నేటి రాజకీయ వార్తలు -07/10

*రాజకీయాల నుంచి వైదొలుగుతున్నా
రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు రామగుండం ఎమ్మెల్యే, ఆర్టీసీ ఛైర్మన్‌ సోమారపు సత్యనారాయణ సంచలన ప్రకటన చేశారు. సోమవారం కరీంనగర్‌ ప్రయాణ ప్రాంగణంలోని అభివృద్ధి పనులను పరిశీలించేందుకు వచ్చిన ఆయన అనూహ్యంగా తన అంతరంగాన్ని విలేకరుల ఎదుట వ్యక్తపర్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత నిర్ణయంతోనే తాను వైదొలుగుతున్నానన్నారు.
*ప్రతి పారిశ్రామికవాడలోనూ వ్యర్థజలాల శుద్ధి ప్లాంట్లు
‘రాష్ట్ర ముఖ్యమంత్రుల నుంచి దేశ ప్రధానుల వరకు ప్రతి ఒక్కరూ మా వద్ద పెట్టుబడులు పెట్టండి…అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామంటూ పరిశ్రమలకు ఎర్రతివాచీ పరుస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రోత్సాహకాలు, రాయితీలిస్తోంది. అన్ని రకాల మౌలిక సదుపాయాలనూ కల్పిస్తోంది. కానీ పర్యావరణాన్ని కలుషితం చేసే వారిపై మాత్రం కఠినంగానే ఉంటుంది. భవిష్యత్తు తరాలు ఇబ్బంది పడకూడదన్నదే మా ఉద్దేశం’ అని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలంలోని పాశమైలారం పారిశ్రామికవాడలో రూ.104 కోట్లతో నిర్మించనున్న వ్యర్థజలాల శుద్ధి ప్లాంటుకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. వర్సటైల్‌ ఆటో కంపెనీ తయారు చేసిన ఈ-బైక్‌నూ ఆయన ఈ సందర్భంగా ఆవిష్కరించారు.
*అలకబూనిన టీజీ వెంకటేష్‌
తెదేపా ప్రధాన కార్యదర్శి హోదాలో లోకేష్‌ సోమవారం కర్నూలు పర్యటనలో చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టించింది. నగరంలోని ఉస్మానియా కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి లోకేష్‌ మాట్లాడుతూ కుల, మత, ప్రాంతాన్ని తీసుకొచ్చి చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్న పార్టీలకు బుద్ధి చెప్పి ఎమ్మెల్యేగా ఎస్వీ మోహన్‌రెడ్డి, ఎంపీగా బుట్టా రేణుకను భారీ మెజార్టీతో గెలిపించి ఒకరిని శాసనసభకు, మరొకరిని లోక్‌సభకు పంపుదామని పిలుపునిచ్చారు. ఈ పిలుపు కార్యకర్తలు, ప్రజల్లో ఉత్సాహం నింపేందుకే అయినా కర్నూలు రాజకీయాల్లో కుదుపు తెచ్చింది.
*కాంగ్రెస్‌లోకి వెళ్లిపోదామన్న అనుయాయులు
తెరాస నాయకుడు, రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌ హైదరాబాద్‌లోని కొంపల్లిలో సోమవారం తన అనుచరగణంతో సమావేశమయ్యారు. నిజామాబాద్‌ గ్రామీణ నియోజకవర్గానికి చెందిన ఏడు మండలాలకు చెందిన వారు హాజరయ్యారు. మండలాల వారీగా సమయం కేటాయించి చర్చించినట్లు తెలిసింది. రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తామంతా కట్టుబడి ఉంటామని ఆ నాయకులంతా డీఎస్‌కు హామీ ఇచ్చినట్లు సమాచారం.
*ఓటు బ్యాంకు కోసమే పరిపూర్ణానంద గృహనిర్బంధం
ఓటు బ్యాంకు కోసమే తెలంగాణ ప్రభుత్వం పరిపూర్ణానంద స్వామిని గృహనిర్బంధం చేసిందని భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ఆరోపించారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్‌ చేశారు. భావ ప్రకటన హక్కు అంటూ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వచ్చిన ప్రకటనపై స్పందిస్తూ 40 కిలోమీటర్ల పాదయాత్ర చేయాలని పరిపూర్ణానంద స్వామి సంకల్పించారని తెలిపారు. కేసీఆర్‌ ప్రభుత్వం పరిపూర్ణానందను గృహనిర్బంధం చేయడం నిజాం తరహా నిర్ణయమని జీవీఎల్‌ విమర్శించారు.
