నేటి రాజకీయ వార్తలు-06/06

*చిదంబరాన్ని ప్రశ్నించిన ఈడీ
ఎయిర్‌సెల్‌-మ్యాక్సిస్‌ మనీలాండరింగ్‌ కేసులో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దాదాపు 6 గంటల పాటు ప్రశ్నించింది. ఆయనను విచారించడం ఇదే మొదటిసారి. మరోవైపు ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు జులై 10 వరకూ అరెస్టు నుంచి రక్షణ కల్పించింది.
*గౌరిలంకేశ్‌, భౌమిక్‌లకు అరుదైన గౌరవం
భారతీయ పాత్రికేయులు దివంగత గౌరి లంకేశ్‌, సుదీప్‌దత్త భౌమిక్‌లకు అరుదైన గౌరవం లభించింది. ప్రతిష్ఠాత్మక న్యూస్‌ప్రదర్శనశాల(న్యూజియం)లో చోటు దక్కింది. పాత్రికేయుల సంస్మరణార్థం మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా 18 మంది పాత్రికేయుల వివరాలను కొత్తగా న్యూజియంలో చేర్చారు.
*సరిహద్దుల్లో ప్రతి దాడికీ సైన్యం దీటుగా బదులు
రంజాన్‌ మాసం కారణంగా జమ్ముకశ్మీర్‌లో కొనసాగుతున్న కాల్పుల విరమణను సైన్యం గౌరవిస్తుందని.. అయితే సరిహద్దుకు ఆవల నుంచి అకారణంగా జరిగే దాడులకు మాత్రం దీటుగా బదులిస్తుందని రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. కేంద్రంలో ఎన్డీఏ సర్కారు నాలుగేళ్ల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా మంగళవారం పాత్రికేయులతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
*కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌.కె.సింగ్‌
రాష్ట్ర విభజన వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య తలెత్తిన విద్యుత్‌ సమస్యలను త్వరలో సమీక్షించి పరిష్కరిస్తామని కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్‌.కె.సింగ్‌ తెలిపారు. మంగళవారం దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని రాష్ట్రాల మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు.
*గులాబీ కూలీపై కౌంటరు దాఖలు చేస్తాం: ప్రభుత్వం
గులాబీ కూలీ పేరుతో పార్టీకి నిధులు సేకరించిన వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలంటూ కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటరు దాఖలు చేస్తామంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అధికార పార్టీ తెరాసకు చెందిన మంత్రులు తదితరులు ఐస్‌క్రీమ్‌లు, టీలు అమ్మి, బస్తాలు మోసి కూలీ కింద లక్షలు సంపాదించారని, ఇది అవినీతి కిందికి వస్తుందని సీబీఐతో దర్యాప్తు జరిపించాలని రేవంత్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు.
*ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉద్బోధ
రాజ్‌భవన్లు సమాంతర అధికార కేంద్రాలు కాదని, అభివృద్ధి ప్రక్రియలో గవర్నర్లు మార్గదర్శక పాత్ర పోషించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. వ్యక్తిగత అభిప్రాయాలు వెల్లడించడం, విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేయడం; సున్నితమైన, రాజకీయఅంశాలపై ట్వీట్లు పోస్టు చేయడం మంచిది కాదని హితవు పలికారు. రాష్ట్రపతిభవన్‌లో జరిగిన గవర్నర్ల సదస్సు ముగింపు కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. గవర్నర్లు అభివృద్ధికి ఉత్ప్రేరకంగా మారాలని సూచించారు. ప్రధాని మోదీ చెప్పిన ‘సంస్కరణ, అమలు, మార్పు’ సిద్ధాంత స్ఫూర్తిని ఆచరణలో పెట్టడానికి గవర్నర్లు కృషి చేయాలని సూచించారు. నిరాడంబరతకు మారుపేరుగా తయారై చేనేతవస్త్రాలు, స్థానికంగా తయారయ్యే వస్తు వినియోగాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ‘మీరు తెలివైన సలహాదారులు, గురువులు, స్నేహితులు, సిద్ధాంతకర్తలు, మార్గదర్శకులు’ అని గవర్నర్లను అభివర్ణించారు. 10వ తరగతివరకూ తప్పనిసరిగా స్థానిక భాషను ఉపయోగించేలా రాష్ట్ర ప్రభుత్వాలకు నచ్చజెప్పాలన్నారు.
