నేటి రాజకీయ వార్తలు -07/12

1. పోలవరం ప్రాజెక్టులో క్షేత్రస్థాయి పరిస్థితుల వల్లే సేకరించే భూమి విస్తీర్ణం పెరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు.. కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీకి స్పష్టం చేశారు. 2013 భూసేకరణ చట్టం అమలు చేయాల్సి రావడం, ముంపునకు తగ్గట్టుగా నిపుణుల కమిటీలు ఆ తర్వాత కాలంలో తీసుకున్న నిర్ణయాలు ప్రధాన కారణాలన్నారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల్లో సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించుకోవాల్సి ఉందని కేంద్ర మంత్రి ప్రకటించిన నేపథ్యంలో ఈ స్పష్టత ఇచ్చారు. అధికారులతో, ముఖ్యమంత్రితో గడ్కరీ నిర్వహించిన సమావేశంలోను, వాహనంలో ఆయనతో పాటు పోలవరం ప్రాజెక్టు వద్ద పర్యటించిన సందర్భంలో చంద్రబాబు సుస్పష్టంగా వివరించినట్లు తెలిసింది.

2. తెలంగాణ పంచాయతీరాజ్‌ సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించుకునే వెసులుబాటు రాష్ట్రాలకే అప్పగించాలంటూ కేంద్రాన్ని కోరాలని మంత్రివర్గ ఉప సంఘం తీర్మానించింది. రాష్ట్ర పంచాయతీ రాజ్‌ చట్టంలో పొందుపర్చిన విధంగా పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను అమలు చేసి తీరాలని భావించింది. ఇంతకు ముందు 61.19 శాతం రిజర్వేషన్ల అమలుకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చినందున ఇప్పుడు మళ్లీ అక్కడికి వెళ్లాలనే యోచనకు వచ్చింది. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేసుకున్నందున ప్రస్తుత రిజర్వేషన్ల విధానం కొనసాగింపునకు ఆమోదం లభించవచ్చనే ఆశాభావం వ్యక్తంచేసింది.

3. నవ్యాంధ్రలో వెనుకబడిన ఏడు జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ(ఎస్డీపీ) ఇస్తామన్నారు. కానీ, ఒక్కో జిల్లాకు రూ.50కోట్లు చొప్పునే మూడేళ్లు ఇచ్చారు. గత ఏడాది ఫిబ్రవరిలో రూ.350 కోట్లు విడుదల చేసిన కేంద్రం.. వెంటనే వెనక్కి తీసుకుంది. చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. కేంద్రానికి తెలుగోడి పౌరుషం ఏమిటో చూపించే సమయం వచ్చింది. కేంద్రం మెడలు వంచితేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది. ఏపీలో జగన్‌, పవన్‌ను చూసుకొని మోదీ, అమిత్‌షా ఆటలాడుతున్నారు. వారికి తగిన బుద్ధిచెప్పి, రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు పోరాడతాం.. అంటూ తెదేపా ఎంపీలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రతిన బూనారు. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు ఎస్డీపీ నిధులను కేంద్రం నిలిపేయడాన్ని నిరసిస్తూ అనంతపురం వేదికగా తెదేపా ఎంపీలు, ప్రజాప్రతినిధులు ‘కరవు నేలపై కేంద్రం వివక్ష’ పేరిట బుధవారం దీక్ష నిర్వహించారు.

4. వయోజనుల్లో పరస్పరాంగీకార స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే సెక్షన్‌ 377 రాజ్యాంగపరమైన చెల్లుబాటుపై నిర్ణయాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వివేచనకే వదిలేస్తున్నట్లు కేంద్రం బుధవారం వెల్లడించింది. స్వలింగ సంపర్కుల వివాహం, దత్తత, ఎల్‌జీబీటీక్యూ వర్గాల ఇతర అనుబంధ పౌరహక్కుల అంశాల గురించి విచారించవద్దని అభ్యర్థించింది. భారత శిక్షా స్మృతిలోని సెక్షన్‌ 377పై కోర్టు నిర్ణయం వెలువరించే విషయంలో కేంద్ర ప్రభుత్వానికేమీ అభ్యంతరమేమీ లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్ర, న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌.నారిమన్‌, జస్టిస్‌ ఎ.ఎం.ఖాన్‌విల్కర్‌, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ ఇందు మల్హోత్రతో కూడిన ధర్మాసనానికి ప్రభుత్వం తరఫున హాజరయిన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా చెప్పారు.

