నేటి రాజకీయ వార్తలు -07/09

*24న పార్లమెంట్ ఎదుట వామపక్షాల నిరసన
త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుండడానికి వ్యతిరేకంగా ఈనెల 24న పార్లమెంట్ ఎదుట వామపక్షాల నిరసన ప్రదర్శన చేపడతామని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి తెలిపారు. త్రిపురలో భాజపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నలుగురు సీపీఎం కార్యకర్తలు హత్యకు గురయ్యారని ఆయన వ్యాఖ్యానించారు.
*భాజపా యాత్రకు జాతీయ స్థాయిలో గుర్తింపు
తెలంగాణలో భాజపా చేపట్టిన జన చైతన్య యాత్రకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. తెరాస ప్రభుత్వాన్ని గద్దె దించడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో నిర్వహించిన భాజపా జన చైతన్య యాత్ర విజయోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈయాత్ర ద్వారా తెలంగాణలో భాజపా అధికారం చేపడుతుందనే ధీమా వ్యక్తం చేశారు. అన్ని వర్గాల నుంచి యాత్రకు స్పందన లభించిందని పేర్కొన్నారు.
*కేటీఆర్‌ జోక్యంతో అవిశ్వాస తీర్మానం ఉపసంహరణ
పెద్దపల్లి జిల్లా రామగుండం మేయర్‌, డిప్యూటీ మేయర్లపై 39 మంది కార్పొరేటర్లు ఇచ్చిన అవిశ్వాసం నోటీసును ఉపసంహరించుకుంటున్నట్లు స్థానిక ఎమ్మెల్యే, ఆర్టీసీ ఛైర్మన్‌ సోమారపు సత్యనారాయణ తెలిపారు. ఆదివారం ఆయన గోదావరివరిఖనిలో విలేకరులతో మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన నగరపాలక స్థాయీసంఘం ఎన్నికల్లో తెరాస నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా తాను జారీ చేసిన ఆదేశాలను ధిక్కరించి కొందరు అధికార పార్టీ కార్పొరేటర్లు బరిలో నిలిచారన్నారు.
*సర్కారు సాయంతో బీసీలకు సాధికారిత- తలసాని
ముఖ్యమంత్రి కేసీఆర్‌ వందశాతం రాయితీతో ఆర్థిక సాయం అందించేందుకు తీసుకున్న నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని బీసీలు సాధికారిత సాధిస్తారని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. మాజీ మంత్రి దానం నాగేందర్‌తో కలిసి ఆదివారం తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
*ప్రజలను మోసం చేసేందుకే హామీ- ఆర్‌.కృష్ణయ్య
వచ్చే విద్యా సంవత్సరం నుంచి 119 బీసీ గురుకులాలను ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి హామీ ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య మండిపడ్డారు. వారం రోజుల్లో బీసీ గురుకుల పాఠశాలలను ప్రారంభించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
*దోపిడీ రాజ్యంగా తెలంగాణ- డీకే అరుణ
తెలంగాణ రాష్ట్రం దోపిడీ రాజ్యంగా మారిందని గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ విమర్శించారు. ఆదివారం మహబూబ్‌నగర్‌లోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఎంపీ నంది ఎల్లయ్యతో కలిసి ఆమె విలేకర్లతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనను ప్రజలు తరిమికొట్టే సమయం ఆసన్నమైందని ఆమె విమర్శించారు.
*ఉద్యోగాలు అడిగితే లాఠీ ఛార్జి-భట్టివిక్రమార్క
ఉద్యోగాలు కావాలని కోరిన నిరుద్యోగులపై ప్రభుత్వం లాఠీ ఛార్జి చేపిస్తోందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు. ఆదివారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు రోడ్లపైకి వస్తున్నారని, ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు కూడా ఈ ప్రభుత్వం చెల్లించడం లేదన్నారు.
*సంప్రదాయానికి విరుద్ధంగా మోదీ ప్రసంగం- అన్సారీ
తన వీడ్కోలు సందర్భంగా ప్రధాని చేసిన ప్రసంగం సంప్రదాయాలకు విరుద్ధంగా ఉందని మాజీ ఉపరాష్ట్రపతి అన్సారీ అభిప్రాయపడ్డారు. ‘నేను ప్రశ్నించగలనా?’ అన్న పేరుతో వెలువరించిన పుస్తకంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. పదేళ్లపాటు పదవిలో ఉన్న ఆయన చివరి ఏడాదిలో చేసిన ప్రసంగాలు, రచనలను ఈ పుస్తకంలో పొందుపరిచారు.
