నేటి రాజకీయ వార్తలు – 05/17

*నీటి సంరక్షణ బాధ్యత అందరిదీ
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం మండలం పోకూరులో ‘నీరు- ప్రగతి’ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కందుకూరు ఏఎంసీ ఆవరణలో ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. నీటి సంరక్షణ అందిర బాధ్యత అన్నారు. నీటికోసం తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇచ్చామన్నారు. గొట్టివాటి కొండవాటు కాలువ పూర్తిచేసి కందుకూరు ప్రాంతానికి నీళ్లు తీసుకొస్తామని హామీ ఇచ్చారు.
* లోకేశ్‌కు ‘డిజిటల్‌ లీడర్‌’ పురస్కారం
రాష్ట్ర ఐటీ, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నారా లోకేశ్‌కు బిజినెస్‌ వరల్డ్‌ మ్యాగజైన్‌ ‘డిజిటల్‌ లీడర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ పురస్కారం ప్రకటించింది. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల్లో దేశవ్యాప్తంగా చేపడుతున్న వివిధ కార్యక్రమాలను పరిగణనలోకి తీసుకుని మంత్రి లోకేశ్‌కు ఈ అవార్డు ప్రకటించిందని ఐటీశాఖ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. జలవాణి, గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగానికి సంబంధించి మరో అవార్డు లభించిందని వెల్లడించింది. ఈ నెల 18న దిల్లీలో జరిగే బిజినెస్‌ వరల్డ్‌ డిజిటల్‌ ఇండియా సదస్సులో మంత్రి పురస్కారం అందుకోనున్నారు.
* సమగ్ర నివేదిక ఇవ్వాలని సంక్షేమశాఖలకు ఆదేశాలు
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రాయితీ రుణాల్లో అక్రమాలను నిరోధించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాజకీయ ఒత్తిళ్లు, బయటి వ్యక్తుల ప్రమేయం తగ్గించి, బోగస్‌ను ఏరివేసేందుకు పరిష్కారాలను సిద్ధం చేసింది. గ్రామసభ నుంచి లాటరీ విధానం అమలు చేయాలని, నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వమే లాటరీ విధానంపై అధికారికంగా నిర్ణయం తీసుకోవాలంటూ సంక్షేమశాఖలు ప్రతిపాదించాయి.
* చేపల ఆహారంతో ఆరోగ్యం
రోజూవారీ ఆహారంలో చేపలను భాగం చేయడం వల్ల పోషకాలు లభించి ఆరోగ్యంగా ఉంటారని మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ అన్నారు. జాతీయ మత్స్య అభివృద్ధి మండలి సీఈఓ రాణీ కుముదినితో కలిసి మంత్రి బుధవారం సచివాలయంలో మత్స్యకారుల సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 24,192 నీటి వనరుల్లో 77 కోట్ల చేప, కోటి రొయ్య పిల్లలను వదలాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. మత్స్య రంగ అభివృద్ధితో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.
* ప్రైవేట్‌ విద్యాసంస్థలపై వ్యతిరేక భావం లేదు
ప్రైవేట్‌ విద్యాసంస్థలపై తనకు వ్యతిరేక భావం లేదని ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఇటీవల జయశంకర్‌ జిల్లాలో పర్యటన సందర్భంగా ఆయన ప్రైవేట్‌ పాఠశాలల బస్సులు పల్లెలకు వస్తే టైర్లలో గాలి తీయాలని వాఖ్యానించారు.
* ప్రలోభాలకు తెరలేపిన భాజపా
కర్ణాటకలో ఆధిక్యాన్ని నిరూపించుకొనేందుకు భాజపాకు సమయం ఇవ్వాలని రాష్ట్ర గవర్నర్‌ తీసుకున్న నిర్ణయాన్ని సీపీఎం విమర్శించింది. పక్క పార్టీల ఎమ్మెల్యేలను భాజపా ప్రలోభాలకు గురిచేస్తోందని ఆరోపిస్తూ పార్టీ బుధవారం ఓ ప్రకటన విడుదలచేసింది. ‘డబ్బును ఎరగావేసి, ప్రలోభాలకు గురిచేసి సభలో ఆధిక్యాన్ని నిరూపించుకునేందుకు భాజపాకు సమయం ఇవ్వడాన్ని సీపీఎం పొలిట్‌బ్యూరో తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. జాప్యం జరుగుతోందంటే రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన గవర్నర్‌ పదవిని దుర్వినియోగం చేస్తున్నారనే అర్థం. ఇది ప్రజాస్వామ్యానికి పూర్తి విరుద్ధం’అని ప్రకటనలో సీపీఎం వ్యాఖ్యానించింది.