5. ఇంటర్నెట్‌ టెలిఫోనీ సేవలకు ప్రభుత్వరంగ బీఎస్‌ఎన్‌ఎల్‌ శ్రీకారం చుడుతోంది. ఇందుకోసం మొబైల్‌ యాప్‌ ‘వింగ్స్‌’ను సంస్థ ఆవిష్కరించింది. ఈ యాప్‌ ద్వారా, దేశంలో ఏ టెలిఫోన్‌ నెంబరుకు అయినా కాల్‌ చేసుకోవచ్చు. ఏడాది రుసుముగా రూ.1,099 చెల్లించాలి. అనంతరం ఏ నెట్‌వర్క్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్‌/వైఫై ద్వారా అయినా, దేశంలోని టెలిఫోన్‌ నెంబర్లకు అపరిమిత కాల్స్‌ చేసుకోవచ్చు. ఈనెల 25న ఈ సేవలు ప్రారంభమవుతాయి.

6. ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పోరాట యాత్ర ఈ నెల 16న ప్రారంభించనున్నారు. ముందుగా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఆయన యాత్ర ప్రారంభమవుతుందని పార్టీ వర్గాల సమాచారం. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో పవన్‌ పోరాట యాత్ర ఇటీవలే ముగిసింది. ఉభయ గోదావరి జిల్లాల యాత్రను ఆయన తూర్పు గోదావరి జిల్లాలో ప్రారంభించాలని భావించారు. వైకాపా అధ్యక్షుడు జగన్‌ పాదయాత్ర ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతున్న నేపథ్యంలో, అదే సమయంలో పవన్‌ కూడా పోరాటయాత్ర చేస్తే శాంతి భద్రతల సమస్య ఏర్పడుతుందని పోలీసులు అభ్యంతరం వ్యక్తంచేసినట్టు సమాచారం. ఆ నేపథ్యంలో మొదట పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పోరాటయాత్ర చేయాలని పవన్‌ నిర్ణయించినట్టు తెలిసింది.

7. ఎన్నో సంచలనాలకు మారుపేరైన ఫిఫా 2018లో మరో సంచలనం. ఆశ్చర్యకర ప్రదర్శనను కొనసాగిస్తూ సంచలనాల క్రొయేషియా ఫిఫా-2018 పుట్‌బాల్‌లో మరోసారి సత్తా చాటింది. లుజ్నికీ స్టేడియంలో జరిగిన రసవత్తర పోరులో ఇంగ్లాండ్‌పై 2-1 తేడాతో గెలిచి తొలిసారిగా ఫైనల్‌కు చేరింది. దీంతో క్రొయేషియా తమ ఫుట్‌బాల్‌ చరిత్రను మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. ఇక ఆదివారం జరిగే టైటిల్‌ పోరులో ఫ్రాన్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.

8. ‘‘అర్ధరాత్రి నిర్ణయాలు తీసుకుని ఉదయాన్నే బి-ఫారం ఇచ్చే ముందు అభ్యర్థులను ప్రకటించే ఆనవాయితీ తెదేపాలో ఉంది. సీఎం సర్వే చేసి ముందుకెళ్తామన్నారు. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మంత్రి లోకేష్‌ను హిప్నటైజ్‌ చేశారేమో. ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటించి ఓట్లు వేసి గెలిపించాలని మంత్రి లోకేష్‌ చెప్పడం నాకు అర్థం కాలేదు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన తర్వాత నా స్పందన ఉంటుంది’’అని ఎంపీ టీజీ వెంకటేష్‌ పేర్కొన్నారు. కర్నూలులో బుధవారం అన్న క్యాంటీన్‌ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి లోకేష్‌ ప్రకటనపై స్పందించాలని టీజీని మీడియా కోరగా ఆయన పై మేరకు పేర్కొన్నారు.

