నేటి రాజకీయ వార్తలు -06/14

*తెలంగాణ పౌరసరఫరాల శాఖకు జాతీయ అవార్డు
రాష్ట్ర పౌరసరఫరాల శాఖలో వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ-పీడీఎస్‌ విధానం ఫలవంతం చేసినందుకుగాను తెలంగాణ పౌరసరఫరాల శాఖకు జెమ్స్‌ ఆఫ్‌ డిజిటల్‌ ఇండియా అవార్డు- 2018 లభించింది. దిల్లీలో బుధవారం జరిగిన కార్యక్రమంలో కోయెస్‌ ఏజ్‌ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్‌ కపిల్‌దేవ్‌ సింగ్‌ చేతుల మీదుగా ఆ శాఖ జనరల్‌ మేనేజర్‌ జి.రాజేందర్‌ అవార్డును అందుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతం చేయటంతో శాఖలో పారదర్శకత, జవాబుదారీతనం పెరిగిందని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ డాక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిష్ఠాత్మక జెమ్స్‌ అవార్డు లభించటంతో అన్ని స్థాయుల సిబ్బందిలో మరింత స్ఫూర్తినిచ్చిందన్నారు.s
*విద్యుత్తు రంగానికి అండగా కేంద్ర ప్రభుత్వం
రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి విద్యుత్తు రంగంలో రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డీడీయుజీజేవై, ఉదయ్‌ పథకాల కింద ఏపీ, తెలంగాణలకు రూ.1,689.12కోట్లు, రూ.1,205.9కోట్లు అందించిందన్నారు.
*వారధి దాటిన ప్రజాసంకల్ప యాత్ర
తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్ర బుధవారం ధవళేశ్వరం వద్ద కాటన్‌ వారధిని దాటి కొత్తపేట నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఉదయం రాజమహేంద్రవరం ఆల్కట్‌తోటలోని గ్లోరిడియో లూథరన్‌ చర్చి నుంచి విపక్ష నేత నడక ప్రారంభించారు. వేదపండితుల ఆశీస్సుల అనంతరం పాదయాత్ర ధవళేశ్వరం వైపు సాగింది. జగన్‌ను చూసేందుకు స్థానికులు, సమీప గ్రామస్థులు పెద్ద ఎత్తున రావడంతో రహదారులు కిక్కిరిశాయి. మధ్యాహ్నం 12.55 గంటలకు పాదయాత్ర కాటన్‌ వారధి వద్దకు చేరుకుంది. మధ్యాహ్న భోజన విరామం తర్వాత తిరిగి ప్రారంభమైన యాత్ర వారధి దాటి ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక మీదుగా పేరవరం చేరుకుంది. కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం పిచ్చుకలంక వద్ద ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో వైకాపా నేతలు స్వాగతం పలికారు. అక్కడి నుంచి 5 కిలోమీటర్లు పాదయాత్ర చేసి పేరవరం గ్రామంలో జగన్‌ రాత్రి బస చేశారు. యాత్రలో ఎక్కడా వైకాపా అధ్యక్షుడు ప్రసంగించలేదు. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. చిన్నారులు, యువతతో సెల్ఫీలు దిగారు. మహిళలు, వృద్ధులతో మాట్లాడేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. దారిపొడవునా ప్రజలు, వివిధ సంఘాల నేతలు తమ సమస్యలపై వినతిపత్రాలు అందించారు.
*ఆ పార్టీలవి విధ్వంస రాజకీయాలు -మంత్రి యనమల ధ్వజం
వైకాపా, జనసేన, భాజపాలు వేర్పాటు విధానాలు అనుసరిస్తూ విధ్వంస రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రధాని మోదీకి ఇచ్చిన వినతిపత్రంలో కాపు రిజర్వేషన్లు, ప్రత్యేకహోదా అంశాన్ని ఎందుకు ప్రస్తావించలేదని బుధవారం ఓ ప్రకటనలో విమర్శించారు. కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న కాపు రిజర్వేషన్ల అంశాన్ని ఆమోదించాలని కన్నా ఎందుకు కోరలేదని ప్రశ్నించారు.
*జ్ఞానం వంశపారంపర్యంగా రాదు
బుద్ధి, జ్ఞానం వంశపారంపర్యంగా సిద్ధించవనీ, వాటిని సొంతంగా ఆర్జించాల్సి ఉంటుందని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని ఉద్దేశించి కేంద్రం మంత్రి అరుణ్‌ జైట్లీ పరిహాసమాడారు. మోదీ వ్యతిరేక మనస్థితిలో పడి కాంగ్రెస్‌ సిద్ధాంతరహిత పార్టీగా మారిపోయిందని పేర్కొన్నారు. బుధవారం ఆయన తన ఫేస్‌బుక్‌ ఖాతాలో ఈ వ్యాఖ్యలను టపా (పోస్ట్‌) చేశారు. కార్పొరేట్‌ దిగ్గజాలకు రూ.2.5 లక్షల కోట్ల బకాయిలను మాఫీ చేశారంటూ రాహుల్‌ సంధించిన విమర్శలనూ జైట్లీ తిప్పికొట్టారు.
*విద్యారంగంపై జగన్‌ వ్యాఖ్యలు అవగాహనా రాహిత్యం
రాష్ట్రంలో విద్యారంగం అధ్వానంగా ఉందని ప్రతిపక్ష నాయకుడు జగన్‌ ఆరోపణలు చేయడం ఆయన అవగాహనారాహిత్యానికి నిదర్శనమని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు బుధవారం ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఈ రంగానికి రూ.25 వేల కోట్లు వెచ్చిస్తూ ఇతర రాష్ట్రాలకు దీటుగా ఆంధ్రప్రదేశ్‌ను ఎడ్యుకేషన్‌ హబ్‌గా మారుస్తోందని వివరించారు.
*విజయసాయి జీవితం అబద్ధాలమయం: జవహర్‌
వైకాపా నాయకుడు విజయసాయిరెడ్డి జీవితమే అబద్దాలమయమని ఎక్సైజ్‌ శాఖ మంత్రి కేఎస్‌.జవహర్‌ విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుంటే దాన్ని గుర్తించకుండా అవహేళనగా మాట్లాడటం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
*తెదేపాలో ఇమడలేను – ఆనం
మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెదేపాను వీడాలని నిర్ణయించుకొన్నారు. ఈమేరకు ఆయన ఆత్మకూరు నియోజకవర్గంలోని నాయకులకు తేల్చి చెప్పేశారు. ఆనం రాజకీయ గమనంపై కొంతకాలంగా ఊహాగానాలు కొనసాగుతూ ఉన్న విషయం తెలిసిందే. ఆయన తెదేపాను వీడి వైకాపాలో చేరతారనే ప్రచారం కొంతకాలంగా ఉంది. దానికితోడు జిల్లా మహానాడు, విజయవాడ మహానాడులకు ఆయన గైర్హాజరవడంతో ఈ ప్రచారం మరింత ఊపందుకొంది. ఈ క్రమంలో ఆయన ఆత్మకూరు నియోజకర్గంలోని మండలాల ముఖ్య నాయకులను బుధవారం పిలిపించారు
*కడప ఉక్కు పరిశ్రమపై తప్పుడు ప్రచారం: కన్నా
కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. నిన్న కేంద్రం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌పై తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. కడప స్టీల్ ప్లాంట్ సాధ్యం కాదని కేంద్రం అఫిడవిట్‌లో పేర్కొనలేదని… మెకాన్ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం కలిసి సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇవ్వాల్సి ఉందని మాత్రమే చెప్పిందన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com