నేటి రాజకీయం-౦౨/౦౬

*తెదేపా డిమాండ్లలో నిజం ఉంది
విభజన హామీలు అమలుచేయాలన్న తెలుగుదేశం పార్టీ డిమాండ్‌లో నిజం ఉందని అకాళీదళ్‌ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు నరేష్‌గుజ్రాల్‌ పేర్కొన్నారు. ఆయన ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమేరకు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని సభాముఖంగా చెప్పి, తర్వాత కాదన్నారన్నారు.
*తెలంగాణ యూనివర్శిటీలు పటిష్టం
రాష్ట్రప్రభుత్వం తెలంగాణలోని యూనివర్సిటీలను పటిష్టం చేస్తోందని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో 1551 అధ్యాపక పోస్టులను భర్తీ చేసేందుకు సిఎం కేసిఆర్ ఆమోదం తెలిపారన్నారు.
* శ్రీకాకుళంలో ధర్నా చేస్తా
‘మరుగుదొడ్ల నిర్మాణంలో అత్యంత వెనుకబడి ఉన్న శ్రీకాకుళం జిల్లాలో త్వరలో ఒక రోజు ధర్నా చేస్తా.. మీరు మరుగుదొడ్లు నిర్మించుకోకపోవడం వల్ల మీకే చెడ్డపేరు వస్తోంది. దాన్ని తొలగించాలనేదే నా తాపత్రయం. అందుకే అధికారులు, ప్రజలపై ధర్నా చేసి నిరసన తెలుపుతా’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
* మహిళా మంత్రుల్లేని ప్రభుత్వంగా తెరాస రికార్డు
మహిళా మంత్రుల్లేని ప్రభుత్వంగా తెరాస రికార్డు సృష్టించిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. వనపర్తి జిల్లా నాగవరంలో ఎమ్మెల్యే చిన్నారెడ్డి అధ్యక్షతన సోమవారం ‘మూడున్నర సంవత్సరాల తెరాస ప్రభుత్వ పాలనలో దగాపడిన స్వయం సహాయక సంఘాల మహిళలు’ అనే అంశంపై నిర్వహించిన ‘మహిళా గర్జన’ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడారు.
* పన్నులు కట్టొద్దని రెచ్చగొడతారా?
వస్తు-సేవల పన్ను (జీఎస్టీ)ని గబ్బర్‌ సింగ్‌ టాక్స్‌ అని అభివర్ణిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ..పన్నులు చెల్లించవద్దంటూ ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తోందా అని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ప్రశ్నించారు.
* ధనిక రాష్ట్రమంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు
తెలంగాణ ధనిక రాష్ట్రమంటూ తెరాస ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని, నిజంగా ధనిక రాష్ట్రమైతే ఆసరా పింఛన్లు, ఫీజు బకాయిలు ఎందుకు నిలిపివేశారని తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి ఆరోపించారు.
* భయాందోళన కలిగిస్తున్న భాజపా సర్కారు
భాజపా ప్రభుత్వం ప్రజల్లో మానసిక భయాందోళన కలిగిస్తోందని రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్‌ విమర్శించారు. సోమవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన ప్రసంగించారు.
*ఏపీ ప్రజల కోసం పిచ్చివాడినయ్యా
ఆంధ్రప్రదేశ్‌కు న్యాయంచేయాలంటూ ఈనెల 1వ తేదీన రాజ్యసభ వెల్‌లో ప్లకార్డు పట్టుకొని నిరసన వ్యక్తంచేస్తున్న తనకు పిచ్చిపట్టిందా? అంటూ రాజ్యసభ ఉపాధ్యక్షుడు పీజేకురియన్‌ వ్యాఖ్యానించడంపై కేవీపీ రామచంద్రరావు విచారం వ్యక్తంచేశారు. అందుకు కారణాలను వివరిస్తూ ఆయన ఆదివారం కురియన్‌కు లేఖ రాశారు.
