నేటి రాజకీయం-౦౨/౦౮

*రాజకీయ ఆశల్లేవు-యోగా గురు బాబా రాందేవ్‌
రాజకీయాల్లోకి రాను గాక రాను. గతంలో ఓ సారి ఇదే చెప్పా. నా దేశం సురక్షితంగా ఉండాలనేదే నా ఆకాంక్ష. అంతే తప్ప రాజకీయంగా ఎలాంటి ఆశల్లేవు. దేశానికే నా జీవితం అంకితం. రాజకీయాల్లోకి వచ్చేది లేదని భీష్మ ప్రతిజ్ఞ చేస్తున్నా.
*ముస్లింలు ఇక్కడెందుకుంటున్నారు-బీజేపీ ఎంపీ వినయ్‌ కటియార్‌
ముస్లింలు భారత్‌లో నివసించకూడదు. వారి జనాభా ఆధారంగా దేశాన్ని విభజించారు. అలాంటప్పుడు వారిక్కడెందుకు ఉంటున్నారు? వారికి ప్రత్యేక దేశం ఏర్పాటు చేశారు కదా? ముస్లింలు పాకిస్థాన్‌ లేదా బంగ్లాదేశ్‌ వెళ్లిపోవాలి.
* ప్రధాని పర్యటన సందర్భంగా బంగ్లాదేశ్‌ సరిహద్దు మూసివేత
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం త్రిపురలో పర్యటించనున్న సందర్భంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. సిపాహిజాలా, ఉనకోటి జిల్లాల్లో బంగ్లాదేశ్‌ సరిహద్దులను మూసివేశారు. ప్రధాని అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో జరిగే రెండు బహిరంగ సభల్లో పాల్గొననున్న దృష్ట్యా ఈ చర్య తీసుకున్నారు. బీఎస్‌ఎఫ్‌, కేంద్ర, రాష్ట్ర పోలీసుల దళాలను భారీగా మోహరించారు.
* ‘ఏపీ ప్రభుత్వంపై సీబీఐ విచారణ జరిపించాలి’
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై సీబీఐతో విచారణ జరిపించాలని వైకాపా ఎంపీ వరప్రసాద్‌ లోక్‌సభలో డిమాండ్‌ చేశారు. బుధవారం బడ్జెట్‌పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. పట్టిసీమ పనుల్లో రూ.280 కోట్ల అవినీతి జరిగిందని కాగ్‌ పేర్కొన్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు రాష్ట్రంలో మంత్రి పదవులు కట్టబెడుతున్నారని విమర్శించారు. కేంద్రం నిధులు ఇవ్వడం లేదని ఆరోపిస్తూనే.. పుష్కరాలకు ఇటీవల రూ.2 వేల కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు.
* రాజ్యసభలో తెదేపా ఆందోళన పట్టు
రాజ్యసభలో తెదేపా సభ్యుల సస్పెన్షన్‌ మార్షల్‌ ప్రయోగం వరకూ వచ్చింది. సభాధ్యక్షస్థానంలో ఉన్న ఉపసభాపతి పీజే కురియన్‌ బుధవారం సీఎం రమేష్‌ను 255 నిబంధన కింద సస్పెండ్‌ చేశారు. సభ నుంచి బయటికెళ్లాలని ఆదేశించారు. అయితే ఆయన వెళ్లకపోవడంతో మార్షల్స్‌ ద్వారా పంపించే ప్రయత్నం జరిగింది. చివరకు అవాంఛనీయ పరిస్థితులు తలెత్తుతాయన్న ఉద్దేశంతో ఉపసభాపతి సభను రేపటికి వాయిదా వేశారు.
* రేణుకను నవ్వనివ్వండి.. చర్యలు తీసుకోవద్దు
హోంమంత్రిగా అద్వానీ ఉన్నప్పుడే ఆధార్‌కు బీజం పడిందని బుధవారం రాజ్యసభలో ప్రధాని మోదీ వ్యాఖ్యానించినప్పుడు.. ఎద్దేవా చేస్తున్నట్లుగా కాంగ్రెస్‌ సభ్యురాలు రేణుకాచౌదరి బిగ్గరగా నవ్వడం కలకలం రేపింది. ఆమె బిగ్గరగా నవ్వడాన్ని సభాధ్యక్షుడు వెంకయ్యనాయుడు తప్పుబట్టారు. ఆరోగ్యసమస్యలేమైనా ఉంటే వైద్యుల దగ్గరకు వెళ్లండంటూ సూచించారు. ఇంతలో రేణుకాచౌదరి లేచి ఏదో చెప్పబోగా కూర్చోవాలంటూ వెంకయ్య గట్టిగా ఆదేశించారు. ఇది మంచిపద్ధతి కాదని, లేదంటే మీపై చర్య తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆ సమయంలో ప్రధానమంత్రి జోక్యం చేసుకుంటూ.. ‘అధ్యక్షా మీరు రేణుకపై చర్య తీసుకోవద్దని ప్రార్థిస్తున్నా.. రామాయణం సీరియల్‌ తర్వాత అలాంటి నవ్వు వినే భాగ్యం ఈ రోజే లభించింది’ అన్నారు. దాంతో సభలో గొల్లుమని నవ్వులు వినిపించాయి.
* బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ది ఏకపక్షం
ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ వేమూరి ఆనందసూర్య వైఖరిపై ఆ కార్పొరేషన్‌లోని నలుగురు డైరెక్టర్లు, గతంలో జిల్లా సమన్వయకర్తలుగా పని చేసిన వారు అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లబ్ధిదారులకు సరైన న్యాయం చేయకుండా ఛైర్మన్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తూ పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తున్నారని వారు తెదేపా అధినాయకత్వానికి ఫిర్యాదు చేశారు. గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వీరు బుధవారం సమావేశమై, కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌ వి.వి.చౌదరితో పరిస్థితిని చర్చించారు.
*నాక్కూడా రాహులే బాస్‌‌
ఇప్పుడు తనకు కూడా రాహుల్‌ గాంధీనే బాస్‌ అని కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. గురువారం కాంగ్రెస్‌ ఎంపీలతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ సోనియా ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. కుమారుడికి బాధ్యతలు ఇవ్వకముందు 19ఏళ్ల పాటు కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా పనిచేసిన సోనియా ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌ పర్సన్‌గా కొనసాగుతున్నారు. ‘ఇప్పడు నాక్కూడా అతడే బాస్‌. అందులో ఎలాంటి సందేహం లేదు. మీరందరూ నాతో కలిసి పనిచేసినట్లుగానే అదే నిబద్ధత, నమ్మకం, ఉత్సాహంతో తనతోనూ కలిసి పనిచేస్తారని నాకు తెలుసు’ అని కాంగ్రెస్‌ ఎంపీలను ఉద్దేశించి అన్నారు.
*శ్వేతపత్రం విడుదల చేయండి
రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు కేంద్ర సర్కారు కుదుర్చుకున్న ఒప్పందం అతిపెద్ద కుంభకోణమని కాంగ్రెస్‌ ఆరోపించింది. ఈ ఒప్పందంపై ప్రధాని నరేంద్రమోదీ స్పష్టతనివ్వాలనీ, ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేయాలనీ డిమాండ్‌ చేసింది.
*ముస్లింలను మోసం చేస్తున్న చంద్రబాబు: జగన్‌ విమర్శ
రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలను ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేస్తున్నారని ప్రతిపక్ష నేత జగన్మోహన్‌ రెడ్డి ఆరోపించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం ఎ.ఎస్‌.పేట మండలం హసనాపురంలో బుధవారం జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర జరిగింది.
*మిత్రపక్షాలకిచ్చే సంకేతాలివేనా
బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కి ఎలాంటి కేటాయింపులు లేవని, మిత్రపక్షాలకు ఎన్డీయే ఇచ్చే సంకేతాలు ఇవేనా అని తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ కేంద్రాన్ని ప్రశ్నించాు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్ని పదే పదే మోసం చేయలేరన్నారు.
*చంద్రబాబుకు వైద్యపరీక్షలు
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న ల్యూసిడ్‌ డయాగ్నస్టిక్‌ కేంద్రంలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఎంఆర్‌ఐ స్కాన్‌తో పాటు పలు వైద్య పరీక్షలను వైద్యుల బృందం ఈ సందర్భంగా ఆయనకు నిర్వహించింది. ఇవన్నీ సాధారణ వైద్య పరీక్షలేనని అనంతరం రోగనిర్ధరణ కేంద్రం ప్రతినిధులు తెలిపారు.
*ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ తో ఏపీ జట్టు
ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం బుధవారం రాత్రి దుబాయ్‌ పర్యటనకు బయలుదేరి వెళ్లింది. త్వరలో జరగనున్న విశాఖ భాగస్వామ్య సదస్సులో పాల్గొనాల్సిందిగా దుబాయ్‌లో పలువురు పారిశ్రామికవేత్తలు, ప్రముఖులను ముఖ్యమంత్రి స్వయంగా కలిసి ఆహ్వానించనున్నారు. ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌ ఆధ్వర్యంలో ఏపీలో భారీస్థాయిలో నిర్వహణ, మరమ్మతుల కేంద్రం, వైమానిక(ఏవియేషన్‌) అకాడమీ, నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు వీలుగా ప్రభుత్వంతో ఆ సంస్థ సీఈవో, ఛైర్మన్‌ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నారు. ఆదేశ ప్రధానమంత్రి షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్మాక్తోమ్‌, దుబాయ్‌ ఎయిర్‌పోర్టు ఫ్రీజోన్‌ అథారిటీ డైరెక్టర్‌ జనరల్‌ మహమ్మద్‌ అల్‌ జరూనితోనూ ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com