9. దేశవ్యాప్తంగా ముందస్తు ఎన్నికలపై చర్చ జరుగుతున్న తరుణంలో కేంద్ర జలవనరులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. 2019 మే నెలలో ఎన్నికలు వస్తాయన్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి నాటికే పోలవరం సివిల్‌ పనులు పూర్తి చేయాలని అధికారులను కోరుతున్నట్టు చెప్పారు. పోలవరంలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ గడ్కరీ ఈ మాటలన్నారు.

10. తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ఉండవల్లిలోని ప్రజా దర్బారు హాల్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరగనుంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, పార్టీ ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. రాష్ట్రంలో తెదేపా ప్రభుత్వం ఏర్పడి 1500 రోజులవుతున్న సందర్భంగా ఈ నెల 16 నుంచి చేపట్టనున్న గ్రామదర్శిని, పట్టణ దర్శిని కార్యక్రమం విధివిధానాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. శాసనసభ వర్షాకాల సమావేశాల నిర్వహణపైనా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

* శాశ్వతంగా తొలిస్థానంలో మనమే ఉంటాం- చంద్రబాబు
‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో మొదటిస్థానంలో ఉన్నామని, శాశ్వతంగా మనమే తొలిస్థానంలో ఉంటామని’ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గురువారం వేతనాలు పెంచింనందుకు గాను సీఎం చంద్రబాబును అంగన్‌వాడీ, ఆశావర్కర్లు సన్మానించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు సంఘటితం కావాలని అన్నారు.
* కొండా సురేఖ సవాల్
టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొండా సురేఖ, మేయర్ మధ్య వివాదం ముదురుతోంది. శిలాఫలకంపై పేర్ల విషయంలో నేతల మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ విషయంపై కొండా సురేఖ మాట్లాడుతూ…కొందరు శిలాఫలకంపై పెద్దగా పేరు పెట్టలేదని, ఫొటో పెట్టలేదని అలిగారని అన్నారు. కమీషన్ కోసం రోడ్డు పనులు అడ్డుకుంటున్నామంటున్న వారికి ఆమె సవాల్ విసిరారు. తాను కమీషన్ తీసుకున్నట్టు రుజువు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని స్పష్టం చేశారు. మాకు ప్రజలు అండగా ఉన్నారు.. మేం ఎవరికీ భయపడమన్నారు.
* అంబరాన్ని అంటేలా బోనాల సంబరాలు – ఇంద్రకరణ్ రెడ్డి
బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తామని, రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండేలా అమ్మవారి అనుగ్రహం ఉండాలని రాష్ట్ర గృహ నిర్మాణ‌,న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దంపట్టే బోనాల పండుగ నిర్వహణ కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఇవాళ బొగ్గుల‌కుంట‌లోని ధార్మిక భ‌వ‌న్ లో బోనాల నిర్వహణ పై దేవాదాయశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి దేవాదాయ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి శివ‌శంక‌ర్, అద‌న‌పు క‌మిష‌న‌ర్ శ్రీనివాస రావు, హైద‌రాబాద్ డిప్యూటీ క‌మిష‌న‌ర్ రామ‌కృష్ణ‌, న‌గ‌ర స‌హాయ‌క క‌మిష‌న‌ర్లు, వివిధ ఆల‌యాల కార్య నిర్వ‌హ‌ణ అధికారులు హాజ‌ర‌య్యారు.
*2019 మేలో ఎన్నికలు- గడ్కరీ
