నేటి రాజకీయం-౧౧/౩౦

*తెలంగాణ రాష్ట్రంలో తెరాస ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలు, కుటుంబ పాలన, అవినీతి ప్రజలను తీవ్ర అసంతృప్తికి గురి చేస్తున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆరోపించారు. సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. రాష్ట్రంలో సుమారు 60శాతం మంది వ్యవసాయంపై ఆధారపడితే ఆ రంగాన్ని ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
*జయలలిత మృతితో ఖాళీ ఏర్పడిన ఆర్కేనగర్‌ ఉపఎన్నికలో అన్నాడీఎంకే బహిష్కృత నేత, శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్‌ పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆ వర్గం సీనియర్‌ నేత అన్బళగన్‌ అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించారు. శశికళ ఆమోదంతో దినకరన్‌ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు.
*చ్చే ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేయనని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ప్రకటించారు. ఎంపీలు పార్లమెంటులో చేయడానికి ఏమీ లేదన్నారు. ఎంపీలు కరివేపాకుల్లా మారారని, వారిని కనీసం పలకరించే వారే కరువయ్యారని అన్నారు. అనంతపురం నుంచి పోటీ చేసేందుకు తన కుమారుడు ఆసక్తిగా ఉన్నాడని, చంద్రబాబు అనుమతిస్తే తనే అభ్యర్థి అని తెలిపారు.
* కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాహుల్‌గాంధీ డిసెంబరు 4న నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఈ విషయాన్ని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌, మాజీ రక్షణ మంత్రి ఏకే.ఆంథోని రాహుల్‌ పేరును అధ్యక్ష పదవికి ప్రతిపాదించనున్నారు. పార్టీ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి డిసెంబరు 1న నోటిషికేషన్‌ జారీ చేయనున్నారు. డిసెంబరు 4న నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబరు 11 చివరి తేదీ.డిసెంబరు 16న ఎన్నికలు నిర్వహించి.. 19న ఫలితాలు వెల్లడించనున్నారు.
* చైనా కమ్యూనిస్టు పార్టీ బీజింగ్‌లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సుకు మన దేశం నుంచి సీపీఎం, సీపీఐల అగ్రనేతలు సీతారాం ఏచూరి, సురవరం సుధాకర్‌రెడ్డిలకు ఆహ్వానం అందింది. నవంబరు 30 నుంచి డిసెంబరు 3 వరకు నిర్వహించే ఈ సదస్సులో 120 దేశాలకు చెందిన 200 రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొంటున్నారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి గురువారం ఉదయం బీజింగ్‌కు బయలుదేరుతున్నారు.
* ఆర్‌కే నగర్ ఉపఎన్నికలో అధికార అన్నాడీఎంకే అభ్యర్థిగా ఈ.మధుసూధనన్ బరిలోకి దిగనున్నారు. జయలలిత మృతితో ఖాళీ అయిన ఆ స్థానంలో డిసెంబర్ 21న ఉపఎన్నిక జరుగనుంది.
* అనంతపురం జిల్లాకు చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే బి. గురునాథ్‌రెడ్డి అమరావతిలోని అసెంబ్లీ వద్దకు వచ్చారు. ఆయన తన అనుచరులతో కలిసి గురువారం సాయంత్రం అధికార తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో ఆయన టీడీపీ కండువా కప్పుకోనున్నారు. దీంతో అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. కాగా… గురునాథ్‌రెడ్డి పార్టీలో చేరడాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే… ముఖ్యమంత్రి చంద్రబాబు… ప్రభాకర్‌చౌదరితో మాట్లాడి సముదాయించినప్పటికీ వీరిద్దరి మధ్య సయోధ్య కుదరడం కష్టంగానే ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
* పశ్చిమ్‌బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. మైక్‌ అనుకుని పొరపాటున టార్చ్‌లైట్‌ పట్టుకుని ప్రసంగించబోయారు. కోల్‌కతాలో ఏర్పాటుచేసిన ఓ సమావేశంలో మమతపాల్గొన్నారు. ఈ సందర్భంగా మమత ప్రసంగించాలనుకున్నారు. కానీ చూసుకోకుండా మైక్‌ అనుకుని అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు చేతిలోని టార్చ్‌లైట్‌ తీసుకుని ప్రసంగించబోయారు.
* ప్రభుత్వ నిర్ణయాల ప్రభావం రాజకీయంగా ఎలా ఉంటుందో తనకు తెలుసునని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గురువారం హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు రాజకీయంగా చెల్లించవలసిన మూల్యం గురించి తనకు తెలుసునన్నారు. దేశాన్ని అవినీతిరహితం చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అవినీతి నిర్మూలనప్రజల జీవన పరిస్థితుల మెరుగుదల దేశంలో అభివృద్ధికి అనుకూల వాతావరణం ఏర్పాటు కోసం తన ప్రభుత్వం తీవ్రంగా క‌‌ృషి చేస్తోందని చెప్పారు.
*ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ గురువారం కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. పౌర సేవలకు హామీ కల్పించడంతో పాటు పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధి, భూసేకరణ చట్టానికి సవరణ తదితర ఎనిమిది కీలక బిల్లులను ఆమోదించింది.
* పోలవరం ప్రాజెక్ట్‌ ఆంధ్రప్రదేశ్‌కు జీవనాధారమని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. అలాంటిది చంద్రబాబు నాయుడు తన స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన చట్టంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించారని బొత్స ఈ సందర్భంగా గుర్తు చేశారు. పోలవరానికి కేంద్రం నుంచి అనుమతులు తెచ్చింది వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డేనని, భూ సేకరణ మొదలుపెట్టింది కూడా ఆయనేనని అన్నారు. హైదరాబాద్‌కు మెట్రో రైలు తానే తెచ్చానని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని బొత్స విమర్శించారు. రేపు విశాఖకు సముద్రాన్ని తానే తెచ్చానని కూడా ఆయన చెప్పొచ్చంటూ ఎద్దేవా చేశారు.
* ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ‘ప్రజా సంకల్ప పాదయాత్ర’ తలపెట్టిన విషయం తెలిసిందే. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభించిన జగన్ పాదయాత్ర ప్రస్తుతం కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది. అయితే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా స్థాయి నేతలు కూడా తమ నియోజకవర్గాల్లో పాదయాత్ర ప్రారంభించారు.
* రైతులకు సాగునీరందించిన ఘనత కాంగ్రెస్‌దేనని, 2019లో అధికారం ఖాయమని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ అన్నారు. రైతులకు ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ, పత్తికి రూ. 5 వేలు, మిర్చికి రూ.10 వేలు, వరికి రూ. 2 వేల మద్దతు ధర కల్పిస్తామన్నారు. నిరుద్యోగ భృతి నెలకు రూ. 3వేలు ఇస్తామని ఉత్తమ్‌‌కుమార్‌ స్పష్టం చేశారు.
* పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం సాయంత్రం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన చంద్రబాబు.. పోలవరం టెండర్ల విషయంలో కేంద్రం ఆపమంటే ఆపేస్తామని వ్యాఖ్యానించారు.కేంద్రం అదే వైఖరితో ఉంటే వాళ్ళకే అప్పజెప్పి నమస్కారం పెడతానని పేర్కొన్నారు. ప్రాజెక్ట్ పనులు ఆరునెలలపాటు ఆగిపోతే మళ్ళీ దారి పట్టించడం కష్టమని సీఎం తేల్చిచెప్పారు. పోలవరంపై ఎందుకు ఇన్ని ఇబ్బందులో అర్థం కావడం లేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
* వచ్చే ఏడాది జనవరిలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ పార్టీ ప్రకటిస్తారని ఆయన సోదరుడు సత్యనారాయణ రావు పేర్కొన్నారు. బుధవారం తమిళనాడులోని ధర్మపురిలో రజనీ అభిమానుల సంఘం జిల్లా కార్యదర్శి కుమారుడి వివాహానికి హాజరైన ఆయన విలేకర్లతో మాట్లాడారు. రజనీకాంత్‌ను అందరూ అభిమానిస్తారని, ఆయన రాజకీయాల్లోకి వస్తే మంచి చేస్తారని నమ్ముతున్నారని చెప్పారు. రజనీకాంత్‌ జనవరిలో పార్టీ ప్రకటన చేస్తారని, ప్రజలే దీనిపై నిర్ణయించుకోవాలన్నారు. ఈ ఏడాది మే నెలలో యుద్ధానికి సిద్ధంగా ఉండండని అభిమానులతో రజనీకాంత్‌ పేర్కొన్నారు. అనంతరం ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారని అనేక మంది ప్రకటించారు. ఇటీవల జరిగిన 2.ఓ ఆడియో వేడుకల్లో కూడా ఒక కోరిక ఇంకా మిగిలుందని రజనీకాంత్‌ తెలిపారు. ఇటీవల రాజకీయ ప్రవేశం వార్తను ఆయన తోసిపుచ్చారు. ఇప్పుడు రాజకీయాల్లోకి రావాల్సిన ఆవశ్యకత లేదని వెల్లడించారు. ఇప్పుడు ఆయన సోదరుడు ప్రకటన చేస్తారని చెప్పడంతో మరోసారి దీనిపై చర్చ మొదలైంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com