నేటి రాజకీయ వార్తలు-౦౪/౧౭

* ఆయన టీడీపీలోనే కొనసాగుతారు
ఏపీకి ప్రత్యేక హోదాపై వైసీపీ కేంద్రాన్ని గట్టిగా నిలదీయడం లేదని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షం కంటే బీజేపీయే మమ్మల్ని ఎక్కువగా విమర్శిస్తోందని అన్నారు. బీజేపీ నేతలు మమ్మల్ని తిట్టడం మానేసి… విభజన హామీలను నెరవేర్చాలని మంత్రి డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలపై వెనక్కి తగ్గితే ఆ ప్రభావం దేశవ్యాప్తంగా పడుతుందని ఆయన అన్నారు. బీజేపీ-వైసీపీ నాయకుల మధ్య లాలూచీ రాజకీయం నడుస్తోందని, ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేరతారన్న వార్తలు అవాస్తవమని అన్నారు. ఆనం టీడీపీలోనే కొనసాగుతారని సోమిరెడ్డి స్పష్టం చేశారు.
* రాష్ట్రపతిని కలిసిన వైఎస్సార్‌సీపీ ఎంపీలు
రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు మంగళవారం కలిశారు. పార్టీకి చెందిన ఐదుగురు లోక్‌సభ సభ్యుల రాజీనామా, అందుకు దారితీసిన పరిస్థితులను రాష్ట్రపతికి వివరించనున్నట్లు పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా తాము చేసిన పోరాటాన్ని, ప్రజల ఆకాంక్షలను వైఎస్సార్‌ సీపీ ఎంపీలు ఈ సందర్భంగా రాష్ట్రపతికి వివరించారు. అలాగే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులతో పాటు అన్ని అంశాలపై వినతిపత్రం సమర్పించారు.ఏపీని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, హోదాతో పాటు విభజన హామీలు అమలు చేయడం లేదని, కేంద్రం వైఖరితో రాష్ట్రానికి తీవ్రంగా అన్యాయం జరుగుతోందని,జోక్యం చేసుకోవాలని ఎంపీలు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతిని కలిసిన ఎంపీల బృందం ఈ సందర్భంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రెడ్డి లేఖను అందచేసింది. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించే విషయంలో రాష్ట్రపతి కలగచేసుకోవాలని ఆ లేఖలో వైఎస్‌ జగన్‌ కోరారు. ఇక రాష్ట్రపతిని కలిసినవారిలో మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్‌, వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి ఉన్నారు.
*23న పోలవరానికి చంద్రబాబు
పోలవరం పనులను పర్యవేక్షించడానికి సీఎం చంద్రబాబు ఈనెల 23న ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించనున్నారు. ప్రతి నెలా మూడోవారంలో స్వయంగా పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తానని గతంలోనే ఆయన ప్రకటించారు. ఇటీవల ప్రత్యేక హోదా డిమాండ్‌, పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వ వైఖరి తదితర కారణా నేపథ్యంలో ప్రతివారం వర్చువల్‌ రివ్యూ మినహా స్వయంగా ప్రాజెక్టును సందర్శించడం వీలుకాలేదు. అయితే 23న సీఎం పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. వచ్చే నెలలో 960 మెగావాట్ల పోలవరం జల విద్యుత్కేంద్రానికి ముఖ్యమంత్రి భూమిపూజ చేయనున్నారు. ఈ నెల 23నే భూమి పూజ చేయాలని జెన్కో అధికారులు భావించినా… తవ్వకం పనులు మిగిలి ఉండడంతో వచ్చే నెలలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ఇంధన శాఖ అధికారులు నిర్ణయించారు.
* విదేశీ పర్యటన ప్రారంభించిన ప్రధాని మోదీ
ఏప్రిల్‌ 17 నుంచి స్వీడన్‌, జర్మనీ, యూకేలో ఐదు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ సోమవారం బయలుదేరారు. మొదటగా స్వీడన్‌ రాజధాని స్టాక్‌హోం చేరుకుంటారు. నార్డిక్‌ దేశాలుగా ప్రసిద్ధి పొందిన ఫిన్లాండ్‌, నార్వే, డెన్మార్క్‌, ఐస్‌లాండ్‌లతో జరిగే సంయుక్త సమావేశంలో పాల్గొంటారు. అంతకుముందు స్వీడన్‌ ప్రధాని స్టెఫాన్‌ లొఫ్‌వెన్‌తో భేటీ అవుతారు. వాణిజ్యం, పెట్టుబడులు సహా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతానికి కృషి చేయనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. కామన్వెల్త్‌ దేశాధినేతల సమావేశం-చోగంలో జరిగే సమావేశాల్లో ఆరోగ్యం, నవీకరణ, డిజిటల్‌ టెక్నాలజీ, సైబర్‌ సెక్యూరిటీ రంగాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకృతం చేయనున్నట్లు చెప్పారు. ఏప్రిల్‌20న జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌తో బెర్లిన్‌లో సమావేశంకానున్నారు.
