన సంగతి విదితమే.
*ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ ‘ఎల్‌జీ వీ30 ప్లస్‌’ను భారత విపణిలోకి ఎల్‌జీ విడుదల చేసింది. దీని ధర రూ.44,990. 6- అంగుళాల పూర్తి తెర, 4జీబీ ర్యామ్‌, 128 జీబీ అంతర్గత నిల్వ సామర్థ్యం, 16 మెగాపిక్సెల్‌ వెనుక కెమేరా, 5 మెగాపికెల్స్‌ ముందు కెమేరా, 3300 ఎంఏహెచ్‌ బ్యాటరీ దీని ప్రత్యేకతలు. ‘కెమేరా నాణ్యతతో పాటు అద్భుతమైన ఫీచర్లు కలిగిన వీ30 ప్లస్‌పై బుల్లిష్‌గా ఉన్నాం. వీ20 మోడల్‌తో పోలిస్తే రెండింతలు ఎక్కువగా వీ30 ప్లస్‌ మొబైళ్లు విక్రయించగలమని అంచనా వేస్తున్నాం’ అని ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా హెడ్‌ (కార్పొరేట్‌ మార్కెటింగ్‌) అమిత్‌ గుజ్రాల్‌ తెలిపారు.
*సమాచార సాంకేతిక (ఐటీ) రంగంలో నాలుగయిదేళ్లకోసారి సరికొత్త టెక్నాలజీలు ఆవిర్భవిస్తూ, అందుకనుగుణంగా ఉద్యోగాలు లభిస్తుంటాయి. అన్ని రంగాల్లో డిజిటలీకరణకు తోడు పెట్రోల్‌-డీజిల్‌ వాహనాల స్థానంలో విద్యుత్తుతో నడిచేవి దూసుకు రానుండటం, విద్యాబోధన, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో సమూల మార్పులు సంభవిస్తున్నాయి. అందువల్లే 2022 నాటికి దేశంలో 60 కోట్లకు పైగా ఉద్యోగాలు లభిస్తాయని, ప్రస్తుతం లేని సరికొత్త ఉపాధి అవకాశాలు అప్పుడు ఉంటాయని, వాటిలోనే 9 శాతం (6 కోట్ల) మందికి పైగా పనిచేస్తారని ఫిక్కీ-నాస్‌కామ్‌-ఈవై రూపొందించిన నివేదిక పేర్కొంది.
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధిరేటు 6.7 శాతానికి పరిమితం అవుతుందని ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) తాజాగా అంచనా వేసింది. గతంలో 7 శాతం వృద్ధి లభిస్తుందని అంచనా వేయగా, పెద్దనోట్ల రద్దు, వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)కు పన్ను వ్యవస్థ మారడంలో ఏర్పడిన సవాళ్లు, వ్యవసాయానికి వాతావరణ ఇబ్బందుల వల్ల ప్రథమార్థంలో ఏర్పడిన మందగమన ప్రభావం, పూర్తి ఏడాదిపై పడుతోందని వివరించింది.
*కారు కొనాలంటే సాధారణంగా మనం ఏం చేస్తాం. ముందుగా ఓ విక్రయ కేంద్రానికి వెళ్తాం. వివిధ కారు మోడళ్లను పరిశీలించి వివరాలు ఆరా తీస్తాం. ధరలు, ప్రత్యేకతలు తెలుసుకుంటాం. ఆ తర్వాత మనం ఎంత వరకు డబ్బులు పెట్టగలమో దృష్టిలో పెట్టుకొని కారు మోడల్‌ను ఎంపిక చేసుకుంటాం. కారు రంగును కూడా ఎంచుకుంటాం. అయితే కారు కొనే ముందు పై వివరాలన్నింటినీ విక్రయ కేంద్రాల్లో కాకుండా ఆన్‌లైన్‌ ద్వారానే ఎక్కువ మంది తెలుసుకుంటున్నారని ఓ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది దాదాపు 90 శాతం కార్ల కొనుగోళ్లు ఈ ధోరణిలోనే జరిగాయని పేర్కొంది. కిందటేడాది ఇది 75 శాతంగా నమోదైందని పేర్కొంది.
*కారు కొనాలంటే సాధారణంగా మనం ఏం చేస్తాం. ముందుగా ఓ విక్రయ కేంద్రానికి వెళ్తాం. వివిధ కారు మోడళ్లను పరిశీలించి వివరాలు ఆరా తీస్తాం. ధరలు, ప్రత్యేకతలు తెలుసుకుంటాం. ఆ తర్వాత మనం ఎంత వరకు డబ్బులు పెట్టగలమో దృష్టిలో పెట్టుకొని కారు మోడల్‌ను ఎంపిక చేసుకుంటాం. కారు రంగును కూడా ఎంచుకుంటాం. అయితే కారు కొనే ముందు పై వివరాలన్నింటినీ విక్రయ కేంద్రాల్లో కాకుండా ఆన్‌లైన్‌ ద్వారానే ఎక్కువ మంది తెలుసుకుంటున్నారని ఓ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది దాదాపు 90 శాతం కార్ల కొనుగోళ్లు ఈ ధోరణిలోనే జరిగాయని పేర్కొంది. కిందటేడాది ఇది 75 శాతంగా నమోదైందని పేర్కొంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com