*తెరాసకు విద్యార్థులంతా మద్దతివ్వాలి
తెలంగాణలోని విద్యార్థులంతా తెరాస ప్రభుత్వానికి మద్దతివ్వాలని ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను ఇంటింటికీ చాటాలన్నారు. సోమవారం తెలంగాణభవన్‌లో టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నేత నందకిషోర్‌ సహా పలు విద్యార్థి సంఘాల నేతలు తెరాస అనుబంధ విద్యార్థి విభాగం టీఆర్‌ఎస్వీలో చేరారు.వారికి ఉపముఖ్యమంత్రి కండువాలు కప్పి ఆహ్వానించారు.
*ఎత్తిపోతల పథకాలతో అదనపు భారం
రాష్ట్రంలో పలు ప్రాజెక్టుల్లో భాగంగా నిర్మిస్తోన్న ఎత్తిపోతల పథకాల వల్ల రాష్ట్ర ప్రజలపై అదనపు భారం పడుతుందని కాంగ్రెస్‌ శాసనసభాపక్ష ఉపనేత జీవన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గ్రావిటీతో నీటిని తరలించాల్సిన చోట అనవసరంగా ఎత్తిపోతల పథకాలను నిర్మిస్తున్నారని ప్రశ్నించారు.
*తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌ క్షమాపణలు చెప్పాలి
కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి తదితర ప్రాజెక్టులను అడ్డుకునేందుకు యత్నిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ ఇక అలాంటి ప్రయత్నాలు మాని ప్రజలకు క్షమాపణలు చెప్పాలని తెరాస ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్‌, రాములునాయక్‌లు డిమాండ్‌ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ ప్రోద్బలంతో వేసిన కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పు ఆ పార్టీకి చెంపపెట్టు అని అన్నారు.
*విధానసభలో వేడివేడి చర్చ
‘అప్పుడు కాంగ్రెస్‌ పార్టీకి ద్రోహం చేశారు. నాటి ముఖ్యమంత్రి ధరంసింగ్‌కు వెన్నుపోటు పొడిచి.. అనంతర కాలంలో ఆయన మృతికి కారణమయ్యారు. మా(భాజపా)తో చేతులు కలిపి నమ్మించి మోసగించారు. నమ్మక ద్రోహం మీ రక్తంలోనే ఉంది’ అని కర్ణాటక విధానసభలో విపక్ష నేత యడ్యూరప్ప సోమవారం ముఖ్యమంత్రి హెచ్‌.డి.కుమారస్వామిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
*ఉనికి కోల్పోతున్న ప్రతిపక్షాలు- కంభంపాటి
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధితో ప్రతిపక్ష పార్టీలు ఉనికి కోల్పోతున్నాయని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ముందుకు రావడంతో దిక్కుతోచక నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. పదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో అధికార పార్టీ నేతలకు ముడుపులివ్వలేక ఫోక్స్‌వ్యాగన్‌, అశోక్‌లేలాండ్‌ తదితర సంస్థలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా అడ్డుకోలేరని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
*రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌
కడపలో ఉక్కు కర్మాగారం నిర్మాణానికి శంకుస్థాపన జరిగే వరకు తాను గడ్డం తీయనని తెదేపా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ తెలిపారు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని సోమవారం ఉదయం కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్న ఆయన ఆలయం ఎదుట మీడియాతో మాట్లాడారు.
*మండలి’ని గేలి చేయడం రాజ్యాంగ విరుద్ధం- డొక్కా
అడ్డదారిలో ఎన్నికయ్యారంటూ శాసనమండలి సభ్యులను జనసేన అధ్యక్షులు పవన్‌కల్యాణ్‌ కించపరిచేలా(గేలి) మాట్లాడటం రాజ్యాంగ విరుద్ధమని మండలి విప్‌ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్ఠపరిచేందుకే రాజ్యాంగంలో మండలి, రాజ్యసభలను పొందుపరిచిన విషయాన్ని గుర్తుంచుకుని మాట్లాడాలని హితవు పలికారు.
* కేంద్రాన్ని నిలదీసే ధైర్యం ఆయనకు లేదు- మంత్రి గంటా
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌కల్యాణ్‌కు 25 ప్రశ్నలను సంధించారు.పోలవరం సహా ఇతర సాగునీటి ప్రాజెక్టుల్ని పవన్ కళ్యాaణ్ కళ్లతో చూడలేని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీని గెలిపించింది తానే అనే భ్రమలో ఆయనున్నారని ఆక్షేపించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com