నేటి రాజకీయం-౦౨/౦౭

*జైలు నుంచే లాలు .. పార్టీలో నియామకాలు
బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దళ్‌ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ జైల్లో నుంచే పార్టీ కార్యనిర్వహక కమిటీని పునరుద్ధరించారు. దాణా కుంభకోణం కేసులో ప్రస్తుతం లాలూ ప్రసాద్‌ జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. లాలూ కారాగారం నుంచే తన భార్య, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి అయిన రబ్రీ దేవిని ఆర్జేడీ ఉపాధ్యక్ష పదవిలో నియమించారు. పార్టీ కార్యనిర్వాహక కమిటీని పునరుద్ధరించారు.
*రాష్ట్రంలో నాలుగు స్తంభాలాట
రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబం నాలుగు స్తంభాలాట ఆడుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ఆరోపించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మంగళవారం పార్టీ ఆధ్వర్యంలో తొలి దళిత అదాలత్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమగ్ర కుటుంబ సర్వే పేరుతో దేశ, విదేశాల్లో ఉన్న వారందరినీ రప్పించి సర్వే చేసిన ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందని ప్రశ్నించారు.
*రాఫెల్‌ ఒప్పందంలో కుంభకోణం
రాఫెల్‌ యుద్ధ విమానాల ధరలను బహిర్గతం చేసేందుకు కేంద్రప్రభుత్వం నిరాకరించడంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శలు గుప్పించారు. వాటి కొనుగోలు ఒప్పందంలో కుంభకోణం చోటుచేసుకుందని ఆరోపించారు.
*ఏపీ భవన్‌ విభజనకు కమిటీ వేయలేదు
దేశ రాజధానిలోని ఏపీభవన్‌ విభజనకు సంబంధించి ఎలాంటి కమిటీని నియమించలేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్‌ గంగారం అహిర్‌ తెలిపారు. మంగళవారం లోక్‌సభలో వైకాపా ఎంపీ అవినాశ్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.
*తెలంగాణ శాసనసభ, మండలిలకు విరామం
తెలంగాణ శాసనసభ, శాసనమండలిలకు ప్రొరోగ్‌(విరామం) ప్రకటిస్తూ రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సభ, మండలి ఎనిమిదో విడత సమావేశాలు గత అక్టోబర్‌ 27 నుంచి నవంబరు 17 వరకు జరిగాయి.
*ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టండి
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఎన్‌.అమర్‌నాథ్‌రెడ్డి జర్మనీ పారిశ్రామికవేత్తలను కోరారు. మంగళవారం బెర్లిన్‌లో హర్బర్‌, అప్లస్‌ ఆటో సంస్థల సీఈవోలు, ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం మధ్యతరహా పరిశ్రమల ప్రతినిధులతో భేటీ అయ్యారు.
*రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషి
ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. మేమిద్దరం కలిసే వెళ్తున్నామని, చిన్నచిన్న అపోహలు, అపార్థాలు వచ్చినప్పటికీ వాటన్నింటినీ సర్దుబాటు చేసుకుంటున్నామని భాజపా, తెదేపాలను ఉద్దేశించి మంత్రి వ్యాఖ్యానించారు.
*రాష్ట్ర ఆర్థిక కమిషన్‌ ఛైర్మన్‌గా నాంచారయ్య
రాష్ట్ర ఆర్థిక కమిషన్‌ను పునర్నియమిస్తూ గవర్నర్‌ నరసింహన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించే సాయం, వీటి బలోపేతానికి తీసుకోవలసిన చర్యలపై.. ఉమ్మడి రాష్ట్రంలో ఎంఎల్‌ కాంతారావు ఛైర్మన్‌గా ఉన్న రాష్ట్ర ఆర్థిక కమిషన్‌ను ప్రభుత్వం గత ఏడాది రద్దు చేసి పునర్నియామకం కోసం గవర్నర్‌కు పంపిన ప్రతిపాదనలను ఆయన ఆమోదించారు.
*కత్తి పద్మారావుకు పితృ వియోగం
నవ్యాంధ్ర పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్‌ కత్తి పద్మారావు తండ్రి కత్తి సుబ్బారావు (95) మంగళవారం సాయంత్రం పొన్నూరు పట్టణం అంబేడ్కర్‌నగర్‌లోని ఆయన స్వగృహంలో మృతి చెందారు. అంత్యక్రియలు బుధవారం స్వగ్రామంలో నిర్వహిస్తున్నట్లు కత్తి పద్మారావు పేర్కొన్నారు.
*అమెరికా వలస చట్టాలను మార్చాలి
అమెరికా వలస చట్టాల వ్యవస్థ పనితీరు మరింత వేగంగా, అందరికీ సమానంగా అవకాశమిచ్చేలా ఉండాలి. గ్రీన్‌ కార్డుల మంజూరుపై ఉన్న పరిమితిని తొలగించాలి. అమెరికాలోని భారత సంతతికి చెందిన వారు ఎన్నో ఇక్కట్లకు గురవుతున్నారు. ప్రతివాళ్లూ తమ కన్నీటి గాథలను అందరికీ చెప్పాలి.
*గాంధీ కలను మోదీ నెరవేర్చారు-బీజేపీ ఎంపీ రాకేశ్‌సింగ్‌
మహాత్మాగాంధీ స్వచ్ఛభారత్‌ కోసం కలగన్నారు. ఆ కలను మోదీ సర్కారు నెరవేర్చింది. ఆరు దశాబ్దాలు అధికారంలో ఉన్నా కాంగ్రెస్‌ ఆ పని చేయలేకపోయింది. మూడున్నరేళ్లలోనే 5.5 కోట్ల మరుగుదొడ్లను ప్రభుత్వం నిర్మించింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com