నేటి రాజకీయ వార్తలు -07/07

*మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం
రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలు, కేంద్రం ఇచ్చిన హామీల అమలు కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి దాఖలు చేసిన కేసులో సంబంధిత కేంద్ర ప్రభుత్వ శాఖలు సుప్రీంకోర్టుకు సమర్పిస్తున్న అఫిడవిట్లన్నింటికీ మొదట రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్‌ అఫిడవిట్లు వేయాలని, ఆ తర్వాత సుప్రీంకోర్టులో స్వయంగా కేసు వేయాలని శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. విభజన చట్టంలోని అంశాలు, ఇచ్చిన హామీలు అమలుచేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని, రాష్ట్ర హక్కులను కాపాడాలని కోరుతూ వెంటనే సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయాలా? అన్న అంశంపై సమావేశంలో చర్చించారు.
*రాష్ట్రంలో కమలం వాడిపోయింది: జీవన్‌రెడ్డి
తెలంగాణలో భాజపా పువ్వు వాడిపోయిందని, జనచైతన్య యాత్రలో ఎక్కడా జనం కనిపించడం లేదని తెరాస శాసనసభ్యుడు జీవన్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బస్సు యాత్రతో భాజపా కొత్తగా సాధించిందేం లేదన్నారు. ప్రచారం కోసం ఏం మాట్లాడాలో తెలియక తెరాస శాసనసభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భాజపా జాతీయ నేత రాంమాధవ్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. 2014 అనంతరం నిర్వహించిన ఎన్నికల్లో భాజపా ఓడిపోవడంపై సంజాయిషీ ఇవ్వాలన్నారు.
*సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలపై పోలీసుల వెల్లడి
పెద్దపల్లి పార్లమెంట్‌ సభ్యుడు బాల్క సుమన్‌పై సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న లైంగిక వేధింపుల అంశం అసత్య ప్రచారమని పోలీసులు పేర్కొన్నారు. శుక్రవారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మహేష్‌ మాట్లాడుతూ.. మంచిర్యాలకు చెందిన బోయిని విజేత, సంధ్య అనే అక్కాచెల్లెళ్లు ఎంపీ ఫొటోను సంధ్యతో కలిసి ఉన్నట్లుగా మార్చి డబ్బుల వసూలుకు యత్నించినట్లు సుమన్‌ అనుచరులు తమకు ఫిర్యాదు చేశారాన్నారు.
*రామగుండం మేయర్‌, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాసం
పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ మేయర్‌ కొంకటి లక్ష్మీనారాయణ, డిప్యూటీ మేయర్‌ సాగంటి శంకర్‌లపై 39 మంది కార్పొరేటర్లు అవిశ్వాసం ప్రకటించారు. శుక్రవారం జిల్లా పాలనాధికారి శ్రీదేవసేనకు నోటీసు అందజేశారు. అవిశ్వాస నోటీసు అందజేసిన వారిలో అధికార పార్టీ తెరాస తరఫున 28 మంది, కాంగ్రెస్‌ తరఫున 10 మంది, భాజపా తరఫున ఒక్కరు ఉన్నారు. పార్టీలకతీతంగా నోటీసులపై సంతకాలు చేసి పాలనాధికారికి సమర్పించారు.
*తెలుగు ప్రజల గుండెల్లో సీఎం శ్రమ పదిలం
రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పడుతున్న శ్రమ తెలుగు ప్రజల గుండెల్లో పదిలంగానే ఉంటుందని ఐటీ మంత్రి లోకేశ్‌ స్పష్టం చేశారు. జనసేన అధినేత పవన్‌ వ్యాఖ్యలపై శుక్రవారం ట్విట్టర్‌ వేదికగా లోకేశ్‌ స్పందించారు. ‘68 ఏళ్ల వయసులో సీఎం చంద్రబాబు 24 ఏళ్ల యువకుడిలా రాష్ట్రానికి న్యాయం చేయమని పోరాడుతున్నారు. అందుకోసం ఆయన్ను ద్వేషిస్తాం అంటే ద్వేషించండి.
*తీవ్ర రక్తస్రావానికి చిన్న పట్టీ వేశారు
కేంద్ర ప్రభుత్వం 14 పంటలకు ‘కనీస మద్దతు ధర’లను పెంచిన తీరు.. తీవ్ర రక్తస్రావానికి చిన్న పట్టీ వేసినట్లుగా ఉందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చురకలు అంటించారు. దేశవ్యాప్తంగా ఉన్న 12 కోట్ల రైతులకు కేంద్రం కేవలం రూ.15వేల కోట్ల బడ్జెట్‌ కేటాయించిందని శుక్రవారం ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. కర్ణాటకలో జేడీయూ-కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని రైతులకు రూ.34వేల కోట్ల మేర పంట రుణాలను మాఫీ చేస్తుందని చెప్పారు. తమవి అసలైన చేతలని.. కేంద్రానివి కేవలం ‘మార్కెటింగ్‌’ మాటలని రాహుల్‌ వ్యాఖ్యానించారు.
*కర్ణాటక ఉపసభాపతిగా కృష్ణారెడ్డి
కర్ణాటక విధానసభ ఉపసభాపతిగా చింతామణి విధానసభ సభ్యుడు ఎం.కృష్ణారెడ్డి (జనతాదళ్‌) శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘విధుల్ని చిత్తశుద్ధితో నిర్వర్తిస్తాను’ అని పేర్కొన్నారు. ‘‘మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ, ముఖ్యమంత్రి కుమారస్వామి, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆశీస్సులు, విధానసభలో విపక్ష నేత యడ్యూరప్ప సహకారంతో ఈ పదవికి ఎన్నికయ్యా’’నని కృష్ణారెడ్డి వారికి కృతజ్ఞతలు తెలిపారు.
*దమ్ముంటే.. మీ చెల్లిని ఎంపీగా గెలిపించుకో
‘వచ్చే ప్రభుత్వం మాదే.. వంద సీట్లు వస్తాయని చెప్పడం కాదు.. దమ్ముంటే మీ చెల్లెలు కవితను అదే నిజామాబాద్‌ పార్లమెంటు స్థానం నుంచి గెలిపించు చూస్తా’ అని కాంగ్రెస్‌ నేత, శాసనసభ్యత్వం నుంచి బహిష్కరణకు గురైన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంత్రి కేటీఆర్‌కు సవాల్‌ విసిరారు. నిజామాబాద్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎంపీగా కవిత మళ్లీ గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com