నేటి రాజకీయ వార్తలు -06/05

*ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్న జైట్లీ
మూత్రపిండ మార్పిడి కోసం అఖిల భారత వైద్య విజ్ఞానసంస్థ (ఎయిమ్స్‌)లో చేరిన కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ (65) మూడు వారాల తర్వాత సోమవారం ఇంటికి చేరుకున్నారు. తన ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకుంటూ సేవలందించిన వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందికి ఆయన ట్విట్టర్‌లో ధన్యవాదాలు తెలిపారు. మే 12న ఆయన ఆసుపత్రిలో చేరగా 14న శస్త్రచికిత్స నిర్వహించారు. జైట్లీ చికిత్స పొందుతున్న సమయంలో ఆయన చూస్తున్న ఆర్థికశాఖ అదనపు బాధ్యతలను రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే. ఇంటికి చేరుకున్న అరుణ్‌జైట్లీ పరిమిత వాతావరణంలో ఇంటినుంచే పనిని ప్రారంభించారు. ఈమేరకు సోమవారం ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో దృశ్యశ్రవణ విధానంలో (వీడియో కాన్ఫరెన్స్‌) సమావేశమయ్యారు.
*అక్రమ నగదు నిరోధానికి బ్రిక్స్‌ ఉమ్మడి కృషి: సుష్మా
అక్రమ నగదు చలామణిని నిరోధించడం, ఉగ్రవాదులకు నిధులు అందకుండా చేయడంలో బ్రిక్స్‌ దేశాలు కలిసికట్టుగా పనిచేయాలని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ పిలుపునిచ్చారు. అయిదు రోజుల దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా సోమవారం ఆమె బ్రిక్స్‌ దేశాల విదేశాంగ శాఖ మంత్రుల సమావేశంలో పాల్గొన్నారు. వచ్చే నెలలో జొహన్నెస్‌బర్గ్‌లో బ్రిక్స్‌ వార్షిక సదస్సు నిర్వహించనున్న నేపథ్యంలో ఆయా దేశాల విదేశాంగ మంత్రులు సమావేశమయ్యారు. బహుళత్వం, అంతర్జాతీయ వాణిజ్యం, నిబంధనల ఆధారిత ప్రపంచ వ్యవస్థకు ఎదురుగాలులు వీస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడిందని అన్నారు.
*స్పీకరు లేదా శాసనసభ మాత్రమే దాఖలు చేయాలని ధర్మాసనం స్పష్టీకరణ
నల్గొండ, అలంపూర్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్‌.ఎ.సంపత్‌కుమార్‌లను బహిష్కరిస్తూ శాసనసభ చేసిన తీర్మానాన్ని కొట్టివేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుపై అప్పీలు దాఖలు చేయడానికి అనుమతించాలంటూ 12 మంది తెరాస ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌ను ఉమ్మడి హైకోర్టు కొట్టివేసింది.
*మత్స్య రంగంలో పీపీపీ విధానం
రాష్ట్రంలో మత్స్య రంగం అభివృద్ధికి ‘ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం’(పీపీపీ) కింద నూతన విధానం రూపొందిస్తున్నామని ఇందుకోసం త్వరలో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ తెలిపారు. సోమవారం బేగంపేటలోని హరితప్లాజా హోటల్‌లో మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘భాగస్వామ్య సదస్సు’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
*టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ ధ్వజం
మోదీ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత దేశంలో ముస్లింలు అభద్రతా భావానికి లోనవుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తేనే మైనార్టీలకు రక్షణ ఉంటుందన్నారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. కేంద్రంలో మోదీ సర్కారు వచ్చాక ఎవరు ఏం తినాలి? ఏ దుస్తులు వేసుకోవాలి? అనేది చర్చకు వచ్చిందన్నారు. కట్టు బొట్టు, తిండి, సంపద్రాయాలపై భాజపా శక్తులు దాడి చేస్తున్నాయని ఆరోపించారు. రంజాన్‌ సందర్భంగా జిల్లాల్లో జరిగే ఇఫ్తార్‌ విందులకు హాజరవుతానన్నారు. ఈ నెల 12న నాంపల్లిలోని రెడ్‌రోజ్‌ గార్డెన్‌లో ముస్లిం సోదరులకు టీపీసీసీ ఆధ్వర్యంలో ఇఫ్తార్‌ విందు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి పార్టీ మారతారని జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ ‘అలాంటిదేమీ లేదని’ ఉత్తమ్‌ తెలిపారు.