* సింగపూర్‌ సదస్సులో సీఎం చంద్రబాబు ప్రసంగం
పట్టణీకరణ-నీరు, పర్యావరణం, ప్రజా రవాణా నిర్వహణ అనే అంశంపై సింగపూర్‌లో జరుగుతున్న ప్రపంచ నగరాల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. నివాసయోగ్యమైన నగరాల రూపకల్పనలో నీరు, పర్యావరణ లక్ష్యాలను చేరుకోవడానికి సాంకేతికత, మౌలిక సదుపాయల కల్పన అత్యంత అవసరమని అన్నారు. వనరుల నిర్వహణలో వైజ్ఞానిక, సమాచార సాంకేతికత ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) సాధనాల ద్వారా భూగర్భ, ఉపరితల నీటి వనరులు, ఉష్ణోగ్రతలు, గాలి నాణ్యత తదితర సమాచారాన్ని కచ్చితంగా తెలుసుకోవచ్చన్నారు. వనరులను సమర్ధంగా వినియోగించి ప్రజలకు మెరుగైన జీవనం అందించడానికి ఈ సమాచారం దోహదపడుతుందని సీఎం వెల్లడించారు.
* అత్యంత విషమంగా ఎన్‌.డి.తివారీ ఆరోగ్యం
ఉత్తరాఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి ఎన్‌.డి.తివారీ(92) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఆయన మూత్రపిండాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తివారీకి వైద్యులు డయాలసిస్‌(రక్తశుద్ధి) చికిత్స అందిస్తున్నారని ఆయన కుమారుడు రోహిత్‌ శేఖర్‌ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
* ఎన్నికల కోసమే మద్దతు ధరలు పెంచారు
సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే కేంద్రం వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలను ప్రకటించిందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల అమలు సాధ్యం కాదంటూ నీతి ఆయోగ్‌ చెప్పడంపై ప్రధాని ఎందుకు మౌనం వహిస్తున్నారు? 56 అంగుళాల ఛాతి అంటే ఇదేనా? అని ధ్వజమెత్తారు.
* తెదేపా, వైకాపాలకు మోదీ భయం
తెదేపా, వైకాపాలకు ప్రధాని మోదీ భయం పట్టుకుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. అందుకే ఆ రెండు పార్టీలు పరస్పరం విమర్శించుకుంటూ అన్నదాతల సమస్యలపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం లేదన్నారు. ఆదివారం అనంతపురంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయన్నారు. ప్రభుత్వాలను ఎండగట్టేందుకు ఉభయ కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో పోరాటాలకు సిద్ధమయ్యామన్నారు.
* విశాఖ రైల్వే జోన్‌కు కేంద్రం సుముఖం..
విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం జూన్‌ 13న దిల్లిలో జరిగిన సమావేశంలో నిర్ణయించిందని భాజపా శాసన సభాపక్షనేత, ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు వెల్లడించారు. ఆదివారం విశాఖలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రైల్వేజోన్‌ విషయంలో తెదేపా ప్రజలను తప్పుదారి పట్టించి ఓట్లు పొందాలని చూస్తోందన్నారు. విశాఖలో భూ ఆక్రమణలపై సిట్‌ వేశారని, ఆ నివేదిక ఏమైందని ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తన పర్యటనను ఎప్పుడు ప్రారంభిస్తారో, ఎప్పుడు నిలిపేస్తారో తెలియదన్నారు.
* సమస్యకు పరిష్కారం చూపే వారే యువత- లక్ష్మీనారాయణ
ఎవరైతే సమస్యకు పరిష్కారం చూపుతారో వారే నిజమైన యువత అని మాజీ ఐపీఎస్‌ అధికారి, సీబీఐ పూర్వ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ‘తల దించుకుని చేసేది మొబైల్‌ చాట్‌ అయితే.. తల ఎత్తుకునేట్లు చేసేది బోధన’ అని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా గన్నవరంలో ఆదివారం ‘క్లీన్‌ గన్నవరం- గ్రీన్‌ గన్నవరం’ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. తర్వాత ఎన్టీఆర్‌ పశువైద్య కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. ప్రాణాయామం, పుస్తక పఠనం ఆవశ్యకతను వివరించారు. యువత గ్రామ సర్పంచులు కావాలని ఉద్బోధించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com