నేటి రాజకీయ వార్తలు-06/13

*వరవరరావుపై కేసుల యోచన విరమించుకోవాలి
అక్రమ కేసులో వరవరరావును ఇరికించే ప్రయత్నాన్ని మానుకోవాలని రచయితలు, కవులు, కళాకారులు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సోమవారం ఓ ప్రకటనలో కోరారు. ఒక వ్యక్తి వద్ద దొరికిన లేఖను ఆధారంగా చేసుకొని ఆయనను వేధించడం సరికాదన్నారు. గత 60ఏళ్లుగా వరవరరావు కవిగా, రచయితగా, విమర్శకుడిగా, పరిశోధకుడిగా తెలుగు సాహిత్యంలో ఎనలేని కృషి చేస్తున్నారన్నారు.
*ఫిక్కీ కాస్కేడ్‌ ఆధ్వర్యంలో సదస్సు
పెట్రో ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తెస్తే తాము వ్యతిరేకిస్తామని తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. మంగళవారం ఇక్కడ జరిగిన ఓ సదస్సు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే 52 శాతం వ్యాట్‌ జీఎస్‌టీ పరిధిలోకి వెళ్లిందని, కేవలం 48 శాతం వ్యాట్‌ మాత్రమే పెట్రోలు, డీజిల్‌, మద్యం తదితరాల ద్వారా రాష్ట్రానికి దక్కుతోందన్నారు.
*ఎంపీ కవిత ఇఫ్తారు విందు
నిజామాబాద్‌లో ఎంపీ కవిత ముస్లిం మైనార్టీ సోదరులకు మంగళవారం సాయంత్రం ఇఫ్తారు విందు ఇచ్చారు. ‘ఖిల్లా’ రోడ్డులో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు ఎంపీ కవిత పండు తినిపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు.
*రాహుల్‌ గాంధీపై అభియోగాలు
రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆరెస్సెస్‌)పై నిందాపూర్వక వ్యాఖ్యలు చేశారంటూ దాఖలైన పరువునష్టం కేసులో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విచారణ ఎదుర్కోనున్నారు. ఈ కేసులో ఆయనపై తాజాగా అభియోగాలు నమోదయ్యాయి. పరువునష్టం కేసుకు సంబంధించి మహారాష్ట్రలోని భివండీలోగల మేజిస్ట్రేట్‌ కోర్టుకు రాహుల్‌ మంగళవారం హాజరయ్యారు.
*కన్నా కరడుకట్టిన వైకాపా అభిమాని
కన్నా లక్ష్మీనారాయణ కరడు కట్టిన వైకాపా అభిమాని… జగన్మోహన్‌రెడ్డికి రాజకీయ పెద్దన్న అని అందరూ అంటారని, అలాంటి వ్యక్తిని తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం ద్వారా భాజపా ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తోందో అర్ధమవుతోందని సమాచార, పౌరసంబంధాలశాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు తీవ్రంగా ధ్వజమెత్తారు. మంగళవారం ఉండవల్లిలో తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం తర్వాత మంత్రితో పాటు ఎస్సీ, కాపు కార్పొరేషన్ల ఛైర్మన్లు జూపూడి ప్రభాకరరావు, కొత్తపల్లి సుబ్బారాయుడు విలేకరులతో మాట్లాడారు. ఎలాంటి ఆధారాలు, సాక్ష్యాలు లేకుండా ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా జగన్మోహన్‌రెడ్డి, పవన్‌కల్యాణ్‌ వ్యవహరిస్తున్నారని చెప్పారు.
*ట్విట్టర్‌ వేదికగా పవన్‌కల్యాణ్‌ ట్వీట్‌
ఉత్తరాంధ్ర గడ్డపై వీర తెలంగాణ పోరాట స్ఫూర్తిని చూశానని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. భారతీయ ఆత్మ దోపీడీశక్తులకు, వారి పన్నాగాలకు ఎన్నడూ లొంగదని, అలాంటి ఆత్మబలం ఉత్తరాంధ్ర ప్రజల్లో కనిపించిందని ఆయన పేర్కొన్నారు. ట్విట్టర్‌ వేదికగా జనసేనాధిపతి మంగళవారం స్పందించారు. రంజాన్‌ కారణంగా జనపోరాట యాత్రకు కొన్నాళ్లు విరామం ప్రకటించిన పవన్‌ హైదరాబాద్‌ వెళ్లారు.
*లాలూ కుటుంబంపై ఈడీ కొరడా
రాష్ట్రీయ జనతా దళ్‌(ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్‌ కుటుంబంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కొరడా ఝుళిపించింది. పట్నా సమీపంలోని దానాపుర్‌లో లాలూ కుటుంబానికి చెందిన 11 స్థలాలను(వీటి మొత్తం విస్తీర్ణం దాదాపు 3 ఎకరాలు) మంగళవారం జప్తు చేసింది. ఈ స్థలాల విలువ రూ.44.75 కోట్లు. యూపీఏ-1 హయాంలో రైల్వేశాఖ మంత్రిగా ఉన్నప్పుడు లాలూ భారతీయ రైల్వే ఆహార, విహార సంస్థ(ఐఆర్‌సీటీసీ)కు చెందిన రెండు హోటళ్ల నిర్వహణను ఓ సంస్థకు అనుచిత రీతిలో కట్టబెట్టారని.. అందుకు ప్రతిఫలంగా భూములను ముడుపులుగా స్వీకరించారని కేసు నమోదైన సంగతి గమనార్హం.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com