నేటి రాజకీయం-౦౪/౦౧

*పోచమ్మ ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి హరీష్ రావు
మర్కూక్ మండలం పాములపర్తి వద్ద కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు పంప్‌హౌజ్ నిర్మాణ పనులను నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు పరిశీలించారు. పనుల్లో నాణ్యత లోపించకుండా ఎప్పటికప్పుడూ పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వచ్చే జులై, ఆగస్టు వరకు ప్రాజెక్టు పనులు పూర్తి చేసేలా 24 గంటలు పనులు చేయాలని మంత్రి చెప్పారు.
* చంద్రబాబుతో యలమంచిలి రవి భేటీ
పార్టీ మారాలని నిర్ణయించుకున్న మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవిని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలిపించి బుజ్జగించారు. విజయవాడ ఎంపీ కేశినేని నానితో కలిసి వచ్చిన యలమంచిలి రవితో దాదాపు గంటసేపు చంద్రబాబుతో సమావేశమయ్యారు. పార్టీ మారే ఆలోచన విరమించుకోవాలని.. సముచిత స్థానం కల్పిస్తామంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు. అనంతరం రవి మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ మారాలనుకున్న మాట వాస్తవమేనని.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆ ఆలోచన చేసినట్లు తెలిపారు. చంద్రబాబుతో జరిపిన చర్చలతో సంతృప్తి కలిగిందని.. దీంతో ఆ ఆలోచన విరమించుకున్నట్లు స్పష్టం చేశారు.
*వైసీపీపై విరుచుకుపడ్డ సీఎం రమేష్
కేసుల మాఫీ కోసం బీజేపీతో విజయసాయిరెడ్డి లాలూచీ పడుతున్నారని ఎంపీ సీఎం రమేష్ వ్యాఖ్యానించారు. విభజన హామీలను నెరవేర్చాల్సిన కేంద్రాన్ని విమర్శించకుండా చంద్రబాబుపై ఆరోపణలు చేస్తూ వైసీపీ పబ్బం గడుపుతోందని మండిపడ్డారు. వైసీపీ ఎంపీల రాజీనామాలతో ఒరిగేదేమీలేదని స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని సీఎం రమేష్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈనెల 3న రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేయనున్నట్లు తెలిపారు. ప్రత్యేకహోదా, విభజన హామీలను అమలు చేసే విధంగా కేంద్రానికి కనువిప్పు కలిగించాలని శ్రీవారిని ప్రార్థించానని సీఎం రమేష్ తెలిపారు.
*అందుకోసమే ఏపీని అణగదొక్కుతున్నారు
నాలుగేళ్లుగా ఏపీని బీజేపీ నిర్లక్ష్యం చేసిందని ఎంపీ కేశినేని ఆరోపించారు. మోదీకి వ్యతిరేకంగా టీడీపీ నేతలు పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ ప్రజలకు అవగాహన కల్పించాలానే పోస్టర్‌ ఆవిష్కరించామని తెలిపారు. చివరి బడ్జెట్‌లోనూ ఏపీకి అన్యాయం చేశారని మండిపడ్డారు. గుజరాత్ కన్నా ఏపీ ఎక్కువ అభివృద్ధి చెందుతోందని అణగదొక్కుతున్నారని విమర్శించారు. ఏపీ అభివృద్ధిని అడ్డుకోవాలని మోదీ, అమిత్ షా ప్రయత్నాలు చేస్తున్నారని ఎంపీ కేశినేని నాని ఆరోపించారు.
*రాజీనామా రోజే ఎంపీల ఆమరణ దీక్ష
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే పార్లమెంట్‌ సమావేశాల చివరి రోజున వైకాపా ఎంపీలు రాజీనామా చేసి నేరుగా ఏపీభవన్‌కు వెళ్లి ఆమరణ దీక్ష చేస్తారని ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వై.ఎస్‌.జగన్‌ ప్రకటించారు. ఏపీభవన్‌ అనేది ఆంధ్రప్రదేశ్‌ ఆస్తి అని, అందుకే అక్కడ దీక్ష చేయనున్నట్లు తెలిపారు. ఎంపీలకు మద్దతుగా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో రిలే నిరాహార దీక్షలు చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా విద్యార్థులు వారు చదివే కళాశాలల్లోనే దీక్షలకు కూర్చోవాలని కోరారు. సంఘీభావంగా చేపట్టే దీక్షల్లో యువత పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
*వీధి రౌడీలా జగన్‌ వ్యవహారం
అపర కుబేరుడు జగన్మోహన్‌రెడ్డి తనపై కేసుల మాఫీకి కుట్ర రాజకీయాలు చేస్తూ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ల వద్ద తాకట్టు పెట్టారని మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ ఆరోపించారు. కడప ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహంలో శనివారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. జగన్‌కే కాదు, పార్టీలో ఎవరికీ సంస్కారం లేదన్నారు.
