నేటి రాజకీయం-౦౨/౧౧

నేటి రాజకీయ వార్తలు
*రాజీనామాలకూ వెనకాడం
రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు ప్రజా సమస్యల పరిష్కారానికి అవసరమైతే రాజీనామాలకు కూడా సిద్ధమని తెలుగు దేశం ఎంపీ కొనకళ్ల నారాయణ అన్నారు. కేంద్రం పదేపదే మోసపూరిత ప్రకటనలు చేసిన నేపథ్యంలో తాడోపేడో తేల్చుకునేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. జైట్లీ ప్రకటనలతో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని అన్నారు.
*లక్ష ఇళ్ల నిర్మాణం ఏడాదిలో పూర్తి చేయాలి
హైదరాబాద్ నగరంలో పేదలకు లక్ష రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం ఏడాదిలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ ఏడాదంతా మంజూరైన ఇళ్లను నిర్మించి లబ్ధిదారుల చేతుల్లో పెట్టడమే మంత్రులు, ఎమ్మెల్యేల బాధ్యతని మంత్రి స్పష్టం చేశారు. సికింద్రాబాద్‌లోని గాంధీనగర్, మారేడుపల్లిలో దాదాపు 800 రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.
*పోలవరం వంతెనకు ఎన్టీఆర్‌ పేరు
జి.కొండూరు మండల పరిధిలోని వెలగలేరు గ్రామం వద్ద విజయవాడ – విస్సన్నపేట రహదారిపై పోలవరం కుడికాలువ 173.550 కిలోమీటర్‌ వద్ద నిర్మించిన రెండు వరుసల వంతెనకు టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు పేరు పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ వంతెనకు ఎన్టీఆర్‌ పేరు పెట్టాలని గ్రామానికి చెందిన పలువురు టీడీపీ నేతలు ప్రభుత్వాన్ని కోరారు. గ్రామస్థుల కోరిక మేరకు ప్రభుత్వం వంతెనకు ఎన్టీఆర్‌ పేరు పెట్టింది. ఈ మేరకు రెండు వరుసల వంతెనకు ఎన్టీఆర్‌ పేరును ఖరారు చేస్తూ జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
*భాజపాను ఒంటరి చేద్దాం-రఘువీరారెడ్డి
ఆంధ్రప్రదేశ్‌లో భాజపాను ఒంటరిని చేద్దామని, అన్ని పార్టీలు కలిసి రావాలని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. ఆ పార్టీని రాష్ట్రం నుంచి తరిమి కొడదామన్నారు. కేంద్రంతో లాలూచీ పడకుండా, ప్రధాని మోదీకి భయపడకుండా తెదేపా, వైకాపా ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండు చేశారు.
*రాష్ట్రవ్యాప్త పర్యటనకు రజనీకాంత్‌ సిద్ధం
లోక నాయకుడు కమల్‌హాసన్‌ తరహాలోనే సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కూడా రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు శుక్రవారం మక్కల్‌ మండ్రం సభ్యులు, అభిమాన సంఘం ముఖ్యనాయకులతో కోడంబాక్కంలోని రాఘవేంద్ర కళ్యాణ మండపంలో సమావేశమయ్యారు.
*చిత్తశుద్ధి ఉంటే మంత్రివర్గం నుంచి బయటకు రావాలి
పోలవరానికి అడ్డంకులు తొలగించింది భాజపానేనని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ప్రాణమున్నంత వరకు జాతీయవాదం, భాజపా కోసం తాను పనిచేస్తానన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాసేవలోనే తాను తృప్తి పొందుతానన్నారు.
*సంక్షేమ పథకాలు మనల్ని గెలిపిస్తాయి
కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లాలని భాజపా ఎంపీలకు ప్రధాని నరేంద్రమోదీ సూచించారు. పథకాలకు కల్పించే విస్తృత ప్రచారం ఎన్నికల్లో పార్టీకి విజయాన్ని అందిస్తుందని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది.
*రాజ్‌భవన్‌ ఆకృతులపై గవర్నర్‌తో చర్చ
అమరావతిలోని పరిపాలన నగరంలో నిర్మించే రాజ్‌భవన్‌ ప్రణాళిక గురించి తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌కు సీఆర్‌డీఏ అధికారులు శుక్రవారం వివరించారు. సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌, అదనపు కమిషనర్‌ షణ్మోహన్‌, నిర్మాణరంగ నిపుణులు హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌తో సమావేశమయ్యారు.
*కాంగ్రెస్‌కు ఆరోపణలు, విమర్శలు తప్ప వేరే పనిలేదు
కాంగ్రెస్‌ పార్టీ నేతలకు గాంధీభవన్‌లో కూర్చొని ప్రభుత్వం మీద, కేసీఆర్‌ మీద ఆరోపణలు, విమర్శలు చేయడం తప్ప వేరే పని లేదని ప్రభుత్వ విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. దేశంలో పనికిరాని ప్రతిపక్షం ఏదైనా ఉందంటే అది తెలంగాణ కాంగ్రెస్సేనని ఆయన ఎద్దేవా చేశారు.
*ఉపరాష్ట్రపతిపై ఫేస్‌బుక్‌లో కామెంట్లు
రాజ్యసభను నడపడంలో ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఓ ఎంపీ ఫేస్‌బుక్‌లో కామెంట్లు పోస్ట్‌ చేయడాన్ని రాజ్యసభలోని ఎంపీలంతా పార్టీలకతీతంగా ఖండించారు.
*నేరగాళ్లకు తుపాకీతోనే బదులివ్వండి-ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ప్రతి ఒక్కరికి భద్రత కల్పించాలి. తుపాకులతో శాంతికి భగ్నం కలిగించేవారిని ఉపేక్షించేది లేదు. అలాంటి వారికి తూటాతోనే బదులివ్వాలి. ఈ విషయంలో అధికారులకు ఎలాంటి సంకోచం అక్కర్లేదు.
*ఓటేసింది మందిరం కోసం ట్రిపుల్‌ తలాక్‌ కోసం కాదు-వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు తొగాడియా
ప్రజలు మిమ్మల్ని (ఎన్డీయే) గెలిపించింది రామ మందిర నిర్మాణం కోసం. ట్రిపుల్‌ తలాక్‌పై చట్టాలు చేయడానికి కాదు. రామ మందిర నిర్మాణానికి వెంటనే మార్గం సుగమం చేయాలి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com