*నీరు-ప్రగతి టెలికాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబునాయుడు
సాగునీటి ప్రాజెక్టులు, చెరువులకు ఉన్న 750 గేట్లు తనిఖీ చేయాలని, పకడ్బందీగా నిర్వహణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులకు సూచించారు. నీరు-ప్రగతిపై సోమవారం తన నివాసం నుంచి నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పది రాష్ట్రాల రైతులు రోడ్లెక్కినా మన రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదంటే మనం చేసిన పనులే కారణమని చెప్పారు.
*పోలవరంలో కాంక్రీటు పనుల వేగం పెంచాలి
పోలవరం ప్రాజెక్టులో క్రమేణా కాంక్రీటు పనులు పెంచుకుంటూ వెళ్లాలని జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌లు సూచించారు. మరిన్ని బ్లాచింగ్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు గుత్తేదారులు వివరించగా… తొందరగా వాటిని ఏర్పాటు చేసి రోజుకు 10వేల క్యూబిక్‌ మీటర్ల వరకు కాంక్రీటు వేయాలని, స్టిల్లింగ్‌ బేసిన్‌, స్పిల్‌ ఛానల్‌లోను వేగవంతం చేయాలని చెప్పారు.
* ఆంధ్రుల చెవిలో పువ్వులు పెట్టారు
ప్రధాని నరేంద్ర మోదీ తన పతనాన్ని అర్థం చేసుకోవాలని తిరుపతి ఎంపీ శివప్రసాద్‌ అన్నారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైకాపా నేతలు మాయ మాటలతో ప్రజలను ఎంతోకాలం మోసగించలేరన్నారు. మోదీ దర్శకత్వంలో వైకాపా ఎంపీలు నాటకాలు ఆడుతున్నారని ఆక్షేపించారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రజలందరి చెవుల్లో పువ్వులు పెట్టిందంటూ కమలం పువ్వులు చెవిలో పెట్టుకుని నిరసన తెలిపారు. స్వచ్ఛ్‌ భారత్‌ అని చెప్పే మోదీ.. తన నియోజకవర్గం వారణాసిని మాత్రం స్వచ్ఛంగా ఉంచలేకపోతున్నారని శివప్రసాద్‌ ఆక్షేపించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్న చంద్రబాబును అడ్డుకోవాలని చూడటం భావ్యం కాదన్నారు.
* వైకాపా ఎంపీల నటన అద్భుతం: లోకేశ్‌
వైకాపా ఎంపీల రాజీనామాలపై మంత్రి నారా లోకేశ్‌ ట్విట్టర్లో స్పందించారు. రాజీనామాల విషయంలో వైకాపాది గొప్ప నటన అని ఎద్దేవా చేశారు. ప్రజలను మభ్యపెట్టి, భాజాపాతో కుమ్మక్కై ఉప ఎన్నికలు రాకుండా జాగ్రత్త పడటంలో గొప్ప నటన కనబర్చారని విమర్శించారు. రాజీనామా డ్రామాకు గాను వైకాపా ఎంపీలకు భాస్కర్ అవార్డ్స్ ఇవ్వాలని వ్యంగ్యంగా విమర్శించారు. వారు సొంత కథతో “ఏ1 మరియు అర డజన్ దొంగలు” సినిమా తీస్తే బాగుంటుందని లోకేశ్‌ ఎద్దేవా చేశారు.
* వైసీపీ ఆరోపణలు అర్థరహితం
ఎస్సీ కార్పొరేషన్‌పై వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ అన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని, లక్షా 30 వేల మంది ఎస్సీలకు రుణాలు మంజూరు చేశామన్నారు. ఈ ఏడాది ప్రభుత్వం రూ.3 వేల కోట్లు కేటాయించిందని ప్రభాకర్ తెలిపారు.
* ఉపఎన్నికలు రావని తెలిసే రాజీనామాలు
వైసీపీ ఎంపీల రాజీనామాలన్నీ డ్రామాలని అని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. బీజేపీ, వైసీపీ కలిసి ఆడుతున్న నాటకంలో భాగమే అని ఆరోపించారు. ఎన్నికలకు ఏడాది ఉందనగా రాజీనామా చేస్తే ఉపఎన్నికలు రావని వైసీపీ ఎంపీలకు తెలుసన్నారు. రాజీనామాలు ఆమోదించే విషయంలో స్పీకర్ కావాలనే జాప్యం చేస్తున్నారని ఎంపీ జేసీ ఆరోపించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com