నేటి రాజకీయం-౦౪/౧౨

*బీజేపీ ఎమ్మెల్యే‌పై ఎఫ్ఐఆర్ నమోదు
పదహారేళ్ల బాలికపై అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్ సింగ్ నెగార్‌పై గురువారంనాడు ఎఫ్ఐఅర్ నమోదైంది. ఈ విషయాన్ని పోలీస్ స్టేషన్ ఆఫీసర్ రాజేష్ సింగ్ ధ్రువీకరించారు. నెగార్‌పై ఐపీసీ సెక్షన్ 363 (కిడ్నాప్), 366 (మహిళ అపహరణ), 376 (అత్యాచారం), 506 (నేరపూరిత బెదరింపులు), పోస్కో చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాధితురాలి తండ్రి కస్టడీలో మరణించిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించడం, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి సిట్ దర్యాప్తు నివేదకను సమర్పించిన నేపథ్యంలో సెంగార్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. కేసును సీబీఐకి అప్పగించాలని యూపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.
* ఏపీ నుంచే భాజపా పతనం
ఆంధ్రప్రదేశ్‌ నుంచే భారతీయ జనతా పార్టీ పతనం ప్రారంభమవుతుందని రాజమహేంద్రవరం గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మోదీ విధానాలు దేశానికి నష్టం కల్గించేలా ఉన్నాయని, కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి దేశాన్ని ముక్కలు చేసే పరిస్థితులను తీసుకువస్తున్నారని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం అవినీతిపరులను ప్రోత్సహిస్తున్నారన్నారు.
*సాయి భక్తులకు రాహుల్‌ క్షమాపణ చెప్పాలి- షిర్డీ సాయి సంస్థాన్‌ ట్రస్టు చైర్మన్‌ సురేశ్‌ హవారే
రాహుల్‌జీ.. షిర్డీని రాజకీయాలకు ఆపాదించడం దారుణం. ప్రపంచంలోని సాయి భక్తుల మనోభా వాలు దెబ్బతీసేలా మీ ట్వీట్‌ ఉంది. దాన్ని మేం ఖండిస్తున్నాం. దీనిపై మీరు కచ్చితంగా క్షమాపణ చెప్పాలి.
* ఆవిర్భావ సభకు అనుమతివ్వాలి
రాష్ట్ర ప్రభుత్వం అప్రజాస్వామిక ధోరణి విడనాడి.. తెలంగాణ జన సమితి ఆవిర్భావ సభ నిర్వహణకు అనుమతివ్వాలని ఆచార్య కోదండరాం డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆర్టికల్‌-19 ప్రకారం సంఘాల ఏర్పాటు, శాంతియుతంగా సభలు, సమావేశాల నిర్వహణ, భావప్రకటన స్వేచ్ఛ వంటి హక్కులను రాజ్యాంగం కల్పించిందన్నారు.
*ధన, కండబలం గుప్పిట ఎన్నికల వ్యవస్థ- మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌
భారత ఎన్నికల వ్యవస్థ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడింది. అయితే నేడు ఎన్నికల వ్యవస్థను ధన, కండబలం శాసిస్తున్నాయి. ఈ ధోరణికి కళ్లెం వేయాలంటే ఎన్నికల వ్యవస్థను సంస్కరించాల్సిన అవసరం ఉంది.
*ధార్వాడ్‌లో అమిత్‌షా దీక్ష
పార్లమెంటు లోపలా, బయటా కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక విధానాలకు పాల్పడుతోందంటూ బీజేపీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం కర్ణాటకలోని ధార్వాడ్‌లో నిర్వహిస్తున్న ధర్నాలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పాల్గొన్నారు. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి హెచ్ఎన్ అనంతకుమార్, పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు ఈ దీక్షలో పాల్గొన్నారు.