దేశవ్యాప్తంగా ముందస్తు ఎన్నికలపై చర్చ జరుగుతున్న తరుణంలో కేంద్ర జలవనరులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. 2019 మే నెలలో ఎన్నికలు వస్తాయన్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి నాటికే పోలవరం సివిల్‌ పనులు పూర్తి చేయాలని అధికారులను కోరుతున్నట్టు చెప్పారు. పోలవరంలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ గడ్కరీ ఈ మాటలన్నారు.
*జమిలి ఎన్నికలు రాజ్యాంగ వైపరీత్యం- కాంగ్రెస్‌
లోక్‌సభ, శాసనసభలకు ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదనను కాంగ్రెస్‌ తిరస్కరించింది. ఇది ‘రాజ్యాంగ వైపరీత్యం’ అనీ, ప్రజాస్వామ్య మూల విలువలపై దెబ్బ పడినట్లేనని పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్‌ సింఘ్వి పేర్కొన్నారు. ఏ కారణం వల్లనైనా ప్రభుత్వాలు మధ్యలోనే పడిపోతే దేశంలో, రాష్ట్రాల్లో కూడా రాష్ట్రపతి పాలననే విధిస్తారా అని మంగళవారం విలేకరుల సమావేశంలో అనుమానం వ్యక్తం చేశారు.
*హైకోర్టు తీర్పు సర్కారుకు చెంపపెట్టు- చాడ
పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు 50శాతానికి మించొద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పు తెరాస సర్కారుకు చెంపపెట్టు వంటిదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్లి పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయడం ద్వారా గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన తీసుకురావాలని సీఎం కేసీఆర్‌ యత్నిస్తున్నారని ఆరోపించారు.
*రిజర్వేషన్లు తగ్గిస్తే తెలంగాణ భగ్గుమంటుంది- ఆర్‌.కృష్ణయ్య
స్థానిక ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50 శాతం దాటరాదనే హైకోర్టు తీర్పుతో తెలంగాణలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 34 శాతం నుంచి 21 శాతానికి తగ్గే ప్రమాదం ఉందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య అన్నారు.
*భావోద్వేగంతో ప్రసంగం
ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలోనే తాను పనిచేస్తానని, రాజకీయాల నుంచి వైదొలగాలనే ఆలోచనను విరమించుకున్నానని ఆర్టీసీ ఛైర్మన్‌ సోమారపు సత్యనారాయణ తెలిపారు. రాజకీయాల నుంచి తప్పుకుంటానని సోమవారం ఆయన ప్రకటించడం కలకలం రేపింది. వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు మంత్రి కేటీఆర్‌ మంగళవారం ఆయనను తమ ఇంటికి పిలిపించుకొని చర్చలు జరిపారు.
*సింహగర్జనతో కదలిక తెస్తాం-మందకృష్ణ
దేశంలో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని భాజపా కుట్ర చేస్తుంటే వాటిని న్యాయ వ్యవస్థ అమలు చేస్తున్నట్లుగా దళిత, గిరిజన సమాజం భావిస్తోందని ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక పరిరక్షణ కమిటీ కన్వీనర్‌, ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. సోమవారం సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు 8న దిల్లీలో నిర్వహించబోయే సింహగర్జనతో దేశవ్యాప్తంగా కదలిక తీసుకొస్తామన్నారు. హైదరాబాద్‌ నుంచి కత్తి మహేష్‌ను బహిష్కరించడాన్ని తాము ఖండిస్తున్నామని మందకృష్ణ పేర్కొన్నారు. ఈ చర్య కుల బహిష్కరణగా కనిపిస్తోందన్నారు.
*రాజకీయాల నుంచి వైదొలుగుతున్నా ..
రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు రామగుండం ఎమ్మెల్యే, ఆర్టీసీ ఛైర్మన్‌ సోమారపు సత్యనారాయణ సంచలన ప్రకటన చేశారు. సోమవారం కరీంనగర్‌ ప్రయాణ ప్రాంగణంలోని అభివృద్ధి పనులను పరిశీలించేందుకు వచ్చిన ఆయన అనూహ్యంగా తన అంతరంగాన్ని విలేకరుల ఎదుట వ్యక్తపర్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత నిర్ణయంతోనే తాను వైదొలుగుతున్నానన్నారు.
*ప్రతి పారిశ్రామికవాడలోనూ వ్యర్థజలాల శుద్ధి ప్లాంట్లు
‘రాష్ట్ర ముఖ్యమంత్రుల నుంచి దేశ ప్రధానుల వరకు ప్రతి ఒక్కరూ మా వద్ద పెట్టుబడులు పెట్టండి…అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామంటూ పరిశ్రమలకు ఎర్రతివాచీ పరుస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రోత్సాహకాలు, రాయితీలిస్తోంది. అన్ని రకాల మౌలిక సదుపాయాలనూ కల్పిస్తోంది. కానీ పర్యావరణాన్ని కలుషితం చేసే వారిపై మాత్రం కఠినంగానే ఉంటుంది. భవిష్యత్తు తరాలు ఇబ్బంది పడకూడదన్నదే మా ఉద్దేశం’ అని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలంలోని పాశమైలారం పారిశ్రామికవాడలో రూ.104 కోట్లతో నిర్మించనున్న వ్యర్థజలాల శుద్ధి ప్లాంటుకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. వర్సటైల్‌ ఆటో కంపెనీ తయారు చేసిన ఈ-బైక్‌నూ ఆయన ఈ సందర్భంగా ఆవిష్కరించారు.
*అలకబూనిన టీజీ వెంకటేష్‌
తెదేపా ప్రధాన కార్యదర్శి హోదాలో లోకేష్‌ సోమవారం కర్నూలు పర్యటనలో చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టించింది. నగరంలోని ఉస్మానియా కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి లోకేష్‌ మాట్లాడుతూ కుల, మత, ప్రాంతాన్ని తీసుకొచ్చి చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్న పార్టీలకు బుద్ధి చెప్పి ఎమ్మెల్యేగా ఎస్వీ మోహన్‌రెడ్డి, ఎంపీగా బుట్టా రేణుకను భారీ మెజార్టీతో గెలిపించి ఒకరిని శాసనసభకు, మరొకరిని లోక్‌సభకు పంపుదామని పిలుపునిచ్చారు. ఈ పిలుపు కార్యకర్తలు, ప్రజల్లో ఉత్సాహం నింపేందుకే అయినా కర్నూలు రాజకీయాల్లో కుదుపు తెచ్చింది.
*కాంగ్రెస్‌లోకి వెళ్లిపోదామన్న అనుయాయులు
తెరాస నాయకుడు, రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌ హైదరాబాద్‌లోని కొంపల్లిలో సోమవారం తన అనుచరగణంతో సమావేశమయ్యారు. నిజామాబాద్‌ గ్రామీణ నియోజకవర్గానికి చెందిన ఏడు మండలాలకు చెందిన వారు హాజరయ్యారు. మండలాల వారీగా సమయం కేటాయించి చర్చించినట్లు తెలిసింది. రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తామంతా కట్టుబడి ఉంటామని ఆ నాయకులంతా డీఎస్‌కు హామీ ఇచ్చినట్లు సమాచారం.
*ఓటు బ్యాంకు కోసమే పరిపూర్ణానంద గృహనిర్బంధం
ఓటు బ్యాంకు కోసమే తెలంగాణ ప్రభుత్వం పరిపూర్ణానంద స్వామిని గృహనిర్బంధం చేసిందని భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ఆరోపించారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్‌ చేశారు. భావ ప్రకటన హక్కు అంటూ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వచ్చిన ప్రకటనపై స్పందిస్తూ 40 కిలోమీటర్ల పాదయాత్ర చేయాలని పరిపూర్ణానంద స్వామి సంకల్పించారని తెలిపారు. కేసీఆర్‌ ప్రభుత్వం పరిపూర్ణానందను గృహనిర్బంధం చేయడం నిజాం తరహా నిర్ణయమని జీవీఎల్‌ విమర్శించారు.
*తెరాసకు విద్యార్థులంతా మద్దతివ్వాలి