*పర్యావరణానికి ప్రాధాన్యం ఇవ్వాలి- శిద్దా
ప్రజలందరూ పర్యావరణానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఏపీ మంత్రి శిద్దా రాఘవరావు కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారమిక్కడ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు అటవీ విభాగంలో అనేక కార్యక్రమాలు చేపట్టి పచ్చదనం పెంచడానికి కృషి చేస్తున్నారని, ప్లాస్టిక్‌ రహిత రాష్ట్రంగా ముందుకెళ్లాలని ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఎక్కువ కాలుష్యం విడుదల చేసే పరిశ్రమలపై దృష్టి పెట్టామని, పర్యావరణ హిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రజలు సహకరించాలని మంత్రి విజ్ఞప్తిచేశారు.
*వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే
‘‘నిబంధనలు మరిచి కొందరు అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. వారి చిట్టాను తయారు చేస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది మేమే. విచారణ చేసి వీరిపై చర్యలు తీసుకుంటాం’’అని టీపీసీసీ కార్యనిర్వాహక రాష్ట్ర అధ్యక్షుడు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. మంగళవారం ఆయన బాన్సువాడలో మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు.
* జగన్‌కు ఆస్తులు ప్రకటించే దమ్ముందా?- లోకేశ్‌
వైకాపా అధినేత వైఎస్‌ జగన్ చేసిన ఆరోపణలపై మంత్రి నారా లోకేశ్‌ ట్విట్టర్లో స్పందించారు. ప్రియమైన ప్రతిపక్ష నేత గారు అంటూ సంభోదిస్తూనే.. ఆయన చేసిన ఆరోపణలను తీవ్రస్థాయిలో ఖండించారు. నారా, వైఎస్ ఇంటి పేర్లకు చాలా వ్యత్యాసం ఉందని, తాము అభివృద్ధి మార్గం ఎంచుకుంటే, మీరు అవినీతి, అక్రమాల వైపు ఉంటారని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో ఆస్తులు ప్రకటించేది తమ కుటుంబం మాత్రమేనన్న లోకేశ్‌… మీ ఆస్తులు ప్రకటించే దమ్ముందా అని జగన్‌కు సవాల్‌ విసిరారు.
* ఆయన్ని చాలా మిస్సవుతున్నాను
ప్రముఖ నటి, కాంగ్రెస్‌ పార్టీ నేత ఖుష్బూ‌..దివంగత నటుడు, సంజయ్‌ దత్‌ తండ్రి సునీల్‌ దత్‌ను గుర్తుచేసుకున్నారు. తాను కాంగ్రెస్‌లో చేరడానికి ఆయనే కారణమని అన్నారు. ఈరోజు సునీల్‌ దత్‌ జయంతి. ఈ సందర్భంగా ఖుష్బూ ట్విటర్‌ ద్వారా సునీల్‌‌ దత్‌కు నివాళులు అర్పించారు. తనకు సునీల్‌ దత్‌తో ఉన్న అనుబంధం గురించి వెల్లడించారు.
* 10 రోజుల్లో రైతు రుణాలు మాఫీ- రాహుల్
మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పది రోజుల్లో రైతు రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ‘మీ (రైతులు) మీద కాల్పులు జరిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుని తీరుతాం’ అని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోని మాండసౌర్‌లో రైతులపై కాల్పులు జరిగి ఏడాది అయిన సందర్భంలో మాండసౌర్‌లో బుధవారం జరిగిన రైతు ర్యాలీలో రాహుల్ పాల్గొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com