నేటి రాజకీయ వార్తలు-06/11

* చైనా రికార్డును కూడా అధిగమిస్తాం- మంత్రి దేవినేని
నిర్మాణపరంగా పోలవరం ప్రాజెక్టు మరో రికార్డు సాధించిందని మంత్రి దేవినేని ఉమామహేశ్వర్‌రావు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ స్పిల్‌ ఛానల్‌, స్పిల్‌ వే పనుల్లో ఒక్కరోజులో 11,158 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులతో రికార్డు సాధించామన్నారు. దేశంలో ఏ సాగునీటి ప్రాజెక్టులో ఈస్థాయి కాంక్రీట్‌ పనులు చేయలేదని చెప్పారు. చైనా త్రీగోర్జెస్‌ డ్యామ్‌లో 24 గంటల్లో 13వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు జరిగాయని, జులైనాటికి చైనా రికార్డును కూడా అధిగమిస్తామని మంత్రి దేవినేని స్పష్టం చేశారు.
*ప్రణబ్‌ క్రియాశీల రాజకీయాల్లోకి తిరిగి రానే రారు- శర్మిష్ఠ ముఖర్జీ
మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తిరిగి క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని ఆయన కుమార్తె, కాంగ్రెస్‌ నాయకురాలు శర్మిష్ఠ ముఖర్జీ ఆదివారం నాడిక్కడ స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో తమ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రణబ్‌ను ఆరెస్సెస్‌ పేర్కొనవచ్చునేమోనన్న శివసేన వ్యాఖ్యల నేపథ్యంలో శర్మిష్ఠ స్పందిస్తూ ఇలా అన్నారు. శివసేన పత్రిక ‘సామ్నా’ తాజా సంపాదకీయంలో ప్రణబ్‌పేరును ప్రస్తావించింది.
*కేంద్ర పునఃపరిశీలనపై కాంగ్రెస్‌ది రాద్ధాంతం
న్యాయవ్యవస్థ నియామకాలకు సంబంధించి కొలీజియం చేసిన ఓ ప్రతిపాదనను కేంద్రం పునఃపరిశీలనకు పంపడంపై కాంగ్రెస్‌ అనవసరంగా రాద్ధాంతం చేస్తోందంటూ కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ విమర్శలు గుప్పించారు. కొలీజియానికి ప్రభుత్వం సూచనలు చేయవచ్చని.. ప్రతిపాదనలనూ పునఃపరిశీలనకు పంపవచ్చని అన్నారు. ప్రజాస్వామ్య జవాబుదారీతనంలో భాగంగానే ప్రభుత్వం ఈ ‘పరిమిత’ పాత్రను పోషిస్తుందని చెప్పారు.
*తెరాస, కాంగ్రెస్‌లవి అవకాశవాద రాజకీయం
తెరాస, కాంగ్రెస్‌ పార్టీలవి అవకాశవాద రాజకీయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ విమర్శించారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో జరిగిన బీజేవైఎం రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ అపవిత్ర కలయికను ఏర్పాటు చేసుకుందని ఎద్దేవా చేశారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు భాజపానే అధికారంలో ఉందని చెప్పారు. తెలంగాణలో తెరాస, కాంగ్రెస్‌లకు భాజపాయే ప్రత్యామ్నాయమని స్పష్టం చేశారు.
*మంత్రి పదవులు భర్తీ చేస్తే అసమ్మతికి తెర: ఖర్గే
కర్ణాటకలో ఖాళీగా ఉన్న మంత్రి పదవులను వీలైనంత త్వరగా భర్తీ చేస్తే కాంగ్రెస్‌లో చెలరేగుతున్న అసంతృప్తి సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉందని లోక్‌సభలో కాంగ్రెస్‌ పార్టీ నేత మల్లికార్జున ఖర్గే సూచించారు. బెంగళూరులో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
*కొత్త పార్టీ పెట్టిన శశికళ సోదరుడు
శశికళ సోదరుడు దివాకరన్‌ కొత్తపార్టీ పెట్టారు. అన్నాడీఎంకేలో ‘అమ్మ’ వర్గంగా కొనసాగుతామంటూ గతంలో ‘అమ్మ అణి’ ఏర్పాటు చేశారు. తిరువారూర్‌ జిల్లా మన్నార్గుడిలో కార్యాలయం కూడా ప్రారంభించారు. అయితే తన పేరు కాని, ఫొటో కాని వాడకూడదని హెచ్చరిస్తూ తన న్యాయవాది ద్వారా దివాకరన్‌కు శశికళ నోటీసు పంపారు. దీంతో దివాకరన్‌…‘అన్నా ద్రావిడర్‌ కళగం’ పేరిట కొత్త పార్టీని ఆదివారం ప్రారంభించారు.
* టీడీపీ పాలనలో యథేచ్ఛగా అవినీతి- మాణిక్యాలరావు
2019 ఎన్నికలే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్తామని మాజీ మంత్రి మాణిక్యాలరావు స్పష్టం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ పాలనలో అనేక శాఖల్లో యథేచ్ఛగా అవినీతి జరుగుతోందని ఆరోపించారు. ఉచిత ఇసుక పేరుతో ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారన్నారు. ఏపీకి కేంద్రం ఎంతో సాయం చేసినా చంద్రబాబు తన గొప్పలు చెప్పుకుంటున్నారని మాణిక్యాలరావు మండిపడ్డారు.
* అఖిలేశ్ యాదవ్ సంచలన నిర్ణయం…
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేశ్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీఎస్పీతో బంధాన్ని బలోపేతం చేసేలా యూపీలో కొన్ని లోక్‌సభ సీట్లను త్యాగం చేసేందుకు సిద్ధమయ్యారు. మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ)తో జట్టుకట్టిన ఎస్పీ.. ఇటీవల ఉపఎన్నికల్లో బీజేపీకి అనూహ్యంగా చెక్ పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో 2019 సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీ బీజేపీని ఓడించేందుకు ఇరుపార్టీలు సీట్లు సర్దుబాటు చేసుకోనున్నట్టు అఖిలేశ్ ప్రకటించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com