నేటి రాజకీయ వార్తలు -07/06

*13న కాంగ్రెస్‌లోకి కిరణ్‌కుమార్‌రెడ్డి ?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి వచ్చే వారం కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 13న ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. పార్టీలో చేరేముందు ఆయన సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలను కలవనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం రేపో మాపో ఆయన దిల్లీకి వెళ్లనున్నారట. 13న కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరతారని..దిల్లీలో రాహుల్‌ సమక్షంలో పార్టీ కండువ కప్పుకుంటారని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు రాహుల్‌గాంధీ నల్లారికి అపాయింట్‌మెంట్‌ ఇచ్చినట్లు ఏఐసీసీ వర్గాల సమాచారం.
అయితే కాంగ్రెస్‌లో చేరే విషయమై తాను ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని కిరణ్‌కుమార్‌రెడ్డి అంటున్నారు. ఇలాంటి వార్తలు తాను టీవీ ఛానళ్లలోనే చూస్తున్నానని చెబుతున్నారు.
*రైతు రుణాల మాఫీ సబబే రాహుల్‌ గాంధీ
తాము అధికారంలోకి వచ్చాక రైతులకే తొలి ప్రాధాన్యమిస్తామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. కర్ణాటక ప్రభుత్వం రూ.34,000 కోట్ల మేర వ్యవసాయ రుణాలను మాఫీ చేయడాన్ని సమర్థించారు. తన సొంత నియోజకవర్గంలో రెండ్రోజుల పర్యటన ముగింపు సందర్భంగా గురువారం ఆయన స్థానికులనుద్దేశించి మాట్లాడారు.
*మద్దతు ధర లొసుగులను బయటపెడతాం: సీపీఎం
స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులకు అనుగుణంగా వరి, ఇతర పంటలకు కనీస మద్దతు ధరలు పెంచామంటూ కేంద్రం మోసపూరితంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని సీపీఎం పొలిట్‌ బ్యూరో విమర్శించింది. ఉత్పత్తి వ్యయాల లెక్కింపు ఆధారంగా స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులకు.. మోదీ ప్రభుత్వ ప్రకటనలపరంగా చూస్తే వరికి రూ.600, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చెరకు విషయంలో రూ.1,800 నుంచి రూ.2,000 తేడా ఉందని వెల్లడించింది. మద్దతు ధర విషయంలో లోపాలను బయటపెడతామని ప్రకటించింది.
*కౌంటర్‌ అఫిడవిట్‌ ఎందుకు దాఖలు చేయడం లేదు: పొంగులేటి
ఏపీ విభజన హామీల అమలు కోసం సుప్రీంకోర్టులో వేసిన కేసులో తెలంగాణ ప్రభుత్వం ఎందుకు కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయడం లేదో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజలకు సమాధానం చెప్పాలని మండలిలో విపక్ష ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. తెలంగాణ తెచ్చింది తానే అని చెప్పుకొనే కేసీఆర్‌..విభజన హామీలు సాధించే విషయంలో విఫలం చెందుతున్నారని విమర్శించారు.
*టీపీసీసీ సంప్రదింపుల కమిటీ తొలిభేటీ హాజరైన ఉత్తమ్‌, జానారెడ్డి
టీపీసీసీ సంప్రదింపుల కమిటీ( కన్సల్టెన్సీ కమిటీ) తొలిభేటీ గురువారమిక్కడ జరిగింది. నాయకుల మద్య విభేదాలు పరిష్కరించడం, పార్టీ వీడతారని ప్రచారం జరుగుతున్న నేతలతో సంప్రదింపులు జరపడం, ఇతర పార్టీలోంచి కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నా.. అడ్డంకులు.. తదితర సమస్యల పరిష్కారానికి టీపీసీసీ ఇటీవల సంప్రదింపుల కమిటీని ఏర్పాటు చేసింది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేతలు జానారెడ్డి, షబ్బీర్‌అలీ, వీహెచ్‌, దామోదర రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్య ఇందులో సభ్యులుగా ఉన్నారు.
*రాష్ట్రపతితో విజయసాయిరెడ్డి భేటీ
వైకాపా ఎంపీ వి.విజయసాయిరెడ్డి భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిశారు. ఈ విషయాన్ని ఎంపీ గురువారం రాత్రి ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. అందులో ‘‘4న రాష్ట్రపతిని కలిశాను. నా పుస్తకం ‘‘గ్లోరీ ఆఫ్‌ లార్డ్‌ వేంకటేశ్వర’’ను ఆయనకు బహూకరించాను.’’అని పేర్కొన్నారు.
*అరగంటలో ముగిసిన జగన్‌ పాదయాత్ర
తూర్పుగోదావరి జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర కొనసాగుతోంది. గురువారం పాదయాత్ర అర గంటలో ముగిసింది. రామచంద్రపురం నియోజకవర్గంలో ద్రాక్షారామ ఎస్‌.పి.వి.ఆర్‌. జూనియర్‌ కళాశాల నుంచి పాదయాత్రను ప్రారంభించారు. దారి పొడుగునా సెల్ఫీలు తీసుకునేందుకు ప్రజలు ఎగబడ్డారు. జనంతో మాట్లాడుతూ ఆయన ముందుకు సాగారు. జగన్నాయకులపాలెం- తాళ్లపొలం మధ్య ఇటుక బట్టీల వరకు వచ్చి యాత్రను ముగించారు. అక్కడి నుంచి ఆయన హైదరాబాద్‌కు పయనమై వెళ్లారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, డాక్టర్‌ పితాని అన్నవరం, వాడ్రేవు సాయిప్రసాద్‌ పాల్గొన్నారు.
*పవన్‌ కల్యాణ్‌పై కళా వెంకట్రావు ధ్వజం
కాపులకు రిజర్వేషన్‌ కల్పించే బిల్లును ఆమోదించకుండా నాన్చుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోదీని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఎందుకు ప్రశ్నించడం లేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు, ఇంధన శాఖ మంత్రి కిమిడి కళావెంకట్రావు నిలదీశారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్ని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును అభినందించకుండా పవన్‌ రాజకీయ లబ్ధి కోసం చౌకబారు విమర్శలు చేస్తున్నారని, ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన గురువారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.
*సీఎం క్షమాపణ చెప్పాలి: వట్టి
గోదావరి జలాల తరలింపులో బచావత్‌ ట్రైబ్యునల్‌ తీర్పును కాదని ప్రభుత్వం ఇష్టానుసారం వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత వట్టి వసంత్‌కుమార్‌ విమర్శించారు. పట్టిసీమ ద్వారా నీటిని కృష్ణాకు తరలిస్తూ గోదావరి డెల్టా రైతుల పొట్ట కొడుతున్నారని ఆరోపించారు.
*పాత జీవో ప్రకారమే ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌ చేపట్టాలి
ఇటీవల జరిగిన ఎంబీబీఎస్‌ సీట్ల వెబ్‌ కౌన్సెలింగ్‌ను రద్దు చేసి పాత పద్ధతిలో (2001 నాటి జీవో 550 ప్రకారం) చేపట్టాలని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి డిమాండ్‌ చేశారు. సీట్ల వెబ్‌ కౌన్సెలింగ్‌లో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు 500 సీట్ల వరకూ నష్టపోయారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన గురువారం సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com