*సభ్యత్వ సేకరణకు యాప్‌ సాయం
జనసేన పార్టీ జనసైన్యం పేరుతో చేపట్టిన సభ్యత్వ నమోదులో యాప్‌ సేవలను వినియోగించుకుంటోంది. ఇప్పటికే మిస్డ్‌కాల్‌ ద్వారా 17లక్షల సభ్యత్వం నమోదైందని పార్టీ ప్రతినిధులు తెలిపారు. శనివారం జనసేన పరిపాలన కార్యాలయంలో సాంకేతిక విభాగ ప్రతినిధులు డాక్టర్‌ ఎం.విజయనిర్మల, శ్రీనివాస్‌ మిరియాల, కులదీప్‌, సత్య విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు.
*దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం చిన్నచూపు
దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూస్తున్న కేంద్ర వైఖరిని అందరూ నిలదీయాలని రాష్ట్ర మంత్రి అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీ నుంచి కేంద్రానికి చేరుతున్న పన్ను, ఇతర ఆదాయాలకు.. అక్కడినుంచి వస్తున్న నిధులకు ఎలాంటి పొంతన లేదని ఆయన సవివరంగా తెలిపారు.
*కోదండరాం పార్టీ.. తెలంగాణ జన సమితి
తెలంగాణ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం నేతృత్వంలో రానున్న రాజకీయ పార్టీ పేరు ఖరారైంది. ‘తెలంగాణ జన సమితి’ పేరుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. దీంతో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కోదండరాం సిద్ధమవుతున్నారు. పార్టీ పేరుతో పాటు జెండా, అజెండా వివరాలను ఏప్రిల్‌ 2న స్వయంగా ప్రకటించనున్నారు. పార్టీ చిహ్నాలకు సంబంధించి మూడు నమూనాలను ఇప్పటికే రూపొందించారు. 2న నిర్వహించే సమావేశంలో వీటిని వెల్లడించి ప్రజల అభిప్రాయాన్ని తీసుకోనున్నారు. 4న పార్టీ జెండాను, పోస్టర్‌ను ఆవిష్కరిస్తారు. ఏప్రిల్‌ 29న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు దృష్టిపెట్టారు.
*ప్రభుత్వ పెద్దలు కాగ్‌ నివేదికను చదవాలి
ప్రతిపక్షాలపై ఎదురుదాడులు మాని.. తెరాస ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కాగ్‌ నివేదికను చదవడం మంచిదని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి హితవు పలికారు. ఎన్టీఆర్‌ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ..అప్పులను తీసుకొచ్చి ఆదాయంగా చూపిన ఘనత తెరాస సర్కారుకే దక్కుతుందన్నారు.
*రాహుల్‌ గాంధీపై కేసు కొట్టివేత
ప్రధానమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై దాఖలైన కేసును స్థానిక న్యాయస్థానం కొట్టివేసింది. కాంగ్రెస్‌ పార్టీ సమావేశంలో ప్రధాని మోదీపై రాహుల్‌ అనుచిత విమర్శలు చేశారంటూ ఇక్కడికోర్టులో కేసు దాఖలైంది. ఇదిలాఉంటే…,మతపరమైన హింసలో తమ కుమారులను కోల్పోయినప్పటికీ…అసన్‌సోల్‌కు చెందిన ఇమామ్‌ రషీదీ, దిల్లీకి చెందిన యశ్‌పాల్‌ సక్సేనాలు శాంతిసౌభ్రాతృత్వ స్థాపనకు పిలుపునివ్వడాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నాడిక్కడ ప్రశంసించారు.
* అవినీతిలో జగన్‌కు ఆస్కార్‌ ఇవ్వాలి
దిల్లీలో వైకాపా ఎంపీల ఆమరణ దీక్ష పేరుతో భాజపా అధ్యక్షుడు అమిత్ షా మరో కొత్త నాటకానికి తెరలేపారని గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజవేయులు ధ్వజమెత్తారు. పార్లమెంటు సమావేశాలు ముగిసే దశలో రాజీనామాలంటూ వైకాపా చేస్తున్న హంగామాను ప్రజలు గమనిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com