*లోక్‌సభ స్పీకర్‌కు తెదేపా ఎంపీల నోటీసు
బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పార్లమెంటు వేదికగా పోరాడేందుకు తెలుగుదేశం పార్టీ ఎంపీలు సిద్ధమయ్యారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఆ దిశగా కార్యాచరణ చేపట్టారు. విభజన హామీలు నెరవేర్చేలా చర్యలు చేపట్టాలని లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌కు ఎంపీలు తోట నరసింహం, కేశినేని నాని, నిమ్మల కిష్టప్ప నోటీసు ఇచ్చారు. విభజన హామీల అమలుపై 193వ నిబంధన కింద చర్చ చేపట్టాలని నోటీసులో పేర్కొన్నారు.
* శాంతికి భంగం కలిగించే కుట్ర- ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ, కేంద్ర మంత్రి
శాంతి సామరస్యం, సహనం అనేవి ఇండియా మూలాల్లోనే ఉన్నాయి. అటువంటి వాటిని దెబ్బ తీసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. వారి దుష్ట ఆలోచనలను అడ్డుకుని ఓడించాలి. దేశ ఐక్యతకు భంగం కలిగించే ఎటువంటి చర్యలైనా ఎట్టి పరిస్థితుల్లోనూ సహించం.
* బీజేపీ అజేయం కాదని తేల్చేశాం- సచిన్‌ పైలట్‌, రాజస్థాన్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు
బీజేపీ అంటే ఏ ఎన్నికల్లోనైనా గెలిచే యంత్రమనే అపోహలకు రాజస్థాన్‌ ఉప ఎన్నికల ఫలితాలు అడ్డుకట్ట వేశాయి. ఈ ఫలితాలు దేశవ్యాప్తంగా మిగిలిన రాష్ట్రాల్లోనూ పునరావృతమవుతాయి.
* బడ్జెట్‌ సమావేశాల్లోనే పంచాయతీ బిల్లు
తెలంగాణలో మార్చి నెలలో జరిగే శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో పంచాయతీరాజ్‌ చట్టంపై బిల్లు పెట్టాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. దీనికి అవసరమైన సన్నాహాలు చేయాలని అధికారులను ఆదేశించారు.
* పార్లమెంటులో పోరాటం
కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పార్లమెంటు వేదికగా పోరాడాలని, రాష్ట్ర ప్రజల్లోని తీవ్ర అసంతృప్తి, ఆగ్రహాలను కేంద్రానికి అర్ధమయ్యేలా చెప్పాలని తెలుగుదేశం నిర్ణయించింది.
* కువైట్‌లో బాధితులకు సాయం
కువైట్‌లో ఇబ్బందుల్లో ఉన్న తెలంగాణ కార్మికులను ఆ దేశ ప్రభుత్వం ప్రకటించిన క్షమాభిక్ష పథకం కింద స్వరాష్ట్రానికి రప్పించేందుకు అవసరమయిన అన్ని చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర ప్రవాసుల వ్యవహారాల శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు.
* యూరోపియన్‌ కమిషన్‌ ఏఎన్‌ఎంల వేతనాల పెంపు
తెలంగాణలో యూరోపియన్‌ కమిషన్‌ కింద 2003 నుంచి పనిచేస్తున్న 710 మంది ఏఎన్‌ఎంల వేతనాల పెంపుదలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు.
* ఆప్‌ ఎమ్మెల్యేల వ్యాజ్యాన్ని కొట్టివేయాలని కోరిన ఈసీ
తమపై అనర్హత వేటు వేయడాన్ని సవాలు చేస్తూ ఆప్‌ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని ఎన్నికల కమిషన్‌ (ఈసీ) దిల్లీ హైకోర్టును కోరింది.
* మాల్దీవుల్లో ముదిరిన సంక్షోభం
మాల్దీవుల్లో ఏర్పడ్డ రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. రాజకీయ ఖైదీల విడుదలకు, అనర్హతవేటు పడ్డ ఎంపీల సభ్యత్వాలను పునరుద్ధరించాలంటూ తానిచ్చిన ఆదేశాలకు కట్టుబడాల్సిందేనని దేశాధ్యక్షుడు అబ్దుల్లా యమీన్‌కు సుప్రీం కోర్టు మరోసారి స్పష్టంచేసింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com