*మే మొదటి వారంలో ఒడిశాకు కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే నెల మొదటి వారంలో ఒడిశాకు వెళ్లనున్నారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా కసరత్తు చేస్తోన్న సీఎం కేసీఆర్ ఇప్పటికే మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఝార్ఘండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తదితరులతో చర్చించారు. అదే క్రమంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తోనూ ఆయన దేశ రాజకీయాలపై చర్చించనున్నారు. ఈ నెల 27వ తేదీన జరగనున్న తెరాస ప్లీనరీ కంటె ముందే ఒడిషా వెళ్లాలని కేసీఆర్ తొలుత భావించారు. అయితే అక్కడ శాసనసభా సమావేశాలు జరుగుతున్నందున మే నెల మొదటి వారంలో భువనేశ్వర్ రావాలని కేసీఆర్‌ను నవీన్ పట్నాయక్ ఆహ్వానించారు. అందుకు అంగీకరించిన సీఎం కేసీఆర్ వచ్చే నెల మొదటి వారంలో భువనేశ్వర్ వెళ్లనున్నారు.
*రాష్ట్రపతిని కలిసిన వైసీపీ ఎంపీలు
భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో వైసీపీ ఎంపీలు మంగళవారం సమావేశమయ్యారు. విభజన హామీల అమలు, ఏపీకి ప్రత్యేక హోదాపై రాష్ట్రపతితో ఎంపీలు చర్చించినట్లు తెలుస్తోంది. కాగా రాష్ట్రపతితో సమావేశానికి విజయసాయి రెడ్డి గైర్హాజరయ్యారు.మరోవైపు ప్రత్యేక హోదా డిమాండ్‌తో లోక్‌సభకు వైసీపీ ఎంపీలు రాజీనామా చేసి పది రోజులు అయినా స్పీకర్ సుమిత్రామహాజన్ ఆమోదించలేదు. రాజీనామాలను స్పీకర్ తిరస్కరించినా ఆశ్చర్యపోనక్కర్లేదని, భావోద్వేగాలతో రాజీనామాలు చేశారంటూ ఆమోదించకపోవచ్చని ఓ అధికారి అభిప్రాయపడ్డారు. వైసీపీ ఎంపీల రాజీనామాలను టీడీపీ, ఇతర పార్టీలు డ్రామాలుగా అభివర్ణిస్తున్నాయి. జనం నిలదీస్తారన్న ఆందోళన వైసీపీలో నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతికి వినతిపత్రం పేరుతో మరో డ్రామాకు తెరలేపిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
*ఫోటోల భయం
రాజకీయ నాయకుల అందరికి ఒక్కసారిగా ఫోటోల భయం పట్టుకుంది. ఇటీవల దేశం వదిలి పారిపోయిన నీరవ్ మోడీ ప్రధాని నరేంద్ర మోడీ తో కలిసి గ్రూప్ ఫోటో దిగిన విషయం కాంగ్రెస్ వెలుగులోకి తెచ్చింది. ఏ సంబంధం లేకుండానే ఆ మోడీ ఈ మోడీ గ్రూప్ ఫోటోలోకి వచ్చాడా. అని కాంగ్రెస్ ప్రశ్నించింది. దీనితో భాజపాని దెబ్బ కొట్టామనుకుంది. కాంగ్రెస్. కాని ఇప్పుడు భాజపా ఐటీ విభాగం గతంలో పత్రికల్లో వచ్చిన కాంగ్రెస్ నేతల ఫొటోలన్నీ వడకడుతున్నది. ఇప్పటికే కలకత్తా బ్యాంక్ కుంభకోణంలో అరెస్టు అయిన శివాజీ పంజా అనే వ్యక్తీ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కలిసి ఉన్న ఫోటో ను బయటపెట్టింది. ఇక కర్ణాటక ఎన్నికల ప్రచార సమయంలో ఆపైన2009 ఎన్నికల సమయంలో కొత్త కొత్త ఫోటోలను వెలుగులోకి తీసుకురాబోతున్నారు. ఇప్పుడు అన్నీ పార్టీల నేతలకు ఫోటోల భయం తుకుంది.
