నేటి రాజకీయం-౦౨/౦౩

*హామీలను నెరవేర్చే బడ్జెట్‌
రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్‌ను రూపొందించలేదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ స్పష్టం చేశారు. ఎన్నికల సంవత్సరం కావడంతోనే మధ్య తరగతి, కార్పొరేట్‌ ప్రయోజనాలను ఫణంగా పెట్టి వ్యవసాయంపై అవసరానికి మించి దృష్టి కేంద్రీకరించారన్న విమర్శలను కొట్టిపారేశారు.
*పథకాలు ఘనం.. ఇచ్చింది అరకొర
ఆఖరి బడ్జెట్‌లోనూ రాష్ట్రానికి న్యాయం జరగకపోతే ఎలా? అసలు వాళ్లేమనుకుంటున్నారు. మిత్రపక్షంగా మనమెంతో సామరస్యంగా, నమ్మకంగా ఉంటున్నాం. ప్రధానిని, కేంద్ర మంత్రుల్ని కలసి న్యాయం చేయమని అడుగుతున్నాం. చట్ట ప్రకారం కేంద్రం ఇచ్చిన హామీల మేరకు మనకు రావలసిందే అడుగుతున్నాం తప్ప గొంతెమ్మ కోర్కెలేమీ కోరడం లేదు. అయినా ఎందుకిలా చేస్తున్నారు?
*విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ప్రకటించాలి
విశాఖపట్నం కేంద్రంగా రైల్వేజోన్‌ తక్షణమే ప్రకటించాలని ఉత్తరాంధ్ర చర్చా వేదిక డిమాండు చేసింది. శుక్రవారమిక్కడ మాజీ మంత్రి కొణతాల, మాజీ ఎంపీ జ్ఞానేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర రైల్వే మంత్రి పీయూష్‌గోయెల్‌కు రక్తంతో సంతకాలు చేసిన వినతి పత్రాన్ని అందజేశారు.
*బడ్జెట్‌పై పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి
కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తగిన కేటాయింపులు లేకపోవడంపై పార్టీ శ్రేణులు, ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి కళావెంకట్రావు వ్యాఖ్యానించారు.
*చంద్రబాబు బలహీనతలే రాష్ట్రానికి శాపం
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బలహీనతలే ఏపీ పాలిట శాపంగా మారాయని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి నిరసనగా తెదేపా, వైకాపా ఎంపీలందరూ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండు చేశారు.
*బీసీ ఎంపీలు మాట్లాడరా
పార్లమెంటులో 94 మంది బీసీ ఎంపీలున్నా బీసీల సమస్యలపై మాట్లాడకపోవడం దారుణమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య ఆవేదన వ్యక్తంచేశారు.
*మా అత్తగారిలా ఎవరూ ఇబ్బందులు పడకూడదనే
నవ్యాంధ్రలో క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేయటం శుభపరిణామని సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరులో ఒమేగా ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘మా అత్తగారు (ఎన్టీఆర్ సతీమణి) క్యాన్సర్ వ్యాధితో చాలా ఇబ్బందులు పడ్డారు. అలా ఎవరు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో అప్పట్లో ఎన్టీఆర్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు’’ అని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో అమరావతి ప్రపంచంలో అద్భుతమైన మెడికల్ హబ్‌గా మారబోతోందని, ఇప్పటకే 14 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చామని సీఎం తెలిపారు. 18 రోజుల్లోనే ఒమేగా క్యాన్సర్ హాస్పటల్‌కి ఏపీఐసీసీ అనుమతి ఇచ్చిందని చంద్రబాబు చెప్పారు.
*టీడీపీ ఎన్‌ఆర్‌ఐల సమావేశంలో మంత్రి లోకేష్
అమెరికా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ అట్లాంటాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్‌ఆర్‌ఐలు ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. గత పాలకులు ఎన్ఆర్ఐలు రాష్ట్రానికి ఏం ఇస్తారని అడిగేవారని… ఎన్‌ఆర్ఐలకు మేలు చేయాలని సీఎం ఆలోచిస్తున్నారని సమావేశంలో లోకేష్ అన్నారు. ఎన్ఆర్ఐలకు నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ఇందుకు ఎన్ఆర్ఐలు అందరూ సహకరించాలని మంత్రి నారా లోకేష్ కోరారు.
*చంద్రబాబును కలిసిన వైసీపీ ఎమ్మెల్యే
సీఎం చంద్రబాబును వైసీపీ ఎమ్మెల్యే ముస్తాఫా కలిశారు. గుంటూరులోని ఒమేగా ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చిన చంద్రబాబును ముస్తఫా హెలిఫ్యాడ్ వద్ద కలుసుకున్నారు. కొద్దిసేపు చంద్రబాబుతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ముస్తఫాను చంద్రబాబు వద్దకు ఎంపీ రాయపాటి సాంబశివరావు తీసుకువచ్చారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మద్దలి గిరిధరరావుపై ముస్తఫా విజయం సాధించారు. అయితే ముస్తాఫా టీడీపీలో చేరుతారనే ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతోంది. వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు ప్రస్తుతానికి తగ్గాయి. శనివారం సీఎంతో ముస్తఫా భేటీ కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
*డిప్యూటీ సీఎం మహమూద్ అలీకి ఎంపీ కవిత పరామర్శ
అనారోగ్యంతో జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డిప్యూటీ సీఎం మహమూద్ అలీని టీఆర్‌ఎస్ ఎంపీ కవిత పరామర్శించారు. ఆయన ఆరోగ్య వివరాలను వైద్యులను అడిగి కవిత తెలుసుకున్నారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని వైద్యులు తెలిపారు. గ్యాస్ట్రో సమస్యతో మహమూద్ అలీ అపోలో ఆస్పత్రిలో గురువారం చేరిన విషయం తెలిసిందే.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com