తెలంగాణలోని విద్యార్థులంతా తెరాస ప్రభుత్వానికి మద్దతివ్వాలని ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను ఇంటింటికీ చాటాలన్నారు. సోమవారం తెలంగాణభవన్‌లో టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నేత నందకిషోర్‌ సహా పలు విద్యార్థి సంఘాల నేతలు తెరాస అనుబంధ విద్యార్థి విభాగం టీఆర్‌ఎస్వీలో చేరారు.వారికి ఉపముఖ్యమంత్రి కండువాలు కప్పి ఆహ్వానించారు.
*ఎత్తిపోతల పథకాలతో అదనపు భారం
రాష్ట్రంలో పలు ప్రాజెక్టుల్లో భాగంగా నిర్మిస్తోన్న ఎత్తిపోతల పథకాల వల్ల రాష్ట్ర ప్రజలపై అదనపు భారం పడుతుందని కాంగ్రెస్‌ శాసనసభాపక్ష ఉపనేత జీవన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గ్రావిటీతో నీటిని తరలించాల్సిన చోట అనవసరంగా ఎత్తిపోతల పథకాలను నిర్మిస్తున్నారని ప్రశ్నించారు.
*తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌ క్షమాపణలు చెప్పాలి
కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి తదితర ప్రాజెక్టులను అడ్డుకునేందుకు యత్నిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ ఇక అలాంటి ప్రయత్నాలు మాని ప్రజలకు క్షమాపణలు చెప్పాలని తెరాస ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్‌, రాములునాయక్‌లు డిమాండ్‌ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ ప్రోద్బలంతో వేసిన కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పు ఆ పార్టీకి చెంపపెట్టు అని అన్నారు.
*విధానసభలో వేడివేడి చర్చ
‘అప్పుడు కాంగ్రెస్‌ పార్టీకి ద్రోహం చేశారు. నాటి ముఖ్యమంత్రి ధరంసింగ్‌కు వెన్నుపోటు పొడిచి.. అనంతర కాలంలో ఆయన మృతికి కారణమయ్యారు. మా(భాజపా)తో చేతులు కలిపి నమ్మించి మోసగించారు. నమ్మక ద్రోహం మీ రక్తంలోనే ఉంది’ అని కర్ణాటక విధానసభలో విపక్ష నేత యడ్యూరప్ప సోమవారం ముఖ్యమంత్రి హెచ్‌.డి.కుమారస్వామిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
*ఉనికి కోల్పోతున్న ప్రతిపక్షాలు- కంభంపాటి
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధితో ప్రతిపక్ష పార్టీలు ఉనికి కోల్పోతున్నాయని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ముందుకు రావడంతో దిక్కుతోచక నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. పదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో అధికార పార్టీ నేతలకు ముడుపులివ్వలేక ఫోక్స్‌వ్యాగన్‌, అశోక్‌లేలాండ్‌ తదితర సంస్థలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా అడ్డుకోలేరని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
*రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌
కడపలో ఉక్కు కర్మాగారం నిర్మాణానికి శంకుస్థాపన జరిగే వరకు తాను గడ్డం తీయనని తెదేపా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ తెలిపారు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని సోమవారం ఉదయం కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్న ఆయన ఆలయం ఎదుట మీడియాతో మాట్లాడారు.
*మండలి’ని గేలి చేయడం రాజ్యాంగ విరుద్ధం- డొక్కా
అడ్డదారిలో ఎన్నికయ్యారంటూ శాసనమండలి సభ్యులను జనసేన అధ్యక్షులు పవన్‌కల్యాణ్‌ కించపరిచేలా(గేలి) మాట్లాడటం రాజ్యాంగ విరుద్ధమని మండలి విప్‌ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్ఠపరిచేందుకే రాజ్యాంగంలో మండలి, రాజ్యసభలను పొందుపరిచిన విషయాన్ని గుర్తుంచుకుని మాట్లాడాలని హితవు పలికారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com