*శ్రీశైల మల్లన్న సేవలో తెలంగాణ మంత్రి హరీశ్‌ రావు
ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌ రావు కుటుంబ సభ్యులతో సోమవారం దర్శించుకున్నారు. దర్శనార్థం వచ్చిన ఆయనకు రాజగోపురం వద్ద దేవస్థానం అధికారులు, అర్చకుల సాదర స్వాగతం పలికారు. అనంతరం మంత్రి స్వామి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.వేదపండితులు మంత్రి కుటుంబ సభ్యులకు ఆశీర్వచనాలు పలికారు.
*బకాయిలపై కేంద్రానికి లేఖలు రాయాలని ఆదేశం
పోలవరం ప్రాజెక్టులో కాంక్రీటు పనుల వేగం పెరగడంపై ముఖ్యమంత్రి అధికారులను అభినందించారు. తొలిసారిగా 5,000 క్యూబిక్‌ మీటర్ల లక్ష్యాన్ని చేరుకోవడంపై సంతృప్తి వ్యక్తంచేశారు. డయా ఫ్రం వాల్‌ పనులు కూడా వేగంగా సాగుతున్నాయని అధికారులు వివరించారు.
*మంత్రి జగదీశ్వర్‌రెడ్డిపై లోకాయుక్తలో ఫిర్యాదు చేస్తాం
సూర్యాపేట కలెక్టరేట్‌ సమీకృత భవన నిర్మాణానికి ప్రైవేటు భూముల కొనుగోళ్ల వ్యవహారంలో మంత్రి జగదీశ్వర్‌రెడ్డిపై కేంద్ర నిఘా సంస్థ కమిషనర్‌, లోకాయుక్తలకు ఫిర్యాదు చేస్తామని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ తెలిపారు.
*ఫెడరల్‌ ఫ్రంట్‌లో కలవం
ఫెడరల్‌ ఫ్రంట్‌లో కలవడానికి సీపీఎం సిద్ధంగా లేదని, ‘‘మేము కాంగ్రెస్‌కు వ్యతిరేకం, భాజపాకు వ్యతిరేకమని చెబుతున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల అవకాశవాద రాజకీయాలను విశ్వసించం’’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు.
*పంట నష్టం జరిగినా ప్రగతి భవన్‌ నుంచి బయటికి రాలేదు
ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్లక్ష్య పాలనవల్లే అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని తెతెదేపా అధ్యక్షుడు ఎల్‌.రమణ ధ్వజమెత్తారు. పార్టీ రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలతో సోమవారం ఎన్టీఆర్‌ భవన్‌లో ఆయన సమావేశం అయ్యారు. ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించారు. ఈ నెల 20న పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిరాహారదీక్ష చేస్తున్న సందర్భంగా తెలంగాణలో పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించుకున్నారు.
*నైట్‌క్లబ్‌ ప్రారంభించిన భాజపా ఎంపీ సాక్షి మహరాజ్‌
లఖ్‌నవూలోని ఓ నైట్‌క్లబ్‌ను భాజపా ఎంపీ సాక్షి మహరాజ్‌ చేతులమీదుగా ప్రారంభించినట్లు బయటపడ్డ ఫొటోలతో కలకలం చెలరేగింది. ప్రారంభోత్సవం సందర్భంగా ఓ గణేశుడి విగ్రహాన్ని జ్ఞాపికగా సాక్షి అందుకుంటున్నట్లు బయటపడిన ఫొటోపై స్థానిక మీడియాలో చర్చోపచర్చలు జరిగాయి. ఉన్నావ్‌లోని 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో సీబీఐ అరెస్టు చేసిన బంగార్‌మౌ అసెంబ్లీస్థానం కూడా సాక్షి నియోజకవర్గంలోనిదే. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్న నేపథ్యంలో హిందూ సంప్రదాయాన్ని ఉద్ధరిస్తున్నామంటూ ఇవేం పనులని సాక్షిపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. సాక్షి మాట్లాడుతూ నైట్‌క్లబ్‌ ప్రారంభించినట్లు తనకు తెలియదని,తనతో ఫలహారశాల అని చెప్పారని వివరణ ఇచ్చారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com