* వైకాపా ఎంపీల దీక్ష భగ్నం
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ ఏపీ భవన్‌ వేదికగా ఆరో రోజూ ఆమరణ దీక్ష చేస్తున్న వైకాపా ఎంపీలు మిథున్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డిల ఆరోగ్యం క్షీణించడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. బుధవారం మధ్యాహ్నం 12.30గంటలకు ఏపీ భవన్‌ దీక్ష వేదిక వద్దకు వచ్చిన వైద్య బృందం ఎంపీలకు దీక్ష కొనసాగించొద్దని సూచించింది. వారు అంగీకరించకపోవడంతో పోలీసుల సహకారంతో అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.
* మోదీ ఇంటి ముందు చంద్రబాబు ఆమరణదీక్ష చేపట్టాలి
కాపు జాతిని మోసం చేసిన తెదేపాను సముద్రగర్భంలో కలిపే వరకు విశ్రమించబోనని కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో రాష్ట్ర కాపు ఐకాస కార్యాచరణ సదస్సు నిర్వహించారు. సదస్సు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు రిజర్వేషన్లు ఇస్తామని అవమానించారని, బిల్లు పెట్టడానికి నాలుగేళ్లు పట్టిందని, అమలుకు నాలుగు దశాబ్దాలు పడుతుందా? అని ప్రశ్నించారు.
* అఖిలపక్ష సమావేశంలో నిర్ణయాలు
కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధించేందుకు రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆందోళనలను ఉద్ధృతం చేయాలని పలు పార్టీలు, ప్రజాసంఘాల నేతలు సూచించారు. విజయవాడలో బుధవారం ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో భవిష్యత్తు కార్యాచరణపై అఖిలపక్ష సమావేశం జరిగింది. ఇందులో పలువురు పాల్గొన్నారు. పార్లమెంటులో నయవంచన, మోసం చేశారని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి భాజపా పరిహాసం చేసిందని విమర్శించారు.
* ప్రధాని చేయాల్సింది దీక్షలు కాదు.. రాజీనామా
లోక్‌సభలో అవిశ్వాస పరీక్షను ఎదుర్కోనందుకు ప్రధాని మోదీ చేయాల్సింది నిరాహార దీక్షలు కాదు.. రాజీనామా అని ఏపీ సాంఘిక సంక్షేమ మంత్రి నక్కా ఆనందబాబు మండిపడ్డారు. గుంటూరులోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలను కాపాడలేని మోదీ దీక్ష చేస్తామనడం సిగ్గుమాలినచర్యగా అభివర్ణించారు. వాయిదాల పర్వం కొనసాగించి పారిపోయినందుకు మోదీ, అమిత్‌ షాలు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.
* కర్ణాటక ఎన్నికల తర్వాతే ఏపీ భాజపా అధ్యక్షుడి నియామకం
ఆంధ్రప్రదేశ్‌ భాజపా అధ్యక్షుడి ఎన్నిక కర్ణాటక ఎన్నికలు పూర్తయ్యే వరకూ వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఏపీలో ఏ నిర్ణయం తీసుకున్నా ఆ రాష్ట్రంలోని తెలుగువారిపై ప్రభావం చూపి అది ఎన్నికల ఫలితాలను తారుమారు చేస్తుందేమోనన్న ఆందోళనతో భాజపా అధిష్ఠానం ఈ నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల మాజీ మంత్రి మాణిక్యాలరావు దిల్లీలో రెండురోజులు మకాం వేసి పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌ను కలిసి వెళ్లారు. ఫలితంగా ఆయన పేరు అధ్యక్ష రేసులో ప్రధానంగా వినిపించింది.
* మహనీయుల ఆశయ సాధనకు పాటుపడాలి
మహనీయుల ఆశయసాధనకు అంతా పాటుపడాలని ఏపీ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు. బుధవారమిక్కడ ఏపీ/తెలంగాణ భవన్‌ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్మాజ్యోతిభా పూలే 192వ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి మహిళల్లో విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేసిన సంఘ సంస్కర్త పూలే అని కొనియాడారు. కార్యక్రమంలో ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com