* భాజపా ముందు రెండు ప్రత్యామ్నాయాలు
కర్ణాటకలో తాజా రాజకీయ వాతావరణం నేపథ్యంలో భాజపా ముందు రెండు ప్రత్యామ్నాయాలు కనిపిస్తున్నాయి. బల నిరూపణ అవసరమైన నేపథ్యంలో వీటిలో ఒకదానిని అనుసరించవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. 2008లో కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్థానాల్లో భాజపాకి మూడు తక్కువ వచ్చాయి.
*బీజేపీపై మండిపడ్డ సిద్ధరామయ్య
గవర్నర్ నిర్ణయంపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. మెజార్టీ సభ్యులు తమవైపే ఉన్నారని చెప్పారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా బీజేపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా ప్రమాణస్వీకారం చేయడం సరికాదన్నారు. ప్రజల్లోకి వెళ్లి బీజేపీ నిజస్వరూపాన్ని బయటపెడతామని సిద్దరామయ్య తెలిపారు.
* జగన్ శవాలపై పైసలు ఏరుకునే రకం
ప్రకృతి వైపరీత్య వల్లే గోదావరి పడవ ప్రమాదం జరిగిందని మంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ పడవ ప్రమాదం ఎంతో దురదృష్టకరమైన సంఘట అని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా గోదావరిలో లాంచీ ప్రమాదంపై ప్రతిపక్ష నేత జగన్ స్పందించకపోవడంపై మంత్రి మంపడ్డారు. మానవత్వం ఉన్న ఎవరైనా ఈ ఘటనపై స్పందిస్తారని…కానీ ప్రతిపక్ష నేత జగన్ వైఖరి సిగ్గు చేటన్నారు.
*త్వరలో చేనేత కార్పొరేషన్‌ ఏర్పాటు
చేనేత కార్మికులకు త్వరలో ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రకటించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో జరిగిన మినీమహానాడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీజేఎఫ్‌ఎస్‌ లబ్ధిదారులకు భూహక్కులు కల్పిస్తూ పట్టాలను అందజేస్తామన్నారు. వారికి వ్యవసాయ రుణాల అర్హత కల్పిస్తామని చెప్పారు. దీని ద్వారా రాష్ట్రంలో 65వేల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. సోమశిల స్వర్ణముఖి కాలువ పనులు పూర్తి చేస్తామన్నారు. డక్కిలి మండలం ఆల్కూరుపాడులో రూ. 350కోట్లతో ఆనకట్ట నిర్మాణానికి టెండర్లు పిలువనున్నట్లు తెలిపారు. ఎస్‌ఎస్‌ కాలువ ద్వారా నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 270 చెరువులకు నీళ్లు అందిస్తామని చెప్పారు. జూన్‌ 2లోపు పెండింగ్‌లో ఉన్న 3లక్షలమంది దరఖాస్తుదారులకు పింఛన్లు, లక్షన్నరమందికి కొత్త రేషన్‌ కార్డులను మంజూరు చేయనున్నట్లు తెలిపారు.
*విధానసభ వద్ద కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల ఆందోళన
కర్ణాటక ముఖ్యమంత్రిగా భాజపా నేత యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. విధానసభ వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట భైటాయించారు. కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలు ఈగల్టన్‌ రిసార్ట్స్‌ నుంచి బయటకు వచ్చి విధానసభ వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. గులాంనబీ ఆజాద్‌, అశోక్‌ గెహ్లాట్‌, మల్లికార్జున్‌ ఖర్గే, వేణుగోపాల్‌, సిద్ధరామయ్య తదితరులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.
*జగన్‌కు చంద్రబాబు హెచ్చరిక
లాంచీ ప్రమాదానికి సుడిగాలి కారణమైతే తనపై విమర్శలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. బాధితులను పరామర్శించి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించామని చెప్పారు. ప్రతిపక్ష నేత జగన్‌ ఘటనాస్థలానికి కూడా రాలేదని, అనవసర ఆరోపణలు చేస్తే సహించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు
*రాష్ట్రపతిని కలిసిన ఐదు రాష్ట్రాల ఆర్ధికమంత్రులు
రాష్ట్రపతి కోవింద్‌ను ఐదు రాష్ట్రాల ఆర్ధికమంత్రులు కలిశారు. ఏపీ ఆర్థిక మంత్రి యనమల నేతృత్వంలో రాష్ట్రపతిని కేరళ, పంజాబ్, ఢిల్లీ, బెంగాల్ ఆర్ధిక మంత్రులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 15వ ఆర్ధిక సంఘం విధివిధానాలను‌ మార్చాలని మంత్రులు కోరారు. అలాగే కేంద్రం విధివిధానాల విషయంలో జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతికి వినతి పత్రం అందజేశారు. 2011 జనాభా నిష్పత్తి ప్రకారం నిధుల పంపకాల విధానంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అమరావతిలో చేసిన తీర్మానం నివేదికను రాష్ట్రపతికి మంత్రులు అందజేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com